[box type=’note’ fontsize=’16’] “మళ్ళీ అందరూ ఆనందంగా మిత్ర బాంధవులతో కలిసి ప్రత్యక్ష షాపింగ్‌లకీ, స్వయంగా పెళ్ళీ పేరంటాలకీ, సశరీరంగా సాహిత్య సభలకీ వెళ్లే రోజులెప్పుడు వస్తాయో కదా!” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]
[dropcap]మా[/dropcap] పల్లెటూర్లో సెలవు రోజు మాట్నీ సినిమా కెళ్ళడం అంటే ఒకరోజంతా దాంతోనే సరిపోయేది. ఆత్రుత కొద్దీ రెండు గంటలు ముందు బయలుదేరి రెండు మైళ్ళు నడిచి వెళ్లి సినిమా చూసి వచ్చేటప్పుడు మరీ నెమ్మదిగా తోటల్లోంచి దారి పట్టి పిందెలేమైనా ఉన్నాయేమో అని చూసుకుంటూ పెత్తనాలు చేసుకుంటూ రావడానికి ఓ రెండు గంటలు. అలా రోజు పూర్తి. ఇప్పుడు మన డ్రాయింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చుని యు ట్యూబ్ మూవీలూ, టీవీ చానెల్స్ వేసే సినిమాలు హాయిగా చూడొచ్చు. బ్రేకుల్లో వంటింట్లో దూరి అవీ ఇవీ తెచ్చుకుని తింటూ కూడా చూడొచ్చు. అప్పుడే ఈ టీవీ సౌకర్యం ఉండుంటే ఇంకెన్ని వేల సినిమాలు చుట్టేసేవాళ్ళమో.
ఇప్పుడీ కరోనా దేవత దయవల్ల మన జీవితాల్లో కనీ వినీ ఎరగని చిత్ర విచిత్రమైన మార్పులొచ్చాయి. అందులో ఒకటి స్కూళ్ళు, కాలేజీలు ఇంట్లోకే వచ్చెయ్యడం! వేసవి సెలవులకొచ్చిన పిల్లలు ఇక్కడే ఉన్నారు. కరోనా వల్ల స్కూల్స్, కాలేజీలూ పోతున్నాయి, పిల్లలింట్లో తిని టీవీ ముందు కూర్చుని బద్ధకస్తులవుతున్నారని బాధ పడేలోపు ఆన్ లైన్ పాఠాలు మంజూరయ్యాయి. ‘పర్వాలేదులే వాళ్ళని స్కూల్‌కి పంపాలంటే వాళ్ళని తయారు చేసి మంచినీళ్ళతో సహా లంచ్ బాక్స్, ఈవెనింగ్ స్నాక్స్, వాన్ స్నాక్స్ అంటూ ఓ పది డబ్బాలు కట్టే బాధలేదులే’ అని ఆనందపడ్డాం. పిల్లల పక్కన మనం కూడా కూర్చుని మళ్ళీ స్టూడెంట్లయి పోవచ్చని లోపల మాకు భలే ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూసాం.
ఆ రోజు నుంచే నాలుగు చదువుతున్న పెద్దవాడికి క్లాస్‌లు ప్రారంభం. ఇంట్లో అందరం మరీ ఉత్సాహపడి రెడీ ఐపోయాం. పొద్దున్నే లేచి వాడిని గుంజి లేపి స్నానం చేయించి వాడు వద్దంటున్నా టిఫిన్ కుక్కి, మేం కూడా తిని ఆ కంప్యూటర్ ముందు కూర్చున్నాం. మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి మనసు పులకించింది కూడా. స్క్రీన్ ముందు మేం కెమెరాకి కనబడకుండా ఎక్కడ కూర్చోవాలో చూపించి మీటింగ్ ఉందంటూ మా అమ్మాయి తన లాప్ టాప్ తీసుకుని రూంలోకి వెళ్లి తలుపేసుకుంది. ఒక టీచర్ వచ్చింది. ముద్దుగా బానే ఉంది. మాక్కూడా నచ్చింది. ఆమె రాగానే నవ్వుతూ అందరి వైపూ ప్రేమగా చూసింది. రాగానే కూర్చోకుండా ప్రార్థనలు, భగవద్గీత శ్లోకాలు మొదలు పెట్టింది. పెద్దవాడు మిగిలిన పిల్లలతో కలిసి ఆ శ్లోకాలు చదువుతుంటే మాకు సిగ్గేసింది. అవి మాకు పూర్తిగా రావు మరి. తర్వాత ఓ ఇరవై గుంజీళ్లు తీయించారు. ఆ పై కళ్ల ఎక్సర్ సైజ్ చేయించారు. వాడి పక్కనే కెమెరాలో కనబడకుండా మేం సర్దుకుని కూర్చున్నాం.
