ప్రియస్వప్న

2
3

[box type=’note’ fontsize=’16’] తమ దాంపత్యంలో చెలరేగిన అపోహలను, కలతలను ఓ బందువు సాయంతో ఆ భర్త ఎదుర్కున్న వైనాన్ని బొందల నాగేశ్వరరావు రచించిన ఈ హాస్య నాటిక చెబుతుంది. [/box]

ఇందులో…

  • చక్రవర్తి (కథానాయకుడు) – వయస్సు 30 సం.
  • సంధ్య (చక్రవర్తి భార్య) – 25 సం.
  • చిదంబరం (సంధ్యకు బాబాయ్) – 60 సం.
  • దామోదరం (చక్రవర్తికి తండ్రి) – 60 సం.
  • బుజ్జిగాడు (చిదంబరానికి కొడుకు) – 30 సం.

(తెర లేస్తూనే అదో ఇంటి హాలు. అన్ని హంగులతో అందంగా మొదటి తరగతికి చెందినదై కనబడుతుంది. హాల్లో ప్రేక్షకులకు అభిముఖంగా రెండు పడక గదులకు వెళ్ళే ద్వారాలు. ఓ ద్వారం పైన ఓ బోసి నవ్వుల బాబు ఫోటో, ఇంకో ద్వారం మీద భార్యభర్తలు కలిసి తీసుకొన్న ఫోటోలు వుంటాయి. హాలుకు నడుమ ఓ టీపాయ్. దానిమీద కొన్ని పత్రికలు. టీపాయికి మూడు వైపుల ఓ సోఫాసెట్ వుంటుంది. ఓ మూల్లో డ్రసింగ్ టేబుల్, మరో మూల్లో టెలిఫోను వున్నాయి.

అప్పుడు ఆలుమగలైన చక్రవర్తి, సంధ్యలు వ్యానులో బడికి వెళుతున్న వాళ్ళ బాబాకు గుమ్మం వద్ద నిలబడి ‘టాటా’ చెప్పి వెనుదిరుగుతారు. సంధ్య పడగ్గదిలోకి వెళుతుంది. చక్రవర్తి చేతికున్న వాచీ చూసుకొని డ్రసింగ్ టేబుల్ ముందు నిలబడి తల దువ్వుకున్నాడు. ఈల వేస్తూ పౌడరు రాసుకొని పడగ్గది వేపు చూస్తూ)

చక్రవర్తి : సంధ్యా… సంధ్యా(కాస్త పెద్దగా) సతీ సంధ్యారాణీ!

సంధ్యారాణి: (చేత షర్టును పట్టుకొని వస్తూ) అబ్బబ్బా… ఏమిటండీ… ఆ గావు కేకలు… లోపల నేనేం వూరికే లేను. మీ షర్టుకు ఇస్త్రీ వేస్తున్నా… ఇందా!

చక్ర : (షర్టు వేసుకొని బట్టన్సు పెట్టుకుంటూ) ఆగ్రహించకు సంధ్యా! ఇప్పుడు సమయంబు తొమ్మిది గంటల ముప్పది నిముషంబులాయె! కార్యాలయమునకు ఆలస్యంబుగా నేగుట తగునా? అందుకు అధికారులు ఒప్పుకొందురా? నుడువుము.

సంధ్య: అయ్యా… కవిగారూ! కాస్త మీ కవిత్వపు ధోరణి మాటల్ని కట్టి పెట్టి కాస్త ఈ ప్రపంచంలోకి రండి.

చక్ర: చిరాకెందుకే బేలా! విషయంబేమిటో విన్నవించుకోరాదా ?

సంధ్య: (చిరు కోపంతో)ఏమండోయ్! నేను మీ భార్యను. నాతో కాస్త మామూలుగా మాట్లాడండి.

చక్ర : అలాగే విషయమేమిటి? (కౌగిలికి తీసుకొన్నాడు)

సంధ్య: (గొంతు పెంచి)ఏమిటిది… ఏమిటిది? వదలండి ప్లీజ్… !

చక్ర :(వదిలి పెట్టి) సారీ సంధ్యా! మూడొచ్చేసిందోయ్!

సంధ్య: ఆఁ… రాదు మరి. ఏ బాదరాబందీ లేకుండా వండి వారుస్తుంటే… లక్షణంగా తింటూ హాయిగా వుంటున్నారుగా… అదీ సంగతి. సరే!… సాయంత్రం ఆఫీసవుతూనే ఇంటికొస్తారా లేక ఇంకెక్కడికైనా ప్రోగ్రాం వుందా? ( వెళ్ళి ‘షూ’ తెచ్చి యిచ్చింది)

చక్ర: ఊహు… ఏ ప్రోగ్రామూ లేదు. ఆఫీసవుతూనే సరాసరి సంధ్యారాణి గారి సన్నిధి కొచ్చేయడమే! (దగ్గరకు లాక్కొన్నాడు)

సంధ్య: (హెచ్చరింపుగా) ఊఁ లాక్కండి. ఏమిటీ వేషాలు? తప్పుకొండి… మీకు ‘టై’ తెస్తాను. (లోనికెళ్ళి  ‘టై’ తెచ్చింది. చక్రవర్తి’ టై’ కట్టుకొంటున్నాడు, సంధ్య తన్ను తాను మరచిపోయి చక్రవర్తిని తదేకంగా చూస్తుంది)

చక్ర : సంధ్యా! (పెద్దగా )సంధ్యా!…

సంధ్య : (వులిక్కి పడి) ఆఁ…

చక్ర : ఏమిటోయ్… ఏమైంది నీకు? అలా చూస్తుండిపోయావ్! నువ్వలా నన్ను కళ్ళలోకి చూస్తూ కట్టి పడేస్తే యెలా! నేను ఆఫీసుకు వెళ్ళనక్కరలేదా? అయితే చెప్పు. ఇవాల్టికి సెలవుపెట్టేసి… ఇక్కడే… (సోఫాలో కూర్చొన్నాడు)

సంధ్య : (అక్కడే వున్న టిఫన్ బాక్సును బ్రీఫ్ కేసులో వుంచి) బాబ్బాబూ! మీకో నమస్కారం. ఇక దయ చేయండి.

చక్ర : ఆఁ … అలాగే! వెళ్ళోస్తా సంధ్యా!(చక్రవర్తి ఒకడుగు ముందుకేశాడు)

సంధ్య : ఏమండీ…!

చక్ర : ఏమిటి సంధ్యా!

సంధ్య : కాస్త యిలా రండి.

చక్ర : (దగ్గరకొచ్చి) ఏమిటమ్మా?

సంధ్య : (తేరి పారజూసి) మీరివాళ చాలా అందంగా వున్నారండి.

చక్ర : బ్రతికించావురా భగవంతుడా! ఈ మాట చెప్పటానికేనా పిలిచింది. నేనింకేదో అనుకున్నా! (‘టై’ సర్దుకొన్నాడు. గర్వంగా ఫీలవుతూ) ఇంతకీ… నా అందానికి నువ్వదోలా అయిపోయినట్టున్నావ్! కదూ?

సంధ్య : ఏమీ కాలేదులే !వూరికే అన్నాను! ఆఁ… ఏమండీ!మీ… మీ ఆఫీసులో…

చక్ర : ఆఁ.. చెప్పు. మా ఆఫీసులో…

సంధ్య : (ఆలోచన ధోరణితో) ఆడవాళ్ళు….

చక్ర : ఐదుగురున్నారు. ఇహ వాళ్ళ పేర్లు… వరుసగా సుధ, రాధ, సీత, గీత. (ఆలోచిస్తూ) ఆ… ఇంకెవరున్నారబ్బా! ఆఁ. . ఆఁ… కంప్యూటరాపరేటరు లత. ఇంకా….

సంధ్య : ఇంకా వరున్నారండి… ఐదుగురేనన్నారుగా!

చక్ర : అవునవును. ఐదుగురేనని చెప్పాను కదూ!

సంధ్య : అందరూ పెళ్ళయినవారే కదండీ?

చక్ర : ఎవడా అంది? ముగ్గురికి మాత్రమే పెళ్ళయ్యింది. అవును. ఏమిటీ విషయం? నువ్వేదో పోలీసాఫీసర్ లాగా అరా తీస్తున్నావ్? అయినా మా ఆఫీసు గోల నీకెందుకే సంధ్యా!

సంధ్య : అన్నట్టు నాకెందుకూ వంటింట్లో పడుండేదాన్ని. అబ్బే! వూరికే అడిగానులెండి. ఆఁ! అన్నట్టు… లంచ్ అందరూ ఒకే చోట తీసుకుంటారు కదండీ?

చక్ర : కాదు. ఆడవాళ్ళు ఆఫీసరు గదికి అటువైపు. మగవాళ్ళమంతా ఇటువైపు. అయినా ఆఫీసరు గదికున్న అద్దాల్లోంచి వాళ్ళను వీళ్ళు, వీళ్ళను వాళ్ళు ఏంచక్కా చూసుకోవచ్చు. అవునూ… ఈ వివరాలన్నీ నీకెందుకమ్మా?

సంధ్య: అన్నట్టు నాకెందుకూ! వూరికే అడిగానులెండి! చూడండీ! మరేమో… మరేమో ఈ కాలంలో చాలామంది మగాళ్లు ఎంతో సులువుగా ఆడాళ్ళ వల్లో పడిపోతారటండీ… అలాగని… శాంతమ్మ పిన్నిగారు నాతో చెప్పారు! వుంది… వుందండీ… మీ మీద నాకా నమ్మకం వుంది.

చక్ర: ఏమిటీ… ఆడాళ్ళ వల్లో పడిపోతాననా?

సంధ్య: కాదండీ! శ్రీరామచంద్రుల్లా ఏకపత్నీవ్రతులుగా నాతో వుండి పోతారని. ఏమైనా అలాంటి పోకిరి ఆడాళ్ళు మిమ్మల్ని వల్లో వేసుకోను ప్రయత్నించరటండీ!… అందుకనీ…

చక్ర: సంధ్యా… సంధ్యా… అర్థమైంది. నాకిప్పుడంతా అర్థమైంది. నువ్వు లాగబోతున్న’లా’ పాయింటేమిటో నన్నది బాగా అర్థమైంది. నిజం చెపుతున్నా సంధ్యా! నాకు పెళ్ళికాక ముందు నేనెవర్ని ప్రేమించలేదు. ఈ ప్రభుత్వపు ఆఫీసులో అసిస్టంటు మేనేజర్ను అయిన తరువాత కూడా నేను ప్రేమలో పడలేదు. చివరిగా నిన్ను పెళ్ళాడి నా దాన్ని చేసుకొన్నాక… .

సంధ్య: ఆ… చేసుకొన్నాక…!?

చక్ర : అనగా నీమెళ్ళో ఆ మూడు ముళ్ళు వేసింతరువాత… నా మనసారా…

సంధ్య: ఆఁ మీ మనసారా… చెప్పండి… చెప్పండి!

చక్ర: ప్రేమించాను… ప్రేమిస్తున్నాను… ఇకపై కూడా ప్రేమిస్తాను.

