కొడిగట్టిన దీపాలు-3

0
4

[box type=’note’ fontsize=’16’] విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘కొడిగట్టిన దీపాలు‘ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

5

[dropcap]వి[/dropcap]శాలగుప్త దగ్గరుండి మాధవరావు దహన సంస్కార ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. అవసరమైన సామాగ్రిని తెప్పించాడు. విశాలగుప్త భార్య ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. అయితే నాంచారమ్మ మాత్రం అలా మౌనంగా కూర్చుంది. కాని వదిన గార్ని ఓదార్చడానికి ప్రయత్నించలేదు.

“శవం మీద కప్పడానికి క్రొత్త బట్ట ఉండాలి. తెచ్చారా?” దహన సంస్కార సమయంలో పురోహితుడు అడిగాడు, “అన్నీ తెచ్చామండీ” విశాలగుప్త జవాబిచ్చాడు. అంత దుఃఖంలోని రాజశేఖరం నిర్వికారంగా మనస్సులో నవ్వుకున్నాడు.

“ఏఁటో ఈ ఆచారాలు? బ్రతికి ఉన్న సమయంలో అందరికీ కాకపోయినా కొంతమందికి కట్టుకోడానికి సరియైన బట్టలు లేకపోయినా, కడుపునిండా తినడానికి తిండి లేకపోయినా ఆ మనిషి చనిపోయిన తరువాత శవం మీద కష్టడానికి క్రొత్త బట్టకావాలి. ఆ తరువాత శ్రాద్ధ కర్మ సందర్భంలో వివిధ వంటకాలతో బంధుమిత్రుల్ని పిలిచి భోజనాలు పెడ్తారు. అలా చేస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి లభిస్తుందట. తను నాస్తికుడు కాదు. అయినా ఈ ఆచారాల మీద తనకి నమ్మకం ఉన్నదా లేదా అని అంటే చెప్పలేని పరిస్థితి. తనది తటస్థ వైఖరి. వాటికి ఖర్చు పెట్టిన డబ్బుతో తన కుటుంబం చక్కగా ఉండగలదేమో అని మరుక్షణంలో ఆలోచిస్తాడు. అయితే కొన్ని సంప్రదాయాలకి కట్టుబడి ఉన్న ఆ సంప్రదాయాల్ని, ఆచారాలను సమాజంలో పాటించి తీరాలి” మరో పర్యాయం అనుకున్నాడు.

తండ్రి నిర్జీవ శరీరానికి దహన సంస్కార సమయంలో చితికి నిప్పు పెట్టాడు రాజశేఖరం. తండ్రి నిర్జీవ శరీరం అగ్ని జ్వాలలకి ఆహుతి

అయిపోతుంటే ఎదురుగా ఉన్న చెట్టు క్రింద కూర్చుని నిర్వికారంగా ఆ జ్వాలల వేపు చూస్తున్న రాజశేఖరం మదిలో విరక్తితో కూడిన ఆలోచనలు.

“ఏఁటో ఈ మానవ జీవితం? పుట్టినప్పుడు ఒంటరిగా పుడతాడు. ఈ భూమ్మీదకి వస్తాడు, పోతున్నప్పుడు అదే చనిపోయే సమయంలో ఒంటరిగానే పోతాడు. పుట్టుక, చావు మధ్య జీవితంలోనే బంధాలు, బాంధవ్యాలు, మమతలు మనిషి ఎప్పుడూ ఒంటరే. ఎండమావే జీవితం. భ్రమల్లో బ్రతుకుతాడు. భ్రమలో జీవిస్తాడు. ఆ భ్రమనే ఆసరాగా చేసుకుంటాడు.” వయస్సుకి మించిన ఆలోచన్లు అతడ్ని చుట్టుముడున్నాయి.

ధర్మారావు దూరంగా నిలబడి రాజశేఖరాన్ని గమనిస్తున్నాడే కాని మేనల్లుడ్ని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పడానికి ముందుకు రాలేదు. విశాలగుప్త అలా ఊరుకోలేకపోయాడు. గబగబా వచ్చి రాజశేఖరం తల ఆప్యాయతగా నిమిరాడు. ఒక్కసారి నిర్వికారంగా ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి విశాలగుప్తా వేపు చూశాడు కళ్ళలో కన్నీరు చిప్పిల్లాడుతుండగా.

“రాజూ!”

