[dropcap]ఆ[/dropcap]మెకి చిరాగ్గా వుంది.
పని.. పని.. పనీ.. ప్రొద్దుట అలారంతో బాటు లేచి గడియారంతో బాటు పరిగెత్తి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి పూజకి సిద్ధం చేసి మరిది కాలేజీ టైంకి టిఫిన్ పెట్టి, పనిమనుషి చేత సరిగ్గా ఇల్లు తుడిపించి, పాలవాడితో కూరల వాడితో బేరాలూ భేటీలూ అయి, తనకీ మొగుడికీ బాక్స్‌లు కట్టుకుని ఈ ట్రాఫిక్‌లో టూ వీలర్ మీద పద్మవ్యూహాన్ని చేధించినట్లు, ప్రాణాలకి తెగించి, ఆఫీసు చేరేటప్పటికీ రోజూ లేటే..
ఆడ బాస్ రోజూ చివాట్లే.. ఆవిడకేం, ఇంట్లో నలుగురు పనివాళ్లు వున్నారుట.. తనకి ఎడ తెరిపి లేని పని, ట్రావెల్ ఏజెన్సీ.. అందులోనూ సమ్మర్ బుకింగ్స్..
లంచ్ టైంలో అమ్మ ఫోన్.. రోజూ ఒకటే నస! “పిల్లల గురించి ఏం ఆలోచించారూ మీ అత్తగారు అడుగుతున్నారు”? అని.. అసలు ఎక్కడ ప్లేస్ వుంది సిటీ బస్సులా ఓవర్ క్రౌడెడ్‌గా వున్న జీవితంలో? ఆవిడకి అర్థం కాదు.. పూజలూ గుళ్లూ బాబాలూ అంటుంది.. పూజల వల్ల పిల్లలు పుడతారా?.. కొన్నిసార్లు అతను అలిసి పోయి ఇంటి కొస్తాడు..”త్వరగా అన్నం పెట్టెయ్ పడుకోవాలి..టూ టయర్డ్..” అంటాడు.. కొన్ని సార్లు అతను, తనకి నిద్ర పడ్తుండగా మీద చెయ్యి వేస్తే తను కస్సుమని ‘ఇదొక్కటే తక్కువ, నడుం లాగేస్తుంటే..’ అంటుంది.. కాసేపటికి జాలేసి అటు తిరిగి మీద చెయ్యేస్తే గురక వినిపిస్తుంది.. ఇంకెక్కడ పిల్లలూ..!!
వాట్సప్ గ్రూప్‌లో ఫ్రెండ్స్ సన్డే సినిమా ప్రోగ్రాం వేస్తున్నారు.”నాట్ పాజిబుల్” అని తనని ఎవరూ అడగక ముందే పెట్టేసింది. “పిల్లలతో వున్న మేమే వస్తుంటే నీకేం అయిందే” అని ఒకత్తి అంటే “హబ్బీ టూ రొమేంటిక్ హై రే” అని ఇంకోత్తి అంటుంది.. నిటూర్చి పనిలో తల దూర్చేసింది.. క్లోజ్ ఫ్రెండ్ నుండి మూడు మిస్సుడ్ కాల్స్.. చివరికి మెసేజ్..”చచ్చావా.. వున్నావా.. మొన్న నీకు ఇష్టమైన సోనూ నిగం మ్యూజిక్ షోకి రమ్మన్నా రాలేదు.. ఇవాళ సినిమాకి రానంటున్నావు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అసలు వాడవు.. వై యూ ఆర్ సో ఏంటీ సోషల్? కాలేజ్‌లో సినిమాలూ డాన్స్లూ స్పోర్ట్స్ అంటూ ఓ చోట వుండకుండా తిరిగేదానివీ.. ఎనీ ప్రోబ్లెమ్.. హజ్బెండ్ టార్చర్ పెడ్తున్నాడా.. నా దగ్గర కుడా దాస్తున్నావా?”
