జ్ఞాపకాలు – వ్యాపకాలు – 19

0
3

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

రైల్వే మ్యాప్‌లో కొత్తగూడెం స్టేషన్ కనబడడం లేదని కంగారు:

1989 ఫిబ్రవరి నాటి మాట. నేను ఢిల్లీలో ఆకాశవాణి ట్రెయినింగ్ సెంటర్‍లో డిప్యూటీ డైరక్టర్‍గా పని చేస్తున్నాను. ఓ సాయంకాలం నన్ను హైదరాబాద్‍ ట్రెయినింగ్ సెంటర్‌కు మారుస్తూ ఆర్డర్లు వచ్చాయి. అదనంగా కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం బాధ్యతలు అప్పగించారు. అప్పటికి నేను ఢిల్లీ వెళ్ళి సరిగ్గా రెండు సంవత్సరాలు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. మరునాడు రాత్రి మా డైరక్టర్ యస్.కె.శర్మ కొడుకు పెళ్ళి విందుకు నేను, మా ఆవిడ వెళ్ళాము. అక్కడ మా డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే కనిపిస్తే ఇద్దరం నమస్కరించాం.

“రావ్! హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ వచ్చిందని మీ ఆవిడ సంబరపడుతుండాలి” అన్నారు షిండే.

“మేం ఢిల్లీ వచ్చి రెండేళ్ళు పూర్తి కాలేదు. అప్పుడే ట్రాన్స్‌ఫర్ ఎందుకు?” అని మా ఆవిడ వచ్చీ రాని హిందీలో ప్రశ్నించింది.

ఆయన చాలా కోపదారి. అలాంటిది వెంటానే – “The orders will be cancelled. Go on tour to Kothagudem and get it inaugurated” అన్నారు.

మనసులో నేను వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను.

మర్నాడు ఆయనను ఆఫీసులో కలిశాను. అప్పట్లో కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రిగా జలగం వెంగళరావు వున్నారు. ఆయన ఒక రోజు షిండేని పిలిపించి మార్చి 24న కొత్తగూడెం కేంద్రం తాను ప్రారంభిస్తాననీ, త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయమని ఆదేశించారు. ఆ భారం నా మీడ పడవేశారు మా డైరక్టర్ జనరల్.

“మీరు మన చీఫ్ ఇంజనీర్‌ని వెళ్ళి కలిసి రేపే కొత్తగూడెం ప్రయాణం కట్టండి. వెంగళరావు తొందర పెడుతున్నారు” అన్నారు షిండే.

నేను చీఫ్ ఇంజనీర్ రూమ్‌కి వెళ్తే ఆయన టేబుల్ మీద పెద్ద రైల్వే మ్యాప్ పెట్టుకుని కొత్తగూడెం రైల్వే స్టేషన్ కనబడడం లేదని కంగారు పడుతున్నాడు.

‘భద్రాచలం రోడ్డు’ అనే పేరుతో కొత్తగూడెం స్టేషను కనిపిస్తుంది. ఆ మాట చెప్పగానే ఆయన కంగారు తగ్గింది. డైరక్టరేట్‌లో శాంక్షన్లు అన్నీ తీసుకొన్నాను.

హైదరాబాదులో:

ఢిల్లీ నుండి నేను 1989 ఫిబ్రవరి 24న బయలుదేరి హైదరాబాదు చేరి అక్కడ ఆకాశవాణి డైరక్టర్ గణేశన్‌ని కలిసి యుద్ధ ప్రాతిపదక మీద సిబ్బందిని పదిమందిని ‘టూర్’ మీద కొత్తగూడెం పంపమని డైరక్టర్ జనరల్ ఆదేశం చూపాను. రెండు మూడు రోజుల్లో ఆర్డర్లు వచ్చాయి. నేను విజయవాడ వెళ్ళి అక్కడి డైరక్టర్ అయూబ్‌ని కలిసి ఆఫీసు జీపు, డ్రైవర్‌తో కొత్తగూడెం మార్చి 2న చేరుకొన్నాను. విజయవాడలో కనకదుర్గ ఆశీస్సులందుకొన్నాను.

