అలనాటి అపురూపాలు-25

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

జయలలిత తల్లిగా గుర్తుండే వేదవల్లి/నటి సంధ్య:

తన తరంలో తానో చక్కని నటి అయినప్పటికీ, తన కూతురే ఎదిగి మరింత గొప్ప నటిగా రాణించడంతో ‘వేదవల్లి’ అనే కన్నా, జయలలిత తల్లి అంటే ఎక్కువగా గుర్తొచ్చే నటి సంధ్య గురించి ఈ వారం తెలుసుకుందాం.

వేదవల్లి పూర్వీకులు తమిళనాడులోని శ్రీరంగంకు చెందినవారు. వారు మూడు శాఖలుగా విడిపోయారు. ఒక శాఖ వారు అంధ్ర ప్రాంతంలోని గుంటూరు లోనూ, మరో శాఖ వారు అంధ్ర ప్రాంతంలోని నెల్లూరు లోనూ, మరో శాఖ వారు మైసూరు ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆమె తాతగారు నెల్లూరికి చెందినవారు. ఆయనకి ఆ ప్రాంతంలో భూములుండేవి, వారి గ్రామంలో ఆయన గొప్ప వ్యక్తిగా పేరు పొందారు. ఆమె భర్త యొక్క తండ్రి మైసూరుకి చెందినవారు. ఆయన పేరు డాక్టర్ నరసింహన్ రంగాచారి. ఆయన ప్రఖ్యాత సర్జన్. 1919లో 25వ మైసూరు మహారాజు – మహారాజ జయచామరాజేంద్ర వడియార్ గారు జన్మించినప్పుడు ఆయన రాజ వైద్యులుగా ఉన్నారు. రాజకుటుంబానికి ఆయనెంతో ఆప్తులు. ఆయన ఇల్లు కట్టుకున్నాక, ఆ భవనానికి ‘జయ విలాస్’ అని పేరు పెట్టుకున్నారు. రాచకుటుంబీకులు ఆయనను ‘జయరామన్’ అని పిలిచేవారు. వేదవల్లి తండ్రి రంగసామి అయ్యంగార్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగం నిమిత్తం శ్రీరంగం నుంచి మైసూరు తరలివెళ్ళారు. ఆవిడ తల్లి పేరు కమలమ్మాళ్. వేదవల్లికి శ్రీనివాసన్ అనే సోదరుడు, అంబుజవల్లి (నటి వేదవతి), పద్మవల్లి అనే సోదరీమణులు ఉన్నారు. వేదవల్లికి తన 16వ ఏట (ఆమె 1924లో జన్మించారు) నరసింహన్ రంగాచారి కుమారుడైన జయరామ్‌తో 1940లో వివాహమైంది (వేదవల్లి ఆయనకు రెండవ భార్య. మొదటి భార్య జయమ్మ, ఆమెకు  వాసుదేవన్ అనే ఒక కొడుకు, శైలజ అనే కూతురు ఉన్నారు). వేదవల్లి కుమారుడికి తండ్రి పేరులోని ‘జయ’ కలిసొచ్చేలా జయ కుమార్ అని పేరు పెట్టారు. రంగాచారి గారికి ‘జయ విలాస్’ మాత్రమే కాకుండా, ‘లలిత విలాస్’ అనే మరో ఇల్లు ఉండేది. జయలలిత జన్మించినప్పుడు ఈ రెండిళ్ళ పేర్ల నుండి ఆమెకు జయలలిత అనే పేరు పెట్టారు. అయితే జీవితచరిత్రకారులు మాత్రం జయలలిత పుట్టినప్పుడు వాళ్ళ అమ్మమ్మ పేరు ‘కోమలవల్లి’ అని