జీవన రమణీయం-121

2
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

నా అశ్విన్, కృష్ణకాంత్‌లతో

[dropcap]మా[/dropcap] చిన్నవాడు కృష్ణకాంత్ హ్యుండైలో వుద్యోగం మానేసి పూనేలో మా సాయికృష్ణ దగ్గర బిర్లా గారి సోలార్ ప్లాంట్‌లో వుద్యోగానికి వెళ్ళి, ఏడాది చేసాకా, అది మూసేసారు, దాంతో వాళ్ళ అన్నయ్య, అంటే మా అశ్విన్ కోప్పడి. ‘యూ.ఎస్. వెళ్ళి మాస్టర్స్ చేయాల్సిందే’ అని వాడి చేత అప్లయి చేయించాడు.

మొదటిసారి అశ్విన్‌ని అమెరికా పంపడానికి, వీసాకి అప్లయి చెయ్యడానికి, నా ఎకౌంట్‌లో 15 లక్షలు లేకపోతే శ్రీమిత్రా ప్రసాద్ అనే మిత్రుడు తన డబ్బు నా ఎకౌంట్‌లో వేసి చూపెట్టినప్పుడు నేనేంతో సిగ్గు పడ్డాను. ఆ తర్వాత పట్టుదలగా, డబ్బు సంపాదన మీద మనసుపెట్టి సంపాదించాను. కృష్ణ యూ.ఎస్. విసాకి వెళ్ళేటప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా, నా ఎకౌంట్‌లో చాలా డబ్బు వుంది. వీసాకి వెళ్ళే రోజు నేను గుడికి వెళ్ళి సాయిబాబాకి కొబ్బరికాయ కొట్టి, కొంచెం టెన్షన్  పడ్డాను. అప్పుడు అరవింద్ గారు నాతో “మన చిరంజీవి గారు టూరిజమ్ మినిస్టర్, నేను హెల్ప్ చేయిస్తా… అన్నింటికీ అంత కంగారెందుకండీ?” అన్నారు. ఆ మాటకే నేనెంతో మురిసిపోయాను. కానీ ఎవరి సాయం అక్కర్లేకుండానే, కృష్ణకి వెళ్ళిన మొదటిసారే వీసా వచ్చేసింది.

అప్పుడు వంగూరి చిట్టెన్‌రాజు గారు తన ‘అమెరికా కాలక్షేపం కథలు’ టీవీ కోసం సీరియల్‌గా తియ్యాలని అనుకుని, నన్నూ, రేలంగి నరసింహారావు గారినీ, భువనచంద్రగారినీ, వంగూరి సదస్సుకి ఆహ్వానించారు. నేను ఎందుకనో వెళ్ళలేకపోయా. వెళ్తే భువనచంద్ర గారితో 2013లోనే స్నేహం అయి వుండేది.

ఆ తర్వాత కృష్ణ వెళ్తుంటే నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి – వి.ఎన్. ఆదిత్యని డైరక్టర్‌గా పెట్టి అవే కథలు తియ్యాలని, నన్ను స్క్రీన్ ప్లే చెయ్యమని ఆయన టికెట్స్ పంపించారు. మా రెగ్యులర్ ట్రావెల్ ఏజంట్ గణేష్ కాకుండా, ఆదిత్య తనకి తెలిసిన వేరే ట్రావెల్ ఏజంట్ ద్వారా బుక్ చేయించడం, అందులో చాలా గోల్‌మాల్ జరగడం, చిట్టెన్‍రాజు గారికి కాస్త చిరాకు కలగడం, వ్యయం అధికం అవడం ఇవన్నీ జరిగాయి. అయినా కూడా నేను కృష్ణతో బాటు యూ.ఎస్. వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. వెళ్ళేది ఫాల్ కాబట్టి, ర్యాలీలో చలి జోరుగా వుంటుందని, చలి దుస్తులూ, షూస్, గ్లౌజెస్ అవీ కొనుక్కుని షాపింగ్ చేసాం.

