“దుర్గ” ఓ వారధి

0
3

[dropcap]మ[/dropcap]న కుటుంబంలో తల్లితో బిడ్డ కు వున్న అనుబంధం వొకలా వుంటుంది. అదే తండ్రికీ కొడుక్కీ మధ్య ఒకలా వుంటుంది. వాళ్ళ మధ్య బాల్యంలోనే స్నేహపూర్వక సంబంధం ఏర్పడి వుంటే ఒకలాగా, లేదూ సాంప్రదాయికంగా (?) తండ్రీ కొడుకుల సంబంధం ఏర్పడితే మరోలాగా వుంటుంది. తల్లి కొడుకును తిడుతుంది, కొడుతుంది, మళ్ళీ దగ్గర చేసి ముద్దు చేస్తుంది. కొడుకు కూడా అంతే అధికారంగా తల్లితో దెబ్బలాడుతాడు, అలుగుతాడు అన్నీ చేస్తాడు. వాళ్ళ మధ్య మాటల వంతెనలకు కరువు తక్కువే. కానీ తండ్రీ కొడుకుల మధ్య గనక ఆ వంతెనలు కట్టుకోకపోతే తండ్రి మనసులో మాట కొడుక్కీ, కొడుకు మనసులో మాట తండ్రికీ స్పష్టం అవక ఇద్దరూ విలపిస్తారు. చాలా సున్నితమైన విషయం. దీని మీద ఒక చిత్రం తీస్తే ఎలా వుంటుంది? ఇదిగో ఇలా “దుర్గ” లా బ్రహ్మాండంగా వుంటుంది.

మనవరాలు దుర్గ (శార్వరి మనోజ్ కషిద్) ఈ కథను చెబుతుంది. రెండు రోజులైంది తండ్రి (ముక్తి రవి దాస్) పంట అమ్మడానికి మార్కెట్టు కు వెళ్ళి. ఇవాళా రాలేదు. అమ్మ వంటా, ఇంటి పనులూ చూసుకుంటూ వుంది. తాతయ్యకి ఆరోగ్యం బాగా లేదు. తినమంటే అబ్బాయి వచ్చాడా అని అడుగుతాడు. మార్కెట్లో కొనుగోలు ధర చాలా తక్కువ వుంది, ఏ మాత్రం పెంచం అంటున్నారు. రెండు రాత్రిళ్ళు అక్కడే పడుకోవాల్సి వచ్చింది ఆ తండ్రికి. ఇంటికి ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇటు కొనుగోలుదార్లకు నచ్చచెప్పలేక, అటు భార్యకు తన బాగోగులు తెలియపరచలేక నలిగిపోతున్నాడు.

మొదట్లో దుర్గ చెప్పినట్టే, వీళ్ళెవరూ నమ్మట్లేదు గాని అది వారనుకుంటున్నట్టుగా కల కాదు, నిజంగానే తను తాతయ్యతో రాత్రి మాట్లాడిందని చెబుతోంది. ఎందుకో తలుపుబయట మాటలు వినిపిస్తే నాన్నేమో అనుకుని తలుపు తీసింది. చూస్తే ఆవుకి గడ్డి తినిపిస్తూ తాతయ్య. దగ్గరికెళ్తుంది. తాతయ్య చాలా విషయాలు చెబుతాడు. తను చిన్నప్పుడు దుర్గని సంతకు తీసుకెళ్తే, తనకు ఏమీ కనబడడం లేదంటే భుజాన మోస్తాడు. అప్పుడు సంతలో అందరికన్నా పొడగరి అయి అన్నీ చూడగలుగుతుంది దుర్గ. ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయింది కదమ్మా, అందుకే ఈ సారి సంతకు నిన్ను తీసుకెళ్ళలేకపోయాను, క్షమించమ్మా. నువ్వు నాన్నతో స్నేహం కలుపుకో, నిన్ను సంతకు భుజమ్మీద మోసుకుంటూ తీసుకెళ్ళి చూపిస్తాడు. ఆ రోజు మనకు సంత నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి వాహనం దొరక్కపోతే నిన్ను భుజాన మోస్తూ అడవి దారంట నడుచుకుంటూ అర్ధరాత్రి ఇల్లు చేరాను. అడవిలో నక్క ఊళలు గుర్తున్నాయా? ఆ రాత్రి నా కొడుకే అయినా నన్ను ఎన్ని తిట్లు తిట్టాడనీ. నేను బాధ్యతారహితుడిని ఎట్లా అయ్యాను? ఇప్పుడు నేనూ చిన్నపిల్లవాడినేగా. అయినా నాకు వాడి మీద కోపం లేదు. మీ నాన్న కష్టజీవి. మనిద్దారి మధ్య వున్నటువంటి స్నేహం మా ఇద్దరిమధ్య వాడి చిన్నప్పుడు ఏర్పడలేదు. వాడొచ్చినప్పుడు నువ్వైతే స్నేహం కలుపుకో, ఏం. అలాగే నాకు వాడి మీద ప్రేమే గాని కోపం లేదని కూడా చెప్పు. అంటాడు.

చనిపోయిన తాతయ్యకు అంతిమ యాత్రప్పుడు దుర్గ మొండికేస్తే భుజాన్నెత్తుకున్న తండ్రితో ఇదంతా చెబుతుంది. భోరున ఏడుస్తాడా తండ్రి.

అందరూ చెబుతున్నట్టు ఆ తాతయ్య దుర్గ కలలో చెప్పాడా? దుర్గైతే నిజంగానే అన్నాడంటుంది. చాలా అనారోగ్యంగా, రెండు ముక్కలు మాట్లాడలేని, భోజనానికి సహాయం ఇస్తే తప్ప లేచి కూర్చోలేని తాతయ్య కలలో నైతే నేం చాలా అవసరమైన విషయమే చెప్పాడు. ఆ తండ్రీ కూతుళ్ళ మధ్య స్నేహాన్ని కలిపాడు.

తెర మీద చివర్న ఆ తండ్రి ఏడుపు మనకు అర్థం అవుతుంది. తండ్రిని తిట్టినా కోపం లేదని చెప్పించాడే, అలాంటి తండ్రి పట్ల తన దురుసుతనం తలచుకుని, తండ్రి ఇక లేడని తలచుకుని కార్చిన కన్నీరు. ఆ క్షణం లో తను తన కూతురి గురించే తప్ప తండ్రి గురించి ఆలోచించలేదనీ. ఇవన్నీ ఏమీ అర్థం కాని దుర్గ మాత్రం ఈ కథకు, ఈ చిత్రానికీ వో వెన్నెముక. దుర్గగా శార్వరి చాలా బాగా చేసింది. రఘువీర్ యాదవ్, ముక్తి రవి దాస్ లు కూడా. దర్శకుడు అభిషేక్ రాయ్ సాన్యాల్ నటుడు చందన్ రాయ్ సాన్యాల్ సోదరుడు. ఇంతియాజ్ అలి దర్శకుది దగ్గర అసిస్టెంట్ గా పని చేసినవాడు. ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసింది కూడా ఇంతియాజ్ అలీనే. ఇతని దగ్గరినుంచి మరైన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. చాయాగ్రహణం, సంగీతం అన్నీ చక్కగా వున్నాయి.

ఓ అపురూపమైన అనుభవం కోసం తప్పక చూడాల్సిన చిత్రం ఇది. యూట్యూబ్ లో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here