సంధ్య : (ఏడుపు ముఖంతో) ఏమండీ… మీరు… మీరు… ఏదో అయి పోయారండి. కాకపోతే కట్టుకున్న పెళ్ళాన్ని నిండుగా మీముందు నేనుండగా నాకు కాని మాట నాతోనే చెపుతారా? మీరు ఎవర్తి వల్లోనో పడిపోయారు. ఒప్పుకోనండి… నేనస్సలొప్పుకోను. దాన్ని… దాన్ని… కత్తి పీటతో నరికి పారేస్తాను. కొబ్బరి తురిమినట్టు తురిమి పారేస్తాను. ఎవతి… అదెవతో చెప్పండి. దాని సంగతి యిప్పుడే తేలుస్తాను.

చక్ర : (పెద్దగా) సంధ్యా… ఏమిటలా వూగిపోతున్నావ్? అబ్బబ్బా… ఆఫీసుకు పోతున్నవాణ్ణి పిలిచి గొడవ పెట్టుకొంటావేమిటి? రా… చూపిస్తాను. రా… చూడు… నేను ప్రేమిస్తున్న నా ప్రేయసిని… ఈ అద్దంలో చూడు.

సంధ్య : ఇదా… ఇది… నా ప్రతిబింబమండీ!

చక్ర : ఆఁ. దాన్నే… ఆ నీ ప్రతిబింబాన్నే! అంటే నిన్నే… నేను యిన్నాళ్ళు భార్యగా చేసుకొని ప్రేమిస్తుంది.

సంధ్య: (గోముగా) సారీ అండీ! నా మనసే అంత. మిమ్మల్ని తప్పుగా అనుకొన్నందుకు నన్ను క్షమించరాండీ?!

చక్ర: పాపం సంధ్యా నువ్వు! నీ గురించి నాకు బాగా తెలుసు!(దగ్గరకు లాక్కొని)నీ కల్మషం లేని సున్నితమైన నీ మనసులో పూర్తిగా నేనే వున్నాను. ఆ నేను ఏ పొరపాటు చేయగూడదనీ నీ ఆకాంక్ష. చూడూ! నిన్నూ, నీ అమాయకత్వాన్ని బాగా అర్థం చేసుకొన్న నేను నీకెప్పుడూ కనీసం కల్లో కూడా ద్రోహం తలపెట్టలేను. ఇది నిజం సంధ్యా!

సంధ్య : అవునండి. నాకు అదే కావాలి. మీ గురించి కనీసం చెడుగా విన్నా నేను తట్టుకోలేను… మీరెప్పుడూ నా వారే! నాకే స్వంతం.

చక్ర : అలాగే సంధ్యా!( దగ్గరకు తీసుకొన్నాడు.)

సంధ్య: ఏమిటిది? ఆఫీసుకు టైమైందండీ! బయలుదేరండి. ప్లీజ్!

చక్ర : అలాగే!(బ్రీఫ్‌కేసు తీసుకొని వెళ్ళి పోయాడు. అతన్నే చూస్తూ వంటింట్లోకి నడిచింది సంధ్య. అప్పుడు సంధ్య బాబాయ్ చిదంబరం, ఆయన కొడుకు బుజ్జిగాడితో పెట్టె బేడతో బయటి నుంచి హాల్లోకి ప్రవేశించారు. ఇప్పుటికి నిక్కర్లు తొడుక్కొనే బుజ్జిగాడికి నోట్లో వ్రేలు వేసుకోవడం అలవాటు)

చిద: (నోటిలోని వ్రేలును తప్పించి) ఏరా బుజ్జిగా! ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే! (ఒకసెకనాగి) మాట్లాడవేరా?

బుజ్జిగాడు : (అటు ఇంట్లోకి చూశాడు) అవును నాన్నోయ్ !ఎవరూ లేరు.

చిద :(తలమీద మొట్టి) లోపల అక్కయ్య ఉందేమో చూసి పిలవరా!

బుజ్జి : సందెక్కా… .

చిద : అమ్మా సంధ్యా… !

బుజ్జి : ఓ సందెక్కోయ్ … !

సంధ్య : ( లోపలినుంచి) ఆఁ… వస్తున్నా!(వస్తూ) ఎవరూ?

బుజ్జి : మేమేనక్కా! ఊర తిండిబోతులం!

చిద : (నోటిని మూస్తూ)నోరు మూసుకోరా వెధవ. ఏమిటా పిచ్చికూతలూ!

సంధ్య : (వచ్చి చూసి)అరే… చిదంబరం బాబాయ్, బుజ్జిగాడు! ఎప్పుడొచ్చారు? వున్నట్టుండి వూడి పడ్డారే! పిన్ని కులాసాగా వుందా బాబాయ్!

చిద : పిన్ని… దానికేం నిక్షేపంగా వుంది. ఏటొచ్చి నా ఖర్మ… నాకే అన్నీనూ. ఇక చచ్చినా దాని మొహం చూడనమ్మా! అయినా భర్తనన్న మర్యాద కూడా లేకుండా నన్ను ఎంతలేసి మాటలందో తెలుసా?

సంధ్య: అంటే… మళ్ళీ పిన్ని మీతో తగాదా పెట్టుకొందన్న మాట!

చిద: పిన్నా… అది నీకు !నాకు బ్రహ్మరాక్షసి.

బుజ్జి: జీరంగి. ఇద్దుం బస్తా!ఇంకా… .

చిద: ఇంకా… ఇంకా… ఎక్సట్రాలన్నీ అదేనమ్మా! లేకపోతే… ఈ వయస్సులో… ఈ వయస్సులో ఆ రాక్షసి నన్ను…

బుజ్జి: అదేనక్కా… మనమ్మ నాన్ననీ…

సంధ్య: ఏమంది బాబాయ్!

చిద: నువ్వేమీ అనుకోవుగా?!

బుజ్జి: నాన్నోయ్… మన సందెక్కేగా… చెప్పేయ్… ఏమీ అనుకోదులే!

చిద: అదేనమ్మా! నువ్వూ ఆడదానివేగా! అందుకే సంశయిస్తున్నా. చూడు తల్లీ! మీ ఆడజాతుంది చూశావూ… ఒఠ్ఠి అనుమానపు జాతమ్మా! మొదట సందేహం పుట్టి…

బుజ్జి: నాన్నోయ్ తప్పు! మొదట ఆడోళ్ళు పుట్టి…

చిద: నువ్వూరుకోరా వెధవ. ఏదో ఒకటిగాని!

బుజ్జి: నాన్నోయ్! నన్ను మాటిమాటికి ఇలా వెధవని తిట్టావంటే నేనెళ్ళి పోతా! ఆఁ… తెలిసిందా? అసలు నువ్వు నాకు పెళ్ళి చేసి పెడతానని ఇక్కడికి తీసుకొచ్చావ్ గుర్తుందా! ఆఁ..

చిద: అలాగే లేరా బాబూ! నువ్వూరుకో! చూడమ్మా సంధ్యా! నా వయస్సేమిటి… నేనిప్పుడున్న పరిస్థితేమిటి? లేస్తే కూర్చోలేను… కూర్చుంటే… లేవలేను. నాకూ… నాకూ… .

బుజ్జి: అక్కోయ్! నాన్న పాపం! అసలు సంగతేంటంటే… నాన్నకు… నాన్నకు… ఓ చిన్నిల్లుందన్న అనుమానంతో అమ్మ అట్లకాడట్టుకొని బాగా…

చిద:(బుజ్జిగాడి నోరు మూసి) అట్లు పోసిందిలేమ్మా! వాడో నాలుగు నేనో నాలుగు తిని వస్తున్నాం. కదురా?!

బుజ్జి: కాదక్కోయ్! అబధ్ధం. నాన్న చెప్పేదంతా అబధ్ధం. మరేమో…

సంధ్య: అబ్బబ్బా… అసలు జరిగిందేమిటి?మీ ఇద్దరి ధోరణి నాకు పిచ్చెక్కించేస్తుంది. విషయమేమిటో త్వరగా చెప్పండి.

చిద: ఏమీ లేదమ్మా!నాకూ మన పక్కింటి పార్వతమ్మకు అక్రమ సంబంధం అంటకట్టిందమ్మా మీ పిన్ని.

సంధ్య: ఆఁ… ఏమిటేమిటీ… ఆరుగురి పిల్లల రుబ్బుడు పొత్రం, పిప్పిళ్ళ బస్తా ఆ పార్వతమ్మతోనా? అయ్యో పాపం! నిజంగా నడవాలని తను ప్రయత్నించినా పదడుగులు నడవలేదే బాబాయ్! ఆయాసంతో అలాగే కూర్చొంటుంది.

చిద: అదేం లేదులేమ్మా! పట్టు పట్టి నడిచిందంటే పదడుగులేంటి ఖర్మ. వందడుగులైనా సరే ఎంతో నాజూగ్గా, వయ్యారంగా, సునాయాసంగా నడవగలదు. ఆఁ…

బుజ్జి: అక్కోయ్! ఈ మధ్య ఆ పార్వతమ్మ బ్యూటీ పార్లరుకెళ్ళి ఏంచక్కా బాబ్డు హైర్ క్రాపు కూడా చేయించుకొంది. కదూ నాన్నా!

చిద: ఒరేయ్ డిప్పమొహం వెధవా… నువ్వు కాస్త నోర్ముయ్రా!

బుజ్జి: ఏంటీ… నాది డిప్పమొహమా? అయితే నీది చిప్పమొహం పో! నన్నిలా వూరికే తిట్టావంటే నేనెళ్ళిపోతా! నాకు పెళ్ళీ వద్దు… గిల్లీ వద్దు! మనూరెళ్ళి ఎంచక్కా బిళ్ళంగోడు ఆడుకొంటా. ఆఁ!(వెళ్ళబోతాడు)

చిద: నాయన్నాయనా! నా బుజ్జికణ్ణా… ఆగరా బాబూ!(చెయ్యి పట్టుకొని ఆపి) అదమ్మా సంగతి. అందుకని ఇహ చస్తే మీ పిన్ని మొహం చూడదలచుకోలేదు నేను. కనుక…

బుజ్జి: ఇక్కడే వుండి పోవాలని వచ్చేశామక్కా! తిండి ఖర్చుకూడా వుండదని నాతో చెప్పాడు నాన్న! కదూ నాన్నా!

చిద: నా పిండాకూడు… వెధవ తద్దినం!(అప్పుడు సంధ్య నవ్వుతుంది)

బుజ్జి: ఎప్పుడమ్మా? నువ్వు చచ్చిపోతే కదా!

చిద: (కోపంగా) చస్తానులేరా నా బంగారుకొండా!దానికి టైం రావద్దూ!

సంధ్య: సరి సరే! మీరెవరూ చావక్కరలేదు. ఇక్కడే మాతో వుండి పొండి. కాకపోతే అద్దెడు బియ్యంతో పాటు ఇంకో పిడికెడు కలుపుతాలే!