గోడలు తప్ప మరేమీ లేని ఆకాశవాణి కేంద్రం:

ఒకరిద్దరు ఇంజనీరులు, ట్రాన్స్‌మిషన్ పరికరాలు తప్ప అక్కడ ఏమీ లేవు. సింగరేణి కాలరీల వారి వద్ద మూడెకరాల స్థలం ఆకాశవాణి కొని కేంద్రాన్ని, ఉద్యోగుల క్వార్టర్లను కట్టించి సిద్ధంగా వుంది. నా గదిలో కూచోవడానికి కుర్చీ ఎవరో అరువు తెచ్చారు. మరో 22 రోజుల్లో కేంద్ర ప్రారంభం.

ఫిబ్రవరిలో వెంగళరావు ఖమ్మం పర్యటనకు వచ్చినపుడు ఒక విలేకరి- “దేశంలోనే తొట్ట తొలి స్వతంత్ర ఎఫ్.యం. రేడియో కొత్తగూడెం రెడీగా సంవత్సరం నుండీ వుంది. ప్రారంభోత్సవానికి నోచుకోలేదా?” అని ప్రశ్నించాడు.

ఆయన తన సెక్రెటరీ కె.వి.రావు కేసి చూసి, “మళ్ళీ ఖమ్మం ఎప్పుడు వస్తున్నాం?” అని అడిగారు.

“మార్చి 24న” అన్నాడాయన.

“ఆ రోజు కొత్తగూడెం కేంద్ర ప్రారంభోత్సవం చేస్తాను. ఆకాశవాణి డి.జి.కి ఏర్పాట్లు చేయమని చెప్పండి” అన్నారు వెంగళరావు.

ఈ నేపథ్యంలో 20 రోజుల గండం తుఫాను తీరానికి చేరుకునే దశకు వచ్చింది.

నేను ఖమ్మం వెళ్ళి అక్కడ జిల్లా కలెక్టరు ఐ.వై.కృష్ణారావును కలిసి ప్రారంభోత్సవ సభకు రెవెన్యూ సహకారం కావాలని కోరాను. నేను కందుకూరు కళాశాల్లొ లెక్చరర్‍గా పనిచేసినపుడు ఆయన మా కళాశాల విద్యార్థి. ఆయన వెంటనే జాయింట్ కలెక్టర్ శ్యాంబాబుని పిలిపించి – “వారికి కావలసిన సహకారం అందివ్వండి. ఆయన మా గురువుగారు” అన్నారు.

అప్పుడు సింగరేణి కాలరీస్‌లో సి.యం.డి.గా సీనియర్ ఐఎఎస్ అధికారి వి. గోవిందరాజన్ పని చేస్తున్నారు. ఆయనను కలిసి వారి సహకారం కోరాను. వాళ్ళ అతిథి గృహంలో నేను బస చేసే – పేయింగ్ గెస్ట్ – వసతి సౌకర్యం కల్పించారు. “మా నాన్నగారు వింజమూరి వరదరాజయ్యంగార్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో సంగీత విభాగం ప్రొడ్యూసర్‍గా పని చేశారు. ఆకాశవాణి అంటే నాకభిమానం” అన్నారు. ఆ విధంగా కాగల కార్యం గంధర్వులు తీర్చారు.

హైదరాబాదు నుండి గోవర్ధన్ అసిస్టెంట్ డైరక్టర్‌గా, సత్యనారాయణ ఎకౌంటెంట్‌గా టూర్ మీద వచ్చారు. విజయవాడలో గాద్రేజ్ కంపెనీ మేనేజరు శాస్త్రి ద్వారా అప్పు పద్ధతి మీద బీరువాలు, కుర్చీలు, ఫర్నీచరు తెప్పించాను. ఆయన భార్య సుభాషిణీ శాస్త్రి ఆకాశవాణిలో కర్నాటక సంగీతం పాడుతుంది.

