అలనాటి అపురూపాలు-24

1
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటుడు నాసిర్ ఖాన్ (దిలీప్ కుమార్ తమ్ముడు):

ఏ రంగంలోనైనా అన్నదమ్ములు ఉంటే అన్న నీడలో తమ్ముడు ఎదగడం కష్టమవుతుంది. అందుకు సినీరంగం మినహాయింపు కాదు.  అన్నతమ్ముళ్ళు ఎవరికివారు విడివిడిగా ఎంతగా ప్రతిభావంతులయినా ఎవరో ఒకరినీడలో మిగతా అంతా వొదగాల్సివస్తుంది. యాష్ చోప్రా ఎంత గొప్పవాడయినా బీ ఆర్ చోప్రా ప్రసక్తిలేకుండా అతని ప్రస్తావన వుండదు. అంజాద్ ఖాన్ తెలియనివారుండరు. ఇంతియాజ్ ఖాన్ ఎవరో చెప్పాలి. ప్యారేలాల్ అందరికీ తెలుసు. గోరక్నాథ్ శర్మ ఎవరో చెప్పాలి. మధుబాల అందరికీ తెలుసు. చంచల్ ఎవరో తెలియచెప్పాలి.  అలాగే దిలీప్ కుమార్ ఎవరో చెప్పనవసరంలేదు. నాసీర్ ఖాన్ ఎవరో చెప్పాలి.  దిలీప్ కుమార్ అనే వటవృక్షం ఛాయలో ఎదగడానికి ప్రయత్నించిన నాసిర్ ఖాన్ గురించి ఈ వారం తెలుసుకుందాం.

***

నాసిర్ ఖాన్ (11 జనవరి 1924 – 3 మే 1974) సుప్రసిద్ధ నటుడు దిలీప్ కుమార్‌కి తమ్ముడు. నటుడు ఆయూబ్‍ ఖాన్‌కి తండ్రి. నాసిర్ ఖాన్ – లాలా గులాం సర్వార్ ఆలీ ఖాన్, అయేషా బేగం దంపతులకు బొంబాయిలో జన్మించారు. పఠాన్ హిండ్కో మాట్లాడే అవాన్ కుటుంబానికి చెందిన ఈ దంపతులకు మొత్తం 12 మంది సంతానం. ఆరుగురు ఆడపిల్లలు, ఆరుగురు మగపిల్లలు. నాసిర్ ఖాన్ నాన్నగారికి పెషావర్ లోనూ, డియోలాలి లోనూ తోటలు ఉండేవి. ఆయన ఓ భూస్వామి, పండ్ల వ్యాపారి. ప్రసిద్ధుడైన తన అన్నయ్య దిలీప్ కుమార్ కన్నా నాసిర్ ఖాన్ వయసులో 21 నెలలు చిన్న. నాసిర్ ఖాన్ తన చిన్నతనమంతా బొంబాయి సమీపంలోని డియోలాలి అనే చిన్న స్టేషన్‌లో గడిపారు. ఎందుకంటే నాసిర్ పెద్దన్నయ్య ఆయూబ్ ఖాన్‌ అనారోగ్యం కారణంగా ఆ కుటుంబం అక్కడికి తరలి వచ్చింది. పెద్ద కుటుంబం కావడం వల్ల, ఆ ఇంట్లోని పిల్లలు ఆటలకు ఇల్లు దాటాల్సిన అవసరం పడలేదు. వాళ్ళల్లో వాళ్ళే ఆడుకునేవారు. వయసులో పెద్ద అయిన దిలీప్, సహజంగానే తమ్ముడితో గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. అయినప్పటికీ, ఓ అన్నయ్యలా బాగా చూసుకునేవారు. అలా తనపై ఆధిపత్యం చూపడం నాసిర్‌కి నచ్చేది కాదు. చాలా కాలం పాటు అన్నదమ్ములు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదట. అయితే వారి మధ్య స్నేహసంబంధాలు ఉండేవి, తన అన్న దిలీప్‌కి చెందిన బాంద్రా ఇంట్లో విశ్రాంతి తీసుకోడం బావుంటుదని నాసిర్ అనేవారు. వారి తండ్రికి బొంబాయిలో వ్యాపారం ఉండడంతో, పిల్లలు డియోలాలిలో తల్లి  సంరక్షణలో ఉండేవారు. నాసిర్ తల్లి 1948లో బొంబాయిలో చనిపోయారు, అప్పుడు ఆయన పాకిస్తాన్‌లో ఉన్నారు. తల్లిని ఆఖరి చూపులు చూసుకోలేకపోవడం ఆయన జీవితంలోని అతి పెద్ద విషాదం. నాసిర్ తండ్రి గులాం సర్వార్ ఆలీ ఖాన్ కూడా నాసిర్ లాహోర్‌లో ఉండగానే మరణించారు. నాసిర్ ఎంత ప్రయత్నించినా సకాలంలో బొంబాయి చేరుకోలేకపోయారు.