బుజ్జి: అవి చాలవక్కొయ్ !ఇంకో అద్దెడు కలపాలి. కదూనాన్నా!

చిద: (కోపంగా) అబ్బా… (చెయ్యి పైకెత్తి దించి నవ్వుతూ పెట్టే బేడాతో లోనికి దారి తీశాడు. తండ్రిని వెంబడించాడు బుజ్జి. నవ్వుతూ వంట గదిలోకి వెళ్ళి పోయింది సంధ్య. అంతలో చక్రవర్తి తండ్రి దామోదరం కూరల సంచితో లోనికొచ్చి సంచి టీపాయి మీదుంచాడు)

దామోదరం: ఉష్… అబ్బబ్బా! ఏమి ఎండలురా బాబూ!(కండువాతో ముఖం తుడుచుకొని)అమ్మా సంధ్యా! ఈ కూరలు లోనికి తీసుకెళ్ళి నాకు ఓ గ్లాసు మజ్జిగ పట్రామ్మా!

సంధ్య: (లోపలి నుంచే) ఇదిగో… తెస్తున్నాను మామయ్యా!(మజ్జిగ గ్లాసును చేతికిచ్చి కూరలు తీసుకొని లోనికెళ్ళింది. లోపలినుంచి చిదంబరం, బుజ్జిగాడు అల్పాహారం ముగించుకొని త్రేన్చుతూ, చేతులు తుడుచు కొంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూర్చొన్నారు)

దామో: మీరెప్పుడు దిగారండి బావగారూ!. ఏమిటి… మళ్ళీ మా చెల్లెమ్మతో గొడవ పెట్టుకొని వచ్చినట్టున్నారు!

బుజ్జి: అవును మామయ్యా! ఇక మా వూరికి వెళ్ళకూడదన్నట్టుగా వచ్చేశాం!

దామో: అంటే… ఇక ఇక్కడే తిష్ఠవేస్తారన్న మాట. (నవ్వాడు)

బుజ్జి: ఆఁ… చిలకమ్మతో పెళ్ళి చేసి పెడతానన్నాడు మా నాన్న! కదూ నాన్నా!

చిద:(వెకిలిగా నవ్వి) అవునులేరా!

దామో: అన్నట్టు చిలకమ్మ ఎవరండీ బావగారూ!?

చిద: అదే! మన సంగీతండి!ఆ పిల్లనే మా వాడు ముద్దుగా చిలకమ్మని పిలుస్తుంటాడు.

దామో: మా సంగీతా!అదిప్పుడు రెండో సంవత్సరం ఎం.ఏ. చదువుతోందండీ!

బుజ్జి: మామయ్యొయ్ !నేను కూడా ఏడో క్లాసు మూడేళ్ళు చదివా!

చిద: ఏడిశావులే! నోరు మూసుకో!

దామో:(నవ్వి) పోనీలేండి బావగారూ! బుజ్జీ… నీది గట్టి చదువేలే!పోతే బావగారూ!ఏడో క్లాసయినా, ఎం.ఏ. అయినా ఎవరికీ యెలా రాసి పెట్టుంటుందో అలాగే జరుగుతుంది. ఏమంటారు?

బుజ్జి: అయితే చిలకమ్మను నాకు పెళ్ళి చేసి పెట్టరా?

దామో: ఎందుకనీ! ఆ పిల్ల నీకేనని రాసుంటే ఏంచక్కా పెళ్ళి చేసి పెడతా!

బుజ్జి: (ఎగిరి గంతులేస్తూ) హాయ్! నాకు పెళ్ళి. చిలకమ్మతో నాకు పెళ్ళి. అహా నా పెళ్ళంట… ఓహో నా పెళ్ళంట.

చిద: ఒరేయ్ వెర్రి వెధవా! ఆ గంతులేయడం ఆపి ఇటురా! బావగారూ మీరెళ్ళండి(దామోదరం లోనికెళ్ళాడు). (బుజ్జి నెత్తిన మొట్టి) నా పరువు తీయకురా! నా కడుపున చెడబుట్టావ్. పద. (లోనికి నడిచారు)

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

(హాల్లో ఫోన్ రింగవుతుంది. సంధ్యారాణి తల్లో పూలు తురుముకొంటూ వచ్చి ఫోన్ అందుకొంది)

సంధ్య: హల్లో… హల్లో…  ఏస్! సంధ్యనే మాట్లాడుతున్నానండి. ఆఁ… మీ కిష్టమైన లడ్డూలు, పచ్చిమిరప బజ్జీలు చేసి వుంచా! త్వరగా వస్తారు కదూ! ఆఁ అన్నట్టు మరచిపోయానండోయ్! ఊరి నుంచి మా చిదంబరం బాబాయ్, బుజ్జిగాడూ వచ్చారండోయ్! వాళ్ళు కూడా మనతో పాటు సినిమాకు వస్తామంటున్నారు. ఆఁ…. వద్దా… కుదరదండీ!… వాళ్ళు నాకన్న ముందే తయారై కూర్చొన్నారు. ఆఁ… అవును. తప్పక తీసుకు వెళ్ళాలి. ఓకే ! పెట్టేస్తున్నా.

చిద: ఎవరమ్మా ఫోన్లో… అల్లుడుగారేనా? చెప్పావా మా సంగతి! మేము రెడి.

సంధ్య: ఊఁ… చెప్పానులే! మీరూ తయారై వున్నారని.

చిద: నాకు తెలుసమ్మా నువ్వు తప్పకుండా చెబుతావని. పైగా అల్లుడిగారికి తెలుసు నేనో సినిమాల పిచ్చాడ్నని.

బుజ్జి: నాన్నోయ్… నేను రడీ!

చిద: నువ్వు లేకుండానా… నా పిచ్చితండ్రీ! (సంధ్య వాళ్ళిద్దర్ని చూసి పెదాలపైకి నవ్వు తెచ్చుకొంది. అంతలో ఫోన్ మళ్ళీ రింగైంది.)

సంధ్య: హల్లో… ఆఁ సంధ్యనే… అలాగా… ఏమిటండీ మీరంటుంది? ఇంటికొచ్చి వివరంగా చెబుతారా! రావడానికి ఆలస్యమౌతుందా? ఏమిటండీ మీరనేది… మరో రెండు రోజుల్లో వెళ్ళాలా? ఏమాఫీసండీ… పాడాఫీసు… అసలు ఎవరండండీ మీ బాసు? అతగాడికి పెళ్ళాం పిల్లలంటూ ఎవరూ లేరా? ఒఠ్ఠి శాడిస్టులా వున్నాడు. (ఫోన్ కట్టయ్యింది) హల్లో… హల్లో… చీ పాడు! ఫోన్ కట్టయ్యింది. (తల్లో పూలను తీసి టేబుల్ మీద వుంచింది. బాధతో అటు తిరిగింది)

చిద: ఏమిటమ్మా… ఏమైంది? తల్లో పెట్టుకున్న మల్లె పూలను తీసేశావ్? ఇంతకు ఫోన్లో అల్లుడుగారేమన్నారు?

సంధ్య: ఆయనగారికి… ఏక్సిడెంటలుగా…

చిద: ఆక్సిడెంటా… ఓరి భగవంతుడో! అల్లుడుగారికి ఆక్సిడెంటా… ఇంకేముందిరోయ్ దేవుడో! ఎక్కడమ్మా?… ఎలా జరిగిందట?

సంధ్య: ఛీ! ఏమిటి బాబాయ్ మీరు, మీ మాటల తీరు. అసలెప్పుడూ కీడునే శంకిస్తుంటారు పాడు.

చిద: అంటే…

సంధ్య: ఆఫీసులో ఆయనగారికేదో ఏక్సిడెంటలుగా అర్జంటు పనొచ్చి పడిందట. ఆ పనిమీద వారు మరో రెండు రోజుల్లో వూరెళ్ళాలట.

చిద: ఓస్… అంతేనా! నేనేదో అనుకొని కంగారు పడ్డానమ్మా!-

బుజ్జి: అయితే సినిమా ప్రోగ్రామ్ లేనట్టేనా అక్కా !

సంధ్య: మీకుందిలేరా బుజ్జీ! బాబాయ్… ఇంద డబ్బు. మీరెళ్ళి రండి.

చిద: నా తల్లే… నువ్వు నా బంగారం. ఆఁ పదరా బుజ్జి!(బయటికి వెళ్ళి పోయారు. సంధ్య హాల్లో అటూ యిటూ పచార్లు చేసి పడగ్గదిలోకి వెళ్ళి పోయింది. అప్పుడు గోడ గడియారం ఏనిమిది సార్లు మోగింది.)

చక్ర: (లోనికి ప్రవేశించి చేతిలో వున్న బ్రీఫ్ కేసును టీపాయిమీద గీరాటేసి కూర్చొని ‘టై’ విప్పుకొంటూ) సంధ్యా… సంధ్యా…!

సంధ్య: (లోపలినుంచే) ఆఁ … ఏమిటీ?

చక్ర: కాసిన్ని మంచి నీళ్ళు తీసుకురా!

సంధ్య: మంచినీళ్ళా… మీరే వచ్చి తీసుకు తాగండి.

చక్ర: ఏమిటి… ఏదో కోపంగా వున్నట్టున్నావ్! ఇదిగో… నీకు అసలు సంగతి తెలిస్తే పరిగేత్తుకొంటూ వస్తావ్!

సంధ్య: (పరిగెత్తినట్టు వచ్చి) ఏమన్నారు? ఏదో … సంగతంటున్నారు.

చక్ర: అదా… అదీ… అదీ… మనం విడిపోయే రోజొచ్చింది సంధ్యా!

సంధ్య: (ఆశ్చర్యంతో) ఆఁ మనం విడిపోతున్నామా!? ఏమిటండి మీరంటుంది?

చక్ర: చెప్పానుగా!మా బాసుగాడు లేడూ… అర్జున్ రావని. వాడు మనల్ని విడదీయాలనుకొన్నాడు. ఢిల్లీలో వుందే మా బ్రాంచ్ ఆఫీసులో ఏవో లొసుగులు జరిగాయట. వాటిని సెట్ రైట్ చేసే నిమిత్తం ఓ ఆరునెల్లు డెపుటేషన్ మీద నేనక్కడ వుండాలట. పెళ్ళాం పిల్లాడెలా సార్ అంటే… ఓ ఆరునెల్లేగా బ్రహ్మాండంగా బ్రహ్మచారివై హాయిగా వుండి రావయ్యా చక్రవర్తీ… అని చావు కబురు చల్లగా చెప్పి ఆర్డర్లు చేతిలో వుంచాడు.

సంధ్య: ఏమిటీ… ఢిల్లీకి వెళ్ళమని ఆర్డర్లు యిచ్చారా! అయినెవరండీ మిమ్మల్ని బ్రహ్మచారిగా వుండమనడానికి.

చక్ర: మన బాసు. అయినా ఓ ఆరునెల్లేగా సంధ్యా! ఎందుకలా గాబరా పడిపోతావ్!

