జ్ఞాపకాల పందిరి-18

96
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఇదో రకం..!!

మనిషి సుఖానికి, సౌకర్యాలకు, జల్సాలకు బానిస అయితే, వాటిని సమకూర్చుకోవడానికి సరైన ఆర్ధిక వెసులుబాటు లేకపోతే, అతడు/ఆమె ఉద్యోగి అయినా, నిరుద్యోగి అయినా, డబ్బు సంపాదన కోసం పక్కదారులు తొక్కడం మామూలు అయిపొయింది. ఈ క్రమంలో ఎంతటి సాహసానికైనా, ఎంతటి దారుణానికైనా వెనుకాడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉన్నదానితో సంతృప్తి పడకుండా, వినోదాలకూ, విలాసాలకూ అలవాటు పడిపోయి, ఆర్థికంగా బలంగా ఉన్నవారి జీవితాలతో తమ జీవితాలను పోల్చుకుని, తమ జీవితాలను తప్పు దారుల్లోకి మళ్లించడం నేడు ఒక మామూలు పరిస్థితిగా మారిపోయింది. ఉద్యోగస్థులు ఇలాంటి పరిస్థితులకు దగ్గర కావడం బాధాకరం. దీనినే మనం లంచగొండితనం అంటున్నాము. లంచాలకు అలవాటు పడిన వారు, అది లేకుండా చిన్న పని కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. అది తమ హక్కుగా భావించడం మరీ బాధాకరమైన విషయం. ఉద్యోగులందరూ లంచగొండులని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు! నూరు మందిలో, పదిమంది అలాంటివారు ఉంటే చాలు, ఆ మిగతా తొంబై మందికీ ఆ చెడ్డపేరు అతుక్కు పోతుంది. ఫలానా డిపార్ట్‌మెంట్‍లో అసలు లంచాలు తీసుకోరు.. అని చెప్పుకునే ధైర్యమూ సాహసమూ ఎవరికీ లేదు, ఇదీ ప్రస్తుతం మన వ్యవస్థలో నెలకొని వున్న దుర్భర పరిస్థితి. దీనికి యాభై శాతం కారణం ప్రజలే! వాళ్ళ అవసరాల కోసం డబ్బు ఎరగా పెట్టి ఎంతటి సాధ్యం కాని పనినైనా సుసాధ్యం చేయించుకునేవారు ఎంతమంది లేరు?

ఒక ఉద్యోగి విషయానికి వస్తే, ఆ ఉద్యోగి ఇంక్రిమెంటు శాంక్షన్ కావాలంటే (అందరినీ ఒకే గాట కట్టేయలేము, అది వేరే విషయం) లంచం ముట్ట చెప్పవలసిందే! పైగా అది కింది స్థాయిలోనే జరగడం ఇంకా బాధాకరం. కోరుకున్న చోటికి బదిలీ కావాలంటే అంతో ఇంతో సమర్పించు కోవలసిందే. జి.పి.ఎఫ్ అడ్వాన్సు కావాలంటే, అడిగినంత సమర్పించు కోవలసిందే! ఇన్‌కమ్ టాక్స్ విషయంలో సమర్పించు కోవలసిందే, ఏవైనా ఎరియర్స్ వస్తే ఆ.. చేతిలో పడితేనే మన చేతిలో పడతాయి. హోమ్ టౌన్ ప్రయాణ ఖర్చులు, విహార యాత్రల ఖర్చులు (ప్రభుత్వ పరంగా వచ్చేవి) మంజూరు చేయాలంటే లంచం ఇవ్వవలసిందే! ఇన్ని రకాలుగా లంచాల ప్రసహనం కొనసాగుతూనే వుంది. పై అధికారి లంచగొండి అయితే వేరే చెప్పే పనిలేదు!

