ఎం.హెచ్‌.కె.-8

0
2

[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన ‘ఎం.హెచ్.కె.’ అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 8వ భాగం. [/box]

[dropcap]క[/dropcap]ళ్యాణ్‌ ఆలోచించసాగాడు. తను పొలానికి రాత్రి పూట వెళ్తున్న ప్రతిసారీ దాడి చేసారు. అంటే ఆ పొలాల్లోనే ఏదో జరుగుతుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా అప్పుడప్పుడు వచ్చి వెళుతున్న గ్రహాంతరవాసులు ఇక్కడి వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారన్నమాట. అలా కాకపోతే వారి కార్యకలాపాలు ఇక్కడ జరగడం అసాధ్యం కదా. ఆ గ్రహాంతరవాసులు ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారో తెలియాలంటే తను మళ్ళీ ఆ పొలాల్లోకి వెళ్ళాలి. మరింత గట్టిగా శోధించాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సారి పగలే వెళ్ళి మాటు వెయ్యాలని అనుకున్నాడు. వెంటనే రడీ అయి.. బయలుదేరాడు. జేబులో చిన్న కత్తి పెట్టుకోవడం మరిచిపోలేదు అతను.

చాలా కాజువల్‌గా నడుచుకుంటూ పొలాల్లోకి వెళ్ళాడు. ఇద్దరు ముగ్గురు రైతులు ‘ఏం బాబూ బాగున్నావా’ అని కుశలమడిగారు. అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా చెట్ల తోపులోకి చేరుకున్నాడు. పగలే అయినప్పటికీ వెలుతురు చాలా తక్కువగా ఉంది అక్కడ. అలా నడుచుకుంటూ లోనికి వెళ్ళి ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. జేబులో సెల్‌ఫోన్‌ని వైబ్రేషన్‌ మోడ్‌లో పెట్టాడు. తనతో తెచ్చుకున్న చిన్న బేగ్‌లో ఉన్న ఇన్‌ఫ్రా రెడ్‌ కెమెరాని ఒకసారి తడిమి చూసుకున్నాడు.

క్రమంగా చీకటి పడసాగింది. ఎలర్ట్‌ అయ్యాడు కళ్యాణ్‌.

బాగా పొద్దుపోయిన తర్వాత… కెమేరా ద్వారా పరిసరాలను గమనిస్తున్న కళ్యాణ్‌కి… కదులుతున్న ఆకారాలు కనిపించాయి. మరింత జాగ్రత్తగా వాటి కదలికలను గమనించాడు. వాటి ఇమేజెస్‌లో కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి. మనుషుల ఆకారాలు ఆనవాలు తెలుస్తున్నాయి కానీ వేరే ఆకారాలు మాత్రం చాలా సన్నగా పొడుగ్గా ఉన్నాయి. కాళ్ళు చేతులు చిన్నగా ఉన్నాయి. తల పెద్దగా ఉంది. మామూలుగా నేకెడ్‌ కన్నుతో చూస్తే కనిపించే ఆకారాలు కావు అవి. ఇన్‌ఫ్రా రెడ్‌ విండో నుండి మాత్రమే చూడాలి. అవి గ్రహాంతరవాసుల ఆకారాలని వెంటనే అర్థం అయింది కళ్యాణ్‌కి. అయితే అతను ఆశ్చర్యపోయింది… ఆ గ్రహాంతరవాసులు మన మనుష్యులతో కలిసిపోయి ఏదో కార్యాచరణ మీద ఉండటం.