నాసిర్ చదువు సాఫీగా సాగలేదు. బడిలో గడిపిన కాలం ఆయన జీవితంలో ఆయనకు నచ్చని కాలం. తొలుత డియోలాలిలోని పాఠశాలలో చదివి, ఆపై బొంబాయిలోని బడిలో రెండేళ్ళు చదివారు. కానీ మెట్రిక్యులేషన్ పూర్తి చేయలేకపోయారు. గణితమంటే ఆయనకి భయం. ఆయనకి ఎక్కువగా అవుట్ డోర్ గేమ్స్… అందునా ఫుట్‌బాల్ అంటే బాగా ఇష్టం. డియోలాలిలోని బాల్యస్నేహితులలో హన్సియా అనే అల్లరి కుర్రాడు నాసిర్ వెంటే ఉండేవాడు, నాసిర్ వెళ్ళే అన్ని చోట్లకీ వెడుతూ తోడుగా ఉండేవాడు. వాళ్ళింటికి సమీపంలో ఉన్న మైదానంలో రాత్రిళ్ళు వెన్నెల్లో వాళ్ళిద్దరూ ఫుట్‌బాల్ ఆడేవారు.

విద్యార్థిగా ఉన్న రోజులలో నాసిర్ తన భవిష్యత్తు గురించి ఏనాడు గంభీరంగా ఆలోచించలేదు, 1940లో పాఠశాలని విడిచారు, కెరీర్ గురించిన స్పష్టమైన ప్రణాళిక కూడా లేదు. ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనుకున్నారాయన, కానీ మిలిటరీ క్యాంటిన్‌లో కొంత పని చేశారు. ఆ పై తన తండ్రి వ్యాపారంలో చేరారు. కానీ అక్కడా తృప్తి చెందలేదు. అశాంతిగా ఉంటూ, ఏదైనా స్వతంత్రంగా చేయాలనుకునేవారు. అందుకు అవకాశం త్వరలోనే దక్కింది. అయితే మరీ వెంటనే కాదు, చదువు మానేసిన ఐదేళ్ళకి… లక్ష్యం లేని పనులతో గడిపిన ఐదేళ్ళకి లభించింది.

1945లో ఆయన ఫిల్మిస్థాన్‌ వారి ‘మజ్‌దూర్’ సినిమా సెట్‌కి వెళ్ళినప్పుడు, ఆ దర్శకుడు నితిన్ బోస్‌కి నాసిర్ ఖాన్ నచ్చి, పైగా నటుడు దిలీప్ కుమార్ సోదరుడని తెలియగానే, వెంటనే హీరో అవకాశం ఇచ్చారు. సినిమాలో నాసిర్ ఖాన్ ఇందుమతి సరసన నటించారు. సినిమాలో కెరీర్ ఏర్పర్చుకోమని నితిన్ బోస్ నాసిర్ ఖాన్‌ని ప్రోత్సహించారు. నాసిర్ ఖాన్ కొంత పిరికిగా ఉండేసరికి ఈ ప్రోత్సాహం అవసరమైంది. సెట్స్ మీద కెమెరామ్యాన్ అయినా, సౌండ్ రికార్డిస్ట్ అయినా నాసిర్ భయపడేవారు. కెమెరా గురించి గానీ, లక్షలాది మంది చూసే సినిమాలో తాను నటిస్తున్నానన్న స్పృహ గానీ ఆయనకి ఉండేది కాదు. నటన ఆయనకో సరదా మాత్రమే, షాట్ ఎప్పుడు మొదలయింది, ఎప్పుడు పూర్తయిందో పట్టించుకునేవారు కాదు. ఆ సినిమా హిట్ కాకపోయినా, నాసిర్ పాత్ర జనాలకి నచ్చింది. మరో మోతీలాల్ అవుతారని జనాలు భావించారు.

