[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 7వ భాగం. [/box]
[dropcap]“యో[/dropcap]గాసనాలు అయిపోయాయా…” భార్గవి గట్టిగా అడుగుతూ తేజని సమీపించింది.
ఆమె గొంతు విని వెనక్కి తిరిగాడు తేజ. ఆరడుగుల రూపం. ఆజానుబాహుడిలా ఉంటాడు. చక్కటి ముఖ వర్చస్సు. చురుగ్గా, తీక్షణంగా ఉండే చూపు. ఎదుటివారిని సున్నితంగా శాసిస్తున్నట్టు ఉండే గొంతు. అప్పటిదాకా యోగాసనాలు వెయ్యడం వల్ల పట్టిన చెమట మీద లేత ఎండ పడి అతని ఒంటి మీద వజ్రపు పొడిలా మెరుస్తోంది.
“భార్గవీ, ఇంత పొద్దున్నే?” ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు.
భార్గవి తేజకి దగ్గరగా వచ్చి అతని ముఖంలోకి చూసింది. ఆమె ముఖంలో ఏదో కొత్త వెలుగుని వింతగా చూశాడు తేజ.
“నీకు చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫోన్లో చెప్పేది కాదు. ఆఫీసు ఉన్నప్పుడు ఇంత దూరంలో ఉన్న మీ ఇంటికి రాలేను. ఈ అయిదు రోజులూ ఎంత భారంగా గడిపానో తెలుసా.”
ఆమె అలా ఉద్వేగంగా చెబుతుంటే తేజ ఆత్రుతగా ఆమె ముఖంలోకి చూశాడు.
“ఏంటి అంత ముఖ్యమైన విషయం? ప్రేమలో పడ్డావా?” అనుమానంగా చూస్తున్నట్టు నటిస్తూ కొంటెగా అంటున్న తేజ భుజం మీద చరిచింది భార్గవి.
“నా గురించి కాదు. ఈ అద్భుతమైన విషయం నీ కోసమే తీసుకొచ్చాను.”
తేజ మాట్లాడకుండా చెప్పమన్నట్టు చూడగానే భార్గవి ఆకాశం వైపు చూస్తూ అంది. “అచ్చం నీలాగే ప్రవర్తిస్తున్న అమ్మాయిని కలిశాను.”
తేజ ఉలిక్కిపడినట్టుగా చూశాడు భార్గవి వైపు. ఆకాశం మీద నుంచి చూపుల్ని తేజ కళ్ళలోకి తిప్పింది భార్గవి.
“అవును. తన్మయి…”
“తన్మయా… తను మీ టీం మేట్ అని చెప్పావు. ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో ఉంటుందని చెప్పావు…”
“అవును. తను ఆలోచనల్లో ఉంటుందనుకున్నాను ఇన్నాళ్ళూ. కానీ నీలాగే ఓ ఊహా ప్రపంచంలో సంచరిస్తూ ఉంటుందని క్రిందటి ఆదివారం వాళ్ళింటికి వెళ్ళినప్పుడే తెలిసింది. తను చాలా గొప్ప చిత్రకారిణి తెలుసా.”
భార్గవినే చూస్తున్న తేజ పెదవులు పగడాల్లా మెరిసాయ్.
“అవును తేజా. అంతే కాదు. నీకు నిద్ర దూరం చేసే విషయం ఏమిటంటే తను వేసే ప్రతి చిత్రమూ రాధాకృష్ణులవే.”
ఈసారి ఆశ్చర్యానందాలతో విచ్చుకున్నాయ్ అతని పెదవులు.
తేజ ఉచ్ఛ్వాస నిశ్వాశాల వేగాన్ని బట్టి తను చెప్పిన విషయం అతనికి ఎంత ఆనందాన్ని కలిగించిందో అర్థం చేసుకుంది భార్గవి. తేజకి రాధాకృష్ణులంటే అమితమైన ఆరాధన. వారి చిత్రాలంటే ప్రేమ. తను కోరుకున్న విధంగా వారి మధ్యనుండే ప్రేమ, ఆరాధనా జీవకళతో పాటు ఉట్టిపడేలా ఉండే రాధాకృష్ణుల చిత్రాల కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాడు. అటువంటి చిత్రాలు కనపడతాయేమో అని ప్రతి చిత్రకళా ప్రదర్శనకీ వెళతాడు. అంతర్జాలాన్ని వడపోస్తాడు. కానీ, ఇంతవరకూ అతని మనసుని తృప్తి పరచగల చిత్రాలు అతనికి కనపడలేదు.
ఆత్రుతగా తన వైపు చూస్తున్న తేజ కళ్ళలోకి చూస్తూ –
“తను చిత్రించిన ప్రతి చిత్రంలోనూ రాధాకృష్ణుల ముఖాల్లో భావాలు ఎంత అద్భుతంగా తీసుకొచ్చిందో తెలుసా. వారి మధ్యనున్న ప్రేమ భావం స్పష్టంగా తెలుస్తుంది ఆ చిత్రాన్ని చూడగానే. అంతే కాదు, తను ప్రదర్శనలకీ, పేరు ప్రతిష్ఠలకీ దూరం. ఎందుకని అడిగితే ఏం చెప్పిందో తెలుసా?” అంది భార్గవి.
తేజ మాట్లాడలేదు. ‘ఏం చెప్పింది’ అన్నట్టు చూశాడామెవైపు.