పెట్టారనీ, ప్లే స్కూల్‌లో చేర్చినప్పుడు పేరుని జయలలితగా మార్చారని అంటారు. అయితే వేదవల్లి తన కూతురిని ‘అమ్ము’ అని పిలిచేవారు. ఆమె భర్తకి జాతకాలు, జ్యోతిష్యంలో ప్రవేశం ఉండేది. జయలలిత 24 ఫిబ్రవరి 1948న జన్మించారు. అది మాఘమాసం, పౌర్ణమి రోజు. హిందువులకు పవిత్రమైన రోజు. ఆ రోజు శుక్రవారం, ఆమె జన్మ నక్షత్రం మఖ (మఖ అంటే పెద్ద లేదా గొప్ప అని అర్థం. ఈ నక్షత్రం వారు కుటుంబంలోనూ, బయట ఉన్నత స్థానాలకు ఎదిగి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని విశ్వాసం. ఇది అధికారం, హోదా, ప్రాబల్యం, అత్యున్నత సాంఘిక మర్యాదకి చిహ్నం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తమ తమ రంగాలలో నాయకత్వ స్థాయికి ఎదుగుతారని భావిస్తారు). పైగా ఆ సమయం లోకమాత పార్వతీదేవి జనన సమయం కూడా కావడం విశేషం. వేదవల్లి భర్త ఎంతగానో సంతోషించారు. తమ కూతురు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని అందరికీ చెప్పేవారట. ప్రపంచ ప్రఖ్యాతి మాటెలా ఉంచినా, కనీసం ఒక నటిగా తన కూతురు పొందిన కీర్తిని కూడా ఆయన చూడలేకపోయారు. అయితే ఆయనకి సంబంధించిన ఒక్క జ్ఞాపకం తప్ప జయలలితకి ఆయన మరే రకంగానూ గుర్తులేకపోవడం విచారకరం. అప్పుడామె వయసు రెండేళ్ళే అయినప్పటికీ ఆ జ్ఞాపకాన్ని బాగా గుర్తుంచుకున్నారు (ఎంత ఆశ్చర్యకరం). అప్పుడు వేదవల్లి తన పుట్టింటి బెంగుళూరులో ఉన్నారు. ఏవో ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. ఆమెను చూసి వెళ్ళేందుకు గాను ఆమె భర్త బెంగుళూరు – మైసూరు మధ్య తిరుగుతుండేవారట. ఒక రోజున మైసూరు నుంచి ఏం తెమ్మంటావు అని ఆయన అడిగారట, ఆవిడేదో చెప్పారట, ఆయన సరేనన్నారట. ఆయన మైసూరు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఆయన గుండెపోటుతో మైసూరులో చనిపోయారనే దుర్వార్త వారికి అందింది. ఇది జరిగినది 1950లో. పిల్లల్ని తీసుకుని వేదవల్లి మైసూరు వెళ్ళారు. అమ్మ ఎర్ర చీర కట్టుకున్నట్టు, కారు వెనుక సీటులో తెల్లగుడ్డలో చుట్టిన నాన్న శరీరం జయలలితకు గుర్తున్నాయి. ఆ జ్ఞాపకం అక్కడే ఆగిపోయింది. అంతకు మించి తన తండ్రి గురించి ఆమెకింకేవీ గుర్తులేవు. అప్పట్నించి జయలలిత ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకునే ఉండేవారట.