ఆప్యాయత మిళితమైన ఆ పిలుపుకి దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చాడు. అలా తనని ఆప్యాయంగా తండ్రి పిలిచేవాడు. ఆ తరువాత విశాలగుప్త నోటి వెంట ఆ పిలుపు వింటున్నాడు.

“బాబాయ్! నాన్నగారు బూడిదిగా మిగిలిపోయారు. ఏంటో ఈ జీవితాలు క్షణభంగురమైన అశాశ్వతమైన జీవితాలు. ఇలాంటి జీవితం చూసి కొంత మంది విర్రవీగుతారు. అహంకారం దర్పంతో ఉంటారు. చెడ్డ పనులు చేస్తూ చరిత్ర హీనులుగా మిగులుతారు. మరి కొంతమంది పదిమందికే సహాయపడతారు” విరక్తిగా వయస్సుకి మించిన మాటలు మాట్లాడుతున్నాడు.

శ్మశాన వైరాగ్యంతో రాజశేఖరం ఇలా మాట్లాతున్నాడు అని అర్థం చేసుకున్నాడు విశాలగుప్త.

“రాజూ! ఇదే మానవ జీవితం. ఈ మానవ జీవితంలో భావోద్వేగాలుంటాయి. భావోద్రేకాలుంటాయి. అన్నిటిని సంయమంతో ఎదుర్కున్ననాడే మానవ జీవితానికి సార్థకత. నీ విషయం తీసుకో, ఇవాళ ఉన్న దుఃఖం రేపు ఉండదు. రేపున్న దుఃఖం మరుసటి రోజు ఉండదు. మరుపు అనే తెర మన దుఃఖాన్ని మరుగున పడిస్తుంది. ఆ మరుపే లేకపోతే సమాజంలో మానవ మనుగడే సాగదు. ఈ క్షణకాల కొద్దిపాటి అశాశ్వతమైన జీవితంలోనే ఒకరి మీద మరొకరు అనురాగం పెంచుకుంటారు. మమతలు పెంచుకుంటారు. మరికొందరు నీవు చెప్పినట్టు ద్వేషం – పగ, ప్రతీకారం పెంచుకుంటారు. మంచిని అందరూ చెప్పుకుని మెచ్చుకునేంతగా చెడును ఎవరూ ప్రోత్సహించరు. మనం బ్రతికున్నంత వరకూ మంచిగానే బ్రతకాలి. మంచిగానే జీవించాలి. మీ నాన్నగారు మంచిగానే జీవించారు.”

కురుక్షేత్ర మైదానంలో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడిలా అగుపించాడు విశాలగుప్త రాజశేఖరానికి. బరువైన విషాద పూరితమైన హృదయాల్లో అందరూ ఇంటి దారి పట్టారు.

మాధవరావు చనిపోయిన రోజునున్న దుఃఖం కుటుంబ సభ్యులకి రోజు మీద రోజు గడుస్తున్న కొలదీ తగ్గుతోంది. కర్మ పూర్తయింది. పరిచయస్తుల్ని నా అనుకున్న వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టారు.

“రాజూ! ఒక్కమాట” విశాలగుప్త అన్నాడు.

“ఏంటి బాబాయ్!”

“మీ నాన్నగారు నన్ను సంప్రదించకుండానే నా పేరున ఇల్లు రిజిష్టరు చేసారు. ఎవరైనా ఆస్తిని న్యాయంగా సంపాదించాలి కాని అన్యాయంగా సంపాదించకూడదు. అన్యాయం సొమ్ము ఎప్పటికీ నిలవదు. నేను మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం నిజమే అయితే దానికి బదులుగా ఇల్లు నా పేరున మీ నాన్నగారు వ్రాయడం నాకు నచ్చలేదు. నాకు ఎలాగూ పిల్లలు లేరు. మిమ్మల్నే నేను నా పిల్లలు అని అనుకున్నాను. మీరు నాకు పరాయి వాళ్ళు కాదనుకుంటున్నాను నేను.”

“మేమూ అలాగే అనుకుంటున్నాం బాబాయ్!” రాజశేఖరం అన్నాడు.

ఎదుటి వాళ్ళు మన మీద నమ్మకముంచి, విశ్వసించి మనల్ని నమ్మితే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ విశ్వసనీయతను తెలియజేసుకోవాలనుకుంటారు. స్వార్థమెరుగని నిస్వార్థపరులు వారు.