మా కృష్ణ “అమ్మా, తిరుపతి నడిచి ఎక్కి గుండు కొట్టించుకుంటాను” అన్నాడు. సరే, పిల్లాడు అలా మొక్కుకున్నాడేమో అని, మేం మా కారులోనే, డ్రైవర్ కుమార్‌తో తిరుపతి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు డొక్కా ఫణి ఫోన్ చేసి “అక్కా, ర్యాలీ అంటే మన హైదరాబాద్ – విజయవాడలాగా. మొదట నా దగ్గరకే రండి… నేను తీసుకెళ్ళి దింపుతానూ, నిన్నూ కృష్ణనీ” అన్నాడు. నేను మా ఆయనా తిరుపతి పై దాకా కారులోనే వెళ్ళాము. దర్శనానికి పిఆర్‌పి వాళ్ళు హెల్ప్ చేసారు. రామానాయుడి గారి కాటేజ్‌లో దిగాం. పొద్దుటే సుప్రభాత సేవ, అరగంట సేపు డ్రైవర్‍తో పాటు స్వామి సన్నిధిలో కూర్చుని దర్శనం చేసుకున్నాం. కృష్ణ తను మాత్రం నడిచి కొండెక్కి, గుండు కొట్టించుకున్నాడు. కాణిపాకం, అలువేలు మంగాపురం కూడా వెళ్ళాం. తిరుగు ప్రయాణంలో పెద్ద దర్గా, కడప దగ్గర వుంది, అక్కడ ఆగాం. వాళ్ళ ఆచారం ప్రకారం మగవాళ్ళందరికీ తలల మీద టోపీలిచ్చారు. నేను తల మీద బట్ట కప్పుకున్నాను. చాలా చక్కగా దర్శనం జరిగి ఆనందంగా కారులో ఇంటికి తిరిగి వచ్చాం. ఇంకో పదిహేను రోజుల్లో మా అమెరికా ప్రయాణం.

వచ్చిన మరునాడు కృష్ణనీ, కారు డ్రైవర్‌నీ తీసుకుని, ఏదో పని మీద మావారు జహీరాబాద్ వెళ్ళారు. కృష్ణ మహీంద్రాలో ఆయన దగ్గరే ట్రెయినీగా చేసాడు. వీళ్ళిద్దరూ ఆయన ఆఫీసుకి వెళ్ళగానే బీదర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్‍కి వెళ్ళొచ్చారట. ఇంటర్మీడియట్‌లో వుండగా నేనూ వెళ్ళాను ఆ టెంపుల్‌కి. పీక లోతు నీళ్ళల్లో వెళ్ళాలి గుహలో, పైన గబ్బిలాలు మన తలల మీద నుండి తిరుగుతుంటాయి. అలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారట. ఈలోగా ఈయన కంగారు పడి నాకు ఫోన్ చేయడం, నేను కృష్ణని కోప్పడడం అయింది.

ఆ రాత్రి డ్రైవర్ కృష్ణనీ, ఈయననీ తీసుకుని వచ్చేసాడు. బయట చలిగా వుంది. “వేడి వేడిగా భోజనం చేసి, పడుకుందాం త్వరగా” అని వంట చేసేసాను. నలుగురం తినేసాం. కృష్ణ మా కింద పోర్షన్‌లో పడుకుంటాడు. మా దగ్గరే మా ఆడపడుచుంటారు. వాళ్ళ అత్తకి సాయంగా వీడూ అక్కడే పడుకుంటాడు. అలాగే వెళ్ళిపోయాడు. అశ్విన్ ఎప్పుడూ రాత్రి ఒంటిగంట దాకా మెలకువగా వుండి, పగలు ఉద్యోగం కాబట్టి వర్క్ అవుట్స్ అవీ చేసి, పడుకుంటాడు. నేనూ, ఈయనా త్వరగా నిద్రపోయాం. మంచి నిద్రలో వుండగా, తలుపు కొట్టి “అమ్మా, అమ్మా” అని నెమ్మదిగా పిలుస్తున్నాడు అశ్విన్. నేను లేచి తలుపు దగ్గరేసి, కళ్ళు నులుపుకుంటూ బయటకి వస్తే, “అమ్మా… భయపడకూ, తమ్ముడు బండి మీద నుండి పడ్డాడు… ఏక్సిడెంట్ అయింది… ఏమీ కాలేదు… ఏమీ కాలేదు…” అంటున్నాడు. నేను “ఎక్కడున్నాడూ?” అని అరిచాను. “కింద ఇంట్లో పడుకోపెట్టి వచ్చాను” అన్నాడు.  నేను ఏడుస్తూ పరిగెత్తాను. పళ్ళు రెండు ఊడి, మొహం అంతా నెత్తురు. నేను వాడి తల వైపు చూసాను. తలనీలాలు ఇచ్చి రెండు రోజులే అయింది. నున్నటి గుండు.

