రామం భజే శ్యామలం-2

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర.  [/box]

సాంస్కృతిక విధ్వంసం

[dropcap]రా[/dropcap]మాయణం మనకే కాదు.. విశ్వానికే ఒక అద్భుతమైన సంస్కృతిని, నియమిత జీవన విధానాన్ని అందించింది. భారతదేశాన్ని వేల ఏండ్లుగా కలిపి ఉంచింది.. నిలిపి ఉంచింది ఈ సంస్కృతే, ఈ జీవన విధానమే. రామాయణ కాలం ఇప్పటికి ఏడు వేల ఏండ్లకు క్రితం జరిగినట్టు ప్రఖ్యాత చరిత్రకారులు పీవీ వర్తక్, కోట వెంకటాచలం వంటి వారు సహేతుకంగా నిరూపించారు. అంతకు ముందు ఐదువేల ఏండ్లకు ముందే మనకు కొంత వైదిక విజ్ఞానం, సంస్కృతి ఉన్నాయి. కొందరు విశిష్టమైన వ్యక్తులు సృష్టి రహస్యాన్ని అన్వేషించారు. వారి అద్భుతమైన మేధ చుట్టూ మన నాగరికత, సంస్కృతి విస్తరించాయి. నాగరికత అభివృద్ధి, పరిణామాలు ఇతర దేశాల్లో ఏ ఒక్క వ్యక్తి ద్వారా మాత్రమే వికసిస్తే. మన దేశంలో అనేక ఋషులలో వ్యక్తమైన అద్భుతమైన పత్రిభ చుట్టూ విస్తరించింది. మనం మన నాగరికత గొప్పతనాన్ని ప్రాచీన ఇతిహాస యుగంలో దొరికే కొన్ని శిథిలాలు, లేదా చిహ్నాల నుంచి గుర్తించలేం. ప్రాచీన భారతదేశాన్ని అధ్యయనం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన పరికరాలు తప్పనిసరిగా కావాలి. రామాయణ కాలానికి ఈ వైదిక సంస్కృతి ఉపఖండం నిండా వ్యాపించి ఉన్నది. మనకు తెలిసిన చరిత్రకు పూర్వకాలంలోనే దక్షిణాదిన శ్రీలంకలో వేదాలను, యజ్ఞయాగాదులను జీవన విధానంగా అనుసరించిన సమాజమున్నది. అయోధ్య రాముడు.. ఈ సంస్కృతిని, నాగరికతను, జీవన విలువలను, కుటుంబ వ్యవస్థను, సామాజిక బాధ్యతను ముందుగా తన్ను తాను అనుసరించి.. లోకానికి దారి చూపించాడు. ఆసేతు హిమాచలం.. అన్ని దిశలకు చెందిన ప్రజలు ఈ నాగరిక భావనలను, సంస్కృతిని తమంతట తాముగా స్వీకరించి అనుసరించారు. ఒకరు అదేపనిగా ఉపదేశాలు చేయడం, వారి వారి విశ్వాసాలను మార్చివేసి.. తమ విశ్వాసాల పరిధిలోకి ఆకర్షించడం లాంటి వ్యవస్థలు ఆనాడు ఎక్కడా లేవు. ఒక పక్క కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూనే సమాజపు అవసరాలను బట్టి రక్షణ, నగర నిర్మాణాలు, వ్యవసాయం వంటి రకరకాల పనులకు సంబంధించిన వ్యవస్థలు ఏర్పడ్డాయి. సమాజం కోసం ఎన్ని మార్పులు చేసినా.. కుటుంబ వ్యవస్థ, విలువల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించారు. రామాయణంలో మహిళల పట్ల వివక్ష చూపలేదు. అసలు.. రామాయణం మరో పేరే సీతాయాశ్చరితం మహత్. కైకేయి, తార వంటి వారు అసాధారణ మంత్రాంగం నడిపినవారు. రాముడిని లంకదాకా తీసుకొని వెళ్లిందే సీతాదేవి. ‘నేను ముందు నడుస్తూ నీ దారిలో రాళ్లూ ముళ్లు తొలిగిస్తాను’ అని అంటూ ఆమె నడిచింది. లంక సమాజంలో మోరలను దెబ్బతీసింది. మహిళను కాపాడటమే లక్ష్యంగా రామాయణం సాగింది. ఈ జీవనవిధానమే భారతీయమైంది. భారతీయులను సహస్రాబ్దులుగా కలిపి ఉంచుతున్నది. మంగోలియన్లు, తురుష్కులు, యవనులు, బ్రిటిష్ వాళ్లు వందల ఏండ్ల కొద్దీ దాడులు జరిపి ఆక్రమించుకొన్నా ఇక్కడి ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలో వేలు పెట్టలేకపోయారు. సమస్తమైన స్వాతంత్ర్య సంగ్రామాన్ని సైతం గాంధీ నోటివెంట వచ్చిన రామశబ్దమే తారక మంత్రమై జనావళిని ముందుకు నడిపించింది. గాంధీ కంటే ముందు బాలగంగాధర్ తిలక్ కూడా జాతి ఏకతామంత్రంగా రామతారకాన్నే ప్రయోగించాడు. అలాంటి వ్యవస్థను విచ్చిన్నం చేసే ఒక పెద్ద, భయంకరమైన, దుర్మార్గమైన కుట్ర స్వతంత్ర భారతదేశంలో జరిగింది. స్వాతంత్ర్యం రావడానికి ముందునుంచే హిందూ ధర్మాన్ని విస్మృతం చేయడానికి, బౌద్ధానికి మార్కెటింగ్ చేసిన నెహ్రూ, అంబేద్కర్ ద్వయం.. హిందువుల జీవనవిధానాన్ని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి హిందూ కోడ్ బిల్లు ద్వారా కారణమయ్యారు. భారతదేశంలో హిందువుల కుటుంబాల్లో మహిళలకు తీరని అన్యాయం జరుగుతున్నదని.. (ఇతర మతాల్లో అద్భుతంగా మహిళలను గౌరవిస్తున్నారని వారి అభిప్రాయం) వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి ఈ ఇద్దరు నేతలు అద్భుతమైన సంస్కర్తలై హిందువుల సముద్ధరణకు పూనుకున్నారు. ఈ సముద్ధరణలో భాగంగా స్వతంత్ర భారతంలో హిందూ కోడ్ బిల్లును ఒకదాన్ని తీసుకొచ్చారు. 1948 లోని హిందూ సమాజాన్ని ఆధునీకరించడానికి హిందూ కోడ్ బిల్లును తీసుకొస్తున్నామని ఈ ఇద్దరు నాయకులు తెలిపారు. వాస్తవానికి భారతదేశంలో ఎప్పుడూ ఉమ్మడి పౌరస్మృతి అన్నది లేనే లేదు. ఏ మతానికి ఆ మత సంబంధమైన ధర్మాలు, ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి.