విశాలగుప్త కూడా మాధవరావు తనని నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అతని కుటుంబానికి ఏదో విధంగా సహాయం చేయాలనేదే విశాలగుప్త ఆలోచన.

“నా పేరున ఇల్లు వ్రాయించినా ఇప్పుడు కూడా అది మీ ఇల్లే అనుకుంటున్నాను.”

“అలా అనద్దు బాబాయ్! అది నీ ఇల్లే చట్ట ప్రకారం. నీవు అలా మాట్లాడుతున్నావంటే అది నీ మంచి బుద్ది. నీ ఉదార స్వభావం.”

“ఇప్పుడు మన ముందు సమస్వ నన్ను పొగడం కాదు. కర్తవ్యం ఏంటో చూడాలి, అదే నా ఉద్దేశం. ఇంకో విషయం చెప్పనా? నాన్నగారు ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఎలా ఉన్నారో ఇప్పుడూ నీ వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు. నాకేం అద్దె చెల్లించ అవసరం లేదు. వాళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను.”

“అది ఎలా అవుతుంది? ఉంటే భర్త దగ్గర ఉండాలి. భర్త లేకపోతే పుట్టింటి వాళ్ళ దగ్గరేనా, కన్న సంతానం దగ్గరేనా, రక్త సంబంధీకుల దగ్గరేనా ఉండాలి. అసలే ఆడవాళ్ళు. రేపొద్దున్న ఏదేనా జరుగుతే ఆ అప్రదిష్ట మాకేనా, పలానా మీ వాళ్ళు అలా చేశారు. ఇలా చేశారు అని అందరూ అనుకుంటారు” అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మారావు అన్నాడు.

అతని మాటలకి మరే మాట్లాడలేకపోయాడు విశాలగుప్త. ధర్మారావు తనని పరాయి వాడని వేలెత్తి చూపిస్తున్నట్లు బాధపడ్డాడు.

“మొదట మీ అక్కగారి ఉద్దేశం తెలుసుకోవాలి కదా!” విశాల గుప్త తిరిగి అన్నాడు.

“నా మొహం, దుఃఖంలో ఉన్న మా అక్క ఏఁ చెప్పగలదు. నా ఉద్దేశమే ఆమె ఉద్దేశం” అన్నాడు ధర్మారావు.

“సరే మీ ఇష్టం” అన్నాడు విశాలగుప్త.

మీనాక్షికి కూడా ధర్మారావు, నాంచారమ్మ స్వభావం తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం ఆమెకి కూడా ఇష్టం లేదు. ‘అలా అని రాను ఇక్కడే ఉంటాను అని అంటే అసలే తమ్ముడూ మరదలూ మంచి వాళ్ళు కాదు. విశాలగుప్తకి తనకీ ఏదో సంబంధం ఉన్నదని ప్రచారం చేసినా చేయవచ్చు వాళ్ళు’ అని అనుకున్న మీనాక్షి కుటుంబంతో సహా తమ్ముడు దగ్గరకే వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అదే విషయం చెప్పింది.

“బాబాయ్! పట్నంలో ఓ పుణ్యాత్ములు నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చారు. వారాలు చేసుకుని చదువుకుంటున్నాను. ఉండడానికి, భోజనానికి ఏ సమస్యా లేదు. నా చేతి ఖర్చులకి రెండు మూడు ట్యూషన్లు చెప్పుకుని సంపాదించుకోగలను అన్న నమ్మకం నాకుంది. ఇక అమ్మా వాళ్ళ గురించే నా బాధంతా. బాబాయ్! బ్యాంకులో దాచిన డబ్బుకి వడ్డీ వస్తుంది కదా ఆ వడ్డీ డబ్బు నెలనెలా అమ్మా వాళ్ళకి పంపించాలి” రాజశేఖరం వెళ్తున్న సమయంలో విశాలగుప్తతో అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాడు విశాలగుప్త.

6

మానవ జీవితంలో అశ, నిరాశలు, కష్ట సుఖాలు పగలూ రాత్రిలా అంటి పెట్టుకునే ఉంటాయి. బానిస బ్రతుకు బ్రతుకుతున్న వారిలో తమ బానిస సంకెళ్ళను తెంచి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకునే అవకాశం కలిగించే యుగపురుషుడు వస్తాడు అనే ఆశ. అందుకే వారు తాత్కాలికమైన నిరాశను తమ హృదయ కుహరాల నుండి తొలగించుకుని ఆశతో ఎదురు చూడ్డం అరంభించారు, నిరీక్షించారు.

