కరోనా కాలక్షేపం

3
4

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం 12 గంటలయింది. అప్పటిదాకా పడ్డ శ్రమతో అలసిపోయిన శైలజ పది నిముషాలు కూర్చుంటేగానీ నడుం పని చెయ్యదని కుర్చీలో కూలబడింది. రెండు నిముషాలు ఊపిరి పీల్చుకుందో లేదో ఫోన్. ఫోన్ దగ్గర పెట్టుకోవటం మర్చిపోయింది. నీరసంగా లేచి ఫోన్ తీసుకుని మళ్ళీ కుర్చీలో కూలబడింది ‘హలో’ అంటూ.

“హలో, నేనమ్మా ఎదురుకుండా షాపు శ్రీనుని. బాగున్నారా?” ఒక్క క్షణంలో వెయ్యి ప్రశ్నలు ఎదురుకుండా షాపు యజమాని శ్రీను ఎప్పుడన్నా మంచినీళ్ళకని వస్తాడు. అయితే సరాసరి ఇంటికి వస్తాడుగానీ ఇలా ఫోన్ చెయ్యడు. ఇవాళ ఇలా కొత్తగా ఫోన్ చేస్తున్నాడేమిటి? షాపు తియ్యలేదా? అని తొంగి చూసింది. షాపు తీసే వుంది. శ్రీను షాపులోంచే మాట్లాడుతున్నాడు. ఏమిటా అనుకుంటూ, “ఏమిటి శ్రీనూ, షాపులో వుండే ఫోన్ చేస్తున్నావు? ఏంటి విశేషాలు?” మామూలుగా పలకరించింది.

“అమ్మా, రమేష్ బాబుకి బాగా లేదంటకదమ్మా! నిన్న సాయంకాలం ఆఫీసుకెళ్ళేటప్పుడు చూశాను… బాగానే వున్నారు కదమ్మా. ఎట్లా కనుక్కున్నారు? ఆఫీసులో పరీక్ష చేశారా? ఆస్పత్రికి తీసుకెళ్ళేరా లేదా? మీరు జాగ్రత్తగా వుండండమ్మా. ధైర్యంగా వుండండి” ప్రవాహంలా సాగిపోతున్న శ్రీను మాటలు అర్థం కాలేదు శైలజకి ముందు. “ఏమిటి శ్రీనూ ఏమంటున్నావు? పరీక్ష ఏమిటి? ఆస్పత్రి ఏమిటి??” అయోమయంగా అడిగింది శైలజ.

“అదేనమ్మా, రమేష్ బాబుకు కరోనాట కదా. అది తెలిసే ఫోన్ చేశాను”

“ఏంటి శ్రీనూ? రమేష్‌కి కరోనా ఏమిటి. నైట్ డ్యూటీ కదా. పడుకుని నిద్ర పోతున్నాడు. వాళ్ళ దోస్తులెవరన్నా చెప్పారా నీకు? నాకెవరూ చెప్పలేదే!? ఆఫీసులో టెస్టు చేయించుకున్నాడా!? అయినా టెస్టు రిజల్ట్స్ అంత వెంటనే రావు కదా” అంది. మరి వీడేంటి తనతో ఏమీ చెప్పకుండా మామూలుగా పడుకుని నిద్రపోతున్నాడు. కొడుకూ, శ్రీనూ ఒకే ఈడు వాళ్ళుగనుక స్నేహితులే. కొడుకు స్నేహితులంతా కూడా శ్రీనుకి తెలుసు. అలా ఎవరన్నా చెప్పారా అనే అనుమానం. అయినా కొడుకునే అడుగుదామని గదిలోకి వెళ్ళింది. కాని ప్రశాంతంగా నిద్ర పోతున్న కొడుకుని లేపలేకపోయింది. కొడుకుకి కరోనా అనుకోవటానికే భయపడ్డది తల్లి గుండె. నిన్నటిదాకా బాగానే వున్నాడు. అలాంటిదేమన్నా వస్తే ఎలా? రామ లక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులని చూసుకునే బతుకుతోంది తను 15 సంవత్సరాల క్రితం భర్త పోయిన దగ్గరనుంచీ. ఇప్పుడు చిన్న కొడుక్కిలా అంటే కళ్ళనీళ్ళు ఆగటం లేదు. అయినా అలాంటి విషయాన్ని కూడా వీడెంత తేలిగ్గా తీసుకున్నాడు. తనకి చెప్తే దిగులు పడతానని చెప్పకపోవచ్చు. పెద్దాడికైనా చెప్పాడా లేదా. పెద్ద కొడుక్కి ఫోన్ చేసి అడుగుదామనుకుంది కానీ రాత్రి 12 గం. ల దాకా ఆఫీసు పనే సరిపోయిందని, పొద్దున్నే ఫోన్ చెయ్యకపోతే కంగారు పడద్దని రాత్రి వాడు పెట్టిన మెసేజ్ గుర్తొచ్చి ఆగింది. పెద్ద కొడుకూ కోడలూ ఆఫీసుకి దగ్గరగా ఇల్లు తీసుకుని వున్నారు రోజూ 4, 5 గంటలు ఆఫీసుకెళ్ళి రావటానికే సరిపోతోంది ఇక్కడినుంచి, అసలు రెస్టు సరిపోవటం లేదని.