వేదవల్లి గురించి ఇక్కడ కొంచెం చెప్పుకుందాం. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఆరో తరగతి వరకు మాత్రమే చదివారు. అయితే వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఒక పెద్ద గ్రంథాలయాన్ని అమర్చారు. ఇంటినిండా నౌకర్లు, కారు ఉన్న గొప్ప ధనవంతులైన కుటుంబం వారిది. ఆమెకెంతో ఖాళీ సమయం ఉండేది. ఇంటి లైబ్రరీలో నుంచి ఎన్నో పుస్తకాలు చదివేవారు. ఇంగ్లీషులో మాట్లాడం నేర్చుకున్నారు. వాళ్ళ నాన్నగారికి క్రమశిక్షణ అంటే ప్రాణం, ప్రతీ పని సరిగ్గా జరగాలని అనుకునేవారు. గోడకి వెళ్ళాడే చిత్రపటం సరిగా లేకపోయినా, పనివాళ్ళని పిలిచి దాన్ని సరిగ్గా వేళ్ళాడదీయించేవారట. వేదవల్లికి ఈ అలవాటు ఆయన్నుంచే వచ్చింది. భర్త మరణం తర్వాత, వారి ఆస్తులన్నీ కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి (జయలలిత తన సవతి తల్లిని, సవతి పిల్లలని ఎన్నటికీ క్షమించలేదు. వాళ్ళు తనకి సవతి తోబుట్టువులు అని బహిరంగంగా వెల్లడించినందుకు; తాము పేదరికంలో ఉన్నామంటూ తమకు ఆర్థిక సహాయం కావాలని కోరినందుకు జయలలిత వారిపై దావా వేశారు). మావగారు చాలా ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ, వేదవల్లి భర్త విలాసవంతమైన జీవనశైలి వల్ల చాలా ఆస్తులు కరిగిపోయాయి. ఆయన డబ్బు దాచి ఉంటే, ఆయన మరణాంతరం వేదవల్లికి పనిచేయవలసిన అవసరం వచ్చి ఉండేది కాదు. కేసుల కారణంగా వేదవల్లి తరచూ కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చేది, ప్రతీసారి కూతురు జయలలితను తీసుకువెళ్ళడం వీలయ్యేది కాదు. అమ్మంటే జయకి ప్రేమ అధికం కావడంతో, వారికదో సమస్య అయ్యింది. అందుకని వేదవల్లి తన సోదరుడి భార్య అయిన పద్మినికి జయ బాధ్యత అప్పజెప్పింది. జయలలిత తల్లి చీర చెంగుని వేలికి చుట్టుకునే నిద్రపోయేవారట. అందుకని జయలలిత నిద్రపోయాకా, జయ గుర్తు పట్టే వాసన కలిగిన ఆ చీరని విడిచి, మరో చీర కట్టుకుని వేదవల్లి బయటకు వెళ్ళేవారు. ఆమె విప్పిన చీరని పద్మిని కట్టుకుని జయ పక్కన నిద్రించేవారట. జయలలిత పెద్దయ్యాక, ఆమెతో హాస్యమాడుతూ, “ఖర్మ… మీ అమ్మ విప్పి వదిలేసిన చీర నేను కట్టుకోవాల్సి వచ్చేది” అన్నారట.  అయితే ఆస్తులు పోగొట్టుకుని, వేదవల్లి తన పిల్లలతో సహా వచ్చి తల్లిదండ్రులతో బెంగుళూరులో స్థిరపడ్డారు (వేదవల్లి తల్లిదండ్రులు తొలుత 1910-30 ప్రాంతాలలో శ్రీరంగంలో నెంబరు 91, ఈస్ట్ చిత్తిరాయ్ స్ట్రీట్‌ ఇంట్లో ఉండేవారు. అప్పట్లో అద్దెకున్న ఆ ఇంటి నుండి అదే వీధిలోని మరికొన్ని ఇళ్ళ తర్వాత ఉన్న నెంబరు 104 ఇంట్లోకి మారారు. ఆ ఇల్లుని వాళ్ళు కొనుక్కుని ‘కోమల విలాస్ వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ ఇల్లుని కొనుగోలు చేసిన వారు ‘కోమల విలాస్ అలమేలు ఇళ్ళం’ అని పేరు పెట్టుకున్నారు).

