[dropcap]సం[/dropcap]బంధాలు చెదిరినప్పుడల్లా
అనుబంధాలు కదిలిపోయిప్పుడల్లా
మనసు మర్మాల కర్మాగారంలో
కొత్త అర్థాల నిఘంటువులు కొలువుతీరుతుంటాయి
ఆరాల గూఢచర్యం చేస్తూ
సంఘటనల పేజీలను పోస్టుమార్టం చేస్తూ
మాటల మామూలు అర్థాలను
మసిపూసి మారేడుకాయ చేస
అపార్థాల అంతరార్థాల వెటకారాల
వింతైన వెతుకులాటకు వేగిరపడుతాయి
మాటల మధ్య మౌనంగా ఉన్న మౌనానికీ
పెడర్థాల పెనుగులాటను పెనవేయిస్తుంటాయి
కాలం, ఆయువు జాడీలోంచి కొద్దికొద్దిగా
కారిపోతూ ఖాళీ అవుతున్న కొద్దీ
ఆత్మీయత సరిహద్దుల్లో ఆంక్షలు పెరుగుతుంటాయి
మాటల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి
మనిషికి మనిషికి మధ్య మెల్లమెల్లగా
దూరాలు కొద్దికొద్దిగా పోగుపడుతుంటాయి
ఎక్కడినుంచో … ఎవరి చలువవల్లో
అహంకారపు ఇసుక
ఆభిజాత్యపు ఇటుక
ఆత్మాభిమానాల సిమెంటు
కొత్త ఆత్మీయుతల కూలీ మేస్త్రీ పనితనాలు
అలా అలా వచ్చేస్తుంటాయి
దగ్గరితనపు నేల,
లోలోతుల్లోంచి తవ్వబడి
ఎడమొసహపు పెడమొహపు పునాదులు మొలుస్తాయి
నిశ్శబ్దంగానే గోడలు నిర్మితమై నిలుచుంటాయి
దారులు వేరౌతాయి
కొత్త దారులు క్రమంగా క్రమబద్దీకరించబడతాయి
మూతబడిన మనసు నేలమాళిగల్లో
కలివిడి జ్ఞాపకాలు కనిపించకుండా బందీ అయిపోతే
అపార్థాల గాయపుకట్ల కట్టుబాట్లుతో
మనిషికీ మనిషికీ మధ్యలో ఇప్పుడు మాటలు ఉండవు
గట్టి గోడలే ఉంటాయి…. నిలువెత్తు గోడలే ఉంటాయి