..అబ్బా.. ఇదొక్కత్తీ.. ఫోన్ పక్కన పారేసి, గబగబా మిగిలిన పని చూస్తుండగా మళ్లీ మెసేజ్.”నన్నూ దూరం పెట్టేసేటంత కష్టంలో వున్నావా? ఏంలేదు.. అంతా బాగానే వుంది, లాంటి చచ్చు రిప్లైలు ఇవ్వకు” అదంతే!.. తనంటే ఎంత ప్రేమో అంత పట్టుదల.. వదలదు చెప్పేదాకా.. రిప్లై టైప్ చేస్తుంటే.. మధ్యలో అఫీషియల్ ఫోన్స్. భర్త ‘రాత్రికి వుప్మా చెయ్యి అన్నం తినను’ అని మెసేజ్. బాస్ రూం లోకి రమ్మని తను మర్చిపోయిన మెయిల్ గురించి తలంటింది.. విసుగ్గా వచ్చి కూర్చుని.. “చస్తున్నా పనులు తెమలక.. పిల్లలు పుట్టట్లేదని మా అమ్మకి అత్తగారు కంప్లైంటట.. ఎలా పుడ్తారు.. ఆయనా నేనూ, వెలుతుర్లో మాట్లాడుకుని.. ప్రేమగా ముద్దు పెట్టుకుని మూడు నెలలు అవుతోంది.. ఇద్దరం మావగారితో ఆస్పత్రికీ, అత్తగారితో సత్యనారాయణ వ్రతాలకీ తప్ప బయటకి వెళ్లి నాలుగు నెలలు అవుతోంది.. గాంధారిలా గుడ్లు పొదగాలేమో ఓ వేళ కడుపొచ్చినా.. లీవ్ దొరికే కంపెనీ కాదిది.. వుద్యోగం మానేస్తే నా ఐ బ్రోస్ చేయించుకోడానికి కూడా మొగుడి దగ్గర చెయ్యిచాపాలి.. ఇంత చేసినా ఎవరికి కృతజ్యత లేదు”.. అని సెండ్ కొట్టే లోపు.. భర్త గారి నుండి “బయల్దేరావా.. అమ్మ అరటి పండ్లు తెమ్మంది వచ్చేటప్పుడు” అని మెసేజెస్.. బాస్ మళ్లీ ఏదో నస వెళ్లిపోతూ కూడా ఆగి.. అన్నీ అయి సెండ్ కొట్టి, బ్యాగ్ వేసుకుని బయల్దేరింది నీరసంగా.
..ఇంటికి చేరడానికి గంట ఆలస్యం అయింది.. అత్తగారు గుమ్మంలోనే చూసి “వచ్చావా.. రారా.. స్నానం చేసి వస్తే ఇద్దరికీ వడ్డించేస్తా.. వాడు వుప్మా చెయ్యమన్నాడు.. నీ కోసం బంగాళ దుంప వేయించాలే, అన్నమే తిందువుగాని” అంది. ఆమె షాక్ అయింది.. ఎందుకంటే ఆవిడ తన పెళ్లవగానే వంట చేయడం మానేసింది.. ఆ రాత్రి భర్త ఆమెని దగ్గరకి తీసుకును ఆమె చెవి రింగ్‌తో ఆడ్తూ..”నాన్నని చూస్కోడానికి కుర్రాడిని పెట్టా. రేపటి నుండీ వస్తాడు.. వారం రోజులు లీవ్ పెట్టెయ్.. మనం కులూ మనాలి వెళ్దాం.. ఎల్.టి.సీ వాడుకోకుండా లీవ్లు అమ్ముకునీ మనం సాధించేదేం లేదు.. చాలా కష్టపడిపోతున్నావు.. అమ్మని సాయంత్రం వంట చెయ్యమన్నా.. పొద్దుట నేను చేసేస్తా లే.. నాకొచ్చు” అన్నాడు..
“ఏవిటిదంతా.. ఏమైంది.?”అంది ఆశ్చర్యంగా..
“లీవ్ ఇవ్వక పోతే జాబ్ మానెయ్యి.. మా ఫ్రెండ్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాడు బ్రాంచ్ హెడ్డుగా నీలా ఎక్స్‌పీరియెన్స్ వున్న వాళ్లు కావాలిట” అని ఆమె కళ్లని ముద్దు పెట్టుకున్నాడు..
“అసలు ఇదంతా ఏవిటి?.. నాకు కలా!..నిజంగా జరుగుతోందా!”.. అంది నమ్మలేక..
“ఈ కొత్త జాబ్‌లో లీవ్స్ ఇస్తారు.. గాంధారిలా పిల్లలను కుండలో పొదగక్కర లేదు నువ్వు” అని నవ్వుతుంటే…
“వాట్!! నీకు ఎలా తెలిసింది.. అది నా మెసేజ్ నీకు పంపిందా?” అరిచింది, లేచి కూర్చుంటూ..
అతను తల అడ్డంగా వూపి.. “ఉషకి చేసాననుకుని నువ్వు నాకే సెండ్ చేసావ్.. చూడు కావలిస్తే! నీ పొరపాటు ఈ సారి మంచి చేసింది కానీ ఇప్పటినుండీ కాస్త చూసుకుని పంపుతూ వుండు.. బాస్‌ని శాడిస్ట్ శాల్తీ అంటూ తిట్టి ఆవిడకే పంపకు” అన్నాడు..
ఆమె తల కొట్టుకుని,”డామిట్” అంటూ అతని మెడ వంపులో సిగ్గుతో మొహం దాచుకుంది!