మరుసటి ఏడాది నాసిర్ ఫిల్మిస్థాన్ వారిదే ‘షెహనాయ్’లో నటించారు.  భారతీయ హాస్య చిత్రాలలో కొత్త బాణీని సృష్టించింది ‘షెహనాయ్. దేశవిభజనకి ముందు ఆయన పోషించిన చివరి పాత్ర అది. 1947లో ఆయన పాకిస్తాన్‌కి వెళ్ళి ‘షాహీదా’ (1949), ‘తేరీ యాద్’ అనే రెండు సినిమాలలో నటించారు. 1948లో విడుదలయిన ‘తేరీ యాద్’ పాకిస్తాన్ దేశపు తొలి సినిమా. ‘తేరీ యాద్’లో ఆశా పొస్లే సరసన నటించారు. పాకిస్తాన్‌లో విడుదలైన తొలి చిత్రం ఇదే. నిర్మాణంలో నాణ్యత లోపించడం, జిన్నా మరణం వంటివి ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణమయ్యాయి. తన రెండవ పాకిస్తానీ సినిమా, దీవాన్ సర్దారీ లాల్ యొక్క ‘షాహీదా’లో షమీమ్‌తో కలసి నటించారు. ఈవిడ కిషోర్ సాహు  ‘సిందూర్’ సినిమాలోని పాత్రకి ప్రసిద్ధి, కానీ ఆ సినిమా కూడా ఆడలేదు. తాను అక్కడ నిలదొక్కుకోడం కష్టమని భావించిన నాసిర్ ఖాన్ తన అన్నయ్య యూసుఫ్ ఖాన్… అంటే దిలీప్ కుమార్ సాయం కోరారు. అప్పటికే దిలీప్ కుమార్ భారత్‌లో ‘మ్యాట్నీ ఐడల్’గా ఎదుగుతున్నారు. నాసిర్ ఖాన్ ‘బెస్ట్ పిక్చర్స్’ బేనర్ పై – నర్గిస్, దిలీప్ కుమార్ నటిచిన ‘మేళా’ సినిమాతో సహా నాలుగు సినిమాలను బొంబాయి నుంచి పాకిస్తాన్‌లో పంపిణీ చేశారు. ఎస్.యు. సన్నీ తీసిన ఆ సినిమాకి నౌషాద్ అద్భుతమైన సంగీతం అందించారు. అనుకోకుండా సంపద వచ్చి పడడంతో నాసిర్ ఖాన్ ఫ్యూడల్ పంజాబీ కుటుంబానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డారట. ఈ విషయంలో గొడవలై ఆయన పాకిస్తాన్‌ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చేశారు. కానీ అప్పటికే పాకిస్తాన్ యొక్క తొలి సినిమా హీరోగా ఆయన పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మార్చి 1950లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నాసిర్ ఖాన్ సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించేసరికి చాలా గొడవలు అయ్యాయి. అయితే నాసిర్ న్యాయపోరాటం కొనసాగించి దేశంలోనే ఉండిపోయారు. ఆ తరువాత వరుసగా భారతీయ సినిమాల్లో నటించారు. అవి ‘నఖ్రే’, ‘నగీనా’, ‘నజ్నీన్’,  ‘ఖజానా’, ‘హంగామా’, ‘శ్రీమతి జీ’, ‘సౌదాగర్’, ‘సాజ్’, ‘ఖూబ్‌సూరత్’, ‘శీషామ్’, ‘లాల్ కున్వర్’, ‘అంగారే’, ‘ఆఘోష్’, ‘ఆస్మాన్’, ‘నిగాహ్’. అప్పట్లో అందరూ కోరుకునే నటుడయ్యారు నాసిర్.  రెండేళ్ళలో పదహారు సినిమాలలో నటించారనే వాస్తవం దీన్ని ఋజువు చేస్తుంది. ‘నగీనా’ అనే మిస్టరీ థ్రిల్లర్‌లో ఆయన ‘నూతన్’ సరసన నటించారు. ‘నగీనా’కు అప్పట్లో సెన్సార్ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకి సి.హెచ్. ఆత్మ, లతా మంగేష్కర్ పాడిన పాటలు ఇప్పటికీ అలరిస్తుంటాయి. ఆ తర్వాత నాసిర్ ఖాన్ నాటి ఎందరో సుప్రసిద్ధ హీరోయిన్లతో జత కట్టారు – సురయ్య (లాల్ కున్వర్), నర్గిస్ (అంగారే), మీనా కుమారి (దేరా), ఇక నూతన్‌తో ఆయన నటించిన సినిమాలు (నగీనా, ఆఘోష్, శీషామ్) విజయవంతమయ్యాయి. అయితే తన పరిమితమైన నటనా సామర్థ్యం, భావ వ్యక్తీకరణ లోపాల కారణంగా తన అన్న దిలీప్ కుమార్‍కి వచ్చినంత పేరును నాసిర్ ఎన్నడూ పొందలేకపోయారు.