సుఖ దుఃఖాలకు ప్రతీ ఒక్కరూ బందీలవకుండా వాటిపై ఆదిపత్యం స్థాపిస్తే మన జీవితాన్ని నిత్య నూతనంగా రసవత్తరంగా శ్రేష్ఠ మార్గంలో పూర్తి చేసుకోవచ్చు. పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నాయని భయపడకుండా ఒకవేళ అనుకూలంగా ఉంటే తృప్తి చెందక ఉన్నవాడే జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవచ్చు అనుకున్నది సాధించవచ్చు. కాలాగుణంగా ఈ రోజు ప్రతికూలంగా ఉన్నవి అనుకూలంగా మారుతాయి.

ఇప్పుడు మనకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ బానిస బ్రతుకులు ఇలా ఉండవల్సిందే అని నిరాశలో అలా కూర్చుంటే మనం ఏం సాధించలేము. ఆ ప్రతికూల పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకుని ముందుకు అడుగు వేసిననాడే విజయం తప్పకుండా లభిస్తుంది. ఇది సుజాత భావన. బాపూజీలో ఆమెకి యుగ పురుషుడు అగుపడ్డాడు. తప్పకుండా అతను భారతమాత బానిస సంకెళ్ళు తెంచగలడు అన్న నమ్మకం ఆమెకి కలిగింది.

ఇక బ్రిటిష్ ప్రభుత్వం విభజించి పాలించు నీతిని పాటిస్తున్నారు. మన భారతీయుల్లోనే కొంతమందికి ఉన్నత పదవులిచ్చి వారిని తమ వేపు త్రిప్పుకున్నారు. పదవీ వ్యామోహంలో ఇలా పదవులు పొందిన వారు ఆ పరాయి ప్రభుత్వాన్ని ఆదరించారు, గౌరవించారు. వారికి వందిమాగధులు కూడా అయ్యారు. మరికొంత మంది ‘ఈ తెల్లదొరలు పెత్తనం మాకొద్దు మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం. మా దేశాన్ని మీరు వదిలి వెళ్ళాలి’ అంటూ గర్జిస్తున్నారు.

కాలేజీ వాతావరణం కలకల్లాడుతోంది. విద్యార్థులు, విద్యార్థినిలు క్లాసులకి వెళ్ళకుండా కాలేజీ ఆవరణ బయట మైదానంలో నిలబడి బ్రిటిష్ నిరంకుశత్వ పరిపాలనకి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేస్తున్నారు. అందరిలోనూ వీరావేశం, ఉప్పొంగుతోంది. వాళ్ళలో వీరావేశం కలగడానికి కారకురాలు సుజాత.

ఆమె ప్రతిభ కలిగిన విద్యార్థినిమే కాకుండా దేశభక్తి కవితలు వ్రాసి వాటి ద్వారా ప్రజల్లో వీరావేశం, దేశభక్తి కలిగించే గొప్ప కవియిత్రి కూడా. తన కవితల ద్వారా దేశవాసుల్ని చైతన్యవంతుల్ని చేసి అందరిలోనూ వీరావేశం తెప్పించి స్వాతంత్ర్య పోరాటంలో ప్రతీ ఒక్క దేశవాసుడ్ని ముందుకు ఉరికేటట్టు చేసే ప్రతిభ ఆమెలో ఉంది.

సుజాత ఆ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని. ఆమె కవితలకి ఆకర్షితులైన విద్యార్థి లోకం విప్లవ శంఖం పూరించి క్లాసులు వదిలి స్వాతంత్ర్య పోరాటం వేపు అడుగులేస్తున్నారు.

సమాజానికి సాహిత్యం అద్దం లాంటిది. ఆ సాహిత్యం కవిత అవచ్చు. కథ అవచ్చు, నవల అవచ్చు, నాటకం అవచ్చు. విమర్శ అవచ్చు. అన్నిటి లక్ష్యం ఒకటే. ఆ సాహిత్యం అనే అద్దంలో సమాజంలో ఉన్న లోటుపాట్లు, ఎత్తు పల్లాలు, మూఢాచారాలు, మూఢ నమ్మకాల వలన వచ్చిన అనర్థాలు ఇవన్నీ స్పష్టంగా అగుపిస్తాయి. వాటిని తన సాహిత్య ప్రక్రియ ద్వారా సమాజం ముందుంచిన సాహిత్యకారుడు. సమాజాన్ని చైతన్య పరచి, సంస్కరించడానికి ప్రయత్నిస్తాడు.