ఇక భూముల రిజిస్ట్రేషన్ విషయంలో, భూముల కబ్జా విషయంలో, ట్రెజరీ ఆఫీసుల్లో, పేదపిల్లలకు అందించే స్కాలర్‍షిప్పుల విషయంలో, ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు ఉదంతాలు బయటికి వస్తాయి. ఇదే కాదు, పై అధికారుల వత్తిడి వల్ల, రాజకీయ నాయకుల వల్ల, కొందరు తప్పని పరిస్థితుల్లో ఈ దురలవాటుకు బానిసలైపోతారు. ఇది నాణానికి మరోవైపు చరిత్ర.

ఇక నేను చెప్పబోయే నా అనుభవానికి పైదంతా ఉపోద్ఘాతం. అసలు విషయానికి వస్తే, నేను ఎదుర్కొన్న నా అనుభవం నన్ను చాలా కాలం బాధ పెట్టింది. అదేమంటే –

ఉద్యోగులు స్థానికంగా వుండి పనిచేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు. దీనికి ఉద్యోగులందరూ కట్టుబడి ఉండవలసిందే! ఒకప్పుడు రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా వున్న రోజుల్లో ఇది నూటికి నూరు శాతం అమలు జరిగింది. కానీ, ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరిగాయి. పని చేసే చోట ఉద్యోగికి అవసరమైన కనీస సదుపాయాలు లేక, ఇళ్లు దొరకక పిల్లల చదువుకు సరైన విద్యాసంస్థలు అందుబాటులో లేక స్థానికంగా ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయ. అందుకే ఈ అప్ అండ్ డౌన్ కల్చర్ వెలుగు చూసింది. అయితే ఇక్కడ పనికి అంతరాయం కలగకుండా డ్యూటీ చేయడం ప్రధానం.

ఈ నేపథ్యంలో నేను, నాతో పాటు, చాలామంది ఆసుపత్రి ఉద్యోగులు వరంగల్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళం. చివరకు మాకు బాస్ అనదగ్గ డిప్యూటీ సివిల్ సర్జన్ కూడా అప్ అండ్ డౌన్ చేసేవారు, లేదంటే తెల్లవారగానే బయలుదేరి జనగాం చేరుకునేవారు. ఈ స్థానికంగా ఉండకపోవడం గురించి చాలాసార్లు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, నాతో కామెంట్ చేయడం జరిగింది. ఆయన కామెంట్ వెనుక వున్న దురుద్దేశం నాకు అర్థం కాలేదు. నా డ్యూటీ నేను శ్రద్ధగా చేసుకుంటూ పోయేవాడిని.

జనగాం ప్రజలనుండి గానీ, పెద్దల నుండి గానీ, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందరూ నన్ను ప్రత్యేకంగా గౌరవించేవారు.

ఎప్పటి మాదిరి గానే ఒక సోమవారం, భాగ్యనగర్ ట్రైన్ దిగి సరాసరి నా డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాను. అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యాను. అలా ఎందుకు చేసారో అర్థం కాలేదు. ఒక్కసారిగా నాలో బి.పి పెరిగిన లక్షణాలు నాకు స్వయంగా తెలుస్తున్నాయి. అప్పుడే అటుగా వచ్చిన స్వీపర్‌ని అడిగాను.

“పెద్దసార్.. తాళం వెయ్యమన్నాడు సార్” అన్నాడు.

అతని మాటకు నిర్ఘాంత పోయాను. ఆతను చేయించిన మూర్ఖపు పనికి ఆశ్చర్యపోయాను. తోటి సహోద్యోగిని, ఇంత దారుణంగా అవమానించడం నాకు బాధ కలిగించడమే కాదు, అమితమైన కోపాన్ని రప్పించింది. అప్పుడు ఆ.. కోపం నా ప్రమేయం లేకుండానే వచ్చింది. బహుశః అక్కడ అలా కోపం రాకూడదేమో. ఆసుపత్రి సిబ్బంది నాకు ఒక శాంతి స్థానం ఇచ్చారు. కానీ నాటి కట్టలు తెంచుకున్న నా కోపం సిబ్బందిని ఆశ్చర్య పరిచింది. ఏదో ఉపద్రవం జరిగితే తప్ప నేను అలా అయివుండనని వాళ్ళకీ బాగా తెలుసు!