వేదవల్లి టైప్ రైటింగ్ నేర్చుకుని, షార్ట్‌హ్యాండ్‌‌లో కరెస్పాండెన్స్ కోర్స్ చేశారు. అప్పుడామెకు ప్రభుత్వంలో ఆహార, వ్యవసాయ కార్యదర్శి అయిన శ్రీ మాల్వే గౌండద్కర్ గారి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. 1950 నుంచి ఆమె ఆయనతో పని చేశారు. ఆ రోజుల్లో ఆమె తండ్రి, సోదరుడు కూడా హెచ్.ఎ.ఎల్.లో పని చేసేవారు. వేదవల్లి తండ్రి తొందరగా వెళ్ళాల్సి ఉండడంతో, ఆమె అమ్మ వంట త్వరగా చేసేవారు. ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే, జయలలిత తన పళ్ళెం తెచ్చుకుని ఆయనతో పాటు కూర్చునేవారట. ఆయన తినేసాకా కూడా జయలలిత తింటూనే ఉండేవారట, ఒక్క చేత్తోనే తాతగారికి టాటా చెప్పేవారట. ఆ తర్వాత ఆప్యాయంగా ‘చీనీ మామా’ అని పిలుచుకునే మావయ్యకి టాటా చెప్పేవారట. ఆ తరువాత జయ పక్కన అత్త పద్మిని కూర్చునే వారట. అప్పటికీ ఆమె తినడం పూర్తయ్యేది కాదట. ఆ తరువాత అమ్మ వేదవల్లి కూర్చుని టిఫిన్ తినడం పూర్తిచేసినా, జయది పూర్తయ్యేది కాదు. ఇంటి నుంచి బస్ స్టాపుకి వెళ్ళే లోపు వేదవల్లి కనీసం నాలుగైదు సార్లు వెనక్కి తిరిగి జయకి టాటా చెప్పేవారట, రసంతో నిండిన తన చేతిని ఊపేవారట జయ. ఒకవేళ బస్‌కి ఆలస్యమవుతోందని వేదవల్లి తొందరగా వెళ్ళిపోతే, జయ గోల గోల చేసి ఆమె వచ్చేదాకా ఊరుకునేవారు కారుట. మూడున్నర సంవత్సరాల వయసులో జయని బడిలో చేర్చారు. బడికి వెళ్ళనని మంకుపట్టు పట్టి బాగా గొడవ చేశారట జయ, కానీ ఆమె మాట నెగ్గలేదు. ఆమె బడికి వెళ్ళాల్సొచ్చింది. రోజూ వేదవల్లి తీసుకెళ్ళి బళ్ళో (అప్పట్లో హోమ్ స్కూల్ అనేవారు) దింపి, ఆఫీసుకు వెళ్ళేవారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకి బడి విడిచిపెట్టగానే నాగరాజు అనే నౌకరు వెళ్ళి సైకిల్ మీద ఇంటికి తెచ్చేవాడు. ఇలాంటి రోజుల్లోనే ఓ ముఖ్యమైన సంఘటన జరిగింది. అందంగా ఉన్న వేదవల్లి, నిర్మాత కెంపరాజ్ దృష్టిలో పడ్డారు (ఆమె ఎంతో అందమైనవారని నేను భావిస్తాను, జయలలిత కంటే కూడా). అలెగ్జాండర్ డ్యూమస్ రాసిన “ద కౌంట్ ఆఫ్ మోంటో క్రిస్టో” ఆధారంగా తాను నిర్మిస్తున్న ‘కఱ్‌కోట్టయ్’ అనే సినిమాలో కథానాయికగా నటించమని అడిగారాయన. నాన్నగారి అనుమతి తీసుకుని నిర్ణయం చెబుతానన్నారు వేదవల్లి.  