99 సెకన్ల కథ-11

2
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. చంద్రం – శాంతి – ?

[dropcap]”ఏ[/dropcap]మిటయ్యా, ఆ భాష! ఆ మూడేళ్ళ పిల్ల చూడు – మీ అరుపులకి ఎలా బిక్క చచ్చిపోయిందో! మంచి వుద్యోగంలో వున్నావు. మా కాలంలో మేమెన్నడూ ఊహించివుండనంతటి జీతం, అలవెన్సులు అనుభవిస్తున్నావు. మీ నాన్న అంటే బడిపంతులు. ఎంత అవస్థపడి మిమ్మల్ని చదివించాడో తెలుసు కదా!… పైగా, ఇప్పుడు నీకు – చదువుకొని కూడా పిల్లలకోసం వుద్యోగం చేయకుండా కుటుంబానికి అంకితమై పోయిన భార్య దొరికింది!… అయినా, నీ పురుషాహంకారంతో నువ్వు, నీకన్నా నేనేం తక్కువన్న ఆత్మ గౌరవంతో నీ భార్య – ఏమిటయ్యా ఆ కేకలు, ఆ భాష!… చుట్టుపక్కలవాళ్ళంతా తొంగి చూస్తున్నారు చూడు.. ఎందుకిదంతా ?”

శేషయ్య గారి క్లాసు నడుస్తూనే వుంది.

అప్పటిదాకా ఆవేశంగా భార్య మీద నోటికొచ్చినట్లు అరుస్తూ, శేషయ్య గారిని చూడగానే అతి కష్టం మీద నోరు అదుపు చేసుకున్న చంద్రం సంబాళించుకొని, శేషయ్య గారు చెప్పింది వింటున్నాడు.

“ఈయన ధూమ పానంతో ఇల్లంతా పొగ అంకుల్!….పిల్లలకి కాన్సర్ వస్తే – అని అడిగానని..” అని రుద్ధ కంఠంతో గబగబా చెప్పేసి, శాంతి తన మూడేళ్ళ పిల్లని తీసుకొని బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది.

“నీ కొడుకేడి?”

“ఇప్పుడే ఆడుకుంటానని కిందకి వెళ్ళాడు.”

చంద్రంలో ఇంకా ఆ ఉమ్మస్సు తగ్గలేదు. శేషయ్య గారు మాట మార్చారు.

“ఇవ్వాళ్టినుంచి నిన్ను ‘నిత్యాగ్నిహోత్రుడు’ అని పిలవాలని వుందయ్యా. సరేనా?”

ఆయన కళ్ళు – చంద్రం పక్కనున్న సిగరెట్ పెట్టె మీద, అగ్గి పెట్టెమీద – అతని వేళ్ళు ఆడుతూండటం చూశాయి. చంద్రం సిగ్గు పడ్డాడు.

వాటిని కుర్చీలో వెనక్కి జరిపాడు.

“నీకీ సిగరెట్లు ఎప్పుడు అలవాటయ్యాయి?”

చంద్రంలో ఆవేశం తగ్గింది.

“ఉద్యోగంలో చేరిన కొత్తలో అంకుల్. ఏదో హోదా కోసం మొదలెట్టాను…”

“దానితో పాటు ‘సురాపానం’ కూడా….” అర్ధోక్తితో ఆపేశారు శేషయ్య.

“ఇది ఉంటే అదికూడా వున్నట్లే కదా అంకుల్. ఒక్కోసారి ఫ్రెండ్స్ మొహమాటానికి బాగా లొంగిపోతారు…” పిల్లని పడుకోబెట్టి వచ్చిన శాంతి అందుకొంది. చంద్రం సిగ్గుతో తల వంచుకున్నాడు.

“నువ్వెప్పుడన్నా తాగి రావటం మీ అబ్బాయి చూశాడా?”

చంద్రం తలవంచుకునే వున్నాడు. మాట్లాడలేదు.

“చూడవయ్యా, మనం ఏం చేస్తే మన పిల్లలు అవే త్వరగా నేర్చుకుంటారు. నువ్వు ఇంతకు ముందు ఛండాలమైన భాష మాట్లాడావు. కోపంలోనే అనుకో. కాని ఆ భాష వాడటం తప్పు కాదని నీ పదేళ్ళ కొడుకు అనుకుంటాడు. రేపు నీ కూతురు అనుకుంటుంది. మనం ఏం చేస్తే దాన్నే వాళ్ళు అనుకరిస్తారు ఈ వయసులో. మంచిదేనా?”

