[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. పులి – తేనె
[dropcap]”ఏ[/dropcap]మయ్యా సత్యం. కొండాపూర్‌లో రాజు గారింటికి వెళ్ళాలి. రేపు శనివారం కుదురుతుందా!” అడిగారు శేషయ్య.
“ఉదయం ఐతే ఫరవాలేదు తాతగారు” అన్నాడు ముప్ఫైలోకి అడుగుపెడుతున్న సత్యం.
అలా శేషయ్య గారిని సత్యం తన కారులో తీసుకెళ్ళాడు.
దారిలో సత్యం తన ఐఐటి అనుభవాల గురించి, ఇప్పుడు తన ఉద్యోగం గురించి చెబుతూ మధ్యలో అమ్మా, నాన్న తన పెళ్ళి గురించి ఎలా సతాయిస్తున్నారో కూడా చెప్పాడు. “నేను చెప్పేశాను తాతగారు – కెరీర్‌లో ఎదగాలంటే, పెళ్ళి ఒక అవరోధం. నా స్నేహితుల్ని చూస్తున్నాను కదా అంకుల్. (కొన్ని ఉదాహరణలు చెప్పాడు.) ఏమంటారు?”
శేషయ్య నవ్వేశారు.
రాజుగారికీ అరవైపైనే వుంటాయి. అయినా చాలా హుషారుగా వున్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి, తొమ్మిదో నెలలో అడుగుపెడుతున్న తన మనవడితో ఆడుకుంటున్నాడు. కోడలు శేషయ్యగారిని పలకరించింది. కాఫీలు తెచ్చింది. రాజుగారు, శేషయ్య తమ రామకృష్ణ మఠం విషయాలు మాట్లాడు కుంటున్నారు.
ఆ మనవడు పాక్కుంటూ సత్యం దగ్గరికి వచ్చేశాడు. సత్యం నవ్వాడు. వాడూ నవ్వాడు. సత్యం వాణ్ణి రెండు చేతుల్లోకి తీసుకొని, తన మూతి సున్నాలా చుట్టి ‘ఓం’ అంటూ ప్రణవ నాదం చేశాడు. అలా నాలుగైదుసార్లు చేశాక, వాడూ తన నోరు సున్నాలా చుట్టి “ఊ ఊ” అంటున్నాడు.
సత్యం చిటికెలువేశాడు. వాడూ చూసి తన పొట్టివేళ్ళతో ప్రయత్నం చేస్తున్నాడు. సత్యం చప్పట్లు కొట్టాడు. వాడూ కొట్టాడు… అలా ఓ గంట పరిసరాలు మైమరిచిపోయాడు. సత్యానికి వాడితో ఇంకాస్సేపు గడపాలని వుంది. శేషయ్య బయల్దేరదీశారు.
కారులో ఎక్కగానే సత్యానికి శేషయ్య ఒక కథ చెప్పారు:
ఒక మనిషి తన గమ్యం చేరటానికి దగ్గర మార్గం కదా అని ఓ అడవిదారిలో వెళ్తున్నాడు… ఓ పులి చూసింది. గాండ్రించింది. పరుగు లంకించుకున్నాడు. పులి తరుముతోంది. ఆ పరుగులో చూసుకోకుండా ఒక పెద్ద బావిలో పడ్డాడు. అదృష్టవశాత్తు పక్కనున్న చెట్టు ఊడలు బావిలోకి వేళ్ళాడుతుంటే, వాటిని పట్టుకొని ఊగుతున్నాడు. అప్పుడు చూశాడు. ఆ పెద్దపులి బావి గట్టు మీద కూర్చుంది. గాండ్రిస్తోంది. ఎంతసేపు ఊగుతాడు? ఊడలు పట్టుకొని చెట్టుపైకి ఎక్కేద్దామా అని పైకి చూశాడు. ఆ చెట్టు పైన ఒక కొమ్మని చుట్టుకొని పడుకున్న కొండచిలువ కళ్ళు తెరిచి చూస్తోంది. నాలుక విసురుతోంది. వీడికి పైప్రాణాలు పైనే పోయాయి… పోనీ బావిలో క్రిందకు దిగుదామా అని చూశాడు. జేబులోంచి ఒక నాణెం తీసి, కిందపడేశాడు. నీళ్ళ శబ్దం రాలేదు. ధైర్యంగా క్రిందకి దిగబోయాడు. బుస్సుమంటూ త్రాచుపాములు లేచాయి. ఆ ప్రక్కనే తేళ్ళు!