నాసిర్‌కి గంభీరమైన, నాటకీయమైన పాత్రలంటే ఇష్టం. ‘చంద్రుడిని చూస్తూ గెంతుతూ పాటలు పాడే హీరోని కాను’ అంటారాయన. నితిన్ బోస్, పంచోలి ఆయన అభిమాన దర్శకులు. సంగీత దర్శకులలో ఆర్.సి.బోరల్, సజ్జద్ హుస్సేన్‌ల పనితనాన్ని మెచ్చుకుంటారాయన. తన అభిమాన సహనటి నూతన్ గురించి “ఆమె భావోద్వేగాలను బాగా పండిస్తారు, గొప్ప ఊహాశక్తి బహుమతిగా పొందారు” అని అన్నారు. సినీనిర్మాణంపై ప్రభుత్వం పరిశోధన చేయాలని ఆయన భావించారు. తన జీవితంలో ఓ ఉత్తమ చిత్రాన్ని కాకుండా ఉత్తమమైన స్టూడియోని నిర్మించాలని ఆయన తలచారు. ఆయన జీవితంలో ఎన్నో సరదా సంఘటనలు, విభ్రాంతి కలిగించే ఘటనలు ఉన్నాయి. ఆయన ఒక్కరే ఉన్నప్పుడు ఎంతో గంభీరంగా ఉండేవారు. తన పని పట్ల, తన చుట్టూ ఉన్న అన్నిటిపట్లా ఆయనెంతో సీరియస్‍గా ఉండేవారు. “నాలో రెండు వ్యక్తిత్వాలున్నాయి” అని ఆయన తరచూ తన స్నేహితులతో చెప్పేవారు. ఒకటి తనది, ఒకటి దిలీప్‌ది అనేవారు. అయితే నాసిర్ సొంత వ్యక్తిత్వానికి సినీ తెరపై ఇంకా మూర్తిమత్వం ఏర్పడలేదు. “మా అన్నయ్య దిలీప్‌లా చదవడం, ఆదర్శవాద సిద్ధాంతాలు చర్చించడం నాకు నచ్చదు” అనేవారాయన. “కానీ దిలీప్ కుమార్‌లా నటించానని జనాలు అంటే ఏమనాలో నాకు తెలియదు. అది ప్రశంసో కాదో కూడా తెలియదు” అని చెప్పారు. బాగా విజయవంతమై, నాసిర్ ఖాన్‌కి బాగా గుర్తుండిపోయిన సినిమా తన అన్నకి వ్యతిరేకమైన పాత్రలో ఆయన నటించిన ‘గంగ జమున’. చట్టానికి రెండు వైపులా ఉండే అన్నదమ్ముల కథ ఇది, గంగ (దిలీప్ కుమార్), జమున (నాసిర్ ఖాన్).