చంద్రం కొంచెం ఆలోచించాడు.

“తప్పని చెబుతాం కదా అంకుల్ !”

“నీ వయసులో నీలాంటి వాళ్ళు సద్గురువుల ప్రవచనాలని విని, ఆస్వాదిస్తారు. కాని, పిల్లలు మన మాటల్ని, చేతల్ని అనుకరిస్తారు, అనుసరిస్తారు.”

“ఎందుకంటారు?”

“గీతలో ఒక శ్లోకం ఇలా చెబుతుంది:

‘యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః, సః యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.’ శ్రేష్ఠులైన వాళ్ళు ఎలా నడిస్తే లోకం కూడా దాన్నే అనుసరిస్తుంది….! పిల్లల దృష్టిలో అమ్మా, నాన్నలే వాళ్ళకి రోల్ మోడల్స్ (శ్రేష్ఠులు). అందుకే నీ భాష, నీ అలవాట్లు, నీ ఆవేశం… అన్నీ వాళ్ళు గమనిస్తుంటారు. అనుకరిస్తుంటారు.”

చంద్రం ఆలోచిస్తున్నాడు…. రామకృష్ణ మఠం కొత్త కార్యక్రమం గురించి చెప్పి శేషయ్య లేచారు.

అంతలో వాచ్‌మ్యాన్ రొప్పుతూ వచ్చాడు పైకి. వస్తూ, చంద్రం కొడుకుని చేయి పట్టుకుని తీసుకువచ్చాడు.

“సర్, మీ వాడు మన భవనం ఆఖరి అంతస్థుపైన వాటర్ ట్యాంక్ చాటున కూర్చొని సిగరెట్ కాలుస్తూ, దగ్గుతుంటే….”

విషయం అర్థమైపోయింది. శేషయ్య చిరునవ్వుతో చంద్రం వంక చూశారు.

చంద్రం ఆయన కళ్ళల్లోకి చూడలేకపోయాడు. కాని, వెంటనే ఇంట్లో వున్న సిగరెట్ ప్యాకెట్లు అన్నీ తెచ్చి, శాంతికిచ్చి తగలబెట్టేయమన్నాడు.

2. కె.ఎం గారి సంస్కారం!

తప్పనిసరి పరిస్థితుల్లో శేషయ్యగారు వరంగల్లు వెళ్ళటానికి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ఆ ట్రైన్లో నాన్ ఎసి ఛైర్ కార్లో ఎక్కారు.

ఖాళీగా వుంది ఛైర్ కారంతా. ఈయన కూర్చున్న రెండు నిమిషాలకే ఒక యువ జంట ఈయనకి ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. వాళ్ళతో వాళ్ళ కొడుకు కూడా. పొట్టిగా వున్నాడు. నాలుగేళ్ళు వుంటాయేమో!

శేషయ్యని చూస్తూనే, ఆ కుర్ర తండ్రి తన కొడుక్కి, “తాత గారికి నమస్కారం పెట్టు నాన్నా” అన్నాడు.

వాడు ఫెడీమని లేచి, శేషయ్య గారి కాళ్ళ మీదకి ఒంగి, ‘నమస్తే ‘ అనేసి, మళ్ళీ అంతే వేగంగా వెనక్కి సాగి సీట్లో కూర్చున్నాడు.

“ఏం చురుకుదనమయ్యా మీ వాడికి! ఏం చదువుతున్నాడేంటి?”

ఆ కుర్ర తండ్రి కొంచెం సిగ్గు పడుతూ, “వీడు మా పెళ్ళవగానే పుట్టేసాడండి. అందుకే ఇప్పుడు ఆరేళ్ళు…”

“ఆ! పెళ్ళవగానే పుట్టేశాడా?” శేషయ్య గారు భూకంపం వచ్చినట్లుగా అదిరిపడ్డారు. కుర్ర పెళ్ళాం మొగుడి తొడ గిల్లింది. కుర్ర మొగుడు సర్దుకున్నాడు.

తన వేళ్ళకున్న నాలుగు ఉంగరాలూ సర్దుకుంటూ, కొంచెం సిగ్గు కుమ్మరిస్తూ, “అంటే, తొమ్మిది నిండాకేనండి” అన్నాడు.