“ఎలారా? అసలు పడుకోకుండా ఎక్కడికి వెళ్ళావు?” అన్నాను ఏడుస్తూ.

“సుశాంత్ రమ్మన్నాడు… మన సందు చివరే. ఒకడొచ్చి డాష్ ఇచ్చాడు… చేతి మీద ఆపుకున్నాను తలకి తగలకుండా” అన్నాడు. కృష్ణ చాలా మొండివాడు. చిన్నప్పటి నుండీ ఎంత నెప్పైనా, భరిస్తాడే కానీ చెప్పడు! అదే భయం వాడితో.

“అమ్మా ఫ్రాక్చర్ లేదు… పౌలోమీలో చూపించాను…. మీరు యూ.ఎస్. వెళ్ళచ్చు” అంటున్నాడు అశ్విన్. మా ఆయనకి ఆ రాత్రి చెప్పలేదు! తెల్లారాక చెప్పాను. ఆ రాత్రి మా పాలిట కాళరాత్రే అయింది. పొద్దుటే నాకు తెలిసిన డెంటిస్ట్ డా. కృష్ణారావు గారని, మా ‘అందరి బంధువయా’లో వేషం వేసారు, ఫైనాన్స్ కూడా చేసారు, ఆయన క్లినిక్‌కి తీసుకెళ్ళాను. ఆయన “నేను ఫైన్‌గా ఇంప్లాంట్స్ పెడ్తాగా…” అని చెక్ చేస్తూ… “అబ్బాయి చేతికి స్వెల్లింగ్ వుంది. ఫ్రాక్చర్ వున్నట్టే వుంది!” అన్నారు.

నేనప్పుడు ఎక్స్‌రే చూసి, ప్రాక్చర్ లేదన్న ఆ పౌలోమీ డ్యూటీ డాక్టర్ దగ్గరకి వెళ్తే అతను రాలేదని తెలిసింది. మా ఆపద్బాంధవుడు డా. ఆర్.టి.ఎస్. నాయక్‌గారికి ఫోన్ చేసి అపోలో హైదర్‌గుడా తీసుకువెళ్ళాను. ఆయన అసిస్టెంట్ డాక్టర్ ఉదయార్క వుంది. నన్ను పిన్నీ అనీ, వీడిని తమ్ముడనీ అంటుంది. చకచకా డా. హరిశర్మ గారికి చూపించింది. ఆయన చూస్తూనే “మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వున్నాయి ఈ అబ్బాయి రిస్ట్‌లో, ఆపరేషన్ వెంటనే చెయ్యాలి” అన్నారు. “మరి వాడి సీటూ?” అన్నాను. “మీకు వాడి అమెరికా సీటు ముఖ్యమైతే అలాగే పంపించెయ్యండి… ఆపరేషన్ కూడా వద్దు!” అని ఆయన నా మీద కోప్పడ్డారు. కృష్ణ కూడా ఏడ్చాడు డిసప్పాయింట్‌మెంట్‌తో. పాతికేళ్ళ కొడుకు కంట తడి పెట్టడం ఏ కన్న తల్లి ఓర్చుకోగలదు? నేను వెక్కి వెక్కి ఏడ్చాను. నాయక్ గారు అప్పుడు నార్కట్‌పల్లి అపోలోకి వెళ్ళారు. ఉదయ నన్నూ, వాడిని ఇద్దరినీ దగ్గరికీ తీసుకుని ఓదార్చింది “ఏం కాదు కృష్ణా… డిఫర్ చేసుకో సీట్… ఆర్నెల్లు ఎంతలోకీ గడుస్తాయి?” అని. కృష్ణ ముందే రూమ్ చూసుకోవడం వల్ల రూమ్‌మేట్‌కి ఫోన్ చేస్తే, “వచ్చెయ్యి, నేను చూసుకుంటా” అంటాడు అతను. వీడు “ఏం కాదు, వెళ్ళిపోతాను” అనీ…!! ఆదిత్య ఫ్రెండ్ మూర్తీ చెంగల్వల “పంపించండి, నేను వున్నాగా” అంటాడు. మా పెద్దవాడు “నా తమ్ముడి కన్నా ఈ చదువలవీ ఇంపార్టెంట్ కాదు… పంపను” అని గట్టిగా చెప్పి, తను మాట్లాడి స్ప్రింగ్‌కి డిఫర్ చేయించేడట్లు చేసిన ఘనత మా పెద్దవాడిదే.