లెక్కల టీచర్ వచ్చింది. మాక్కొంచెం భయం వేసింది. ‘ఆ! నాలుగో క్లాస్ లెక్కలు రావా ఏంటి మాకు?’ అని ధైర్యం తెచ్చుకున్నాం. క్లాస్ మొదలయ్యింది. కొన్ని లెక్కలు ఇచ్చి చెయ్యమందామె. భాగహారాలకి చెవుల విధానం లేదు కొత్త రకంగా ఉంది. అయినా కొంత సేపు మేమో పుస్తకం పెట్టుకుని గుణకారాలు, భాగహారాలూ చేయబోయాం. టీచర్ లెక్క పూర్తవ్వగానే మా జవాబు చూసుకుని సబ్జెక్టు మీద, మర్చిపోయిన లెక్కల మీదా గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. మా వాడి వైపు చూస్తుంటే మాకు వాడు చేసేదీ, టీచర్ చేసే విధానమూ తెలీక అయోమయం అయ్యింది. అప్పుడు వెలిగి కాలిక్యులేటర్ తెచ్చుకుని కూర్చున్నాం. ఎలాగో లెక్కల క్లాస్ అయ్యింది. హిందీ టీచర్ వచ్చింది. మాకెంతో సంతోషం వేసింది. ఆవిడ పాఠం మొదలెట్టి ప్రశ్నలడుగుతుంటే మా వాడికి ప్రాంమ్టింగ్ ఇచ్చి టీచర్ చేత గుడ్ అనిపించాం. ఆవిడ చెప్పే నోట్స్ వాడు గెడ్డం కింద చేతులేసుకుని వింటున్నాడు. నోట్స్ రాసుకోమంటే విసుగ్గా చూసాడు. పోన్లే అని మేమే రాసేసుకున్నాం. ఇచ్చిన హోమ్ వర్క్ కూడా నోట్ చేసుకున్నాం. వాడికి ఇది నచ్చింది. వీళ్ళిద్దరూ నా సహాయకులు అన్నట్టు కూర్చున్నాడు. మధ్యలో మా అమ్మాయి చెకింగ్‌కి వచ్చి మా మీద కోప్పడి నోట్ బుక్ వాడిముందు పెట్టి వెళ్ళిపోయింది. ఇక తప్పనట్టుగా టేబుల్ ముందు అసహనంగా కూర్చున్నాడు.
తర్వాత ఇంగ్లీష్ టీచరొచ్చి గ్రామర్ మొదలెట్టింది. నాలుగో క్లాస్ వాడికి టెన్త్ స్థాయి వ్యాకరణం! కొంత సేపు విన్నాక బోర్ కొట్టి దిక్కులు చూసి, ఆపై టేబుల్ క్లాత్ డిజైన్ చింపడం మొదలెట్టాడు వాడు. ఇంతలో ఒక పిల్లాడు కొబ్బరి తోటలో కూర్చున్నట్టున్నాడు. వాడి వెనక ఉన్న గడ్డి మోపు మీదకి ఒక కోడి ఎగిరి వచ్చి చూసి ఆన్‌లైన్ తతంగం అర్ధం కాక కొక్కొరొకో అంటూ చిరాగ్గా వెళ్లి పోయింది. టీచరూ, పిల్లలూ గట్టిగా నవ్వుతూ రిలాక్స్ అయ్యారు. ఆ బరువు గ్రామర్ పాయింట్లు మళ్ళీ చెప్పి టీచర్ సెలవు తీసుకుంది. ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాం. ఇలా ఓ వారం నడిచింది.
తర్వాతి వారం చిన్నాడికి కూడా క్లాస్‌లు ప్రారంభం అయ్యాయి. ఇద్దరినీ హాల్లో చెరో టేబుల్ ముందూ ట్యాబులు పెట్టి కూర్చొబెట్టాం. ఇద్దరం చెరొకరి దగ్గరా కూర్చున్నాం. పెద్దాడికి కాస్త అలవాటయ్యి బాగానే నోట్ చేసుకుంటున్నాడు.