అక్కడ్నుంచి తన వ్యాపారం గురించి, తన కుటుంబం గురించి, తన కొడుకు ‘శిశు జ్ఞాని’ అవటం గురించి…. ఇలా ఆపకుండా చెప్పేస్తున్నాడు.

“మీలాంటి పెద్ద వాళ్ళముందు చెప్పుకోవటం స్వోత్కర్ష అంటారేమో గాని, నేను మా వాడికి సంస్కారం అంటే ఏమిటో నేర్పుతున్నానండి…” అంటూ ఆపి, మళ్ళీ కొంచెం కుమ్మరించాడు.

“ఫరవాలేదు, చెప్పవయ్యా” ఉత్సాహ పరిచారు శేషయ్య.

ఇక విజృంభించాడు కుర్ర మొగుడు.

“ఒరేయ్, సుమతీ శతకంలోంచి నా అభిమాన పద్యం … ఏదీ..” వాడికి అర్థమైపోయింది.

“అప్పిచ్చువాడు వైద్యుడు, నెడతెగక బారెడు నేరుయు, ద్విజుడున్….” కుర్ర మొగుడు మహా సంబర పడిపోయాడు.

“చూశారా, ఏ గ్రామానికైనా అప్పిచ్చేవాడు ఎంత ముఖ్యమో! అందుకే పద్యం అక్కడ మొదలైంది… “

“ఓహో, మీది ఫైనాన్స్ వ్యాపారమా!”

కె.ఎం మళ్ళీ కుమ్మరించాడు.

“ఇప్పుడు పిల్లలకి మనం ఏమిటిస్తాం సార్! సంపదా? బోల్డు మంది అన్నా చెల్లెళ్ళా? పెద్ద ఆస్థులా? …”

“నువ్వే చెప్పు బాబూ. నేనిప్పుడు కొత్తగా ఆలోచించలేను.”

కె.ఎం మళ్ళీ కుమ్మరిస్తూ, అన్నాడు: “సంస్కారం సార్, సంస్కారం. మా వాడికి అదే నేర్పిస్తున్నాను. అరేయ్, వేమన శతకంలోంచి చెప్పరా.”

పొట్టిగా వున్నా, కంచు కంఠం వాడిది.

పాడేస్తున్నాడు.

అంతలో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టి.టి.ఇ) వచ్చాడు. శేషయ్య గారి టిక్కెట్ చూశాక, ఆ కుర్ర జంట వంక చూశాడు. వాళ్ళు తమ రెండు టిక్కెట్లు చూపించారు.

“ఈ కుర్రాడికి..?” అంటూ అనుమానంగా చూశాడు టి.టి.ఇ.

“అబ్బే వాడికి మొన్ననే మూడు వెళ్ళి నాలుగు వచ్చింది. ఏరా …..!” అన్నాడు కె. ఎం.

ఆ కొడుకు వెర్రి మొహంపెట్టి, “అవును” అన్నాడు.

టి.టి.ఇ వెళ్ళిపోయాడు.

మళ్ళీ సంస్కార పద్యాలు ఊపందు కున్నాయి.

“తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు…”

వరంగల్లు వచ్చేసింది.

శేషయ్య దిగుతూంటే, కె.ఎం మళ్ళీ “తాతగారికి నమస్తే” అన్నాడు కొడుక్కేసి చూసి.

వాడు ఫెడీ మని పెట్టేశాడు.

శేషయ్య ఆ కె.ఎం ని బయటకు పిలిచాడు. ట్రైన్ దిగాక, పక్కకి తీసుకెళ్ళి చెప్పారు.

“బాబూ, ఒక మాట చెబుతాను వింటావా?”

“వినటమేమిటండీ, చేసేస్తాను. చెప్పండి.”

శేషయ్య అతని తల నిమిరి చెప్పారు.

“సంస్కారం పద్యాల దగ్గర కాదు మొదలవ్వాల్సింది. నీ కొడుకు తన వయస్సు దాచకుండా చెప్పటం దగ్గర మొదలవ్వాలి. నువ్వే ఇలా నేర్పుతున్నావంటే, అది ‘కుసంస్కారాన్ని’ నేర్పటమే… ఎలాంటి సంస్కారం ఇవ్వాలనుకుంటున్నావో ఇప్పుడు తేల్చుకో…గాడ్ బ్లెస్ యు.”

కె.ఎం మొహంలో రంగులు మారాయి. వెంటనే టి.టి.ఇ కోసం పరుగెత్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here