సంధ్య: ఆహా… ఆరునెల్లేగా అని ఎంత తేలిగ్గా అన్నారండి. ఆరునెల్లు మిమ్మల్ని విడిచి పెట్టి వుండడం నాకు ఆరు యుగాలనిపిస్తుంది. నా వల్ల కాదండి.

చక్ర: కాదంటే యెలా సంధ్యా! ఇది ఆఫీసు వ్యవహారం. వెళ్ళనంటే నన్ను ఇంటికి పంపించేస్తాడు ఆ బాసు. పైగా అక్కడ జరిగిన లొసుగులను సరి చేయటానికి నేనే సరైన సమర్థుడనట. తప్పదన్నాడు. తప్పించుకోలేక పోయాను. పోనీ… తప్పించుకునేందుకు ఏదైనా మార్గముంటే నువ్వే చెప్పు! నేనూ ఆలోచిస్తా! (సోఫాలో చెరో చివర ఆలోచనా ధోరణితో కూర్చొన్నారు. అంతలో చక్రవర్తి తండ్రి దామోదరం లోనికొచ్చాడు)

దామో: ఏమిట్రా! ఏదో పోగొట్టుకున్నట్టు సోఫాలో చెరో ప్రక్క కూర్చుండి పోయారు?

చక్ర: (బాధతో)మరే…. మరే నాన్నా …

సంధ్య: మరేమో మామగారూ… . వారిని… వారిని (వెక్కివెక్కి ఏడ్చింది)

దామో: ఏమైందమ్మా! విషయాన్ని చెప్పకుండా అలా వెక్కి వెక్కి ఏడిస్తే నాకెలా తెలుస్తుంది? ఏమైందో చెప్పండి?

సంధ్య: మరి… మరి మామగారూ! మీ అబ్బాయిని ఆఫీసు పనిమీద ఢీల్లీ వెళ్ళమన్నారట. తప్పదని మరీ చెప్పి ఆర్డర్లు కూడా యిచ్చారట.

చక్ర: అవును నాన్నా! మా పెళ్ళయిన తరువాత సంధ్యను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా నేను దూరంగా వుండలేదు. వున్నట్టుండి నన్నలా వెళ్ళమంటే నేను అదోలా అయి జీవితాన్నే పోగొట్టుకున్నట్టు, శూన్యంలోకి వెళ్ళి పోయినట్టూ ఫీలవుతున్నాను నాన్నా!

దామో: ఓస్! ఇంతేనా… అందుకే ఆలుమగలిద్దరూ ఏడుపు మొహాలెట్టుకొని చెరో ప్రక్క కూర్చుండి పోయారా?

చక్ర: అవును నాన్నా!

దామో: నోర్ముయ్యరా !ఓ ఆరునెల్లే కదాని హాయిగా డిల్లీకి వెళ్ళి ఎంజాయ్ చేసి రాకుండా… ఇంతకు ఎప్పుడెళ్ళాలి?

చక్ర: మరో రెండు రోజుల్లో !

దామో: అయితే పిచ్చి వేషాలేయకుండా నిశ్చింతగా వెళ్ళి ఆఫీసు పనులను పూర్తి చేసుకొని పేరు సంపాయించుకో! ప్రమోషను తెచ్చుకో… తప్ప, యిలా ఆడదానిలా ఏడుస్తూ కూర్చోమాకు.

చక్ర: మరి సంధ్య పిల్లాడు నాన్నా!

దామో: నేనున్నానుగా! ఇంటి పనులతో పాటు వాణ్ణి బడికి తీసుకువెళ్ళడం , తీసుకు రావడమంటూ అన్నీ చూసుకొంటానులే!

సంధ్య: ఏమండీ!మామగారి మాటలు వింటుంటే తప్పదనిపిస్తుంది. మరి టిక్కెట్టూ…

చక్ర: బుక్ చేశారు సంధ్యా! మా ప్యూనుగాడి చేతికిచ్చి పంపిస్తారు.

దామో: మరింకేం అన్నీ సర్దుకొని హాపీగా బయలుదేరు. (లోనికెళ్ళి పోయాడు)

సంధ్య: ఏమండీ!టిక్కెట్టు సరే! మీరుండడానికి బస, భోజనం లాంటివి యెలాగండి?

చక్ర: లాడ్జిలో వుండమన్నారు. ఆ ఖర్చులు వాళ్ళే భరిస్తారట.

సంధ్య: లాడ్జీలోనా…! ఏమండోయ్! లాడ్జంటే జ్ఙాపకమొచ్చింది. మన పక్కింటి పద్మక్క భర్త రాంబాబు గారు లేరూ… ఇలాగే ఆఫీసు పనిమీద ముంబైకెళ్ళి లాడ్జిలో వున్నారటండీ!అక్కడ తనున్న గది తప్ప తతిమ్మా గదుల్లో తప్పుడు పనులు జరుగుతుంటే పోలీసులొచ్చి అందర్ని పట్టుకెళ్ళారట. పద్మక్కే చెప్పింది. నేను చెప్పొస్తున్నదేమిటంటే…

చక్ర: అలాంటి పొరపాట్లు చెయ్యకుండా, మనసును జారవిడువకుండా జాగ్రత్తగా వుండాలంటావ్… అంతేగా!

సంధ్య: అంతేనండి. జాగ్రత్తలు చెప్పడం తప్పుకాదుగా!

చక్ర: చూడు సంధ్యా! నువ్వు నిశ్చింతగా వుండు. (వ్యంగ్యంతో) ట్రైను ఎక్కిన దగ్గరినుండి మళ్ళీతిరిగి వచ్చేవరకు ప్రతి నిముషం నీ పేరే తారకమంత్రంలా ‘సంధ్యా… సంధ్యా’ అంటూ స్మరిస్తూ వుంటాను. చాలా!

సంధ్య: అయ్యో రామ! మీ మీద నాకా నమ్మకం లేక కాదు. జాగ్రత్త కోసం చెప్పానంతే! ఓ ముఖ్యమైన మాట చెప్పడం మరిచానండోయ్…. మరటండీ! తెలిసో తెలీకో భార్యలకు ద్రోహం తలపెట్టే భర్తలకటండీ… డైరక్టుగా నరకమే ప్రాప్తిస్తుందట. అలాని మన ఎదురింటి బామ్మగారు చెప్పారండీ!

చక్ర: అబ్బబ్బా… సంధ్యా! ఏమిటిది. ఎందుకిలా మాటలతో వేధిస్తున్నావ్! అసలు నీకు నామీద నమ్మకం వుందా లేదా?

సంధ్య: అయ్యో రామ! ఏంటలా అంటారు. మీమీద నాకు బోలెడు నమ్మకం వుంది. జాగ్రత్త కోసమే అలా చెప్పాను. పదండి మీ ప్రయాణానికి కావలసినవన్నీ సర్దాలి. (లోపలికి నడిచారు)

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

(సంధ్య టేబుల్ సర్దుతూ వుంది. చిదంబరం సోఫాలో కూర్చొని దినపత్రికను చదువుతూ వున్నాడు. బుజ్జిగాడు నేలమీద బోర్లగా పడుకొని వ్రేలు చీకుతూ బొమ్మల పుస్తకం తిరగేస్తున్నాడు. అప్పుడు దామోదరం మనవణ్ణి బళ్ళో దిగబెట్టి వచ్చాడు)

సంధ్య: (లోనికెళ్ళి మంచి నీళ్ళు తెచ్చి మామగారికి అందించి) ప్రిన్సిపాల్ గారేమన్నారు మామగారూ!

దామో: కోప్పడ్దారమ్మా! డాక్టరు సర్టిఫికేటు యిచ్చాం కనుక సరి పోయింది.

చిద: లేకపోతే పిల్లాడి పేరు హాజరు పట్టీలోంచి తీసేసేవారేమిటి? అదేంటి బావగారూ! నిఖిల్‌కి విషజ్వరమొచ్చింది అబద్దమనా ఆయనగారి వుద్దేశం!?

బుజ్జి: (టక్కున పైకి లేచి) పొరపాటైపోయిందక్కా! ఆ మాయదారి జ్వరమేదో ఆ ప్రిన్సిపాల్ గాడికొచ్చుంటే బాగుండేది!

సంధ్య: పోనీ లేరా! ఎలాగో చేర్చుకున్నారుగా! అలా వాళ్ళు స్ట్రిక్టుగా వుండక పోతే పిల్లల భవిష్యత్తు పాడై పోతుంది.

చిద: స్ట్రిక్టా… నా పిండా కూడా… ఈ లోకానికి ఇదొక్కటే కార్బోరేటు స్కూలన్నట్టు.

బుజ్జి: సందెక్కోయ్ !మనూళ్ళో చెట్టుకింద బడుందే… ఆ మాట్టారు ఎన్ని రోజులు ఎల్లక పోయినా ఏమి అనరు. ఎంత మంచోడో!

చిద: ఆఁ… అలా నోట్లో ఏలెట్టుకొని చీక్కొంటూ వుండమంటారు. ఒరే జిడ్డు వెధవా! మధ్యలో నువ్వేంట్రా! నోరు మూసుకొని లోపలికి తగలడు. (గదిలోకి నెట్టుకు పోయాడు)

దామో: అమ్మా… సంధ్యా!

సంధ్య: ఏమిటి మామగారూ!

దామో: మనం ఆ సుబ్బారావు కాలనీలో ప్లాటు కొన్నామే… ఆ తాలూకు దస్తావేజులు పట్రామ్మా!అందులో సర్వే నంబరు తప్పు రాశారట. తీసుకెళ్ళి దిద్దుకు రావాలి.

సంధ్య: అలాగే మామగారూ! (లోనికి నడిచింది)

దామో: (లోపలినుంచి బయటికి వస్తున్న చిదంబరాన్నిచూసి) బుజ్జిగాడేడి బావగారూ!

చిద: మనల్ని డిస్ట్రబ్ చేస్తున్నాడని తీసుకెళ్ళిగదిలో వుంచి తాళం వేసొచ్చా!

దామో: అదేంటండీ పాపం. .

చిద: అదంతే! లేకపోతే మన మధ్య దూరి పిచ్చి వాగుడు వాగుతుంటాడు.

సంధ్య: (లోపలినుంచే) అల్మిరా మొత్తం వెతికాను మామగారూ!డాక్యుమెంటు కనబడలేదు.

దామో: ప్రక్కనున్న బీరువాలో చూడమ్మా!అందులో వుంటుంది.

(సంధ్య ఓ నిముషం తరువాత డాక్యుమెంటు తెచ్చి యిచ్చింది. దాన్ని తీసుకొని దామోదరం వెళ్ళి పోయాడు. సంధ్య మళ్ళి లోనికెళ్ళిది. ఓ నిముషం తరువాత)

సంధ్య: (పెద్దగా) బాబాయ్… బాబాయ్! (ఓ పాత డైరీని, అందులో వున్నకొన్ని వుత్తరాలను చేతుంచుకొని హాల్లోకి దూసుకొచ్చింది) చూడండి బాబాయ్! ఈ వుత్తరాలనూ ,డైరీని చూడండి. నా కాపురానికి చిచ్చుపెట్టే రాతలు ఇందులో వున్నాయ్! అవి మీ అల్లుడుగారి దస్తూరితో రాసినవి. ఎవతో ప్రియస్వప్నట… ప్రియస్వప్న. మొత్తం ఆవిడ ప్రస్తావనే ఇందులో వుంది.