…పులి, కొండచిలువ, పాములు, తేళ్ళు తలుచుకొని, భయంతో ఆ ఊడలు గట్టిగా కావిలించుకొని, కళ్ళుమూసుకొని ‘దేముడా’ అనుకొంటున్నాడు… ముక్కుకి ఏదో చల్లటి ద్రవపదార్ధం తగిలింది. అనాలోచితంగా నాలుకతో ముట్టుకున్నాడు. అంతే! పైన తేనెపట్టునుంచి కారుతున్న ఆ తేనె ఎంత మధురంగా వుందంటే, దాన్ని జుర్రేస్తున్నాడు. ఆ మాధుర్యం ఇచ్చిన ఆనందం ముందు పులి గిలి అన్నీ చిన్నవైపోయాయి…
…ఇక్కడ ఆపారు శేషయ్య.
“సత్యం, జీవితంలో కెరీర్, ఆరోగ్యం, బదిలీలు… ఇలా ఎన్నో సమస్యలున్నా, ఇంటికి రాగానే కాళ్ళు చుట్టేసే పిల్లలు ఇచ్చే ముద్దు ముచ్చట్లు, పెరిగాక వాళ్ళ విజయాలు, వాళ్ళపిల్లల ఆటపాటలు, మన ఆరోగ్యం కోసం అమ్మానాన్నల ఆరాటం, మనకోసం ఎదురుచూసే జీవిత భాగస్వామి ప్రేమ – ఇవన్నీ ఆ తేనె మాధుర్యంలాంటివే…”
సత్యం మాట్లాడలేదు.
….
మరునాడు సత్యం తల్లి ఎంతో సంబరపడిపోతూ ఫోన్ చేసింది.
“బాబాయ్ గారూ, మీ ఋణం తీర్చుకోలేం. వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు..”
2. ఆ కుటుంబం నడుస్తుంది…
శేషయ్య గారికి నా కారెక్కిన అయిదు నిమిషాల్లో రెండు కాల్స్ వచ్చాయి.
“ఈశ్వర్రావు, కారు కొంచెం జీడిమెట్ల జోగారావు ఇంటికి పోనీవయ్యా” అన్నారు.
“ఏమిటి సార్. మళ్ళీ పంచాయతీనా?”
శేషయ్య నవ్వారు.
“భార్యాభర్తలిద్దరూ నాకు బంధువు లేనయ్యా. ఎప్పుడూ అవే అలకలూ, ఏడుపులూ, మళ్ళీ విహారయాత్రలూ. అయితే, వాళ్ళ పెద్దవాళ్ళకి మాట ఇచ్చానయ్యా. వాళ్ళు ఈ సిటీలో వున్నంతకాలం నేను కనిపెట్టి చూస్తూంటానని…”
కారు జీడిమెట్లకేసి తిప్పాను.
మేం వెళ్ళేసరికి భార్యాభర్తలిద్దరూ చెరొకగదిలో అలక పానుపులెక్కేసి వున్నారు. శేషయ్య ముందుండే అతిథుల గదిలో నా ముందు నాలుగు పత్రికల్ని పడుకోబెట్టి లోపలికి వెళ్ళారు.
నేను పత్రికలు తెరిచే లోపలే, లోపల పంచాయతీ మొదలైంది. తనవాళ్ళొస్తే పట్టించుకోవట్లేదనీ, అతిథుల ముందు తనకి గౌరవం ఇవ్వట్లేదనీ, తాను లేత సొరకాయ తెచ్చి పాలతో వండమంటే, ఆవ పెట్టి వండుతోందనీ, వాషింగ్ మెషిన్‌లో తన తెల్లబనీన్లని ఆవిడగారి జాకెట్లతో కలిపి ఉతికేసి రంగులంటించేస్తోందనీ … జోగారావు జాబితా చాలా వుంది.