ఎవరితోనూ పంచుకునేందుకు లేకపోయేసరికి మనసంతా ఆందోళనతో నిండి పోయింది శైలజకి. చిన్న కొడుకు రమేష్‌కి కరోనానా!! ఎలా తెలిసింది? తనకి చెప్పలేదేం? కంగారు పడతాననా? అసలు ఇంట్లో వున్న తనకి తెలియకుండా ఎదురుకుండా షాపతనికి ముందు ఎలా తెలిసింది? ఆలోచనలు తెమలకుండానే ఇంకో ఫోను.

నాలుగిళ్ళవతల వుండే సుబ్బలక్ష్మిగారినుంచి. “ఏంటమ్మా శైలజా, రమేష్‌కి ఒంట్లో బాగాలేదా? ఒక్కదానివి ఏం చేస్తున్నావు? పెద్దాడు వచ్చాడా? రాలేదా? ఒక విధంగా రాకపోవటమే మంచిదిలే. కోడల్ని అసలు రావద్దను. అసలే ఒట్టి మనిషికాదు.” ‘హలో హలో’ అని శైలజ హలోలు వినకుండానే సాగిన వాక్ప్రవాహానికి అప్పటికి కామా దొరికింది. ఆ ఖాళీ వదలలేదు శైలజ.

‘ఏమిటి సుబ్బలక్ష్మిగారూ, రమేష్‌కి ఒంట్లో బాగాలేదని మీకెవరు చెప్పారు? వాడు మామూలుగా నైట్ డ్యూటీనుంచి వచ్చి పడుకున్నాడు. ఒంట్లో బాగాలేదని నాకేమి చెప్పలేదే! మీకెలా తెలిసింది!!?” ఆశ్చర్యంగా అడిగింది శైలజ ఆవిడకెవరు చెప్పారా అని.

“మా పనిమనిషి రాములమ్మలేదూ. తను చెప్పింది. పొద్దున్న పనికి వచ్చినప్పుడు. నాకు ఫోన్ చెయ్యటానికి ఇప్పటికి తీరిక దొరికింది. అయినా మీరూ ఆస్పత్రికి వెళ్ళే హడావిడిలో వుంటారుకదా. కొంచెం స్ధిమితంగా చేస్తే వివరాలు తెలుస్తాయనుకున్నాను.”

“మీ పనిమనిషి రాములమ్మ చెప్పిందా? ఆ అమ్మాయి ఇవాళసలు ఇటువైపే వచ్చినట్లులేదుకదా. తనకెలా తెలిసింది?”

“అదే ఇవాళ మీ ఇంట్లో కొత్తగా పనికి చేరిన మల్లమ్మని ఈ అమ్మాయే పెట్టిందటకదా. మల్లమ్మ మీ ఇంటినుంచి వస్తుంటే రాములమ్మ కనిపించిందట. పొద్దున్న కరోనా టెస్ట్ చెయ్యటానికి మీ ఇంటికి మనిషి వచ్చాడుట కదా.”