ఆ ఆకారాలు నెమ్మదిగా కదులుతూ కొంత దూరం వెళ్ళి అదృశ్యమయ్యాయి. కళ్యాణ్‌ చెట్టుపై నుండి చుట్టూ చూసాడు. వేరే ఆకారాలేవీ కనపడలేదు. నెమ్మదిగా చెట్టు దిగి ఆ ఆకారాలు అదృశ్యమైన దిశగా కదిలాడు. కొంత దూరం వెళ్ళాక చెట్ల తర్వాత చిన్న లోయ లాంటిది కనపడింది. అందులోకి దిగాడు. అలా దిగి వెళ్ళగా.. కొంత దూరం తర్వాత భూమి లోపలికి చిన్న దారి లాంటిది కనపడింది. కాని అందులో నుండి వెళ్ళాలంటే నేల మీద హారిజాంటల్‌గా పాక్కుంటూ వెళ్ళాలి. అయితే కళ్యాణ్‌ ఆ పని చెయ్యలేదు. పక్కనే ఉన్న చిన్న బండరాయి వెనకాల దాక్కుని కూర్చున్నాడు. అదును చూసి ఆ పాతాళ దారి లోకి ప్రవేశించాలని అనుకున్నాడు. దాదాపు రెండు గంటల తర్వాత ఎవరో పాక్కుంటూ వస్తున్న చప్పుడు అవుతోంది. ఊపిరి బిగబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్‌చెయ్యసాగాడు. ముగ్గురు మనుషులు పాక్కుంటూ బయటకు వచ్చారు. వాళ్ళ పక్కన ఎవరూ ఉన్నట్టు లేరు. వెంటనే కెమెరా ద్వారా చూసాడు. నేల మీద హారిజాంటల్‌గా పాకుతున్న సన్నటి ఆకారాలు కనిపించాయి. అవి… ఏలియన్స్. ఎప్పటి నుండో ఈ ప్రాంతానికి వచ్చిపోతున్న గ్రహాంతరవాసులు. ఆశ్చర్యాన్ని అదిమి పెట్టుకుని చూస్తున్నాడు. కాసేపటికి తెల్లటి వెలుగురేఖ నేలపై నుండి ఆకాశంలోకి కనిపించింది. దాని ద్వారా ఆ ఏలియన్స్ పైకి ఎగిరిపోయి అదృశ్యమయ్యారు. తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.

‘హమ్మయ్య’ అనుకున్నాడు కళ్యాణ్‌.

కాసేపాగాక.. నెమ్మదిగా పాక్కుంటూ ఆ పాతాళ దారి గుండా వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక కిందికి మెట్లు కనిపించాయి. నెమ్మదిగా దిగాడు. అతన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ కింద చిన్న గృహం ఉంది. పాతాళ గృహం అన్న మాట. అందులో చిన్న గదులు. ఆ గదులు వెతుక్కుంటూ ముందుకు కదిలాడు. ప్రతీ గదిలోనూ ఎలెక్ట్రానిక్‌ పరికరాలు ఉన్నాయి. చిన్న చిన్న ఏంటెన్నాలు ఉన్నాయి. అవన్నీ దాటి వెళ్ళాక ఒక చిన్న గదిలో అపస్మారక స్థితి లో ఉన్న ‘రాము’ కనిపించాడు. ఒక్కసారి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది కళ్యాణ్‌కి. అనతవరకూ రాని కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. ఒక జంతువుని వాడుకున్నట్టు ఆ దుర్మార్గులు రాముని వాడుకుంటున్నారని అర్థమై.. ఆ కన్నీరు. దగ్గరకు వెళ్ళి రాముని చేతుల్లోకి తీసుకున్నాడు. అతన్ని తీసుకుని బయటకు రావాలని కళ్యాణ్‌ ఆలోచన. నెమ్మదిగా రాముని లేపి వెనక్కు కదిలాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించి ఉంటే అలా చేసేవాడు కాదు కళ్యాణ్‌.

***

భూగృహం నుండి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎందుకో మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పటికే కళ్యాణ్‌, రాముని తన పైన వేసుకుని పాక్కుంటూ అందులో నుండి బయటకు వస్తున్నాడు.

ఇమ్మీడియట్‌గా వాళ్ళు కళ్యాణ్‌ మీద దాడి చేసారు. వెంటనే కళ్యాణ్‌ కూడా ఎలర్ట్‌ అయి వాళ్ళను ఎదుర్కొన్నాడు. చాలా సేపు భీకర పోరాటం జరిగింది. అంతిమంగా కళ్యాణ్‌ అందులో విజయం సాధించాడు. ఆ వ్యక్తులని మట్టి కరిపించి వాళ్ళ నుండి రహస్యాన్ని కనుక్కున్నాడు… వెంటనే ప్రొఫెసర్‌కి ఫోన్‌చేసి విషయం చెప్పాడు.

రాముని తీసుకుని సరాసరి ఇంటికొచ్చేసాడు కళ్యాణ్‌. రఘురామయ్య గారు ఇదంతా విని విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎంతో సాహసం చేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చినందుకు కళ్యాణ్‌ని మెచ్చుకున్నారు. అప్పటి దాకా కళ్యాణ్‌పై ఆయనకున్న సందేహాలు తొలగిపోయాయి. అయితే ఈ విషయం మొత్తాన్ని కొన్ని రోజులు రహస్యంగా ఉంచాలని, రాముని తమ ఇంట్లోనే ఉంచి కాపాడాలని నిర్ణయించుకున్నారు.