చిద: (డైరీ త్రిప్పి చూస్తూ) ప్రియస్వప్న… ఎవరీవిడ… దస్తూరీ మనల్లుడిదే! సందేహం లేదు. (ఆలోచించి) అమ్మ బాబోయ్! కొంప ముంచేశాడు. అంటే… అల్లుడుగారు గ్రంథసాంగుడేనన్నమాట. ఇక ఈ ప్రియస్వప్న ఆయనగారు కాలేజి చదువుతున్నరోజుల్లో క్లాసుమేటయ్యుంటుందమ్మా!

సంధ్య: అవునా… అయితే అయిపోయింది. అంతా అయిపోయింది బాబాయ్! నా చక్కటి సంసారంలో దావానలం పుట్టింది. నా బ్రతుకు అంధకారంలోకి వెళ్ళి పోయింది. మీ అల్లుడిగారి రాసక్రీడలు చదివారుగా బాబాయ్!

చిద: ఆఁ… ఆఁ చూశా… ఛీ… చదివా! ఇందులో రాసిన ఆయనగారి కలాపాలన్నీ క్షుణంగా చదివా!

సంధ్య: దీన్ని బట్టి మీకేమర్థమైంది బాబాయ్ !

చిద: ప్రతి పేజీకి పదే… పదే… ‘ప్రియస్వప్న… ప్రియస్వప్న’ అని రాసుంది కనుక… ఆవిడతో మీ వారికి బాగా ముదిరిన ప్రేముందని అర్థమైంది. అవునమ్మా! ఈ వుత్తరాలూ, డైరీ చూశాక… ఆ రోజు… అంటే… నీ పెళ్ళిరోజు మీ వారి తీరును గుర్తుకు తెచ్చుకుంటుంటే అమాయకంగా కనబడే ఈ అల్లుడు ఎంతటి అసాధ్యుడోననిపిస్తోంది. అబ్బబ్బబ్బా! ఆ నాటి అల్లుడిగారి చూపులు, నవ్వులు, ఆ హొయలు,స్టయిలూ… చూడూ! పదివేల గోపికలతో రాసలీలలు సల్పిన ఆ గోపాల కృష్టుడు సైతం మీ వారి ముందు దిగదుడుపే!

సంధ్య: నిజమా బాబాయ్ !

చిద: అబధ్ధం చెప్పాల్సిన ఖర్మ నాకేం పట్టిందమ్మా! ఈ పిల్ల అల్లుడిగారి కాలేజీమేటని ఖచ్చితంగా చెప్పగలను.

సంధ్య: కాలేజీమేటయినంత మాత్రాన. …

చిద: ప్రేయసీ కాకూడదని ఏ చట్టంలోనూ లేదు కదమ్మా! ఇక ఆ ప్రేమను కాస్త అలాగే గొలుసులా జీవితాంతం కొనసాగించ కూడదన్న ధర్మం అంతకన్నా లేదు. తను నీతో పెళ్ళంటూ జరిపించుకొంది ఓ ఫార్మాలిటీకేనే తల్లీ!

సంధ్య: (కోపంతో)మరెందుకు బాబాయ్… దాంతో వూరేక్క నా గొంతుకు వురిత్రాడు బిగించి నా ప్రాణం తీస్తున్నారు. ఎంత మెత్తగా కట్టారో ఈ మెళ్ళో తాళి. ఎంతటి తీయ్యటి కబుర్లతో లొంగదీసుకోన్నారని…! ఇంత నీచమైన మనిషికి సర్వం అర్పించేసుకొన్నానే భగవంతుడా!

చిద: అంతేనా… అతగాడికో బిడ్డను కూడా కన్నావే పిచ్చితల్లీ!

సంధ్య: నన్ను మోసం చేసేందుకు ఎన్నో బాసలు చేశారు. మరెన్నో కబుర్లు చెప్పారు. బాబాయ్! అందుకే… నేనో నిర్ణయానికొచ్చేశాను!

చిద: ఏమిటమ్మా ఆ నిర్ణయం!

సంధ్య: ఇంకో ఆడదానితో సంబంధమున్న వీరితో ఇక కాపురం చెయ్యకూడదని.

చిద: ఆఁ… .

సంధ్య: అవును బాబాయ్! మామగారికి ఈ వివరాలన్నీ చెప్పి మనింటికి వెళ్ళి పోదాం! ఇక నా బొందిలో ప్రాణముండగా ఈ ఛాయలక్కూడా రావొద్దు.

చిద: వున్నఫలంగా అలా వెళ్ళి పోవడానికి ఇదేమన్నా సాధారణ విషయమా! నీ ఏడేళ్ళ సంసార జీవితమే తల్లి! దీనికి ఈ సంఘం కూడా ఒప్పుకోదు సరికదా వెక్కిరిస్తుందమ్మా!

సంధ్య: మరి వీరు చేసిన ఈ పనికి మెచ్చుకొంటుందా!?

చిద: కాదనుకో… అయినా మనం వెళ్ళి పోవడానికీ సరైన కారణం కావాలి కదా!

సంధ్య: (అటూ ఇటూ తిరిగి) కారణం… కారణం… కారణం ఆఁ… ఇదిగో ఈడైరీ వుందిగా! దీన్ని నువ్వంటున్న ఈ సంఘానికి చూపుదాం. కేసుపెట్టి నిదర్శనాలుగా వీటిని కోర్టు వారికి దాఖలు చేసి విడాకులిప్పించుకొని విడి పోతాను.

చిద: (ఆశ్చర్యతో) విడాకులా… అలాగేలేమ్మా! కాస్త ఆవేశం తగ్గించుకొని కొంచం ఓపిక పట్టు. అతగాడ్ని రానీయ్! వచ్చాక… తాడో పేడో తేల్చుకొని వెళ్ళిపోదాం. ధైర్యంగా వుండు. పద లోనికి. (మెల్లగా లోనికి తీసుకెళ్ళాడు)

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

(దాదాపు గత ఆరునెల్లనుంచి ఆ ఇంట పేలవమైన వాతావరణం నెలకొంది. ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేని వారిలా ఏదో పోగొట్టుకొన్నట్టు జీవనాన్ని గడుపుతున్నారు. ఆరోజు ఢిల్లీనుంచి చక్రవర్తి వచ్చాడు)

చక్ర:: (లోనికి ప్రవేశించి చేతిలో వున్న సూట్ కేసును టీపాయి మీదుంచాడు. తనలో తానే) ఎవరూ లేనట్టున్నారే! సంధ్యా… సంధ్యా! (ఒకసెకనైన తరువాత) సంధ్యా! రావేంటి… ఒంట్లో బాలేదా? సమాధానం చెప్పవేం?

సంధ్య: (లోపలినుంచే) నేనేవర్ని మీకు సమాధానం చెప్పడానికి…

చక్ర: ఆఁ … నా భార్యవు.

సంధ్య: అది తెలుస్తూనే వుందిలే నా మెళ్ళో వున్న ఈ తాళి బొట్టు వల్ల.

చక్ర: నువ్వేం మాట్లాడు తున్నావో నాకర్థం కావడంలేదు.

సంధ్య: అర్థం కాదులే! అర్థంకాకనే ఇన్నాళ్ళూ మీరేం చేస్తున్నా నోరు మూసుకొని పడి వున్నాను. (హాల్లోకి వచ్చింది)

చక్ర: (తీసేస్తూ) సరేలే! డిల్లీ నుంచి నీ కోసం ఈ చీర తెచ్చాను. నాన్నగారికి చలికోటు. మామయ్యకు వాకింగ్ స్టిక్కు. నిఖిల్‌కు బొమ్మలు. మీ తమ్ముడికి రిస్టువాచీ… ఏమిటి మౌనంగా వున్నావ్? ఏమైంది నీకు?

సంధ్య: నాకేమీ కాలేదులే! ఎవరికి తెచ్చినవి వాళ్ళకిచ్చి నా కోసం తెచ్చిన ఆ చీరను మాత్రం రిటర్ను చెయ్యండి. లేకుంటే మీ కిష్టమైన వాళ్ళకిచ్చుకోండి.

చక్ర: ఇష్టమైన వాళ్ళా… నీకంటే నాకిష్టమైన వాళ్ళెవరున్నారే సంధ్యా?

సంధ్య: ఏమో! నాకేం తెలుసు. అసలు నాతో మాట్లకండి.

చక్ర : అబ్బా! అసలు విషయం చెప్పకుండా… నీకేమైందివాళ!?

సంధ్య: నా ముఖంలోకి చూసి చెప్పండి! మీకు ప్రియమైన వాళ్ళు ఎవరూ లేరా? చెప్పలేరు. మీరు చెప్పలేరండి! అసలివన్నీ యెందుకూ? ఆ చీరను తీసుకెళ్ళి మీకు ప్రియమైన వాళ్ళకిచ్చుకొండి.

చక్ర: నాకు ప్రియమైన వాళ్ళా… ఎవరు?

సంధ్య: ఎవరా? మీడైరీలో మీరు రాసుకొన్నారే మీ ప్రియాతి ప్రియమైన ప్రియస్వప్న… ఆవిడ.

చక్ర: సంధ్యా… (ఏదో చెప్పబోయాడు)

సంధ్య: మీరింకేమీ చెప్పక్కరలేదు. నాకంతా తెలిసిపోయిందండీ! మీ గూర్చి అంతా తెలిసి యింకా ప్రాణంతో వున్నానంటే మీ కోసం కాదు. నా బాబు కోసం. మామగారి కోసం. అవతలికి వెళ్ళండి నాతో మాట్లాడకండి. ప్లీజ్ !(ముఖానికి పమిటను అడ్డుంచుకొని ఏడుస్తూ లోనికెళ్ళి పోయింది)

చక్ర: సంధ్యా… సంధ్యా… (లోనికెళ్ళ బోయాడు)

చిద: (లోపలినుంచి హాల్లోకొచ్చి) ఆగవయ్యా అల్లుడూ… ఆగు! ఇన్నాళ్ళు నువ్వు వేసిన నాటకాలు, వేస్తున్న వేషాలు, చేస్తున్నదబాయింపులూ, బెదిరింపులు ఇంతటితో ఆపేసేయ్! అదే నీకు మంచిది.

చక్ర: మామగారూ! మరీ…

చిద: ఇంకేమి మాట్లాడకయ్యా! నాకన్ని తెలుసు. ఇదుగో! సంధ్య నా కూతురు కనుక అంత బాధను గుండెల్లో దాచుకొని నీతో మాట్లాడింది. ఇకొక్కర్తయితే ఈ పాటికి నిన్ను రాచి రంపాన పెట్టి కోర్టుకీడ్చి నీ పరువు రోడ్డుకెక్కించేది. ఆఁ…

చక్ర: మామగారూ! ఏమిటి మీరంటున్నది. నాకంతా అయోమయంగా వుంది. ఆరునెల్ల తరువాత ఇంటికొచ్చిన నన్ను చూస్తూనే నా భార్య, పిల్లాడు వచ్చి నా ఒళ్ళో వాలిపోతారని, మీరూ, నాన్నగారు నాకు స్వాగతం పలుకుతారని ఎంతగానో వూహించాను. కాని అంతా తారుమారుగా వుంది.