మండిపడ్డ యన్.టి.రామారావు:

స్టేషన్ ప్రారంభోత్సవరం మార్చి 24గా నిర్ణయించబడింది. ఆహ్వాన పత్రికలు కనీసం వారం ముందు తయారు కావాలి. ప్రోటోకాల్ ప్రకారం కొత్త కేంద్రం ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానం. పది రోజుల ముందు మా ఆకాశవాణి హైదరాబాదు డైరక్టరు గణేశన్ ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. యన్.టి.ఆర్ విరుచుకుపడ్డారు.

“నాతో సంప్రదించకుండా మార్చి 24వ తేదీని ఎలా నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? నేను రాను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి” అన్నారు యన్.టి.ఆర్.

వారం రోజుల క్రితమే వెంగళరావు, యన్.టి.ఆర్‌లు యిద్దరూ పరస్పరం వివిధ సభలలో విమర్శనాస్త్రాలు గుప్పించి వున్నారు. అందువల్ల ఇద్దరూ ఒకే సభలో మాట్లాడడం – ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనంత కష్టం.

మా డైరక్టర్ జనరల్ సందిగ్ధంలో పడ్డారు.

“ఎలానో సర్దుబాటు ధోరణిలో వ్యవహరించండి” అన్నారు నాతో ఫోన్‍లో.

అప్పుడు యన్.టి.ఆర్. సెక్రటరీగా పి.యల్. సంజీవరెడ్డి పని చేస్తున్నారు. వారు కడప కలెక్టరుగా, నేను కడప ఆకాశవాణి ప్రొడ్యూసర్‍గా 1976-77లో బాగా పరిచయం. వారికి ఫోన్ చేశాను. మధ్యేమార్గంగా ఆయన సర్దుబాటు చేశారు. 20వ తేదీ సాయంకాలం వరకు ఈ పంచాయతీ పూర్తి కాలేదు. ఇన్విటేషన్లు ప్రెస్‌లో సిద్ధంగా వున్నాయి.

“రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కారుపాటి వివేకానంద రాష్ట్ర ప్రతినిధిగా సభలో పాల్గొంటారు. గో ఎహెడ్” అన్నారు సంజీవరెడ్డి.

హుటాహుటిన 22వ తేదీ ఉదయానికి హైదరాబాదు నుండి ఆహ్వాన పత్రికలు కొత్తగూడెం చేరాయి.

కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్ వారి మహిళా కళాశాల వుంది. ఆ ప్రిన్సిపాల్ సహృదయుడు. వాళ్ళ ఆడిటోరియంలో మార్చి 24న సాయంకాలం ప్రారంభోత్సవ సభకు వైభవంగా ఏర్పాట్లు చేశాము.

సాయంత్రం 4.30 గంటలకు వెంగళరావు, వివేకానంద ఆకాశవాణి స్టూడియోలకు వచ్చి కేంద్ర ప్రారంభోత్సవం చేసి స్టూడియోలో ఇద్దరూ తమ సందేశాలు రికార్డు చేశారు. యథాతథంగా కేంద్రం నుంది ప్రసారాలు మొదలయ్యాయి. ఆ కార్యక్రమంలో ఢిల్లీ నుండి వచ్చిన మా డిప్యూటీ డైరక్టర్ జనరల్ టి.ఆర్. మలాకర్, ఢిల్లీ నుండి వచ్చిన యం.కె. రామస్వామి, మదరాసు జోన్ చీఫ్ ఇంజనీర్ టి.కె. విశ్వనాథం, హైదరాబాద్ స్టేషన్ డైరక్టరు టి.ఎన్.గణేశన్ పాల్గొన్నారు. సాయంకాలం సభ దిగ్విజయంగా జరిగింది. దేశంలోనే తొలి స్వతంత్ర ఎఫ్.యం.కేంద్రంగా పత్రికలు ప్రశంసించాయి.