***

రశ్మి మనసు అదోలా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. తన మనసుకి నచ్చినట్టు పల్లెటూర్లో హాస్పిటల్‌ పెట్టింది. తన సంతృప్తి కోసం పేదలకు వైద్యం చేస్తోంది. కానీ మనసులో ఏదో వెలితి. దానికి కారణం ‘రవి’.

పల్లెటూర్లో హాస్పిటల్‌ పెట్టడం అతనికి ఇష్టం లేదు. అందుకే అప్పటి నుండీ రశ్మితో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడు. ‘ప్రేమంటే’ ఇదేనా?… రవికి తన మీద ప్రేమ లేదా? ప్రేమ లేదేమో!.. ఉంటే తన అభిప్రాయానికి విలువిచ్చి తనతో కలిసి ఉండేవాడు కదా! సిటీలో పనిచేస్తున్న హాస్పిటల్‌లో వర్క్‌లోడ్‌ ఎక్కువ ఉందని చెబుతూ తనతో కలవకుండా తప్పించుకుంటున్నాడంటే అది నిశ్చయంగా ప్రేమ లేనట్టే! అందుకే ఈ బాధ… ఎవరికీ చెప్పుకోలేని బాధ!

తన బాధను ఎవరితో పంచుకోవాలా అని ఆలోచించింది. తండ్రి కంటే ఇంకెవరు తనకు ఆప్తులు. చిన్నప్పుడే తల్లి పోయింది. అప్పటి నుండి తండ్రి తనని పెంచాడు. కాకపోతే ఖరీదైన రెసిడెన్షియల్‌ హాస్టల్స్‌లో ఉంచి చదివించాడు. అందుకనే తనకు ఇంటితో ఎక్కువ సంబంధం లేదు. అప్పుడప్పుడు సెలవులకి వచ్చి పోతుండేది. తండ్రి తాలూకు కార్యకలాపాలు కానీ, అతనికున్న వేరే సంబంధాలు కానీ ఏవీ ఆమెకు తెలీవు. చదువే ఆమెకు పెద్ద స్నేహితురాలు. ఆ చదువు పూర్తిచేసుకుని బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ప్రేమించిన ‘రవి’ తనకు అండగా ఉంటాడనుకుంది. కానీ అతను కూడా తన స్వార్థం చూసుకుంటున్నాడు. ఇదే లోకం తీరు కాబోలు అనుకుంది.

“ఏమ్మా ఎలా ఉంది నీ ప్రాక్టీసు” అంటూ వచ్చాడు తండ్రి. ఆనందాశ్చర్యాలకు లోనైంది రశ్మి. సాధారణంగా తండ్రి ఈ పల్లెటూరికి రాడు. ఈ రోజు వచ్చాడంటే అది ఒక వింతే అనుకుంది

“బాగానే ఉంది నాన్నా… పేదలకు సేవ చెయ్యడంలో ఉన్న ఆనందం తెలుస్తోంది” అంది.

“సరే.. నీ ఆనందమే నా ఆనందం” అంటూ నవ్వేసారాయన. ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు విష్ణువర్ధనరావ్‌. అది రశ్మికి మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

తండ్రి ఇక్కడే ఉన్నాడంటే ఏదో ఒక కారణం ఉంది.. లేకపోతే ఇలా ఇక్కడ ఉండరు ఆయన అనుకుని ఒక కన్నేసి ఉంచింది.

రాత్రి పొద్దుపోయాక.. విష్ణువర్ధనరావ్‌ బయటకు వెళ్ళాడు. చాలా సేపటి తర్వాత తిరిగి వచ్చి అత్యంత అసహనంగా తన రూములోకి వెళ్ళిపోయాడు. రశ్మికి ఏమీ అర్థం కావడం లేదు. ఇంత రాత్రి పూట చెయ్యాల్సిన కార్యక్రమాలు ఏమిటో ఆమెకు అంతు బట్టడం లేదు. రూములోకి వెళ్ళాక తండ్రి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండటం వినబడింది.

“ఆ.. ఆ… కుర్రాడు తప్పించుకున్నాడు.. దానికి కారణం ఎవరో కనుక్కోండి! మరీ ప్రమాదమైతే ఈ పనులింక ఆపేద్దాం! సరేనా” అంటూ పెట్టేసాడు.

