ఏమండీ ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి!!!

5
4

[dropcap]”అ[/dropcap]మ్మా జీతం ఇస్తారా?” వంట ఏమి చేయాలో వంటామెకు చూపిస్తున్న నా దగ్గరకు వచ్చి అడిగింది మా పనమ్మాయి.

తల తిప్పి చూసి “అదేమిటీ సార్ ఇవ్వలేదా? ఎప్పుడూ రెండో తారీఖుకు ఇచ్చేస్తారుగా?” అన్నాను ఆశ్చర్యంగా.

“అవునమ్మా. ఎప్పుడూ ఇస్తారు. మరి ఈసారే ఇంకా ఇవ్వలేదు. అరో తారీఖు వచ్చింది. మా ఇంటి అద్దె ఐదో తారీకు కల్లా ఇచ్చేయాలి. ఇంటావిడ అడిగింది పొద్దున్నే”అన్నది చిన్నగా నొచ్చుకుంటున్నట్లు.

“నేనూ అడుగుదామనుకుంటున్నానమ్మా. మా అమ్మాయి ఫీజ్ కట్టాలి. సార్ ఇంకా ఎందుకు ఇవ్వలేదో. ఎట్లా అడగాలా అనుకుంటున్నాను” అన్నది వంటామే.

ఆమెకు వంట ఏమి చేయాలో చెప్పి, బయటకు వచ్చి పేపర్ చూసుకుంటున్న ఏమండీతో “ఏమండీ ఈసారి పనివాళ్ళ జీతాలు ఇవ్వలేదా? వాళ్ళు అడుగుతున్నారు” అన్నాను.

నావైపు చూడకుండానే “నువ్వియ్యి” అన్నారు.

“నేనా? మీరు బాంక్ నుంచి తెచ్చారా? ఎక్కడ పెట్టారు?” అని అడిగాను ఎప్పుడూ లేనిది ఇదేమిటీ అనుకుంటూ.

“తేలేదు. నువ్వెళ్ళి తీసుకురా” అన్నారు ముక్తసరిగా.

“నేను వెళ్ళాలా? ఎప్పుడూ తేలేదు, ఎట్లా తేవాలో కూడా తెలీదు. ఎట్లా తేను?” అడిగాను అయోమయంగా.

“నాతో చాలా సార్లు వచ్చావుగా. రాకపోవటానికి ఏముంది అందులో. వెళ్ళి తీసుకొచ్చి అన్ని పేమెంట్స్ చేయి” అన్నారు పేపర్‌లో నుంచి తలెత్తకుండానే.

“అది కాదండీ” అని నేను చెప్పబోతుంటే వినిపించుకోకుండా “డ్రైవర్ వస్తాడు వెళ్ళు. అక్కడ అలమారలో చెక్ బుక్, పాస్ బుక్ ఉన్నాయి. తీసుకెళ్ళు. ఎకౌంట్ బుక్‌లో ఎవరికెంత ఇవ్వాలో రాసి ఉంది, ఇచ్చేయి.” అన్నారు ఇక చెప్పేదేమీ లేదన్నట్లు.

ఐదు నిమిషాలు అట్లాగే నిలబడి, లోపలికి వెళ్ళి తయ్యారై వచ్చి డ్రైవర్‌ను పిలిచి, “వెళుతున్నాను” అన్నాను ఏమండీతో.

ఏమనుకున్నారో నా చేతిలో నుంచి చెక్ బుక్ తీసుకొని, ఎట్లా దానిని నింపాలో, అది ఏ కౌంటర్‌లో ఇవ్వాలో చూపించారు.