కానీ ఈ ఇద్దరు నేతలు మాత్రం మిగతా మతాల జోలికి పోకుండా, హిందూ ధర్మాన్ని ‘ఆధునీకరించాలని’ కంకణం కట్టుకున్నారు. రాజ్యాంగంలోని 44 వ ఆర్టికల్‌లో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కలిపి ఒకే పౌరస్మృతి ఉండాలని ఈ నాయకుల బృందమే రాసింది. వీళ్లు తెచ్చిన హిందూకోడ్ బిల్లుకు ఆ ఆర్టికల్ స్పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బిల్లును వ్యతిరేకించేవారు ప్రధానంగా రెండు అంశాలు ప్రస్తావించారు. వీటిలో మొదటిది మతపరమైన పర్సనల్ చట్టాల్లో బ్రిటిష్ పాలకులు కూడా జోక్యం చేసుకోలేదు. మరి మీరెందుకు చేస్తున్నారని.. రెండవది పౌరస్మృతి అనేది పౌరులు తమ మతాన్ని అనుసరించే హక్కును ప్రభావితం చేస్తుందని.. ఈ అభ్యంతరాలకు అంబేద్కర్ ఒక్కటే మాట చెప్పారు. ఈ ‘పర్సనల్ లా’ లు ఇలాగే కొనసాగితే సమాజం ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతుందని.. ముందుకు సాగదని అన్నారు. కేవలం హిందూ సమాజంలో మాత్రమే మార్పులు జరగాలని, ఆధునీకరణ జరగాలని, హిందూ సమాజం మాత్రమే ముందుకు పోవాలని ఇతర మతాలు ఎక్కడి గొంగడి అక్కడే ఉండాలని.. పురోగమించకూడదని అంబేద్కర్ అనుకున్నారేమో.. అందుకే హిందూ కోడ్ బిల్లును మాత్రమే ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ కుట్ర 1941 నుంచే మొదలైంది. బీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటైన ఒక కమిటీ దేశమంతా తిరిగి 1946 నాటికి హిందూ కోడ్ బిల్లుకు ఒక ముసాయిదా తయారుచేసింది. 1948లో అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ దీనిని పరిశీలించి ఇందులో చాలా మార్పులను ప్రతిపాదించింది. ఈ బిల్లులో ప్రధానమైన ప్రతిపాదిత అంశాలు నాలుగు ఉన్నాయి. 1. ఈ చట్టం మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పిస్తుంది. 2. హిందూ ధర్మం వివాహాన్ని పవిత్రంగా భావిస్తుంది. దాంపత్యమనేది ఎప్పటికీ తెగని లంకెలా కొనసాగాలని కుటుంబ వ్యవస్థ సమాజానికి మంచిదని భావిస్తుంది. కానీ ఈ బిల్లు స్త్రీ పురుషులిద్దరూ తమకు పరస్పరం పడకపోతే చాలు.. విడాకులు తీసుకొని విడిపోవచ్చని ప్రతిపాదించింది. మూడోది కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, నాలుగోది విధవా పునర్వివాహం, విడాకులు తీసుకొన్నవారు తిరిగి పెళ్లి చేసుకోవడం. ఈ నాలుగు కాకుండా ఏ కులం వారినైనా దత్తత తీసుకొనే అవకాశం ఈ బిల్లు హిందువులకు కల్పించింది. ఈ బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కమ్యూనిస్టులు ఈ బిల్లును సంపూర్ణంగా సమర్థించారు. పైగా సంస్కరణలను చాలా నెమ్మదిగా తీసుకొస్తున్నారని నెహ్రూ, అంబేద్కర్లపై విరుచుకుపడ్డారు కూడా. కొందరు నాయకులైతే వ్యవసాయ ఆస్తిని మినహాయించాలని కోరారు. అన్నింటికంటే మించి విడాకుల బిల్లుపై తీవ్రమైన చర్చ జరిగింది. హిందూ ధర్మం ప్రకారం వివాహం అనేది విడదీయరాని బంధంగా భావిస్తారని ఇలాంటి చట్టాలు తీసుకొని రావద్దని పలువురు వ్యతిరేకించారు. ఈ బిల్లును ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ వ్యతిరేకించారు. హిందూ కోడ్ బిల్లు వ్యతిరేక కమిటీ ఒకటి ఏర్పడింది. హిందూ ధర్మశాస్త్రాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ కమిటీ రాజ్యాంగసభను డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా దీనిపై అనేక సభలు, సమావేశాలు, చర్చలు జరిగాయి. దేశమంతటా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరిగాయి. పార్లమెంట్ ముందు హిందూకోడ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు పెల్లుబికాయి. అంబేద్కర్, నెహ్రూ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కానీ, నెహ్రూ, అంబేద్కర్ ఒక్క అడుగు కూడా వెనుకకు తగ్గలేదు. బిల్లును ఆమోదింపజేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ఈ బిల్లు కేవలం హిందువులకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారు? మిగతా మతాలకు ఎందుకు చేయడం లేదని పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని ప్రశ్నించారు కూడా. దానికి నెహ్రూ సమాధానమిస్తూ ‘ముస్లింలు ఈ ఆధునీకరణకు ప్రస్తుతానికి సిద్ధంగా లేరని’ జవాబు చెప్పారు. చివరకు రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నెహ్రూకు బిల్లుపై అభ్యంతరం చెప్తూ లేఖ కూడా రాశారు. ఈ చటాన్ని వర్తింపజేస్తే అన్ని మతాలకు వర్తింపజేయాలని, లేకపోతే బిల్లును చెత్తబుట్టలో పడేయాలని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా నెహ్రూ పట్టించుకోలేదు. అప్పటికి ఉప ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ ఉన్నారు. ఆయన జీవించి ఉ న్నంతవరకు నెహ్రూకు కాంగ్రెస్ పై పూర్తిగా పట్టు రాలేదు. 1950లో పటేల్ అనారోగ్యంతో కన్నుమూశాక నెహ్రూ తనకున్న సోషలిస్ట్ ఇమేజితో తన ఎజెండాను అమలుచేయడానికి పూనుకున్నారు. కానీ, పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందలేదు. అందులో నాలుగు క్లాజులు మాత్రమే ఆమోదానికి నోచుకున్నాయి. కేవలం ఈ కారణంగానే అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామాచేశారు. ఈ మాట ఆయన పార్లమెంట్ లోనే చెప్పారు. ఆ తర్వాత మీడియా ముందు కూడా పునరుద్ఘాటించారు. బయటకు వచ్చి షెడ్యూలు కులాల ఫెడరేషన్‌ను ఒకదాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1952 సాధారణ ఎన్నికల్లో తన సొంతపార్టీ పైనే అంబేద్కర్ పోటీచేశారు.

