స్నిగ్ధమధుసూదనం-6

0
3

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 6వ భాగం. [/box]

“హ్మ్మ్. ముందే అలా చెబితే అంత దూరం ఫ్రెండ్‌తో ఎలా వెళ్ళాను అని నువ్వు అనుకుంటావేమో అని కజిన్ అని చెప్పాను. వాళ్ళ ఫామిలీ, మా ఫామిలీ కూడా చాలా క్లోజ్. చుట్టాలకంటే ఎక్కువ ఆత్మీయంగా ఉంటాం” భార్గవి చెబుతుంటే ఆమెని చూస్తూ తలూపింది తన్మయి.

“తేజాకి కూడా పెయింటింగ్స్ అంటే చెప్పలేనంత ఆసక్తి చిన్నప్పటినుంచీ. ఎక్కడ అద్భుతమైన పెయింటింగ్ కనపడినా అలా చూస్తూ ఉండిపోతాడు. అణువణువూ చూస్తాడు. ఎంత గొప్ప పేరున్న చిత్రకళాకారుడు వేసిన చిత్రమైనా నిశితంగా చూసి అందులో ఏదైనా లోపం ఉంటే చెబుతూ ఉంటాడు. నాతోనేలే వాళ్ళతో కాదు. పెయింటింగ్స్ మీద ఎక్కడ ఏ వ్యాసం వచ్చినా చదువుతాడు.”

“తను కూడా పెయింటింగ్స్ వేస్తాడా?” తన్మయి కొద్దిగా ముందుకు వంగి భార్గవి ముఖంలోకి చూస్తూ అడిగింది.

భార్గవి తల అడ్డంగా ఊపింది.

“లేదు. అంత ఆసక్తి ఉన్నవాడివి నువ్వెందుకు పెయింటింగ్స్ వెయ్యడం మొదలుపెట్టవి అని చాలా సార్లు అడిగాను. చిన్నప్పుడు స్కూల్లో డయాగ్రామ్స్ చాలా చక్కగా అందంగా వేసేవాడు. అసలు చిత్రకళ అంటే ఇంత మైమరచిపోయేవాడివి నువ్వు తప్పకుండా వెయ్యగలవు అంటే వెంటనే దిగులుపడిపోతాడు. చాలా సార్లు ప్రయత్నించాడు. అద్భుతంగా చిత్రాలు వెయ్యాలని ఉందంటాడు. తన మనసులో ఉన్న కొన్ని ఊహా చిత్రాలు కాన్వాసు మీద పెట్టాలనుంది అంటాడు. కానీ, అన్నీ తెచ్చుకుని కూర్చుంటే ఎందుచేతనో చెయ్యి ముందుకు కదలడం లేదని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. రెండు మూడు సార్లు నేను కూడా ప్రయత్నించాను తన దగ్గరే ఉండి బొమ్మ వెయ్యమని ప్రోత్సహిస్తూ. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిత్రకళ గురించి చాలా తెలిసిన తేజా అసలు ప్రయత్నించడానికి కూడా చెయ్యి నిజంగానే ముందుకు కదలకపోవడం. స్ట్రేంజ్ తన్మయీ. అంతే కాదు, చిత్రకళంటే తన ప్రాణంలా ఉండే తేజ, టెన్త్ తరువాత, బి.ఎఫ్.ఏ చదువుతాను అని చేరాడు. థియరీ అంతా లెక్చరర్స్ ఇంకా చెప్పకముందే చదివేసి అర్థం చేసుకునేవాడు, తీరా బొమ్మలు వెయ్యాల్సిన సమయం వచ్చేసరికి అసలు తన చెయ్యి రాయిలా అయిపోయేది. ఆ బాధతో ఇంటికి వచ్చి గట్టిగా ఏడ్చేవాడు. కొన్నాళ్ళు అలా గడిచాక, తన బాధ చూడలేక అతని తల్లితండ్రులు బలవంతంగా ఒప్పించి తేజని మళ్ళీ బి.ఎస్సీ లో చేర్పించారు.”

తన్మయి సమాధానం చెప్పలేనట్టుగా ఆశ్చర్యంగా భార్గవి వైపు చూసింది. ఇలా కూడా జరుగుతుందా అనిపించింది ఆమెకు.

“మొన్న మీ ఇంట్లో అకస్మాత్తుగా నీ పెయింటింగ్స్ చూసేసరికి నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా. ఒక్కసారిగా మబ్బుల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఎందుకో తెలీదు వెంటనే తేజాని పిలవాలని అనిపించింది. తను నీ చిత్రాలు చూస్తే చాలా ఆనందిస్తాడు.”