రశ్మికి అంతా పజిలింగ్‌గా ఉంది. తండ్రి తను అనుకునేంత మంచివాడు కాదు అని నిర్ధారించుకుంది.

***

రోజూ లాగే ఆ రోజు కూడా తెల్లవారింది. ఊరంతా నిద్రలేచి చైతన్యవంతమైంది. కానీ ఆరోజు కి ఒక ప్రత్యేకత ఉండబోతుందని ఎవరూ ఊహించలేదు.

సావిత్రమ్మ గారు వంటగదిలో పనులు చూసుకుంటున్నారు. రఘురామయ్యగారు వాలుకుర్చీలో కూర్చుని ఎవరితోనో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. జనని అమ్మమ్మకు సాయం చేస్తోంది. కళ్యాణ్‌ తన రూములో కూర్చుని ప్రొఫెసర్‌కి బ్రీఫ్‌ చెయ్యాల్సిన విషయాలు వ్రాసుకుంటున్నాడు.

రంగడు పరుగెత్తుకుంటూ వచ్చి “అమ్మా.. సావిత్రమ్మా.. అయ్యా.. అయ్యగారూ.. బయటకు రండి… ఎవరొచ్చారో చూడండి” అంటూ ఆనందాతిరేకాలతో అరుస్తున్నాడు. సావిత్రమ్మ, జనని గబ గబా బయటకు వచ్చారు. రఘురామయ్య గారు నింపాదిగా లేచి ‘వీడి తస్సాదియ్యా.. అన్నీ విడ్డూరమే వీడికి’ అనుకుంటూ వచ్చారు. బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న జంటను చూసి క్షణకాలం స్థాణువయిపోయారు రఘురామయ్య. సావిత్రమ్మ అయితే ఆనందంతో కొయ్యబారిపోయింది. వెంటనే తేరుకుని కన్నీళ్ళు ఉబుకుతుండగా –

“అమ్మా… పల్లవీ.. నువ్వు… నువ్వు బ్రతికే ఉన్నావమ్మా?” అంటూ ముందుకు కదలబోయింది.

రఘురామయ్య గారు కన్నెర్రజేసి “ఆగు సావిత్రీ..” అని గర్జించారు

ఒక్క సారిగా కాళ్ళకు బంధనం వేసినట్టు ఆగిపోయింది సావిత్రమ్మ. వచ్చిన జంట – రఘురామయ్య గారి కూతురు పల్లవి, ఆమె భర్త సాయిక్రిష్ణ. అసలు విషయం తెలియాలంటే కొన్నేళ్ళ క్రితం జరిగినది తెలియాలి మనకు.

కొన్నేళ్ళ క్రితం…

“నాన్నా.. నేను ఈ అబ్బాయిని ప్రేమించాను” తండ్రి ముందు నిలబడి ధైర్యంగా చెప్పింది పల్లవి.

తలెత్తి చూసాడు రఘురామయ్య. పల్లవి పక్కనే నిలబడి ఉన్న ఒక కుర్రాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. అతని కళ్ళల్లో కనబడుతున్న భయం.

“ఎవరమ్మా ఈ కుర్రాడు” అడిగారు రఘురామయ్య.

“నాతో పాటే కాలేజీ లో చదువుతున్నారు నాన్న.. మన పక్క ఊరే..” నెమ్మదిగా చెప్పింది పల్లవి. సావిత్రమ్మ అప్పటికే వచ్చి భయం భయంగా చూస్తోంది.

“ఆహా.. చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇదన్న మాట. అయినా నాకు ఇలాంటివి ఇష్టం లేవు” అన్నారు

“అదేంటి నాన్నా… నేనేమీ తప్పు చెయ్యలేదు.. నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించాను. ఇప్పుడు మేమిద్దరం పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాము. మీకు చెప్పి చేసుకుందామని అతనంటే తీసుకొచ్చాను” అంది.

“పదిమందికి న్యాయం చెప్పే పెద్దమనిషిని నేను… అలాంటిది నా కూతురే తప్పు చేస్తే నా మాటకు ఇక విలువేముంది.. ఎవడు నా మాట వింటాడు”

“మీ మాట పదిమందీ వినాలని చెప్పి నా ఇష్టాన్ని కాదంటారా” గట్టిగా అడిగింది పల్లవి.