కార్‌లో కుర్చొని – ఈ మధ్య ఏమండీగారి ప్రవర్తన ఏమిటీ ఇట్లా ఉంది? బాంక్‌కు చాలాసార్లే వెళ్ళాను ఆయనతో, కాని ఎప్పుడూ విజిటర్స్ కుర్చీలో కూర్చొని, ఆయన పనయ్యేదాకా ఏదైనా బుక్ చదువుకోవటమో, లేక అటూ ఇటూ చూడటమో చేసేదానిని. ఆ మధ్య లోపలికి బాంక్ మేనేజర్ దగ్గరకు తీసుకెళ్ళి నన్ను పరిచయము చేసారు కూడా. ఇంకో సారి బాంక్ హెడ్డాఫీసుకు తీసుకెళ్ళి అక్కడి మేనేజర్‌కు కూడా పరిచయము చేసారు. ఆయన ఆవిడతో మాట్లాడుతుంటే, ఆవిడ కట్టుకున్న ఆకుపచ్చ చీర బాగుందని చూస్తూ కూర్చున్నాను. ఆవిడ పేరు జానకి అని చెప్పినట్లు గుర్తు. ఎప్పుడూ ఆయన వెనక రమ్మనప్పుడు వెళ్ళటమే కాని ఏదీ పట్టించుకోలేదు. కాకపోతే ఈ మధ్య ఎక్కడి కి వెళ్ళినా ఆ ఆఫీస్ వాళ్ళకు నన్ను పరిచయం చేస్తున్నారు. సబేరియాకు వెళ్ళి నప్పుడు ఆయన పని ముగించుకొని వచ్చేదాకా కార్ లోనే కూర్చునేదానినిని. ఇప్పుడేమో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు పరిచయము చేసారు. మూడేళ్ళ నుంచి క్లబ్‌కు రమ్మంటున్నారు. ఎప్పుడైనా బద్దకిస్తే ఇంట్లో ఒక్క దానివి ఆ లాప్‌టాప్ ముందు కూర్చుంటావు పద పదా అని బలవంతం చేస్తున్నారు. ఆర్.యస్సైలో కార్డ్స్ రూం విడిగా ఇనాగరేట్ చేస్తున్నారంటే పొద్దున్నే బయలదేరదీసారు. అక్కడి వాళ్ళకు మా మిసెస్ వస్తుంది చూసుకోండి అని చెప్పారు. సేవక్ సంక్షేమ్ ఆఫీస్‌కు తీసుకెళ్ళి లేడీస్‌కు ఐడి.కార్డ్ విడిగా ఉంటుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఎందుకు అని నేను అడుగుతే జవాబివ్వలేదు.

మొన్నటికి మొన్న పైన బాత్ రూంలో నల్లాలు పని చేయటము లేదని ప్లంబర్‌ని పిలుస్తే, అతనిని చూడనట్లు ఏమి పట్టనట్లు ఊరుకున్నారు. అతనూ సాబ్ అని ఏదో చెప్పబోతే నాతో చెప్పమన్నారు. ఇదివరకు వాళ్ళ వెంటవెంట ఉండి అన్ని చూపించేవారు.

ఇవ్వన్నీ ఒక ఎత్తైతే పోయిన వారం ఆయన పాత క్లర్క్‌ను పిలిచి వీలునామా రాసారు. ఏమిటో కాస్త గాభరాగా అనిపించి పిల్లలతో చెపితే “పోనియమ్మా డాడీ యఫ్.డీ.లు ఎకౌంట్లూ చూపిస్తే చూడరాదా? అంతలో ఏమైంది?” అన్నది అమ్మాయి.

“బాబా మీ డాడీ వీలునామా రాసారురా” అంటే వాడేమో “అబ్బా రాస్తే ఏమైంది. నేనూ, అక్క కూడా రాసాము. నీతో చెపితే ఇదో ఇట్లా టెన్షన్ పడతావనే చెప్పలేదు. ఐనా ఏమిటమ్మా ఈ రోజు ఏ టెన్షనూ లేదే అని కూడా టెన్షన్ పడుతుంటావు” అని నవ్వేసాడు.