అసలు ఆ ఆలోచన వచ్చినందుకే వాళ్ళ నాన్నగారు ఆవిడని తిట్టిపోశారు. తుదకు ఆ పాత్రని నటి కృష్ణకుమారి పోషించారు. వేదవల్లి సోదరీమణుల్లో ఒకరైన అంబుజవల్లి (నటి విద్యావతి) చాలా సాహసి. అప్పట్లో ఆమె బ్రిటీష్ ఎయిర్‌వేస్ వారితో ఎయిర్ హోస్టెస్‍గా పని చేసేవారు. అప్పట్లో ఎయిర్ హోస్టెస్‌లకు చీర కట్టుకునే వీలుండేది కాదు. గౌను ధరించి, బాబ్డ్ హెయిర్‌తో ఉండాల్సి ఉండేది. అంబుజవల్లి జుట్టు కత్తిరించుకుని వచ్చాకా – తండ్రీ, సోదరుడు ఇంట్లోంచి గెంటేసారట. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టద్దని హెచ్చరించారు. సరేనని ఇల్లు వీడారు అంబుజవల్లి. ఆమె అంతటి ధైర్యవంతురాలు. అయితే ఆమె వేదవల్లిని కలుస్తూనే ఉండేవారు. ఆమె విమానం బేస్‌కి తిరిగి వచ్చినప్పుడల్లా, నెలకి రెండుసార్లు బెంగుళూరుకి వచ్చేవారు. వేదవల్లి జయలలితని తీసుకుని ఎయిరోడ్రోమ్‍కి వెళ్ళి ఆమెని కలిసేవారు. ఇంట్లో వండిన పదార్థాలను తెమ్మని అంబుజవల్లి అడిగేవారట. అలాగే జయ పట్ల ఆపేక్ష పెంచుకుని, ఆమెని మరి కొంచెం సేపు తనతో ఉండనీయమని కోరేవారట.  జయలలిత తన పిన్నితో బాటు ఎయిర్ హోస్టెస్ ఎన్‍క్లోజర్‌లో కూర్చుని,  పిన్ని తెచ్చిన చాక్లెట్‌లను తినేవారు. చాక్లెట్లను తింటూ చుట్టూ ఉన్నవాటిని ఆసక్తిగా చూసేవారట జయ. అంబుజవల్లి ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తుండగా తెలుగు నటులు నాగయ్య ఆమెకు సినిమా అవకాశం కల్పించి, ఆమె పేరుని విద్యావతిగా మార్చి 1953 నాటి ‘నా ఇల్లు’ (తమిళంలో ‘ఎన్ వీడు’) చిత్రంలో నటింపజేశారు. తదుపరి ఆమెకి పలు అవకాశాలు రావడంతో ఉద్యోగం మానేసి, సినిమాల్లో నటించసాగారు. వేదవల్లికి ఉత్తరం రాసి, ఉద్యోగం మానేసి మద్రాసు వచ్చేయమని చెప్పారు. వేదవల్లి తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో, పిల్లల్ని తీసుకుని మద్రాసు వచ్చేశారు.