నాసిర్ ఖాన్ మొదటి వివాహం సురయ్యతో జరిగింది, ఈ సురయ్య హీరోయిన్ ‘సురయ్య’ కాదు, మాజీ నటుడు నజీర్ కూతురు. ఒకనాటి వెండితెర రాణి స్వర్ణలత ఈ సురయ్యకు సవతి తల్లి. సురయ్యను నాసిర్ బాంద్రాలో తన పొరుగింటి అమ్మాయిగా చూసి, ప్రేమించి, పెళ్ళి చేసుకున్నారు. వారికి నహీద్ అనే పాప ఉండేది. వీళ్ళు తరచుగా దిలీప్ కుమార్ ఇంటికి వెళ్తుండేవారు. బేగం పారాని పెళ్ళి చేసుకునేందుకు గాను నాసిర్ తన మొదటి భార్యకి విడాకులిచ్చారు. బేగం పారా అప్పట్లో శృంగార నాయిక. నాసిర్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించారు. నటుడు ఆయూబ్ ఖాన్ వీరి పుత్రుడు (బేగం పారా 1944లో విడుదలైన మల్టీ స్టారర్ ‘చాంద్’తో సినీ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో అప్పటి అందాల నటుడు మోతీలాల్ సరసన నటించారు. 1956లో ‘కార్ భాలా’  సినిమా పూర్తి చేశాక ఆమె భారతదేశానికి వచ్చారు. 1974లో తన భర్త మరణించిన తర్వాతే ఆమె తన మాతృదేశానికి తిరిగి వెళ్ళారు). బేగం పారా వెల్లడించిన దాని ప్రకారం – నాసిర్‍కు జుట్టు, కనుబొమలు రాలిపోయే రుగ్మత ఏదో వచ్చింది, దాని వల్ల ఆయన కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ‘గంగ జమున’ షూటింగ్‌లో ఆయన విగ్గు పెట్టుకుని నడిపించేసారట. అందుకని ఆ తర్వాత ఆయన సినీ నిర్మాణం పైనే దృష్టి నిలిపారు.

ఆయన 3 మే 1974 నాడు దివంగతులయ్యారు. ఆయన చివరి సినిమా ‘బైరాగ్’. ఇది ఆయన మరణాంతరం విడుదలయింది.

కుటుంబ కలహాలు, అభియోగాలు:

తన భర్త అన్నగారైన దిలీప్ కుమార్ నుంచి తనకీ, తన పిల్లలకి ఎదురైన చేదు అనుభవాలను వివరించారు బేగం పారా. వాటిని తామెన్నటికీ మరిచిపోలేమని అన్నారావిడ. తన సినిమా ‘జిద్’ కోసం లొకేషన్లు వెతుకుతూ నాసిర్ ఖాన్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించగా, ఆ సినిమాని పూర్తి చేసే బాధ్యత ఆయన భార్య బేగం పారాపై పడింది. ఈ వివరాలన్నీ ఆమె అప్పట్లో స్టార్‌డస్ట్ పత్రికకి వెల్లడించారు. “మా హీరో సంజయ్ ఖాన్ ఎంతో సహకరించారు” అని గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఆయన స్వంతంగా ‘చాందీ సోనా’ అనే సినిమా తీస్తున్నారు, కానీ నాకు అవసరమైనప్పుడల్లా డేట్స్ ఇస్తానని నాకు మాటిచ్చారు. నాకెంతో సంతోషం కలిగింది. కానీ హీరోయిన్ సైరాబాను, ఆమె భర్త – సినిమా పూర్తి కాకుండా అడ్దుపడ్డారు. సైరాబాను ఆటంకాలు కల్పించడమే కాకుండా డేట్లు ఇవ్వకుండా వేధించేది. ఇందులో దిలీప్ కుమార్‌ది చాలా రోత కలిగించే ప్రవర్తన” అన్నారావిడ.