డా. నాయక్, డా. ఉదయ, అరవింద్ గార్లతో

మా వారికి అసలే చిన్నాడంటే ప్రాణం… ఆయన తల్లడిల్లిపోయారు. చాలా బ్యాడ్ డేస్ అవి!

డా. హరిశర్మ గారు ఆపరేషన్ చేసారు. మా డాక్టర్ ఫ్రెండ్ ఒమేగా మోహన్ వంశీ అంటారు “హరిశర్మ గారి లాంటి ఆర్థోపెడిక్ సర్జన్ ఇండియాలోనే వుండరు” అని. హరిశర్మ గారు సర్జరీ చేసి నా పిల్లాడ్ని నాకిచ్చారు. ఆ సమయంలో నా పిల్లాడు ఆర్నెల్లు పడిన మానసిక వేదనా, డిప్రెషన్ నేను జన్మలో మరిచిపోలేను! అసలు ట్రావెల్ ఏజంట్ గణేష్‌ని మార్చడమే, మా ప్రయాణం వాయిదా పడడానికి కారణం అని నేను సెంటిమెంటల్‌గా ఫీల్ అయ్యాను. దాంతో నా ప్రయాణం కాన్సిల్ అయింది. సర్జరీ తర్వాత హరిశర్మ గారు చెప్పినట్లే, వాడి చెయ్యి కట్టు విప్పడానికి నాలుగు నెలలూ, కోలుకోవడానికి ఇంకో నెలా, ఐదు నెలలు నిండుగా పట్టాయి. డా. కృష్ణారావు గారి ధర్మమా అని పళ్ళూ చక్కగా వున్నాయి. నేను సెన్సార్ ఆఫీసర్‌తో సెన్సార్ బోర్డ్ మెంబరుగా నానా కష్టాలూ ఎదుర్కొంటున్న పీరియడ్ అది!

“మీరు సినిమా చూడ్డానికొచ్చారు. ఒంటరిగా వున్న మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో! అసలే డిప్రెషన్‌లో వుంటాడు” అని సానుభూతి చూపిస్తున్నట్లే, మనశ్శాంతి లేకుండా చేసేది మా సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్! భయం వేసి ఏం చేసుకుంటాడో అని నేను ఇంటికి పరిగెత్తేదాన్ని, వాడిని నా కంటి చూపు నుండి పక్కకి వెళ్ళకుండా కనిపెట్టుకుని వుండేదాన్ని! మా అశ్విన్ తమ్ముడికి ఎంతో కౌన్సిలింగ్ చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. తమ్ముడు ఎమ్.ఎస్. చేసి అమెరికాలో జాబ్ చేసేట్టు చేసిన ఘనత మా పెద్దవాడిదే!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here