అప్పటికి బుఱ్ఱలో లైట్ వెలిగింది పొద్దున్ననుంచీ జరిగిన సంఘటనలన్నీ కళ్ళముందు తిరిగిన శైలజకి. వచ్చే నవ్వుని, కోపాన్ని ఆపుకుంటూ, “సుబ్బలక్ష్మిగారూ, రమేష్ సుబ్బరంగా వున్నాడు. ఏ అనారోగ్యమూలేదు. నైట్ డ్యూటీ నుంచి వచ్చి మామూలుగా నిద్రపోతున్నాడు. ఏం జరిగిందో నేనంతా కొంచెంసేపాగి వివరంగా చెబుతాను. మీరేం కంగారు పడకండి. ఎవరన్నా అడిగినా ఏమీ లేదని చెప్పండి. ముందు మల్లమ్మని పట్టుకోవాలి… మల్లమ్మ ఎక్కడన్నా కనబడితే ఒకసారి వచ్చి వెళ్ళమనండి”… హడావిడిగా ఫోన్ పెట్టేసింది. అప్పటికే ఇంకో నాలుగు మిస్డ్ కాల్స్. నలుగురు దగ్గరనుంచి. అందరూ దీనికే చేసుంటారు. ఒక విధంగా సంతోషం అనిపించింది. సోషల్ డిస్టెన్స్ అంటూ మనిషి మనిషికీ దూరం ఎక్కువవుతున్న ఈ రోజుల్లో, కాలనీలో అంతా ఒకటిగా వుంటారుగనుక, కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటారు గనుక కరోనా వచ్చిందన్నా ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. కొన్నిచోట్ల మనిషికి మనిషి దిక్కే వుండదు కదా. మల్లమ్మ ఎంత పని చేసింది. మల్లమ్మని కుదిర్చిన కుమారి ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతోంది. పొద్దున్ననుంచి జరిగిన సంఘటనలన్నీ చక్రాలు తిరగసాగాయి కళ్ళముందు.

కరోనా గోలతో పనిచేసే కమలమ్మ ఊరు వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళ ఊళ్ళో ప్రశాంతమైన వాతావరణం, పైగా వాళ్ళకి ఇల్లు, పొలం వుంది. అందుకే రెండు నెలలకొకసారయినా ఊరెళ్ళి వస్తుంది. ఇప్పుడయితే హైదరాబాద్‌లో కరోనా గోల ఎక్కువగా వుందనీ, ఏదన్నా అయితే ఇక్కడ చూసేవాళ్ళుండరనీ, ఆస్పత్రి అందుబాటులో వుండదనీ ఊరెళ్ళిపోయింది. పని చేసుకోలేక వేరేవాళ్ళకి చెబితే రాములమ్మ ఈ అమ్మాయిని తీసుకొచ్చింది నిన్న సాయంకాలం. అన్నీ మాట్లాడుకుని మర్నాడు ఉదయం 5 గంటలకల్లా వస్తానని చెప్పి వెళ్ళింది.

మల్లమ్మ కోసం 4 గంటలకే లేచి సామానంతా సర్ది బయట వేసింది. కొత్తిల్లు చీకటిగా వుంటే భయపడుతుందేమోనని ఇంటి చుట్టూ లైట్లు వేసి పెట్టింది. కాఫీ తాగి మల్లమ్మ కోసం కూడా కాఫీ రెడీగా పెట్టి ఎదురు చూస్తూ అలాగే చిన్న కునుకు కూడా తీసింది. పొద్దున్న 7 గంటలకు వచ్చింది మల్లమ్మ. “ఏం మల్లమ్మా 5 గంటలకొస్తానన్నావని నేనప్పుడే లేచి కూర్చున్నానంటే…”, “నిద్ర పోయానమ్మా, మెలకువ రాలేదు. రేపటినుంచొస్తానులే” అంది.

“సరే. ముందు ఇల్లు చిమ్ము” అని మల్లమ్మ లోపలకి రాగానే, “బాబు నిద్ర పోతున్నాడు. శబ్దం కాకుండా చెయ్యి” అని తను హాల్ లోకి వెళ్ళింది ఎవరో పిలిస్తే. ఆదిత్య హాస్పిటల్ నుంచి టెక్నిషియన్ వచ్చాడు. షుగర్ లెవల్ తేడా వుందనిపించి డాక్టరుగారికి ఫోన్ చేస్తే, ఈ కరోనా గోలల్లో నువ్వు రావద్దమ్మా, నేనే టెక్నీషియన్‌ని అపాయింట్ చేశాను. అతనింటికొచ్చి టెస్టు చేస్తాడు అంటే మరీ సంతోషించింది. నైట్ డ్యూటీ చేసొచ్చి నిద్రపోయే చిన్న కొడుకు నిద్ర మానుకుని తనకోసం రావక్కరలేదని. అతను ఉదయం 7 గంటలకి వస్తానంటే సరేనన్నది.

7 గంటలకి టెక్నీషియన్ వచ్చాడు. డాక్టర్ గారు కొంచెం జాగ్రత్తపరులు. అతనికి మాస్క్, గ్లౌజ్ వగైరాలే కాకుండా అనేక చోట్ల తిరుగుతూ వుంటాడు కదాని తలకి గ్లాస్ షీల్డ్ వగైరా ఆర్భాటాలని కూడా కొన్ని ఏర్పాటు చేశాడు. అతను వచ్చినా రమేష్ నిద్ర లేవలేదు. అవసరం కనిపించక శైలజ కూడా లేపలేదు. టెక్నిషియన్ బ్లడ్ శాంపుల్ తీసుకుని వెళ్తూ, మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్తుంటే అతని వెనకాలే వాకిట్లోకొచ్చిన శైలజకి చీపురు వాకిట్లో అడ్డంగా పడి వుండటం, మల్లమ్మ గబగబా గేటు దాటటం కనిపించింది. మల్లమ్మ ఎందుకలా హడావిడిగా వెళ్ళిపోతోందో అర్థం కాలేదు శైలజకి. వెనకనుంచి పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళి పోయింది.