దేశంలోని ఇన్ని విప్లవాలు రావడానికి కారణం ఈ సాహిత్యకారులే – వాళ్ళు తమ రచనల ద్వారా ప్రజల్ని చైత్యపరిచి దేశభక్తి వేపు ప్రజల మనస్సుల్ని తీసుకువెళ్తారు. వాళ్ళను చైతన్యపరుస్తారు. అందుకే ఈ సాహిత్యకారుల్ని సమాజానికి వెన్నెముక వంటివారు అని అంటారు.

సుజాతను అప్పుడు మన దేశంలో పరిపాలిస్తున్న విదేశీయ ప్రభుత్వం కొన్ని రోజులు జేలుకు కూడా పంపింది. ఆమె రచనల్ని కల్పించి బుడిద చేసింది. కాని ఆమెలో నున్న విప్లవ రచనా శక్తిని మాత్రం ఆపు చేయలేకపోయింది.

ఆమె గురించి చెప్పుకోవాలంటే ఆమె ఆ ఊరిలో పేరు గాంచిన ప్రముఖ న్యాయవాది సుందర్రామయ్య మొదటి భార్య సంతానం. సుజాత తల్లి మరణించిన తరువాత అతను సీతమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. తనకి సంతానం కలిగే వరకూ సుజాతను బాగానే చూసుకున్న నీతమ్మ సంతానవతి అయిన తరువాత సుజాత మీద అయిష్టత పెంచుకుంది. ఎంతేనా సవతి కూతురు తనకి పరాయిదే అన్నదే ఆమె భావన.

లోకం తీరే అంత. ఏ వస్తువు అవచ్చు లేక మనిషి అవచ్చు. మనకి స్వంతం కానివి, స్వంతం కాని వారు అన్న భావన మనలో ఉన్ననాడు వాళ్ళ మీద, ఆ వస్తువుల మీద ఆపేక్ష కలగదు. అవి ఎంత ఉపయోగకరమైవనవైనా, ఎంత అందంగా ఉన్నా వాటి మీద, వారి మీద మనం మమకారం పెంచుకోము. ఎందుకంటే అవి, వారు తనకి సంబంధించినవి కాకపోవడమే.

తనది అని అనుకున్నది అందంగా లేకపోయినా, ఉపయోగ యోగ్యం కాకపోయినా వాటి మీద, మన వాళ్ళు అని అనిపించుకున్న వాళ్ళ మీద మమతానురాగాలు కలుగుతాయి. ఇది లోక సహజం.

పరాయి వారయినా, పరాయి వస్తువయినా, ఒక్కొక్క పర్యాయం ఆ వస్తువుల మీద, ఆ మనుష్యుల మీద మనకి మమకారం కలుగుతుంది. అది ఎప్పుడు? ఆ వస్తువయినా, ఆ వ్యక్తులైనా తన వాటిగా చేసుకున్ననాడు.

సీతమ్మకి, రాధ పుట్టగానే సుజాతకు కష్టాలు ఆరంభమయ్యాయి. తన దైనందిన జీవితంలో సుజాతకి సాధింపులు, కష్టాలు, కన్నీళ్ళు అరంభమయ్యాయి. అయినా ఆమె ఆత్మసైర్యాన్ని కోల్పోలేదు. వాటిని జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఏదో విధంగా రోజులు నెట్టుకొస్తోంది.

ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దానిమీద అభిరుచి ఉంటుంది. అందరి మనస్తత్వాలు, అభిరుచులు, అలవాట్లు ఒకే విధంగా ఉండవు. సుజాతకి చదువు మీద, సాహిత్యం మీద మక్కువయితే రాధకి చదువుకంటే మిగతా విషయాలు, ఇంట్లో పనిపాట్లు చేయడమంటే ఎక్కువ మక్కువ.