కోపం వచ్చింది రఘురామయ్య గారికి. “ఓహో.. నన్నే ఎదిరించే స్థాయికి వచ్చావన్న మాట. నీకు ఆ అబ్బాయి కావాలంటే నన్ను వదులుకో” అన్నారు స్థిరంగా ఆయన.

నిశ్శబ్దంగా ఆలోచించసాగింది పల్లవి.

తర్వాత “నాన్నా.. నాకు మీరు కావాలి.. ఈ సాయిక్రిష్ణ కూడా కావాలి” అంది.

“తెలివిగా మాట్లాడకు.. ఏదో ఒకటి చెప్పు” అన్నారు.

సావిత్రమ్మ పక్కనుండి “ఏమండీ..” అని ఏదో చెప్పబోయింది.

“నువ్వాగు” అని గట్టిగా ఆమెను వారించారు.

రంగడు “అయ్యా.. అమ్మాయిగారయ్యా..” అంటూ ఏదో చెప్పబోతున్నాడు.

“నువ్వు నోరుముయ్యరా ” అంటూ వాడిని తిట్టి కసిరేసారు.

పల్లవి కన్నీళ్ళు కారుస్తూ, రఘురామయ్య గారి పాదాల మీద వాలి “నన్ను క్షమించు నాన్నా… క్షమించు” అని చెప్పి సాయిక్రిష్ణ చేతిని పట్టుకుని “పదండి వెళ్దాం..” అని బయటకు దారి తీసింది.

సావిత్రమ్మ “అమ్మా..” అని అరిచి అక్కడే ఆగిపోయింది. రంగడు “అమ్మా.. పల్లవమ్మా..” అంటూ ఏడుస్తున్నాడు. రఘురామయ్య గారి మొహం అవమాన భారంతో ఎర్రబడింది.

పల్లవి తన ప్రేమికుడి చేయి పట్టుకుని.. కట్టుబట్టలతో… వచ్చేసింది.

ఆకాశం మేఘావృతమైంది. కారు మబ్బులు ఏనుగుల్లా కదులుతూ వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఊరి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారం మీద కూర్చున్నారు పల్లవి, సాయిక్రిష్ణ. నెమ్మదిగా వర్షం కురవడం ప్రారంభించింది. తను చేస్తున్నది తప్పో ఒప్పో పల్లవికి తెలీదు. కానీ ప్రేమించిన వ్యక్తిని నమ్ముకుని కని పెంచిన తల్లిదండ్రులను వదులుకుని అతని వెంట వచ్చేసింది.

రైలు వస్తున్న సూచనగా కూత వినబడింది. కాసేపట్లో వచ్చి ఆగిన రైల్లో వాళ్ళిద్దరూ ఎక్కి కూర్చున్నారు. సిటీకి వెళ్ళి తమ భవిష్యత్తు వెతుక్కోవాలని వాళ్ళ ఆలోచన.

రైలు కదిలింది. దూరమవుతున్న ఊరుని చూసి కన్నీళ్ళుపెట్టింది పల్లవి.

అలా వెళ్ళిన రైలు పట్టాలు తప్పిందని.. పెద్ద ప్రమాదం జరిగిందని.. చాలా మంది చనిపోయారని ఒక వార్త ఊరి వాళ్ళకి తెలిసింది. ఆ సంఘటనా స్థలానికి వెళ్ళొచ్చిన రంగడు పల్లవి, సాయిక్రిష్ణ చనిపోయారని చెప్పాడు. గుండె బద్దలయిపోయింది సావిత్రమ్మ దంపతులకు. రఘురామయ్య గారు అయితే జీవచ్చవంలా అయిపోయారు. ఆ దెబ్బతో అతని మనసు చచ్చిపోయింది. కన్న కూతురిని కోల్పోయిన బాధ ఆయన్ని లోలోన దహించి వెయ్యసాగింది. కానీ తనే బలహీనమైతే సావిత్రమ్మకి తోడు ఎవరుంటారని అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ గుండె దిటవు చేసుకుని బ్రతకసాగారు. తర్వాత కొన్నాళ్ళకి పొలాల్లో పసిగుడ్డులా జనని వాళ్ళకి దొరకడంతో.. అన్నీ మరచి ఆమెను పెంచడంలో నిమగ్నమయ్యారు. అదీ జరిగిన కథ.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పల్లవి తన భర్తతో కనిపించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here