భార్గవి గొంతులో ఉద్వేగాన్ని వింతగా చూసింది తన్మయి. క్షణం పాటు మౌనంగా ఉండిపోయి భార్గవి తిరిగి తన్మయి వైపు చూస్తూ అంది.

“కానీ, నువ్వు అసలు నన్ను ఫొటో తియ్యద్దు అన్నావ్ కదా. సో, తనకి నువ్వు సృష్టించిన అద్భుతాలు చూపించలేకపోయాను” చివరిమాట ఎందుకో తన్మయి హృదయాన్ని సున్నితంగా పొడిచింది.

“అందుకు కారణం లేకపోలేదు భార్గవీ. చిత్రకారిణిగా నేను తృప్తి పడే పెయింటింగ్ ఇంతవరకూ నేను వెయ్యలేదు. కొన్ని అధ్బుతమైన దృశ్యాలు నా గుండెల్లో ఉన్నాయి. ఆ దృశ్యాల్ని చిత్రించగలగాలి. ఇంతవరకూ ఆ దృశ్యాల్ని స్పష్టంగా మనోనేత్రంలో అయినా దర్శించలేకపోయాను. అందుకే కాన్వాసుమీద పెట్టలేకపోతున్నాను. అది చిత్రించాలని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పటి నుంచీ ఏదో అలజడి. నా గురించీ నా చిత్రాల గురించీ నలుగురికీ తెలిసే అవసరం కన్నా, ముందు నా మనసు, నా అంతరాత్మ శాంతించేలా ఆ చిత్రాల్ని చిత్రించగలగడం ముఖ్యం. అసలు అంతవరకూ నేనూ ఓ చిత్రకారిణిని అని నేను ఒప్పుకోలేను. ఆంతే కాదు. ఏదో అశాంతి నాలో. మదిలో, మస్తిష్కంలో అంత అరుదైనా అందమైన చిత్రాలు గోచరిస్తున్నా, చేతిలో కళ ఉండీ నేనెందుకు వాటిని అలాగే కాన్వాసుపైన పెట్టలేకపోతున్నాను. అలాగే వెయ్యాలని మొదలుపెడతాను. కానీ, నా మనసులో నేను చూసిన చిత్రంలా రాదు. మళ్ళీ అసంతృప్తి. ఇలాగే సాగుతోంది చాలా ఏళ్ళుగా. బహుశా నా మనసేదో ప్రేరణ కోసం ఎదురుచూస్తోందేమో. అదేవిటో అర్థం అయితే కానీ, ఈ కథ ముందుకు సాగదు.”

పచ్చగడ్డిని చేత్తో సున్నితంగా నిమురుతూ చెబుతున్న తన్మయిని చిత్రంగా చూసింది భార్గవి. ఏదో చెప్పాలనుకుంది కానీ, ఎందుకో ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి.

***

శనివారం ఉదయం ఏడుగంటలయింది.

మంచుని చీల్చుకుంటూ వచ్చి భార్గవి స్కూటీ అధునాతనంగా ఉన్న ఓ అందమైన డూప్లెక్స్ ఇంటి ముందు ఆగింది.

భార్గవిని స్కూటీ పైన చూస్తూనే వాచ్‌మన్ గేటు తీస్తూ పలకరింపుగా నవ్వాడు.

“గుడ్ మార్నింగ్ ధర్మా” నవ్వుతూ తన స్కూటీ గేట్ లోపలికి పోనిచ్చింది.

గేటు దాటి లోపలికి వస్తూనే ఇరువైపులా విరబూసిన పూల మొక్కలు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటాయి ఆ ఇంట్లో. గుమ్మంలో పెద్ద ముగ్గు చూస్తూనే స్కూటీని జాగ్రత్తగా ఓ పక్కగా పార్క్ చేసి హుషారుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది.

లోపల డాక్టర్ రఘురాం డైనింగ్ టేబుల్ దగ్గర ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న మరో కుర్చీలో ఆయన భార్య సుమిత్ర్ర కూరలు తరుగుతూ కూర్చుంది. చేతిలో ఉన్న కాఫీ చప్పరిస్తూనే ఆవిడతో ఏవేవో కబుర్లు చెబుతున్నాడు రఘురాం. సుమిత్ర నవ్వుతూ, మధ్యమధ్యలో ఆ విషయాల గురించి ఏవో ప్రశ్నలు వేస్తూ తన పని చేసుకుంటోంది.

క్షణకాలం పాటు వారిద్దరినీ అలాగే ముచ్చటగా చూసింది భార్గవి.