సీతమ్మ తమ్ముడు శేషు కూడా బావగారింటిలో తిష్ఠ వేసి ఆ ఇంటి వారికి నమ్మినబంటులా, తల్లో నాలుకలా మెలగాలని తెగ తాపత్రయ పడతాడు. మనిషికో ఇష్టం అభిరుచి ఉన్నట్లే శేషుకి సుజాతంటే మక్కువ. శేషుని ఇష్టపడుతోంది రాధ. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వారి దగ్గరే సుఖసంతోషాలు లభిస్తాయన్నది శేషు గమనించటం లేదు. సుజాత ప్రేమ పొందడానికి, ఆమె దృష్టిలో పడ్డానికి తెగ ఆరాటపడుతున్నాడు. విభిన్న దృక్పథాలతో, విభిన్న మనస్తత్వాల్తో ఆ కుటుంబంలో మనుష్యులు తమ జీవనయాత్ర సాగిస్తున్నారు.

తనకి తనవాళ్ళకీ లభించనివి ఎదుటి వాళ్ళకి లభిస్తున్నాయంటే ఓర్చుకోలేని గుణం కొంతమందికి ఉంటుంది. తన కూతురు చదువుకోలేదు. చదువుకోవడానికి ఇష్టపడటం లేదు. సుజాత ఎందుకు చదువుకోవాలి? చదువుకునే అవకాశం ఎందుకియ్యాలి. స్వార్థపూరితంగా ఆలోచించేది సీతమ్మ.

ఆమె దృష్టిలో ఆడపిల్లకి అంతేసి చదువులు అవసరంలేదు. ఏదో చాకలి పద్దు వేసుకోడానికి వానాకాలం చదువు చదువుతే చాలు, ఏనాటికేనా ఆడపిల్లని ఓ అయ్య చేతిలో పెట్టవల్సిందే కదా! అడపిల్ల ఏనాటికేనా పరాయి ఇంటికి వెళ్ళవల్సిందే కదా అనేదే సీతమ్మ భావన. తన ఈ ఆలోచన భర్త సుందర్రామయ్య దగ్గర కూడా వెల్లడిచేసింది.

“సుజాతకి అంత చదువెందుకు? ఇప్పటివరకూ చదివిన చదువు చాలదా? పెళ్ళి చేసుకుని చక్కగా ఎప్పటికైనా కాపురం చేసుకోవల్సిందే కదా. నా విషయమే తీసుకోండి, నేనేఁ చదువులు చదివాను? చక్కగా ఇల్లు సరిదిద్దుకోవటం లేదా? ఇప్పటికే మీ కూతురు తిరుగుబాటు చేస్తోంది. తన బోడి కవిత్వం – ఆ రాతలో జేలుకి కూడా వెళ్ళింది. అందుకే అంటారు మగవాడు తిరక్క చెడ్డాడు. ఆడది తిరిగి చెడిందని. వంశ పరువు ప్రతిష్ఠ మీ కూతురు మంట కల్పుతోంది. నా మాట విని మీ కూతురుకి ఇక చదువు ఆపించి పెళ్ళి ప్రయత్నాలు చేయండి” భర్తకి నూరి పోస్తోంది సీతమ్మ.

భార్య మాటల్ని వింటున్నాడు సుందర్రామయ్య. అయితే వినీ విననట్లు ఊరుకున్నాడు. నోరు మెదపలేదు. అతని ప్రవర్తన సీతమ్మకి ఆశ్చర్యం కలిగించింది. అన్ని విషయాల్లో తనకి తందాన తాన అనే భర్త కూతురి చదువు విషయంలో మౌనం వహించడం ఆమెకి నచ్చలేదు. అయినా ఆమె ఊరుకోదల్చలేదు. సమయం చిక్కనప్పుడల్లా భర్త దగ్గర ఈ ప్రస్తావనే తెచ్చేది సీతమ్మ.

సుందర్రామయ్య ఆలోచన్లు మరోలా ఉండేవి. చిన్న కూతురు రాధకి చదువు ఎలాగూ అబ్బలేదు. పెద్ద కూతురు సుజాతయినా చదువుకుంటే చాలు. కూతుర్ని తనలాగే గొప్ప న్యాయవాదిగా తను చూడాలి అనేవి తన కలలు. తన కలల్ని కూతురు సఫలీకృతం చేస్తుందన్న నమ్మకం తనకుంది. బాగా చదువుకునే గుణాలు చదువు మీద ఆసక్తి కూతురుకి ఉన్నాయి అని అనుకున్న ఆ న్యాయవాది. అయితే తనకి కూతురిలో నచ్చని గుణమల్లా ఆమె తన కర్తవ్యమైన ముఖ్యమైన చదువు మానేసి తన కవిత్వంలో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం, జేలుకి వెళ్ళడం.