చిద: వుండదా మరి?. దీనికంతటికి కారణం ఎవరు! ఎవరయ్యా?… నీ ప్రవర్తనే!

చక్ర: నా ప్రవర్తనా? ఏమిటి మీరంటుంది?

చిద: ఏముందయ్యా!నీ నడత అడ్డదోవ పట్టిందని, నువ్వు చెడు వ్యసనాలకు కూడా లోనయ్యావని నాకూ, నా కూతురికి తెలిసిపోయిందయ్యా! ఆహా… ఎంత బాగా నటిస్తావయ్యా! ఆ ముఖంలో ఎంతటి అమాయకత్వమో! ఇదిగో… నువ్వో అమ్మాయిల పిచ్చాడివని మాకు బాగా తెలిసిపోయింది.

చిద: మామగారూ! ఏమిటా తిక్కవాగుడు. మాటలు మర్యాదగా రానివ్వండి.

చిద: ఆఁ… ఆఁ… ఆగవయ్యా బాబూ! భలే రెచ్చిపోతున్నావే! ఇదిగో… నిప్పు లేకుండా పొగ రాదయ్యా! కారణం లేకుండా నిన్నుబాధపెట్టి… మేము బాధ పడతామటయ్యా… చెప్పు?

చక్ర: అబ్బా! అసలు నేను చేసిన తప్పేమిటి మామయ్యా?

చిద: తప్పా… వుందిగా… నీ స్వహస్తాలతో రాసిన నీ డైరీ! ఆ డైరీలో నీ ప్రియమైన ప్రయస్వప్నకు నువ్వు రాసిన ప్రేమ లేఖలు ,ఆమెతో నువ్వాడుకున్న రాసక్రీడలు! ఇంకేంకావాలి?

చక్ర: (పకపక నవ్వి) ఓస్… ఇదా సంగతి! మామగారూ! మీ అందరికి ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో నాకు తెలియడం లేదు. అసలలాంటి వ్యక్తంటూ వుంటే కదా చెప్పడానికి. మామగారూ! మీరనుకొంటున్నదంతా ఒఠ్ఠిది.

చిద: ఓహో… అంటే… నువ్వు నిష్కల్మషుడవని, నిర్మలుడవని, నా అన్న కూతురికి ప్రియాతి ప్రియమైన భర్తవని నన్ను నమ్మమంటావ్! అంతేగా? ఛస్తే నమ్మను. నమ్మను గాక నమ్మను.

చక్ర: మామగారూ! మీరు నమ్మినా నమ్మక పోయినా ఆ డైరీలో వున్న వుదంతమంతా ఒఠ్ఠిది, అందులో రాసిన ప్రియస్వప్నకు అర్థం…

చిద: ఓ అమ్మాయి అని మాకు తెలుసు లేవయ్యా!

చక్ర: కాదు మామయ్యా!

చిద: కాదూ గీదూ అంటే నేను నమ్మనయ్యా! నా కూతురైతే అస్సలు నమ్మదు.

చక్ర: మామగారూ!(పెద్దగా అరిచాడు. ఉలిక్కి పడ్డాడు చిదంబరం)

చిద: అబ్బా … ఏమిటల్లుడూ … ఇంటి కప్పు లేచిపోయేలా అలా అరిచావు?

చక్ర: ఇక మిమ్మల్ని బ్రతిమాలి లాభంలేదు… కాకపోతే వాడెవడో అన్నట్టు కీలెరిగి వాతపెట్టాలి. ఆ విధంగా మీకు తగిన శాస్తి చెయ్యాలి.

చిద: ఏం చేస్తావయ్యా? ఏంచేస్తావేం?

చక్ర: ఏంచేస్తానా… అంటే… మీరు ఇక్కడ ఇంకో ముసలమ్మతో కులుకుతున్నారని అత్తగారికి రాసి ఆమెను రప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది మీరు నన్ను నమ్ముతారో లేదోనన్నది!

చిద: (హతాశుడై కంగారుపడుతూ) అల్లుడూ… అల్లుడూ… ఏమిటయ్యా వున్నట్టుండి ఆటం బాంబును పేలుస్తున్నావ్! నిజంగా నేను మీ అత్తగారి పేరూ, రూపమూ మరచి పోయి ఆరునెల్లు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా వుంటున్నాను. మళ్ళీ ఆ నరరూప రాక్షసిని పిలిచి నా నెమ్మదికి భంగం కలిగించకయ్యా నీకు పుణ్యముంటుంది ప్లీజ్! చెప్పు అసలు విషయమేమిటో చెప్పు? దాంతోపాటు నేను నీకు ఏం చెయ్యాలో కూడా చెప్పు? అవునయ్యా… మనం మనం ఒకటి. చర్చించుకొని ఓ మంచి నిర్ణయానికొద్దాం. అసలు మధ్యన ఆవిడూసెందుకయ్యా! ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్మతానుగా!(తలమీద చెయ్యుంచుకొన్నాడు) విషయాన్ని చెప్పు.

చక్ర: అలా రండి దారికి. మీ చెవినిలా తెండి.

చిద: చెవా… ఎందుకూ?

చక్ర: అబ్బా… చెవినిలా పారేయవయ్యా మగడా! చెబుతాను!(చెవిలో ఏదో చెప్పాడు)

చిద: ఓస్! ఇదేనా అసలు విషయం. అయినా ఎంత అల్లరి చేసుకున్నావల్లుడూ! ఖర్మ కాకపోతే ఈ రభసకి నేనూ ఓ కారణమైయ్యాను. అగ్నిలో ఆజ్యం పోసినట్లు మా సంధ్య సందేహాలకు నా వంతుగా కత్తికి సానా పట్టినట్టు మరికొన్ని జోడించానయ్యా! ఎంత పొరపాటైపోయిందో!

చక్ర: ఇప్పుడెలా మామగారూ?

చిద:(ఆలోచనా ధోరణితో) అదే ఆలోచిస్తున్నా! అమ్మాయి కళ్ళ ముందు సినిమా రీలులా గిర్రున తిరుగుతున్న ఆ సందేహపు తెరలను తొలగించాలి. దాని మనసులో మహా వృక్షంలా పెరిగిపోయిన సందేహాలను కూకటి వ్రేళ్ళతో పెకలించేయాలి. నేను చేసిన పొరపాటుకు బాధ్యత నేనే వహిస్తా!నీ కాపురం నేనే నిలబెడతా! ఆఁ… ఐడియా వచ్చిందల్లుడూ! నీ చెవినిలా పారేయ్! (చెవిలో గుసగుసలాడి)అదీ విషయం. నువ్వేం కంగారు పడకు. తతిమ్మా తతంగాన్ని నేను చూసుకొంటాను.

లైట్స్ ఆఫ్ అండ్ ఆన్

దామో: (బయటి నుండి వచ్చి సోఫాలో కూర్చొన్నాడు) అమ్మా సంధ్యా!

సంధ్య: పనిలో వున్నా… ఏం కావాలి మామగారూ?

దామో: కాసిన్ని మంచి నీళ్ళు తీసుకు రామ్మా! (మంచి నీళ్ళు తెచ్చి యిచ్చింది సంధ్య) మీ బాబాయి, బుజ్జిగాడు ఏరమ్మా?

సంధ్య: బజారుకెళ్ళారు మామయ్యా!

దామో: ఆఁ… అన్నట్టు కారు బయటే వుంది. మీ ఆయన ఆఫీసుకు వెళ్ళ లేదా?

సంధ్య: వెళ్ళారు. మరెందుకో తిరిగొచ్చారు మామయ్యా! ఆ గదిలో వున్నారు.

దామో: ఏమిటోనమ్మా!ఈ మధ్య మనింట్లో మౌనం రాజ్యమేలుతోంది. మనమూ ఎవరికి వారు ఏ సంబంధంలేని వారిలా వున్నాం. అంతా అగమ్యగోచరంగా వుంది. దీనికంతటికి కారణం ఆరోజు నీ పేరా వచ్చిన ఆ వుత్తరమే ననుకొంటా!అందరి మనసుల్ని పాడు చేసి కుటుంబంలో చిచ్చు రేపింది.

సంధ్య: క్షమించండి మామయ్యా!భోజనం వడ్డిస్తాను రండి. (బాధతో కన్నీళ్ళు వొత్తుకొంటూలోనికెళ్ళి పోయింది)

దామో: హు… ఏమిటో… కోడలు అలా బాధ పడుతూ వెళ్ళి పోవడం చూళ్ళేక పోతున్నాను. (అంతలో చక్రవర్తి గదిలోనుంచి తూలుతూ వచ్చాడు) ఏరా… ఆఫీసుకు వెళ్ళలేదా?

చక్ర: (మత్తుతో) వెళ్ళి వచ్చేశాను. ఏం… మీ కోడలు చెప్పలేదా?

దామో: చెప్పిందిలే… అదే నేనడుగుతోంది ఎందుకు తిరిగొచ్చావని?

చక్ర: మనసులో ఏదో బాధతో కూడికొన్న వెలితి.

దామో: వెలితా… ఏమిటది?

చక్ర: ఏం… మీకు తెలియదా?ఎందుకు నాన్నా!నన్నడిగి మరీ ఎక్కువ బాధకు లోను చేస్తారు!

దామో: బాధా… ఎందుకురా? అసలేం జరిగిందని…

చక్ర: (పేలవంగా నవ్వి) ఏం జరగాలి… ఇంకా ఏం జరగాలి నాన్నా! జరగకూడనిదంతా జరిగి పోయిందిగా! అవును నాన్నా! ఆ వుత్తరమే నన్ను ఈ స్థితికి దిగజార్చింది. నా బ్రతుకులో చిచ్చు పెట్టి మంటలు రేపింది.

దామో: అదేమిట్రా… ఎవరో ఓ వెధవ రాసిన ఆకాశ రామన్న వుత్తరానికి ఇంతగా బాధపడి కళకళలాడే నీ సంసారాన్ని, నీ ముద్దు బిడ్డను, నిన్ను ప్రేమించి ఆరాధించే నీ బార్యను బాధ పెడుతూ బ్రతుకుని భారం చేసుకొంటావా? ఇలా తాగి తందనాలాడుతావా?

చక్ర: క్షమించండి నాన్నా! బాధతో కూడికొన్న నా గుండెకోతను మరచి పోవాలంటే ఇంతకన్నా మరో మార్గంలేదు. అయామ్ సారీ!