కానీ గెలవలేదు. అలహాబాద్‌లో నెహ్రూపై హిందూకోడ్ బిల్లు వ్యతిరేక వర్గం నుంచి ఒకరు స్వతంత్రంగా పోటీచేసినప్పటికీ నెహ్రూ గెలిచారు. ఎన్నికల్లో గెలిచాక నెహ్రూ మరింత తెలివిగా వ్యవహరించారు. హిందూ కోడ్ బిల్లును ముక్కలు ముక్కలుగా చేశారు. వివాహం, విడాకులు, సంరక్షణ, వారసత్వం, దత్తత, భరణం.. ఇట్లా రకరకాలుగా విడగొట్టి.. బిల్లులను ఆమోదింపజేసుకున్నారు. అప్పటికీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనప్పటికీ  ఇక చట్టాలు కావడం అసాధ్యం కాలేదు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు పెద్దలు కుదిర్చే వివాహాలను వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేశారు. చివరకు అంబేద్కర్ కోరుకున్నది.. నెహ్రూ తలచుకున్నది పలు వాయిదాల పద్ధతిలో అమలు అయింది. ఆ తరువాత హిందువులకు మాత్రమే వర్తించేలా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చి పెట్టారు. దీనికోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అయింది. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలన్నారు. ముస్లింలు మాత్రం ఎంతమందినైనా కనవచ్చని పరోక్షంగా స్వేచ్ఛను కల్పించారు. 1956లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత హిందూ సమాజంలో సంస్కరణలు తీసుకురావడంలో అంబేద్కర్ కృషిని నెహ్రూ బ్రహ్మాండంగా కొనియాడారు. అంబేద్కర్ కోరుకున్న సమగ్ర చట్టాన్ని తాను ముక్కలు ముక్కలుగానైనా అమలుచేశానని ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా.. ఇంకా చెప్పాలంటే.. రాకముందునుంచి కూడా ఈ దేశంలో హిందూ సమాజాన్ని, సంస్కృతిని బలహీనపరచడానికి కుట్ర జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాము అనుకున్నది సాధించారు. ముందుగా తెలివిగా బౌద్ధాన్ని ప్రమోట్ చేశారు.