అయోమయంలో వుండిపోయింది శైలజ. ఏ బాత్ రూమ్ కన్నా తొందరగా వెళ్ళాల్సి వెళ్ళిందేమోనని కాసేపు ఎదురు చూసింది. ఎంత సేపటికీ రాకపోయేసరికి నెమ్మదిగా ఒక్కక్క పని చేసుకుంది. మల్లమ్మ వస్తుంది కదాని బయట పడేసిన గిన్నెలన్నీ మళ్ళీ ఇంట్లోకి ఏమి తెస్తానులే అని అక్కడే కింద కూర్చుని కడిగే సరికి అసలే నడుం నొప్పితో బాధపడే శైలజకి నడుం విరగ్గొట్టినట్లయింది. మల్లమ్మ ఎందుకంత అర్జంటుగా ఏమీ చెప్పకుండా పరిగెత్తిందో తెలియలేదు. పోనీ మళ్ళీ వచ్చి ఏ సంగతీ చెప్పలేదు. పైగా ఈ ఫోన్లొకటి. రమేష్‌కి ఒంట్లో బాగాలేదుటగా, కరోనాట కదా, టెస్టులు చేయించారా అంటూ.

నెమ్మదిగా రాములమ్మని పట్టుకుని కూపీ లాగింది. వీళ్ళింటినుంచీ వెళ్తూనే మల్లమ్మ ఇంకో రెండిళ్ళకి పనికి వెళ్ళింది. ఆ రెండిళ్ళల్లోనూ సమాచారం ఇచ్చేసింది. వాళ్ళింట్లో ఇవాళే చేరాను. బాబుకి జ్వరం లేవకుండా పడుకున్నాడు. అమ్మకి కూడా ఆ మాయదారి రోగం వచ్చినట్టుంది. డాట్టరు వచ్చి పరీచ్చ చేసి వెళ్తున్నాడు. ఆ రోగానికి వస్తారు కదా అన్నీ ముసుగులేసుకుని అట్టా వచ్చాడు డాట్టరు కూడా. ఆ ఇంటో చేస్తే నాగ్గూడా వత్తాదేమోనని చెప్పా పెట్టకుండా వచ్చేశా. అయినా ఆళ్ళు మాత్రం ముందు చెప్పొద్దామ్మా. పిల్లా పాపా కలోళ్ళం ఏదన్నా వత్తే మేమెక్కడికి పోతాం అని కాలనీలో అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ వీలయినంత మందికి చెప్పేసింది. అలా రాములమ్మ ద్వారా ఇంకొతమందికి వెళ్ళి తెలిసినవాళ్ళు ఫోన్లు మొదలు పెట్టారు. అలాంటిదేమన్నా వుంటే ముందే కాలనీలో మిగతావాళ్ళకి చెప్పాలనుకున్నాము కదా శైలజ గారెందుకు చెప్పలేదు. అసలు వాళ్ళబ్బాయి నిన్న కూడా ఆఫీసుకెళ్ళటం చూశాం కదా. ఎప్పుడయింది అంటూ ఆరాలు.

ఆరాలులో వడ్ల గింజలో బియ్యం గింజ మల్లమ్మ అనుమానం, భయం, కాలనీలో ప్రచారం అన్నీ బయటకి వచ్చాయి. కానీ మల్లమ్మ ప్రచారంతో ఇప్పుడు శైలజకి కాలనీలో పని మనుషులు దొరకటం కష్టమయింది. వాళ్ళింట్లో ఎవరికీ ఏమీ రాలేదని, అందరూ ఆరోగ్యంగా వున్నారనీ, కాలనీలో అందరికీ చెప్పాల్సి వస్తోంది మల్లమ్మ ప్రచారం అలా పాకిపోయింది మరి. పని చెయ్యాల్సిన ఇంట్లో అంతా ఆరోగ్యంగానే వున్నారు అని పక్కవాళ్ళు సర్టిఫై చెయ్యాల్సి వస్తోంది శైలజ ఇబ్బందులెలా వున్నా నాలుగు రోజులపాటు కాలనీలో అందరికీ కరోనాతో కాలక్షేపం అయింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here