పదిహేను నిముషాల్లో దీపస్తంభ సృష్టి:

సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆఫీసుకు మా డి.డి.జి అయిన మలాకార్ వచ్చారు. సాయంత్రం సభ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం చర్చిస్తున్నాం.

“దీప ప్రజ్వలన ఎవరు చేస్తారు?” అని అడిగారు మలాకర్.

ఆ విషయం ముందుగా నిర్ణయం కాలేదు.

“అరగంట లోపు దీపస్తంభము, చమురు, వొత్తి సృష్టించే మ్యాజిక్ నా చేతిలో లేదు సార్!” అన్నాను చిలిపిగా.

ఆయనకు కోపం వచ్చింది.

నా పక్కనే వున్న ఒక శ్రేయోభిలాషి, స్థానిక ఇంజనీరు శాస్త్రిగారు – “నేను కాలేజి దగ్గరకు తీసుకువస్తాను సార్!” అన్నారు.

భగవంతుడు రక్షించాడనుకొన్నాను. 4.25 గంటలకు దీపస్తంభం రెడీ.

ఆకాశవాణి కేంద్రాన్ని తక్షణం మూసివేయమన్న స్థానికులు:

మార్చి 25 ఉదయం 9 గంటల ప్రాంతంలో రహదారి బంగళాలో వెంగళరావు బస చేస్తున్న ప్రదేశానికి ఆకాశవాణి కేంద్రం పరిసరాలలోని రామవరం గ్రామస్థులు 20 మంది గుంపుగా వచ్చారు. “మీరు ప్రారంభించిన రేడియో వల్ల మాకు టి.వి.ఛానెల్స్ రావడం లేదు. మీ రేడియో ఎఫ్.యం. సెట్లు మాకెటూ లేవు. టి.వి. కూడా లేకుంటే ఏం ప్రయోజనం?” అని తీవ్రంగా వాదించారు.

మంత్రి గారు మా చీఫ్ ఇంజనీర్‌-విశ్వనాధంని వెంటనే పిలిపించారు.

“షాడో జోన్ వల్ల రావడం లేదు” అని ఇంజనీరు సమాధానం.

“వారం రోజుల్లో అది సరిదిద్దండి!” ఆయన సర్దుబాటు ధోరణిలో చెప్పి సరిపెట్టారు. “త్వరలో యఫ్.యం. రేడియో సెట్లు కూడా మార్కెట్‌లో వచ్చేటట్లు చూడండి” అనీ, ‘ఫిలిఫ్స్’ కంపెనీతో మాట్లాడమనీ తన సెక్రటరీ కె.వి.రావును ఆదేశించారు.

ఎం.ఎల్.ఎ. అలక:

కొత్త కేంద్ర ప్రారంభోత్సవం అమ్మాయి పెళ్ళి లాంటిది. అది ఎలానో జయప్రదంగా జరిగిపోయింది. స్థానిక ఎం.ఎల్.ఎ. నాకు ఆహ్వానపత్రిక రాలేదని పత్రికా ప్రకటన చేశారు. 23వ తేదీ సాయంత్రం వారిని ఇంటివద్ద నేను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చాను. ఆ సమయంలో వారి మనవరాలి పుట్టినరోజు వేడుకలు. ఆ వీడియోలో నేను ఇన్విటేషన్ ఇచ్చే భాగం చూపించి వారిని ఆశ్చర్యపరిచాను. రెండు నెలల పర్యటన పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఏప్రిల్ 25వ తేదీన మళ్ళీ ఢిల్లీ ట్రెయినింగ్ సెంటర్ చేరుకొన్నాను. శుభం కార్డు పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here