సరాసరి మా సీనియర్ డాక్టరు, డిప్యూటీ సివిల్ సర్జన్ దగ్గరకు వెళ్లాను. ఆయన అప్పుడు ఔట్ పేషేంట్‌లో పేషేంట్స్‌ని చూస్తున్నాడు. కోపంతో మారిన నా ముఖం చూసాడు.

“ఏంటి డాక్టర్ సాబ్?’’ అన్నాడు.

“నా డిపార్ట్‌మెంట్‌కు తాళం ఉండగా దాని మీద, మరో తాళం ఎందుకు వేయించారు?” అన్నాను కాస్త కోపంగా.

“మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు” అన్నాడు.

“నేనొక్కడినే అలా చేస్తున్నానా? నాతోపాటు ఎంతమంది అలా రావడం లేదు? మీరు మాత్రం చేస్తున్న పని ఏమిటీ రోజూ?’’ అన్నాను

“మిగతా వాళ్ళ సంగతి మీకు అనవసరం! నేను డిప్యూటీ సివిల్ సర్జన్‌ని, నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు” అన్నాడు తిక్కగా.

“అవసరం నాకు వుంది. మిమ్ములను ప్రశ్నించే హక్కు కూడా నాకు ఉంది!’’ అన్నాను.

ఆయన మరో మాట మాట్లాడకుండా, నా వైపు సీరియస్‍గా చూడడం మొదలు పెట్టాడు. అప్పుడు మళ్ళీ నేనే అన్నాను.

“నేను తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు మీకు వుంది. కానీ ఇలా అసభ్యంగా సిబ్బంది ముందు అవమానపరచడం కాదు. మీరు నాకు మెమో ఇచ్చి వుండాలిసింది. ఏమి సమాధానం ఇచ్చేవాడినో తెలిసేది, అందరి భండారమూ బయట పడేది” అన్నాను.

“మీరు రూల్స్ బాగానే మాట్లాడుతున్నారు” అంటూ తన కుర్చీ లోనించి లేచి, చర.. చరా.. బయటికి వచ్చి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గది వైపు స్పీడుగా నడవడం మొదలు పెట్టాడు. నేను అతని కంటే స్పీడుగా వెంబడిస్తూ, ఆయనకు వినపడేలా బిగ్గరగా –

“సార్.. మీకు అయిదు నిముషాలు సమయం ఇస్తున్నాను. ఈ లోగా నా డిపార్ట్‌మెంట్ గదికి వేసిన పై తాళం తీయించకపోతే, జరిగే పరిణామాలకు నేను బాధ్యుడిని కాదు” అన్నాను.

అప్పుడు లాబ్ అసిస్టెంట్‌గా వున్న ఒక ముస్లిం సోదరుడు, నాల్గవ తరగతి యూనియన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇక్కడ వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం లేదు. డిప్యూటీ సివిల్ సర్జన్ గారు సరాసరి యూనియన్ అధ్యక్షుడి గదిలో దూరి –

“చూడవయ్యా.. ఈ డాక్టర్ నన్ను కొట్టడానికన్నట్టు తరుముకొస్తున్నాడు” అన్నాడు. అప్పటికే అతనికి విషయం తెలిసింది. నా గురించి కూడా అతనికి బాగా తెలుసు – అప్ అండ్ డౌన్ చేసినా, ఎప్పడూ లోకల్ సిబ్బంది కంటే, నేనే ముందు డిపార్ట్‌మెంట్ తెరుస్తానని; రోగులకు అసౌకర్యం కలిగించనని. అందుకే అతను వెంటనే –

“ఎందుకు సార్.. నాకు చెబుతారు, ఈవాళ గొడవ జరిగినా.. రేపటి నుంచి, మీరంతా ఒకటే కదా!’’ అని డిప్యూటీ సర్జన్‌కి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు.