అంబుజవల్లి ఆధునిక మహిళగా ఉండడానికి ఇష్టపడేవారు. జయలలిత పొడవాటి జుట్టు చూసి, “ఈ విధంగానా ఉండడం?” అంటూ బాబ్డ్ హెయిర్ చేయించారట. ఓ సుప్రసిద్ధ స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆ కేశాలంకరణలో జయలలితని చూసి ఓ ఫొటో తీసారు, ఆ ఫొటోని ఓ పోటీకి పంపితే ఆయనకి మొదటి బహుమతి వచ్చిందట. తరువాతి కాలంలో జయలలిత తన ఇల్లు ‘వేద నిలయం’ గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ ఆ ఫొటోను లైఫ్ సైజ్‌కి ప్రింట్ చేయించి జయకి కానుకగా ఇచ్చారట. ఆ ఫొటో సగర్వంగా నిలిచి ఉందా ఇంట్లో.

మద్రాసు వచ్చాకా వేదవల్లికి కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. 1957లో ‘ప్రేమం దైవం’ అనే సినిమాలో నటించారు. తన పేరుని వేదవల్లి నుంచి సంధ్యగా మార్చుకున్నారు. ఆ పేరుతోనే ఆమె ప్రసిద్ధులయ్యారు. అప్పట్లో అక్కాచెల్లెళ్లిద్దరూ వచ్చిన అన్ని అవకాశాలు అంగీకరిస్తూండేవారు, అలా చేయడం వారి కెరీర్లకి ఓ ఆటంకం అయ్యింది. విద్యావతి కెరీర్ కొద్దికాలమే సాగినా, సంధ్య కెరీర్ చాలా కాలం కొనసాగింది. ఇద్దరూ పొద్దున్న లేచి వెడితే, తిరిగి ఇంటికి చేరేసరికి అర్ధరాత్రయ్యేది, అప్పటికి పిల్లలు నిద్రపోయేవారు. సంధ్య ఓ వాక్స్‌హాల్ కారు కొనుక్కున్నారు. ఆ కారు డ్రైవరు పేరు మాధవన్. జయలలిత స్టార్ అయ్యేవరకు ఈ మాధవన్ వారి డ్రైవర్‌గానే ఉన్నాడు. రోజు ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ తినిపించి, వాళ్ళని స్కూల్లో దింపేవాడు. స్కూల్ అయిపోయాక, వెళ్ళి తీసుకువచ్చేవాడు. సాయంత్రం ఏదైనా తినిపించి వాళ్ళని బీచ్‍కి లేదా లారెల్ హార్డీ సినిమాలకి తీసుకువెళ్ళేవాడు. బాగా అలసిపోయి, ఇంటికి రాగానే నిద్రపోయేవారు పిల్లలు. దాంతో మాధవన్ డ్యూటీ పూర్తయ్యేది. కొన్ని రోజుల తర్వాత సంధ్యకి ఈ పద్ధతి నచ్చలేదు. అందుకని పిల్లల్ని తమ తల్లిదండ్రుల దగ్గరకి బెంగుళూరు పంపేయాలనుకున్నరు. వాళ్ళ తల్లిదండ్రులకి తమ కూతుర్లంటే కోపం గానీ, మనవలు, మనవరాళ్ళంటే అభిమానమే. అందుకని పిల్లల్ని చూసుకోడానికి సంతోషంగా అంగీకరించారు. బెంగుళూరులో పిల్లలు బిషప్ కాటన్ స్కూల్‌లో చేరారు. సెలవలకి మద్రాస్ వెళ్ళేవారు. జయ అమ్మతో ఉన్న సమయమంతా స్వర్గంలో ఉన్నట్టు ఉండేదట. కానీ తిరిగి బెంగుళూరు వెళ్ళగానే అక్కడంతా గడ్డుగా ఉండేదట. ఆ సమయంలో సంధ్య చిన్న చెల్లెలు పద్మవల్లి పిల్లల్ని చూసుకునేవారు. అయితే 1958లో పద్మవల్లికి పెళ్ళవడంతో, పిల్లల్ని శాశ్వతంగా తల్లి దగ్గరకి పంపించేశారు. తరువాతి కాలంలో జయలలిత – తమ బెంగుళూరు నుంచి మద్రాస్ ప్రయాణపు అనుభూతుల్ని గుర్తుచేసుకునేవారు. అమ్మ కేసి అపురూపంగా చూస్తూ, ఆమెని ఎన్నోసార్లు ముద్దుపెట్టుకున్నారట. మద్రాసులో జయ చర్చ్ పార్క్ కాన్వెంట్‌లో చేరారు. అక్కడ ఆమె చదువులో రాణించారు. శాస్త్రీయ సంగీతంతో పాటు భరతనాట్యం, కథక్ నేర్చుకొన్నారు. సంధ్య కారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించారు (1957 నాటి క్లాసిక్ సినిమా మాయాబజార్‌లో ఎన్.టి.ఆర్. సరసన నటించారు). ఆమె నటించిన తమిళ సినిమాల వివరాలు నాకు ఎక్కువగా తెలియవు. డబ్బు హరించుకుపోవడంతో, ఆమె – కూతురి చదువుని బలవంతంగా ఆపించి, సినిమాల్లో నటింపజేశారు. అయిష్టంగానే నటన మొదలుపెట్టిన జయ – తెలుగు, తమిళ సినిమాల్లో గొప్ప స్టార్ అయ్యారు. 1971లో చనిపోయిన అమ్మంటే జయకి ఎంతో ప్రేమ! అమ్మ మరణం తరువాత ఆమె జీవితం మునుపటిలా లేదు…

***

మాయాబజార్‌లో ఎన్.టి.ఆర్.తో…

నిత్య కళ్యాణం పచ్చ తోరణం సినిమాలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here