“ఆయన మా డిస్ట్రిబ్యూటర్లు అందరి వద్దకు వెళ్ళి, తన తమ్ముడి సినిమాని తాను పూర్తి చేస్తాననీ, ఆ బాధ్యత తనదని ఒప్పించారు. ఆయన భరోసాతో తృప్తి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషించారు. నేను షూటింగ్ మొదలుపెడదామని అనుకుని ఫైనాన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్ళిన ప్రతీసారి వాళ్ళు – యూసఫ్ సాబ్‌తో నేరుగా మాట్లాడుతాం అనేవారు, ఎందుకంటే ఆయన తనతోనే సంప్రదించమని వాళ్ళకి చెప్పారట! అయితే వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడూ దిలీప్ కుమార్ వారికి అందుబాటులో లేరు. ఎనిమిది నెలల పాటు మాయమైపోయారు. తన పేద మరదలికి సాయం చేస్తున్నాననే నెపంతో ఆయన నయవంచనతో నన్ను కూకటివేళ్ళతో సహా పెకిలించేశారు. సినిమా ఆపేసి, పాకిస్తాన్ వెళ్ళిపోయి, మా అమ్మతో ఉండడం తప్ప నాకు మరో మార్గం లేకపోయింది. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేముందు చివరగా దిలీప్‌కీ, సైరాకి వీడ్కోలు చెప్పాలనుకున్నాను. ఆ రోజు నాకింకా గుర్తుంది. వాళ్ళింటికి వెళ్దామంటే ఇంట్లో లేరని కబురు తెలిసింది. మరునాడు ఉదయాన్నే వాళ్ళింటికి ఫోన్ చేస్తే, సాబ్ ఇంకా నిద్ర లేవలేదని సైరా చెప్పింది. నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని, పాకిస్తాన్‌లో ఎన్నాళ్ళు ఉంటానో, మళ్ళీ ఇండియాకి ఎప్పుడొస్తానో చెప్పలేనని ఆమెకు చెప్పాను. ఆ విషయం చెబుదామని అంటే, కొంత సేపు నిద్రలేపడానికి ప్రయత్నించి, ఆయన లేవడం లేదని చెప్పింది. యూసుఫ్ గొప్ప మాయగాడు!” అన్నారామె చిరచిరలాడుతూ. “అయితే అందమైన ఆ ఆకర్షణ వెనుక అత్యంత క్రూరమైన మనిషి దాగున్నాడు. ఆయన దేన్నీ మరిచిపోడు, పైగా మీరు ఊహించనప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడతాడు. మౌలికంగా, ఆ మనిషి పిరికివాడు. ఎన్నడూ ప్రత్యర్థి ముందుకు రాడు, వెనుక దెబ్బ తీస్తాడు!” అన్నారు.

పారా, తన పిల్లలతో శాశ్వతంగా పాకిస్తాన్ వెళ్ళిపోయారని నమ్మారు దిలీప్. లేకపోతే వాళ్ళు వెళ్ళాక ఆయన చేసిన ఆ పనిని చేసి ఉండరు. ఒక రోజు అనుకోకుండా భారతదేశానికి వచ్చిన బేగం పారా గట్టి, నమ్మశక్యం కాని ఎదురు దెబ్బ తగిలింది. “గంగ జమున సినిమా వల్ల దిలీప్ కుమార్‌కి కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి” చెప్పారామె. “ఆ సినిమాకి నా భర్త నిర్మాత. ఒక డిస్ట్రిబ్యూటర్‌కి మాత్రమే సినిమా హక్కులిచ్చారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయట పడడానికి దిలీప్ కుమార్‌కి ఉన్న ఏకైక మార్గం ఆ సినిమా హక్కులని జేజిక్కించుకోవడమే. అందుకని ఈ సినిమా కోసం నా భర్త (దిలీప్ నేతృత్వంలో తన సోదరసోదరీమణులతో) ఒక ట్రస్ట్‌ని ఏర్పరచారని దిలీప్ ప్రకటించారు. అయితే నా భర్త ఆయన భార్యని, ముగ్గురు పిల్లలని ఎలా మర్చిపోతారు? వాస్తవం ఏంటంటే – నా భర్త వీలునామా రాయకుండా చనిపోయారు. తనని తాను కాపాడుకోవడానికి అంత గొప్ప దిలీప్ కుమార్ ఈ స్థాయికి దిగజారుతారని ఊహించలేదు” అని చెప్పారామె.

ఈ సంఘటన ఆమె మనసుని ఎంతగా గాయపరిచిందంటే – తర్వాత రాజీ కోసం దిలీప్ కుమార్ ప్రయత్నించినప్పుడు, తన తమ్ముడి పిల్లలకు సాయం చేయాలనుకున్నప్పుడు బేగం పారా ఆయనకు ఫోన్ చేసి “మీకెంత ధైర్యం కాకపోతే మా పిల్లలకి మీ సాయం తీసుకుంటానని ఎలా అనుకున్నారు?” అన్నారు.

అయితే ఆమె కుమారుడు ఆయూబ్ ఖాన్ సినిమాల్లోనూ, టివిలోను రాణించారు. ఆమె తన 81వ ఏట 9 డిసెంబర్ 2008 నాడు నిద్రలో మరణించారు. నాసిర్ ఖాన్ మిగతా పిల్లల గురించి వివరాలు తెలియవు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here