ఆయన మారు మాట్లాడకుండా బయటికి వెళ్లి అటెండర్ చేత నా గదికి వేసిన పై తాళం తీయించాడు. తాళం తీసి ఉండకపోతే ఏమి జరిగేదో కానీ, విషయం ఇలా ముగిసినందుకు తృప్తి పడ్డాను. నా తాళంతో గది తెరచి నా డ్యూటీ నేను చేసుకుని యథా ప్రకారం గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి తిరిగి వచ్చేసాను.

మరునాడు మామూలుగానే సకాలంలో ఆసుపత్రికి వెళ్లి డిపార్ట్‌మెంట్ తెరుచుకుని పనిలో పడ్డాను. ఓపీ సమయం అయిపోతుందనగా, నా మరో సీనియర్ డాక్టర్ గారు నా డిపార్ట్‌మెంట్‍కు వచ్చారు. విషయం అంతా తెలుసుకున్నట్టున్నాడు. నా ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుని, “ముసలాయన మీనుండి ఏదో ఆశిస్తున్నటున్నాడు, ఇచ్చేయక పోయారా?’’ అన్నాడు నవ్వుతూ.

“అతనికి లంచం ఇచ్చే ముచ్చట లేదు సార్..’’ అన్నాను.

“డబ్బులు కాదండీ, మనవాడు మందు మాష్టర్ కదా.. ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేయండి,ఇక మీ జోలికి రాడు..’’ అన్నాడు.

“అది నావల్ల జరిగే పని కాదు సార్..!’’ అన్నాను.

“అది కాదు సార్.. అతను మన అధికారి. అతను ఏమి రాసినా మన పై అధికారులు నమ్ముతారు. ఎందుకు మీ ప్రశాంత జీవితాన్ని పాడు చేసుకుంటారు. మంచి రికార్డు పాడు చేసుకుంటారు?’’ అన్నాడు.

నాకు ఇష్టం లేని ఈ పని గురించి చాలా సేపు ఆలోచించాను. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను.

“సార్.. మీరు నాకు ఒక సహాయం చేయాలి’’ అన్నాను.

“చెప్పండి.. నేను చేయదగ్గది అయితే తప్పక చేస్తాను “అన్నాడు.

“మీరు చేయగలిగిందే! నేను ఎలానూ మీరు చెప్పిన పని నా చేతులతో నేను చేయలేను. అదేదో మీరు కానివ్వండి, దానికైన సొమ్ము నేను మీకు ఇచ్చేస్తాను.’’ అన్నాను.

“దానిదేముంది.. ఆ పని రేపే చేద్దాం. నేను ఆయనకు చేయూత లెండి’’ అన్నాడు నవ్వుతూ కుర్చిలోనించి లేస్తూ..

చెప్పినట్టుగానే, మరునాడు పెద్దమనిషికి బాటిల్ అందడమూ, నాకు సలహా ఇచ్చిన డాక్టరు గారికి ఖర్చు అయిన సొమ్ము నేను చెల్లించడమూ జరిగిపోయాయి. ఆయనకు థాంక్స్ చెప్పాను.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, మరుసటి రోజునుండీ మా డిప్యూటీ సివిల్ సర్జన్ గారు నన్ను కలిసి “డాక్టర్ సాబ్.. బాగున్నారా? పిల్లలు మేడం బాగున్నారా?” అని పలకరించడం మొదలు పెట్టారు.

చూసారా.. సమాజంలో ఇలాంటి వారు కూడా వుంటారు. మన స్వార్థం కోసం, ఇలాంటి వారిని పోషించవలసిన దుస్థితి వల్ల, ఈ లంచగొండితనం చాపక్రింద నీరులా.. నలుదిశలా పాకుతూనే ఉంటుంది. మార్పు ఆశిస్తున్నది మనమే.. లంచగొండితనం పోషిస్తున్నది మనమే!

ఇప్పటికీ నేను చేసిన పని నా సున్నిత హృదయంలో ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here