నేను చెప్పేది పిల్లలకు అర్థం కావటము లేదు. ఏమండీలో వచ్చిన మార్పు నాకే అర్థం అవుతోంది. ఎప్పుడూ గలగలా మాట్లాడే మనిషి మౌనంగా ఉంటున్నారు. ఏదడిగినా జవాబు చెప్పటము లేదు. మాట్లాడండీ అన్నా వినటం లేదు. అప్పటికీ ఓసారి విసుగొచ్చి “దేవుడు మనకు నోరిచ్చింది మాట్లాడమని. అంతే కాని ఇలా మౌనానందస్వామిలా ఉండమని కాదు. ఎప్పుడూ లేనిది ఈ మౌనం ఏమిటి?” అని విసుక్కున్నా జవాబు చెప్పలేదు. అప్పుడప్పుడు నన్ను సాలోచనగా చూస్తున్నారు. ఏమిటండి అట్లా చూస్తున్నారు అంటే ఏమీ లేదులే అంటారు. ఇదివరకైతే జోక్ చేసేవారు.ఏమిటిదంతా?

నా ఆలోచనలో నేనుండగానే బాంక్ వచ్చింది. మనీ డ్రా చేసుకొని, ఇంటికి వచ్చి ఏమండీకి ఇవ్వబోయాను. నీ దగ్గరే ఉండనీయి అన్నారు. ఇక తప్పదన్నట్లు పని వాళ్ళకు లెక్క చూసి జీతం ఇచ్చి పంపేసాక, లంచ్ చేసి టి.వి చూస్తున్న ఏమండీ దగ్గరకు వెళ్ళి టి.వీ ఆపేసాను. ఏమిటి అన్నట్లు చూసారు.

ఏమండీ పక్కన కూర్చొని “ఈ మధ్య ఏమైంది? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. పూర్తిగా మారిపోయారు మీరు. ఇదివరకులా లేరు. ఏమైంది? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా?” అని అడిగాను.

“ఏమైంది? ఏమి మారిపోయాను? బాగానే ఉన్నానుగా?” అన్నారు.

“కాదు. ఇంటి విషయాలేమీ పట్టించుకోవటము లేదు. నేనెప్పుడైనా బయట పనులు, బాంక్ పనులు చేసానా? ఈ మధ్య యఫ్.డీ.లు కూడా చూడమని చూపిస్తున్నారు. అందరి జీతాలూ, వాళ్ళు అడిగినా అడగకపోయినా బోనస్‌లు ఇవ్వటమూ అన్నీ మీరే చూసుకునేవారు. మొన్న పెళ్ళికి కూడా నన్నొక్కదానినే వెళ్ళమన్నారు. నేనెప్పుడైనా ఒక్కదానిని వెళ్ళానా మా ఫ్రెండ్స్ పుస్తకావిష్కరణలకు, పేరంటాలకు తప్ప. ఎందుకిలా చేస్తున్నారు? ఎక్కడికెళ్ళినా కొన్నిసార్లు బద్దకంగా ఉండి రాలేనంటే బలవంతం చేసి , మీవెంట తీసుకుపోతున్నారు” అని ఏడుపు గొంతుతో అడిగాను.

“నేనెప్పుడైనా నిన్ను ఎక్కడికీ వెళ్ళవద్దని అన్నానా? నీ మీద ఏమైనా ఆంక్షలు పెట్టానా?” అడిగారు.

“అనలేదు. కానీ నేనే మీ చుట్టూ నా చిన్ని ప్రపంచం ఏర్పర్చుకున్నాను. ఈ రోజు మీరిలా మారిపోతే భరించలేకపోతున్నాను”

“మారి పోయాను, మారిపోయాను అంటున్నావు ఏమి మారిపోయాను? ఏం, ఈ పనులు చేసుకోలేవా? ఎప్పటికీ నా మీదే ఆధారపడి ఉంట్లే ఎట్లా? పెద్దవాళ్ళ మవుతున్నాము. ఏ రోజు ఎట్లా ఉంటుందో చెప్పలేము. నీకూ ఈ విషయాలన్ని తెలిసి ఉంటే మంచిది. నా మాట వింటున్నానంటున్నావు. రెండు నెలల నుంచి అడుగుతున్నాను, పెన్షన్ ఆఫీస్‌కు వెళుదాము రా అని వచ్చావా?” అని కొంచం సీరియస్‌గా అన్నారు.

ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమండీ అంటున్నది అర్థమయీ అవకుండా ఉన్నట్లుంది. గొంతు పెగుల్చుకొని “ఏమిటీ మీరంటున్నది?” అన్నాను చిన్నగా.

“ఇందులో అర్థం కాకుండా ఉండేందుకు ఏముంది? ఏరోజు ఎట్లా జరుగుతుందో చెప్పలేము. నేను పోతే నువ్వు ఎవరి మీదా అధారపడకుండా ఉండాలి కదా! అన్ని తెలుసుకొని ఉంటే మంచిది. ఇదో ఈ డైరీలో నాకెప్పుడు ఏది గుర్తొస్తే అది రాసి పెడుతున్నాను. పాస్ వర్డ్స్ కూడా రాసాను. జాగ్రత్తగా పెట్టుకో”అని లేచి టేబుల్ మీద నుంచి ఒక డైరీ తీసి ఇచ్చారు.

ఆ డైరీ తీసుకోకుండా కళ్ళప్పగించి ఏమండీనే చూస్తూ ఉండిపోయాను. కొంచం తేరుకొని “ఒక వేళ నేనే ముందు పోతే?” అన్నాను.

“పరవాలేదు నేను ఎట్లాగో బతికేయగలను” అన్నారు.

“ఇద్దరమూ ఒకేసారి ఏ ఆక్సిడెంట్ లోనో పోతే?” అన్నాను ఏమనాలో తెలీక.

“అంతకన్నా అదృష్టం ఏముంది?” అన్నారు.

“ఎందుకు ఇప్పటికిప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చింది మీకు? మీకెందుకలా అనిపిస్తోంది? పోతాననుకుంటున్నారా?” పిచ్చిదానిలా అన్నాను.

“నువ్వు అట్లా అంటే నేనేమి చెపుతాను?” అన్నారు.

“ప్లీజ్ అట్లా మాట్లాడకండి. నాకు భయంగా ఉంది” అన్నాను ఏమండీ చేయి పట్టుకొని.

“అనవద్దన్నంత మాత్రాన జరిగేవి జరగక ఆగుతాయా? నేను పోతే నువ్వెట్లా బతుకుతావా అన్నదే నా దిగులు. కనీసం మంచం మీద ఉన్నా నీకు అండగా ఉంటాను అనుకుంటాను. కాని ఎట్లా జరుగుతుందో మనం చెప్పలేముకదా? ఎట్లా బతుకుతావు మాలా” అన్నారు తపనగా.

“ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎట్లా బతుకుతావు, ఎట్లా బతుకుతావు? అంటారు ఈ మధ్య ఈ మాట మీరు చాలాసార్లు అన్నారు. ఎట్లాగో అట్లా బతుకుతాను. ప్రపంచంలో కోటానుకోట్ల మంది బతుకుతున్నారు. నా ఒక్క దానికి జాగా ఉండదా? ఏ చెట్టు కిందో పుట్ట కిందో బతుకుతాను” ఉక్రోషంగా, కోపంగా అని, ఏడుపు ఆపుకోలేక, ఏమండీ పక్కన కూలబడి ఆయన చేయి పట్టుకొని భోరుమన్నాను.

కొంచం తమాయించుకొని, ఏమండి భుజం మీద తలానించి, “నేనే అన్ని పనులూ నేర్చుకొని చేసుకుంటాను. ఎప్పుడైనా మీ మాట కాదన్నాన్నా? మీరు చెప్పినట్లే వింటున్నాను కదా? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ప్లీజ్ అండి ఇట్లా మౌనంగా ఉండకండి. మీరు మీరుగానే ఉండండి. మిమ్మలిని ఇట్లా చూసి తట్టుకోలేను” అన్నాను వణుకుతున్న గొంతుతో.

నా చేయి నిమురుతూ ఏమండి చిన్నగా నిట్టూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here