“అచ్చం నీలాగే సమాధానం ఇచ్చింది. తన మనసులో ఏవో కొన్ని అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయిట. అవి స్పష్టంగా కాన్వాసు మీద పెట్టలేకపోతోందిట. ఆ దృశ్యాల్ని మనసులో కూడా స్పష్టంగా చూడలేకపోతోందిట. అది చిత్రించగలిగే వరకూ తనని తాను చిత్రకారిణిగా కూడా అంగీకరించలేనంది.”
నమ్మలేని విషయం వింటున్నట్టు ముడుచుకున్న తేజ కనుబొమ్మల్ని ముచ్చటగా చూస్తూ చెప్పింది భార్గవి. తనలాగే… ఆలోచించే… అమ్మాయి. మరోసారి మనసులో అనుకున్నాడు తేజ.
“తన్మయి పెయింటింగ్స్ నీకు చూపించాలి. అతి త్వరలో చూపిస్తాను తేజా.”
***
“ఆంటీ, ఆ బెండకాయలు ఇలా ఇవ్వండి. నేను టేబుల్ మీద కూర్చుని తరిగేస్తాను. నిలబడి ఇక్కడే ఎంతసేపు తరుగుతారు. మీరు మిగతా పని చూసుకోండి.”
చనువుగా అంటూ దేవకి చేతుల్లోంచి కటరు, బెండకాయలూ లాక్కుని భార్గవి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది.
“నువ్విలా ఇంట్లో అమ్మాయిలా ఇంత త్వరగా కలిసిపోయి తిరుగుతుంటే బావుందమ్మా. ప్రతి శనాదివారాల్లోనూ మా ఇంటికి వచ్చేస్తూ ఉండు. హాస్టల్ ఎందుకు?”
భార్గవి నవ్వేసింది. “తప్పకుండా ఆంటీ. నాకూ మా ఇంట్లో ఉన్నట్టే ఉంది మీరు ఇంత అభిమానంగా చూస్తుంటే.”
అప్పటికి భార్గవి వచ్చి గంటయింది. అంతసేపూ ఆమెతో కబుర్లు చెప్పి అప్పుడే తన గదిలోకి వెళ్ళింది తన్మయి. భార్గవి ఆమె వెనుక వెళ్ళలేదు. నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉండాలనుకునే స్నేహితురాలి చుట్టూ ఎక్కువసేపు వసపిట్టలా వాగుతూ తిరగకూడదు అనుకుని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఎవరైనా తనతో మాట్లాడుతూ ఉండాలి అని కోరుకునే దేవకి దగ్గరకి వచ్చేసి వంటలో సహాయపడుతోంది.
బెండకాయలు తరుగుతూ ఆలోచిస్తోంది భార్గవి. తన్మయి అంటే ఎందుకో మొదటినుంచీ తనకి చాలా అభిమానం. ఇప్పుడు తన చేతిలో ఉన్న కళ గురించి తెలిశాక ఆ అభిమానం మరింతగా పెరిగింది. తన్మయి తన సొంత మనిషిలా అనిపిస్తోంది. ఎక్కువగా మాట్లాడదు తన్మయి. అయినా సరే, ఎప్పటికీ ఆమె స్నేహాన్ని వదులుకోకూడదు అనిపిస్తోంది. వీలైనంత త్వరలో తేజని తన్మయికి పరిచయం చెయ్యాలి. తేజ కూడా తన్మయి వేసిన పెయింటింగ్స్ చూడాలి. అప్పుడైనా స్ఫూర్తి పొంది తనూ బొమ్మలు వెయ్యడం మొదలెట్టగలడేమో.
ఆలోచిస్తూనే తరగడం పూర్తిచేసి అవి తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది.
దేవకి మూకుడు పెట్టి పోపు వేస్తుంటే పక్కనే నిలబడింది.
“ఇంకేమిటాంటీ విశేషాలు?”
“ఏమున్నాయమ్మా. ఒక వారం సెలవు పెట్టి తనని మున్నార్ తీసుకువెళ్ళమంటోంది తన్మయి వాళ్ళ నాన్నగారిని.”
“నిజమా. ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగింది భార్గవి.
“పెయింటింగ్స్ వేసుకోవాలిటమ్మా. వాళ్ళ నాన్నగారు సెలవు కోసం ప్రయత్నిస్తున్నారు.”
“అవునా. నాకు ఒక్కమాట అయినా చెప్పలేదు తను. అక్కడికి వెళ్ళి పెయింటింగ్స్ వేస్తుందా.”
“అవునమ్మా. అదీ వర్షాకాలం. ఈ సమయంలో అక్కడికి ఎందుకు అని నా భయం. వినదు. ఈ వర్షాల్లోనే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది కాబట్టి తను వెయ్యాలనుకుంటున్న పెయింటింగ్‌కి అక్కడైనా స్ఫూర్తి దొరుకుతుందేమో అని అంటోంది” కాస్త దిగులుగా అంది దేవకి.
“నిజమే కదా ఆంటీ. పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళకీ, కవితలు రాసుకునే వాళ్ళకీ ఎక్కువగా ప్రకృతే కదా స్ఫూర్తి. వర్షాకాలంలో అంత అందంగా ఉండే ప్రదేశాలకి వెళితే మరిన్ని ఐడియాస్ వస్తాయ్ వాళ్ళకి.”
దేవకి కూడా అవునన్నట్టుగా తలూపింది.
కాసేపు అక్కడే ఉండి దేవకితో మాట్లాడి ఇక తన్మయి ఏం చేస్తోందో చూడాలని మెల్లగా ఆమె గది బయట నిలబడి తొంగి చూసింది భార్గవి.
(సశేషం)