దానికి సమాంతరంగా హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థను విచ్ఛినంచేశారు. ముక్కలుగా నైనా సరే.. అమలుచేసిన హిందూకోడ్ బిల్లు వల్ల ఈ దేశంలో ఉమ్మడి కుటుంబాలు నాశనమయ్యాయి. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. చిన్న కుటుంబాల సంప్రదాయం వచ్చిపడింది. చిన్న చిన్న గొడవలకే దంపతులు విడిపోవడం మొదలైంది. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు.. ఒంటరి తల్లిదండ్రులు.. ఎక్కడ చూసినా వారే.. అలనాపాలనా లేదు. మంచి చెడుచెప్పేవారు లేరు. ఫలితంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు.. శిశు సంరక్షణ కేంద్రాలు పుట్టుకొచ్చాయి. అనాదిగా ఈ దేశంలో పరిఢవిల్లిన విలువల వలువలు విప్పి నగ్నంగా నడివీధిలో నాట్యమాడించే పరిస్థితి నెలకొన్నది. పెచ్చరిల్లిపోయిన విశృంఖలత్వం.. నిర్భయ, దిశల వంటి వారిని బలిపీఠం పైకి ఎక్కిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాముడి రాజ్యంలో రావణులు జడలు విచ్చుకొని తిరుగుతున్నారు. ఇంతగా పతనావస్థకు చేరుకున్నాక.. ఇప్పుడు కొందరు పాలకులు విలువల బోధన గురించి మాట్లాడుతున్నారు.

ఈ సాంస్కృతిక విధ్వంస రచన కేవలం చట్టాలతోనే ఆగిపోలేదు. అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చింది. భారతీయ చరిత్రను, విద్యావిధానాన్ని సమూలంగా మార్చడం మొదలైంది. పాఠ్యపుస్తకాల్లో, చరిత్రలో, సంస్కృతిలో.. మత సామరస్యంలో ముస్లింలు గొప్పవాళ్లయ్యారు. మొఘలే ఆజం నుంచి నిన్నమొన్నటి జోధా అక్బర్, బాజీరావు మస్తానీ వరకు ముస్లింలకు కీర్తికిరీటాలు తొడుగుతూ.. సినిమాలు వచ్చాయి. హిందూ చరిత్రలో మొత్తం అరాచకాలు, మూఢ నమ్మకాలు, పిచ్చి ఆచారాలు, సంప్రదాయాలు.. ఉన్నట్టుగా.. హిందూ రాజులు దుర్మార్గులుగా, కొండొకచో కమెడియన్లుగా, స్త్రీలోలురుగా చిత్రీకరించారు. మన రామరాజ్యంలో ఇదొక పార్శ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here