జయశ్రీ ఏమీ తక్కువ తినలేదు.
ముందు చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా అతిథుల్ని దించుతుంటాడనీ, తన ‘అక్కా బావా వస్తున్నారు బట్టలు పెట్టాల’ని వారం ముందు చెప్పినా వాటిని తేవడం మర్చిపోయాడనీ, ఎక్కడికన్నా వెళ్ళాలని ముందే చెప్పినా సమయానికి అస్సలు రాడనీ, ఆఫీసుకి ఫోన్ చేస్తే ఓ పట్టాన ఎత్తడనీ, కొడుకు స్కూలు విషయాలు కూడ తనకే రుద్దేస్తుంటాడనీ… ఇలాటివే జయశ్రీ ఏకరువు పెట్టింది.
ఇద్దరూ మహా ఆవేశంతో చెరో వైపునుంచీ శేషయ్య గారి మెదడు తలా కాస్తా తినేస్తున్నారు. నాకు వినబడుతోంది.
అలా వాళ్ళు చెప్పిందంతా – వాళ్ళకి ఆవేశం తగ్గేదాకా – ఓపిగ్గా విని, ఓ నవ్వు నవ్వి, అప్పుడు శేషయ్య నోరువిప్పారు.
“నీ భార్య ఆనందం కోసం నువ్వు చేసిన తాజా మంచిపనులు కొన్ని చెప్పు” అని జోగిని అడిగారు. అతను జాబితా చెప్పాడు. అదే ప్రశ్న జయని అడిగారు. ఆమె ఇంకా పెద్ద జాబితా చెప్పింది.
ఆ విషయాల్లో ఎవరూ ఎవరినీ పెద్దగా ఖండించలేదు.
“సరే, నా దగ్గర రెండు పరిష్కారాలు వున్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని తీరాలి. సిద్ధమే అంటే చెబుతాను.”
ఇద్దరూ తలాడించారు.
“మగవాళ్ళు చాలా అల్పసంతోషులం అనుకుంటారు. వాళ్ల తరఫువాళ్ళని బాగా చూడాలి. రుచికరంగా వండిపెట్టాలి. పిల్లల పెంపకం బాగాచెయ్యాలి. ‘ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పు ‘ అనే నానుడిని నిజం చేయాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా మడత నలగని చీర కట్టుకొని తన గౌరవం నిలబెట్టేలా వచ్చేయాలి.. ఇలాంటి చిన్న చిన్న కోరికలుంటాయి. తీర్చాలిగదమ్మా !”
జోగారావు చప్పట్లు కొట్టేశాడు.
“అలాగా! మేము ఇంకా అల్పసంతోషులం. మాకు ఒక్కటే కోరిక…”
“ఓకే. చెప్పు చెప్పు” జోగి.
శేషయ్య నవ్వుకున్నారు.
“ఇల్లు, కుటుంబ విషయాల్లో నేను ఏం చెబితే అది పాటించితీరాలి.”
“నో” అరిచేశాడు జోగి.
“అయితే నేనూ నో” అనేసింది కసిగా జయ.
నిశ్శబ్దం.
“ఆ రెండో మార్గం చెప్పండి” ఇద్దరూ ఒకేసారి అన్నారు.
“పాటించాలి.”
ఇద్దరూ మాట ఇచ్చేశారు.
శేషయ్య లేచారు. వాళ్ళు ఆత్రుతగా చూస్తున్నారు.
“యథాతథ స్థితి.” శేషయ్య వచ్చేశారు.
నేను అనుసరిస్తూ అడిగాను.
“అదేమిటి సార్, ఏమీ చెప్పలేదు మీరు.”
“ఇది అన్ని కుటుంబాల్లో వుండేదే. వాళ్ళకున్న ప్రేమ చాలు. ఆ కుటుంబం నడుస్తుంది. పద.”