ఆమె అడుగుల చప్పుడు విని తలెత్తిన సుమిత్ర “రా భార్గవీ. ఏమిటివాళ ఇంత పొద్దున్నే? తేజా, నువ్వూ ఎక్కడికైనా వెళుతున్నారా?”

“లేదాంటీ. తేజాతో మాట్లాడాలని వచ్చాను. లేచాడా?” అంటూ సుమిత్ర దగ్గరగా వచ్చి నిలబడింది.

“ఆ వాడు ఏ రోజైనా ఉదయం ఆరు తరువాత పడుకున్నాడా? పైన యోగాసనాలు వేసుకుంటున్నాడు. వెళ్ళు.”

“ఓకే ఆంటీ” అని మేడమెట్ల వైపు వెళ్ళబోయినదల్లా ఆగి వెనక్కి తిరిగి రఘురాం వైపు చూసింది.

“అంకుల్, ఈ సమయంలో ఎవరైనా మగవాళ్ళు పేపర్ చదువుతూ ఉంటారు. అందులోనూ ఉదయం తొమ్మిదికల్లా క్లినిక్‌లో ఉండే మీలాంటి బిజీ డాక్టర్లు. మీరు మాత్రం ఇలా ఆంటీతో చక్కగా కబుర్లు చెబుతున్నారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే భలే ముచ్చటగా ఉందంకుల్.”

భార్గవి మాటలకి రఘురాం గట్టిగా నవ్వి అభిమానంగా తన వేళ్ళతో ఆమె తల పట్టుకుని నొక్కాడు.

“ఆరోగ్యంగా జీవించడంలో రహస్యం ఇదేనమ్మా. చాలా చాలా తేలిక. మనల్ని ప్రేమించేవాళ్ళ దగ్గర మనం తగినంత సమయాన్ని గడపడమే. అది కూడా ఉదయాన్నే ఇలా హాయిగా, ప్రేమగా కాసేపు కబుర్లు చెప్పుకుంటే చాలు. రోజంతా ఆనందంగా గడుస్తుంది. ఆ ఆనందం వల్ల ఒంట్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చెప్పినా ఈ రోజుల్లో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకునేవాళ్ళే లేరు.”

“ప్రియమైన వాళ్ళతో గడపడం మానేసి మీలాంటి బిజీ డాక్టర్ల దగ్గరకొచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు. కదా అంకుల్..”

“డబ్బు కూడా…” నవ్వేస్తూ అన్నాడు రఘురాం.

“నేను మాత్రం మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటాను అంకుల్. మీలా నాతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపగలిగేవాడినే పెళ్ళి చేసుకుంటాను” గారంగా చెప్పేసి మేడ మీదకి వెళుతున్న భార్గవి వంక నవ్వుతూ చూసింది సుమిత్ర.

“భలే మంచి పిల్ల. ఏదీ మనసులో దాచుకోదు.”

రఘురాం అంగీకారంగా తలూపాడు.

తేజకి రఘురాం, సుమిత్రలు బాబాయి, పిన్ని అవుతారు. తేజ తండ్రికి స్వయానా తమ్ముడు రఘురాం. తేజ తండ్రి విజయవాడలో వ్యాపారంలో స్థిరపడితే, చిన్నప్పటినుంచే చదువు మీద శ్రధ్ధా, పట్టుదలా ఉన్న రఘురాం న్యూరాలజిస్టు అయ్యాడు. బంధువుల అమ్మాయి సుమిత్రనే పెళ్ళిచేసుకున్నాడు. అందం, ఐశ్వర్యం, ఆస్తీ అన్ని ఉన్నా వాళ్ళిద్దరికీ పిల్లలు కలగలేదు. సుమిత్రని కృత్రిమ పధ్ధతులేవీ అనుసరించనివ్వలేదు రఘురాం. వాటివల్ల ఆమె ఆరోగ్యమే కాక, మానసికంగా కూడా బాధపడటం తను చూడలేనని చెప్పేశాడు. కాలేజీ చదువుల సమయానికి తేజని హైదరాబాదు తీసుకొచ్చి తమ ఇంట్లోనే ఉంచుకుని సొంత కొడుకులా చూసుకుంటున్నారు.

తేజ తండ్రి శివరాం, తల్లి అన్నపూర్ణలకి రఘురాం దంపతులంటే చాలా ప్రేమ.

మేడ మెట్ల దారిలో అందంగా పెట్టుకున్న వాళ్ళ ఫొటోలు చూస్తూ పైకి వెళ్ళి తేజ కోసం వెతికింది భార్గవి. మేడ మీద పిట్టగోడానానుకుని ఆకాశంలోకి చూస్తూ నిలబడి ఉన్నాడు తేజ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here