దామో: చెబుతావురా… సారీ అని సునాయాసంగా చెప్పి నీ నిండు జీవితాన్ని ఆ తాగుడుకి బలి చేసుకొని సందేహాలతోనే చస్తావ్! ఒరేయ్… అది కాదురా జీవితం. కుటుంబం అన్న తరువాత భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు, సందేహాలు వస్తుంటాయి పోతుంటాయ్! వాటిని లెక్కకు తీసుకుంటే… ఒకరిమీద మరొకరికి నమ్మకాలు పోయి ఎవరికి వాళ్ళుగా విడిపోవలసిందే! మీ భార్య భర్తలిద్దరు చక్కగా ఏడేళ్ళు సాగించిన మీ జీవితాల్లో ఇప్పుడు అనవసరంగా కలతలు తెచ్చుకుంటే…

సంధ్య: (తండ్రీకొడుకుల సంభాషణలను విని బయటికొచ్చి) విడిపోతామని మీకు బాధగా వుందా మామగారు! బాధ పడవలసింది మీరు కాదు. బాధ్యతను మరచి పోయి తాగి తందనాలాడుతున్నారే వారు. పదండి మీరు భోంచేద్దురుకాని.

చక్ర: వాట్ నాన్సెన్సు యూ ఆర్ టాకింగ్! నాకు నీతులు చెప్పాలనా నీ వుద్దేశం. వెళ్ళవే అవతలికి… మా పేద్ద ప్రతివ్రతలా చెప్పొచ్చావ్! తేలుస్తానులే… ఆ వుత్తరానికి నీకూ వున్న సంబంధమేమిటో త్వరలో తేలుస్తానులే!

సంధ్య: (కుములుతూ) తేల్చుకొండి… తేల్చుకొండి. మీకు చేతనైనదేమిటో మీరు తేల్చుకోండి. నాకు చేతనైంది నేను తేల్చుకొంటాను. త్వరలోనే విడిపోదాంలే! అదేగా మీకూ… దానికీ కావలసింది. నా ఇంట నా స్థానం పొందాలనుకొంటున్న దానికి కూడా హాపీగా వుంటుంది. (ఏడుస్తూ లోనికెళ్ళి పోయింది. అంతలో చిదంబరం, బుజ్జిగాడు లోనికొచ్చారు. అప్పుడు బుజ్జిగాడి నెత్తి మీద ఓ పార్సిల్ వుంది)

బుజ్జి:సందెక్కా… ఓ సందెక్కోయ్ !

చిద: సఃధ్యా… సంధ్యా… నీకో పార్సిల్ వచ్చిందమ్మా!(టక్కున ఆగి)ఓ మీరూ ఇక్కడే వున్నారా?!

చక్ర: ఒరేయ్ బుజ్జీ ఏమిటా పార్సిల్ ?(అందుకోబోయాడు)

బుజ్జి: ఊఁహు… నేనియ్యను. ఇది మా సందెక్కకొచ్చిన పార్సిల్ !

చక్ర: ఇలాతే!

బుజ్జి:హు… నేనియ్యనన్నానా!ఇది సందెక్కకే యివ్వాలి. సందెక్కా… ఇదిగో తీసుకో!

చిద: అదేంటండీ!మా అమ్మాయి ఏడుస్తున్నట్టుంది!ఏమైంది?

చక్ర: ఏడవలేదు మామగారూ!కాస్త బాధపడి కళ్ళకు నీళ్ళుతెచ్చి పెట్టుకొంది. అంతే !

సంధ్య:(కళ్ళు తుడుచుకొని)మీరు రండి బాబాయ్ భోంచేద్దురుగాని. రారా బుజ్జి… (లోపలికి వెళ్ళారు)

చక్ర: ఓకే… వెళ్ళండి. అందరూ వెళ్ళి సుష్టుగా బోంచేయండి. ఐ హేవ్ నో అబ్జక్షన్! బట్ మామగారూ! బుజ్జిగాడి చేతిలో వున్న ఆ పార్సిల్ ప్యాకెట్టు ఇటిచ్చి వెళ్ళండి. అదేమిటో నాకు తెలియాలి.

చిద: అది అమ్మాయి పేరా వచ్చిందయ్యా! నీ కివ్వకూడదు.

చక్ర: ఎందుకనీ… ఇదిగో! ఆవిడ నా పెళ్ళాం. దాని కష్ట సుఖాల్లో పాలుపంచుకొంటున్నా! పైగా నా డైరీని ఆవిడ చూసినప్పుడు ఆవిడ పేర వచ్చిన ఆ పార్సిల్లో ఏముందో నేను చూడకూడదా? ఇవ్వండి. (బుజ్జి తలమీదున్న పార్సిల్ లాక్కొన్నాడు) వ్వాట్ … ఫ్రమ్ రాజేష్ కుమార్, హైదరాబాద్ టూ సంధ్యారాణి,చెన్నై. వారేవా! ఎవడీ రాజేష్ (పెద్దగా) నాన్నా… నాన్నా!

దామో: (లోపలినుంచి వస్తూ) ఏమిట్రా… ఎందుకలా అరుస్తున్నావ్?

చక్ర: పట్టుకున్నా! దొంగను రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నా!రండి… చూడండి.

దామో: ఎవర్రా… ఎవరా దొంగ!

చక్ర: ఈవిడే… చక్రవర్తి పెళ్ళామూ,దామోదరం గారి కోడలూ అయిన శ్రీమతి సంధ్యా రాణిగారు!ఇదిగో లేఖ.

చిద: ఏం లేఖల్లుడూ… !

చక్ర: ప్రేమ లేఖ.

చిద, దామో:(ఆశ్చర్యంతో) ప్రేమలేఖా!

సంధ్య: ప్రేమలేఖా… ఏమిటండీ మీరంటుంది… ఎవరా రాజేష్ !నాకెందుకు వుత్తరం రాశాడు!

చక్ర: నాన్నా… నాన్నా! నీ కిప్పుడు అర్థమైందా… నా మనో వ్యధకు కారణ మేమిటోనని. ఇవే… ఆవిడ పేరా వచ్చిన వుత్తరాలూ,పార్సిల్. వాటిని పంపిన ఆ రాజేష్ !

దామో: ఏమిట్రా… పార్సిలేమిటి… మళ్ళీ వుత్తరమేమిటి?

చక్ర: రెండూ ఆ రాజేష్ గాడివే! మీ కోడలికి పంపాడు. (విప్పి చూపుతూ) చూశారా పట్టుచీర…

బుజ్జి: చాలా బాగుందక్కా!

సంధ్య: (కోపంగా) ఛీ… నోర్ముయ్యరా! ఏమండీ! నోరుందికదా అని మీ యిష్టం వచ్చినట్లు వాక్కండి. ఆ రాజేష్ ఎవడో నాకు తెలియదు. ఈ చీరకూ నాకూ అస్సలు సంబంధం లేదు. ఆ వుత్తరాన్ని యిలా యివ్వండి. నేను చదవాలి.

చక్ర: నో… ఇవ్వనే! ఇదొక్కటే నాకాధారం. యస్! నీనుంచి ఆ కోర్టు ద్వారా విడి పోవాలంటే… ఇదుండాలి.

చిద: అందులో ఏముందల్లుడూ!?

చక్ర: ఏముందా… (బాధతో) ఆహా! ప్రేమ లేఖలు రాయడంలో వాడికి వాడే సాటి. మొత్తానికి నేనవుటాఫ్ స్టేషన్‌లో వున్నప్పుడు మీ అందరి కళ్ళు కప్పి ఈవిడ జరిపిన ప్రేమ కలాపాలు అద్భుతమని… ఇదిగో ఈ వుత్తరం ద్వారా తెలుస్తోంది. చదవండి. చదివి నాకే యివ్వండి. ఇవ్వకపోతే నాపై ఒట్టే!

సంధ్య: మామగారూ! (దగ్గరగావెళ్ళింది. దామోదరం ఏమీ పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు)బాబాయ్…! బుజ్జీ…! (వాళ్ళూ వెళ్ళి పోయారు) ఏమండీ…! (బాధతో బ్రతిమాలినట్టు) ఏమండీ… !

చక్ర: నో… నో… నన్నలా పిలవకు. ఆ రాజేష్ సమయానికి వుత్తరం రాసి నా కళ్ళు తెరిపించాడు. ఇక జాగ్రత్తపడతాను. మంచి లాయర్ని మాట్లాడుకొని శాశ్వతంగా… నీతో విడిపోతాను. వస్తాను. (లోనికెళ్ళి పోయాడు)

సంధ్య: మామగారూ… బాబాయ్ … ఏమిటి నాకీ శిక్ష? మీరెవరూ మాట్లాడకుండా సమ్మె చేసినట్టు వెళ్ళిపోతున్నారే! చెప్పండి? నేనేం తప్పు చేశాను? భగవంతుడా ఎవడీ రాజేష్? ఏమిటా పార్సిల్, వుత్తరం. నాకంతా అయోమయంగా వుంది. నాకతనితో అక్రమ సంబంధముందా? భగవంతుడా… అస్సలు వూహించలేక పోతున్నాను. మరి… వీళ్ళని యెలా నమ్మించాలి! నేను నిర్దోషిని. నేనేంచెయ్యాలి? నాకేమిటి గత్యంతరం? ఆఁ అవును… అదే… అదే చెయ్యాలి. నేను ఈ లోకానికి దూరమవ్వాలి. వీళ్ళు నాపై మోపిన అభాండం నుంచి తప్పుకోవాలంటే నాకదే మార్గం (గబగబా లోనికెళ్ళి ఓ చిన్న సీసాతో వచ్చింది. దాన్ని తెరిచి అందులోని నిద్ర మాత్రలను అర చేతిలో పోసుకొని నోట్లో పోసుకోబోయింది. అది గమనించిన చక్రవర్తి చేతిలో వున్న బిళ్ళలను చేత్తో తట్టాడు. ‘నాన్నా… ,మామయ్యా’ అని పిలిచాడు. అవతల గదుల్లో వున్న వాళ్ళు పరిగెత్తినట్టు వచ్చారు. )

సంధ్య: నన్నాపకండి. నేను చావాలి. నాపై మోపిన ఈ అభాంఢాన్ని భరించలేను. నేను చావాలి.

చిద: ఎందుకమ్మా!ఏమిటీ పిచ్చి పని?

బుజ్జి: చెప్పక్కా! బావ తాగొచ్చి నిన్ను తన్నాడా?

సంధ్య: నో… నేనెవరికీ సమాధానం చెప్పలేను. నేను చావాలి అప్పుడే ఈ ఇంట్లో కొందరికి నెమ్మది. (చేతులు విడిపించుకోవడానికి గింజుకొంటుంది. చెంప చెళ్ళుమనిపిస్తాడు చక్రవర్తి. సంధ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది)

చక్ర : ఏమిటే… ఏమిటీ ఆగడం?

దామో: ఏమైందిరా… నా కోడలికేమైంది?

చిద: నా కూతురు నిద్ర మాత్రలు మింగి చావాలనుకొంది బావగారూ!

దామో: ఆఁ…

చక్ర: అవును నాన్నా! దీనికి పిచ్చి పట్టింది.