ఎంతమందో న్యాయవాదులు తమ న్యాయవాది వృత్తిని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ ఉంటే సుందరామయ్య మాత్రం తటస్థ వైఖరి అనుసరించడం ఆరంభించాడు. అప్పటి పరాయి ప్రభుత్వం మీద భక్తా అంటే అదీ కాదు. తన వృత్తి వదిలిపెట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటే తన కుటుంబ జీవనం ఎలాగ సాగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది.

న్యాయవాది వృత్తిలో తను ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నాడు. పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాడు. ఈ వృత్తిలో ఎక్కువ ఆస్తిపాస్తులు సంపాదించ లేకపోయినా కుటుంబ జీవనం మాత్రం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా చక్కగా సాగిపోతోంది. ఈ పోరాటంలో దిగుతే ఎన్ని అవాంతరాల్ని ఎదుర్కోవల్సి వస్తుందో? ఎన్ని ఒడిదొడుకుల్ని దాటవలిసి వస్తుందో? ఎన్ని కష్టాల్ని ఎదుక్కోవల్సి వస్తుందో అన్న భావన.

ఆ భావం దగ్గర మాతృదేశం మీద మమకారం, ప్రేమ, గౌరవం, భక్తి భావాలు తెరమరుగవుతూ విదేశీ పాలనను సమర్థించడానికి ఆ భావాలు కారణమవుతూ ఉండేవి. అతనిలో ఎంత దేశ భక్తి ఉందో అతని అంతరాత్మకు తెలుసు. అతనిలో దేన్నేనయినా ప్రేమించే శక్తి, భావం ఉంది అంటూ ఉంటే దాన్నంతా అతను ధనార్జన వేపు, తన కుటుంబ సంరక్షణ వేపు మళ్ళించిన జీవితాన్ని దానికే పరిమితం చేశాడు. అయితే అతను ఇంత సంకుచిత మనస్తత్వంతో తన చుట్టూరా గిరి గీసుకుని ఎందుకు కూర్చున్నాడు? అతనికి అప్పటి ప్రభుత్వంపై నున్న రాజ భక్తా? లేకపోతే స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి లేకనా? అని ప్రశ్న వేసుకుంటే వచ్చేది ఒక్కటే సమాధానం తన పదవిలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని, డబ్బు గడించాలి.

ప్రపంచంలో అన్ని సమస్యలకీ మూల కారణం డబ్బు. ఆ డబ్బు లేకపోతే ఏ పనీ జరగదు. ఆ డబ్బుతో కొండమీద కోతినైనా తేవడం సాధ్యం అవుతుందన్న విశ్వాసం. ఆ విశ్వాసంతోనే కూతురు తను కన్న కలల్ని భగ్నం చేస్తూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని రాజకీయాల్లో తలదూర్చడం అతనికి నచ్చలేదు.

తన సాహిత్యం ద్వారా రాజకీయాల్లో ముందుకు దూసుకుపోతున్న కూతుర్ని మొదట మందలించే అతనికి ఆ తరువాత దేశానికి స్వాతంత్ర్యం ఎంత అవసరమో తనిన్నాళ్ళూ ఎటువంటి సంకుచిత మనస్తత్వంతో ఎటువంటి జీవితం గడిపాడో తెలిసేటప్పటికి తన మీద తనకే అసహ్యం వేసింది.

స్వాతంత్ర్య పోరాటంలో అతనికి పూర్తి విశ్వాసం కుదిరింది. సామాజిక పరిణామం స్థూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. తన పదవిని వదిలిపెట్టి స్వాతంత్ర్యం పోరాటం అనే యజ్ఞ గుండంలో తనూ సమిధగా మారాడు. తండ్రిలో వచ్చిన ఈ మార్పుకి మిక్కిలి సంతోషించిన వ్యక్తి సుజాత. ఇంటిని గెల్చి రచ్చ గెలవాలన్న ఆమె కోరిక సఫలీకృతం కావడంతో మిక్కిలి ఆనందభరితురాలయింది. తండ్రికి తన కృతజ్ఞతలు తెలుపుకుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here