చిన్నవాడి క్లాస్ ప్రారంభం అయ్యింది. కుర్చీలో కూర్చోమనగానే మహా బాధ పడిపోయాడు వాడు. కూర్చోగానే వాష్ రూమ్ అన్నాడు. తీసుకెళ్లి మళ్ళీ కూర్చొబెట్టాం. టీచర్ వీడియోలో ఒక గార్డెన్ చూపించి అక్కడేమున్నాయో చెప్పమని అడిగింది. అవి బాగానే చెప్పాడు. దానికే అలిసిపోయి ఆకలి అని సైగ చేసాడు. ఓ నాలుగు ఖర్జూరం పండ్లు ప్లేట్‌లో వేసి ఇచ్చాను. “యాక్! ఇవి కాక్రోచ్‌లు (బొద్దింకలు) వద్దు” అన్నాడు. అప్పడాలు కావాలన్నాడు. డబ్బా వడిలో పెట్టుకుని టేబుల్ కిందికి దూరి కూర్చుని తింటూ మధ్యలో లేస్తున్నాడు. చిన్నవాళ్ళని కాబోలు టీచర్‌లు పిల్లల్ని కన్నా, కుట్టీ అంటూ బుజ్జగిస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ టీచర్ అ, బ, క, డ అంటూ సౌండ్‌ని బట్టి ఇంగ్లీష్ పదాలు చెబుతుంటే మేం తెల్ల మొహం వేసాం. క యాప్ కాప్, ర యాప్ రాప్ అంటూ రాయించింది. అప్పుడర్ధమయ్యింది వీడు ‘అమ్ అమ్ ఆ’ అంటూ నన్నెందుకు పిలుస్తున్నాడో! అంతలో మంచి నీళ్లు తెమ్మని మాకు పురమాయించాడు. విజిటింగ్ కొచ్చిన మా అమ్మాయి బెదిరించాక కాస్త కంట్రోల్‌లో పడ్డాడు. ఒక పక్క పెద్దవాడికి మరో పక్క చిన్నవాడికి ట్యాబుల్లో క్లాస్‌లు నడుస్తుంటే గోల గోల గా ఉండి మా ఊర్లోని ఎలిమెంటరీ స్కూల్ గుర్తొచ్చింది. అక్కడిలాగే ఒకే పెద్ద హాల్‌లో మూడేసి క్లాసులు నడిచేవి. మూడు తరగతుల వాళ్ళం మూడు దిక్కుల వైపు ముఖం చేసి కూర్చునేవారం. గట్టిగట్టిగా మాష్టార్ల పాఠాలు, వల్లెవేసే పిల్లల స్వరాలతో మా ఊరి కాలవ గట్టు మార్మోగేది.
“ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాస్ సమయాల మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటిచ్చిన కారణాన ఈ నాలుగేసి గంటల చదువుల బాధ మనకి తప్పదు” అంది మా అమ్మాయి. పిల్లలు కూడా బాగానే నలిగిపోతున్నారు. హోమ్ వర్క్‌లూ, ఓరల్ టెస్ట్‌లూ మామూలుగానే ఉన్నాయి.
కరోనా పూర్తిగా తగ్గేవరకూ పిల్లలు స్కూల్స్‌కి పోకపోతే వారి చదువు ఎటుపోతుందో అని భయపడిన పేరెంట్స్ కిప్పుడు ఆన్‌లైన్ పాఠాలతో పగలే చుక్కలు కనబడుతున్నాయి. గ్రాండ్ పేరెంట్స్‌కి కూడా సరదా తీరిపోతోంది. ఇరవై నాలుగు గంటలు సరిపోవడంలేదు వంటింట్లోకి, క్లాస్‌లకీ మధ్య పరుగులు తియ్యడానికి. ‘ఈ ఏడాది మన పరిస్థితి ఇంట్లో భజనేనా’ అనుకున్న స్కూల్స్ యాజమాన్యం వాళ్లు ‘అమ్మయ్య! మన ఫీజుల డబ్బులకి ఢోకా లేదులే’ అని చావుతప్పిన చందంగా కాస్త తెప్పరిల్లారు.
కరోనా భయంతో మనం అందరం చక్కగా బుద్ధిగా లైన్‌లో నిలబడ్డాం. వ్యాయామంతో పాటు కషాయాది ఆరోగ్య చిట్కాలన్నీపాటిస్తున్నాం. బంధుమిత్రులతో ఆన్‌లైన్‌లో మాత్రమే టచ్‌లో ఉంటున్నాం. కూరగాయలు ఇతర వంటింటి సామాన్లు బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం. పెద్దల ఉద్యోగాలూ, పిల్లల చదువులూ ఇంటినుండే ఆన్‌లైన్ లోనే. డాక్టర్‌లు కూడా రోగులను అదే లైన్‌లో చూస్తున్నారు. దేవుడు కూడా దూరం దూరం అంటూ భక్తి ఛానల్స్ ద్వారా దర్శనం ఇస్తున్నాడు. పెళ్ళిళ్ళూ, పుట్టిన రోజులూ, సాహిత్య సభలూ, షాపింగ్‌లూ కూడా ఆన్‌లైన్ లోనే జరిగిపోతున్నాయి.
కరాళ నృత్యం చేస్తున్న కరోనా ప్రపంచాన్ని వదిలి అదృశ్యం కావాలని గత నెల ఆషాఢంలో బోనాలు సమర్పిస్తూ అమ్మవార్లను ప్రార్థించడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ, వరలక్ష్మీ అమ్మవార్ల నోములు నోచి గట్టిగా పూజలు చేసి ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్యం ఇచ్చి కోవిడ్ మహమ్మారి నుంచి కాపాడమని కోరుకోవడం, ఆ పై రాబోయే టీకా కోసం ఎదురుచూడడం మాత్రమే భక్తులు చెయ్యగలిగిన పని. మళ్ళీ అందరూ ఆనందంగా మిత్ర బాంధవులతో కలిసి ప్రత్యక్ష షాపింగ్‌లకీ, స్వయంగా పెళ్ళీ పేరంటాలకీ, సశరీరంగా సాహిత్య సభలకీ వెళ్లే రోజులెప్పుడు వస్తాయో కదా!