సంధ్య: నో… నో… నో… పిచ్చి పట్టింది నాక్కాదు. మీకు. మీ అందరికి. కాకపోతే ఎవడో ఓ వెధవ రాసిన వుత్తరం, పంపిన పట్టు చీరను ఆధారాలుగా చేసుకొని నన్ను తప్పుడు దాన్ని చేస్తారా? మీరంతా నాతో మాట్లాడకుండా నన్ను మాట్లాడనివ్వకుండా నన్నో దోషిగా పరిగణిస్తారా! ఇవన్నీ ఎందుకు? నన్ను కన్నకూతురి కన్నా మిన్నగా చూసుకునే (బాధతో కుములుతూ) మామయ్యే సందేహించారు. ఇక నేనెందుకు బ్రతకాలి? అందుకే చావాలన్న నిర్ణయాని కొచ్చాను. అవును… నేను చావాలి. నేను చావాలి.

చిద: ఆగమ్మా… ఆగమ్మా తల్లీ! ఏడవకు. అసలు నువ్వెందుకు చావాలి?

బుజ్జి: అవునక్కా!అలాంటి పనులు ఎవళ్ళు చేశారోవాళ్ళే చావాలి. కదూ నాన్నా!!

చిద: మధ్యలో వీడొకడు. నువ్వూరూకోరా! అమ్మా సంధ్యా… కాస్త తమాయించుకో… అల్లుడితో నేను మాట్లాడుతానుగా! మీ ఇద్దరి మధ్య వున్న ఈ కలవరానికి కారణం తెలుసుకొని చిక్కులన్నిటిని చక్కగా విప్పేస్తాగా!(చక్రవర్తి వైపు తిరిగి)అల్లుడూ… మీకు పెళ్ళయి ఎన్నేళ్ళయ్యిందయ్యా?

చక్ర: ఏడేళ్ళు.

చిద: మరీ ఏడేళ్ళుఏలాంటి అరమరికలు లేకుండా ఆనందంగా సాఫిగా సంసారాన్ని సాగించారు. అవునా?

చక్ర: అవును.

చిద: మరిన్నేళ్ళు నా కూతురితో సంసారం సాగించిన తమరు ఇవాళ ఆమెను గూర్చి తప్పుగా మాట్లాడుతున్నారే… అది నీకు న్యాయమా?

సంధ్య: అడుగు బాబాయ్! బాగా అడుగు. ఈయనగారు తన పాతడైరీలో రాసిన వారి ప్రియస్వప్నతో యిప్పటి వరకూ సాగిస్తున్న సంబంధం గూర్చి కూడా బాగా అడగండి.

చక్ర: అదీ… అదీ…

దామో: ఒరేయ్ చక్రవర్తీ… ఏమిట్రా యిది. నాకంతా అయోమయంగా వుంది.

చిద: నేను చెపుతాను బావగారూ! మా అమ్మాయి మీ అబ్బాయితో ఏడు సంవత్సరాలు కాపురం చేసింది… అవునా తల్లీ?

సంధ్య: అవును బాబాయ్ !ఎంచక్కా చేశాననీ…

చిద: కనుకనే కదమ్మా మాకో ముద్దుల మనవణ్ణి కూడా కని పెట్టావు. బాగానే వుంది. అయితే మీరిద్దరూ ఒకర్నొకరు ఎంత వరకు అర్థం చేసుకొన్నారో తెలియదు కాని… చక్కగా సాగి పోతున్న మీ సంసారంలో వున్నట్టుండి చిచ్చు రేపుకొన్నారు. అందుకు కారణం… (చక్రవర్తి వేపు చూసి) ఇదిగో… నువ్వు చెప్పల్లుడూ!

సంధ్య: కరెక్టు. బాగా అడిగారు బాబాయ్ !ఈ ప్రశ్నకు సమాధానం వారే చెప్పాలి.

చిద: మరి వూరికే వదలి పెడతాననుకున్నావా?బాగా అడుగుతాను. చెప్పల్లుడూ!

చక్ర: ఏంటి చెప్పేది? సరే… మీ మాట ప్రకారం నాలో ఏదో తప్పుందన్న మీ వూహ నిజమే ననుకొందాం. మీ కూతురు గూర్చి సందేహ పడ్డది కూడా వాస్తవమే ననుకొందాం. మరి ఈ ప్రశ్నలే రివర్సులో మిమ్మల్ని నేనడిగితే!?

చిద: (దీర్ఘం తీస్తూ) ఏమిటయ్యా… . మమ్మల్నేమడుగుతావు?.

చక్ర: అదా… అది ఆ మీరంటున్న ఆ ఏడు సంవత్సరాలు నాతో కాపురం చేసిన ఈవిడ నన్నేమాత్రం అర్థం చేసుకుందాని…

బుజ్జి: అబ్బో… ఇది సరైన మడత పేచీనే… చిత్తైపోయింది సందెక్క!

చిద: నీ బొంద నువ్వూరుకోరా… మడత పేచీలేదు… మడత పూరీ లేదు.

సంధ్య: దానికి సమాధానం నేను చెపుతా బాబాయ్! చూడండీ… ఈ డైరీ దొరకనంతవరకూ వారు మంచి వారే!

చక్ర: దొరికిన తరువాత కూడా మంచివాణ్ణేనమ్మాయ్! నేను మీరనుకొన్నట్టు తాగుబోతునో, వ్యభిచారినో కాను. ఇవాళ కూడా నేను తాగలేదు. ఇదంతా నటన.

సంధ్య: సారీ… మీతో నేను మాట్లాడ్డం లేదు.

చిద: తప్పమ్మా! అలా అనకు. అల్లుడు బంగారం! అయినా అల్లుడూ! నా కూతురికి అసలు విషయం తెలియాలి కదయ్యా! లేకపోతే తను ఇలాగే నిత్యం ఏదో వూహించుకొని కుళ్ళి, కృశించి ఖచ్చితంగా ప్రాణాలపైకి తెచ్చుకొంటుంది. కనుక. ఆ డైరీలో వున్న ఆ ప్రయస్వప్నకూ నీకూ వున్నసంబంధమేమిటో దయచేసి చెప్పు?

సంధ్య: అదే… ఆ సంగతినే తేల్చమనండి బాబాయ్!ఇప్పుడే తేల్చమనండి. వారికీ ఆవిడకున్న సంబంధ మేమిటో ఇప్పుడే తేల్చమనండి.

చక్ర: సంబంధమా… అదీ… అదీ… ఆ ప్రియస్వప్నే నేను-నేనే ఆ ప్రియస్వప్నను!

చిద: అంటే…

చక్ర: అంటే ఏముంది! అది నా పెన్ నేమ్! కలం పేరండి మామగారూ!

చిద: కలం పేరా…

చక్ర: అవును మామగారూ! ఆశ్చర్యపోకుండా అందరూ వినండి. సంధ్యా… ముఖ్యంగా నువ్వు. నేనో రచయితనని మీ అందరికి తెలుసు. ఇక ఈ ప్రియస్వప్నఅన్నది నా కలం పేరు. ఈ పేరుతో నా వూహా లోకంలో ఓ అమ్మాయిని సృష్ఠించుకొని కథలు, కవితలను రాస్తుంటాను. పేరు బాగుందని స్నేహితులు చెప్పటంతో వూహాజగత్తులో ఆవిడనే నా ప్రేయసిగా వూహించుకొని నా స్నేహితుల దృష్టికి నేనో హీరోలా కనబడుతూ వచ్చాను ఇన్నాళ్ళు. ఈ కలం పేరే నా కొంప ముంచుతుందనుకోలేదు. ఇది కేవలం సరదా కోసమే తప్ప మీరూహించుకొన్నట్టు కాదు మామయ్యా! ఇక ఆ వుత్తరాలు గట్రా నాకు నేనే రాసుకొన్నవి. నా యీ గత చరిత్రను పెళ్ళయిన కొత్తల్లోనే సంధ్యకు చెప్పాలనుకొన్నాను. కాని సంసార గొడవల్లో పడి సందర్భం కలిసిరాక చెప్పలేదు. దానికి తగ్గట్టు నా కవిత్వం కూడా మూలబడి అటకెక్కింది.

దామో: మరా వుత్తరాలూ, పార్సిల్ ఎక్కన్నుంచొచ్చాయిరా!. అసలు ఇన్ని సమస్యలు ఏర్పడ్డానికి కారణం ఎవర్రా!?

చిద: నేనే బావగారూ! భర్త మీద సందేహాలను బాగా బలపరచుకొన్న నా కూతురిలో… వాటినంత సులువుగా తొలగించలేనని… ముల్లును ముల్లుతో తీసే ధోరణితో ఆ సందేహపు తెరలను తొలగించటానికి ఈ నాటక మాడాను… ఆ వుత్తరం, పార్సిల్ వగైరా వగైరాలను ఏర్పాటు చేసింది నేనే!(తలగోక్కొన్నాడు)

దామో: ఎంత పని చేశావయ్యా! అన్నెం పున్నెం ఎరుగని నా కోడల్ని చివరికి నేను సందేహించేలా చేశావు కదయ్యా! అమ్మా సంధ్యా…

దామో: మామగారూ!…

చక్ర: సారీ సంధ్యా! మామయ్య రచించిన ఈ నాటకంలో నేను పాత్రధారుణ్ణి. మేము ఈ నాటకం ఆడకపోతే ఈ జన్మలో నువ్వు నన్ను నమ్మే దానవు కావు. ఇప్పుడు నన్ను నమ్ముతావు కదూ!?

సంధ్య: సారీ అండీ! మిమ్మల్ని అపార్థం చేసుకొన్నందుకు నన్ను క్షమించరూ!?

చక్ర: క్షమాపణలన్నవి భార్యాభర్తల మధ్య వుండకూడదు సంధ్యా! నిజానికి ఏ స్త్రీ అయినా నీ స్థానంలో వుంటే అలాగే అనుకొంటుంది. రా సంధ్యా దగ్గరకురా…! (భర్త దగ్గరికి నడిచింది. ఆమెను కౌగిలికి తీసుకొన్నాడు చక్రవర్తి)

దామో: నువ్వు కరక్టమ్మా!తన స్వంతం అనుకొన్న ఏ వస్తువైనా సరే పరాయి పంచన చేరిందంటే ఏ ఆడదీ ఒప్పుకోదు. అందునా కట్టుకున్న భర్తంటే…

చిద: ఇక చెప్పాల్సిన అవసరమే లేదు కదమ్మా!

సంధ్య: అవును బాబాయ్! వీరు నా భర్త. నన్నే ప్రేమించాలి. నాకే స్వంతం. మరో స్త్రీ వంక కనీసం కన్నెత్తి చూసినా నేనోర్చుకోలేను, ఒప్పుకోను.

దామో: భలే! సాటి స్త్రీ సైతం నిన్ను చూసి తెలుసుకొని భర్తను జాగ్రత్త పరచుకునేలా బాగా చెప్పావమ్మా. (అందరూ నవ్వుతుండగా…)

(తెర)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here