[dropcap]లో[/dropcap]యలోంచి బైటపడి వూరివైపుకు నడక సాగించాను. గాలిలో ఏదో మార్పు.. పల్చటి దుర్గంధం… అది ఏమై ఉంటుందా అని ఆలోచించే స్థితిలో లేను. ఇంటికి తొందరగా వెళ్ళాలన్న ఆతురత.. ఎన్నాళ్ళయిందో ఇంటిని వదిలి పెట్టి.. వారమా.. కాదు. పది రోజులా.. ఏమో.. ఇంకా ఎక్కువ కూడా ఐఉండవచ్చు.
మొబైల్ ఫోన్ ముక్కలై పోవడంవల్ల తెల్సుకోవడం కష్టంగా ఉంది. లోయలోకి జారి పడిపోయినప్పుడు తలకు దెబ్బతగిలి స్పృహ తప్పింది. ఎన్ని రోజులలా అచేతనావస్థలో ఉన్నానో తెలియదు. స్పృహ వచ్చాక లోయ లోంచి పైకి రావడానికి ఎంత అవస్థ పడ్డానో.. కొంత ఎత్తుకి ఎక్కడం మళ్ళా జారి పడిపోవడం.. దాదాపు నాలుగు రోజులు నిరంతర ప్రయత్నం.. నరక యాతన.. నేను ఏమైపోయానో అని నా భార్య సుశీల ఆందోళన పడుతో ఉంటుంది. పిల్లలు నా కోసం ఎదురుచూస్తో ఉంటారు. వరుణ్, వినీల.. వరుణ్ కి ఏడేళ్ళు.. వినీల వాడికన్నా రెండేళ్ళు చిన్నది. అసలు ఇంటిమొహం చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు.
రెండ్రోజులు నాకోసం చూసి సుశీల నేను తప్పిపోయాననుకుని ఉంటుంది. పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చి ఉండొచ్చు. లేదా నేను తనమీద కోపంతో ఇల్లొదిలి వెళ్ళిపోయాననుకుని ఉంటుందా? దానికీ అవకాశం ఉంది. ఆ రోజు నేనూ సుశీల పోట్లాడుకున్నాం.. రాత్రి పన్నెండు దాటినా వూరు సద్దుమణిగింది కానీ మా పోట్లాట సద్దుమణగలేదు. నాకు బాగా కోపం వచ్చింది. ‘ఈ ఇల్లొక నరకం’ అన్నాను. ‘మీ కంటికి నేనూ నా పిల్లలు మిమ్మల్ని కాల్చుకుతినే యమకింకరుల్లా కన్పిస్తున్నామా? ఐతే ఇక్కడెందుకు ఉండటం? మీక్కావల్సిన స్వర్గానికే వెళ్ళండి’ అంది.
‘వెళ్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా తిరిగి రాను’ అంటూ బైట పడ్డాను.
ఇన్ని రోజులూ అనుభవించిన నరకాన్ని తల్చుకుంటే వొళ్ళు జలదరిస్తోంది. శరీరం నిండా గాయాలు… రక్తమోడుతూ.. ప్రాణాల్లో తిరిగొస్తాననుకోలేదు. సన్నటి మట్టి రోడ్డు దాటి మా వూరికెళ్ళే పక్కా రోడ్డుకి చేరుకున్నాను. దాన్ని చూడగానే పోగొట్టుకున్న ఆత్మీయుణ్ణి మరలా కల్సుకున్నంత సంతోషమనిపించింది. అన్నిటికన్నా ప్రాణభయం దారుణమైంది. అది శరీరరంలోని సర్వశక్తుల్ని పీల్చేసుకుంటుంది.
ఉదయం పది గంటలై ఉంటుంది. ఎండ చురుక్కుమంటోంది. ఉక్కబోతగా ఉంది. ఇంటి గురించి ఆలోచిస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయాను. ఇది నాకు తెలిసిన రోడ్డేనా… నేను తప్పిపోయి మరో ప్రదేశానికి రాలేదు కదా.. ఈ సమయానికి ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఇంత నిర్మానుష్యంగా ఉందేమిటి? ప్రతి చోటా భయంకరమైన నిశ్శబ్దం రోడ్డు మధ్యలో అడ్డంగా పడుకుని.. భయపెడుతూ.. ఏవీ వాహనాల రొదలు? ఏరీ మనుషులు? వూరు వూరంతా వలస పోయినట్టు…
వేగం పెంచాను. గాలికి రోడ్డుకిరువైపులా ఉన్న చెట్ల ఆకులు చేసే శబ్దం తప్ప పక్షుల రెక్కల చప్పుడు గానీ వాటి కువకువలు గానీ విన్పించలేదు. పక్షులు కూడా తమ గూళ్ళు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాయా? ఆకాశం వైపు చూశాను. నీలి తటాకంలో తెల్లటి హంసలు ఈదులాడుతున్నట్టు కదుల్తున్న మేఘాలు.. ఆకాశం ఎంత అమాయకంగా తిరిగి నా వైపు చూసిందో… తనకేమీ తెలియదన్నట్టు మొహం పెట్టి..
ఈసారి దుర్గంధం చిక్కబడింది.. కుళ్ళిన శవాల వాసన.. శరీరాలు కాలుతున్న కమురు వాసన.. ఎక్కడినుంచి వస్తుందో తెలియక తలయెత్తి పైకి చూస్తూ నడుస్తూ కాలికేదో అడ్డం తగిలి పడబోయి నిలదొక్కుకుని కిందికి చూశాను. ఎవరిదో శవం.. రోడ్డు మధ్యన.. సగం కుళ్ళిపోయి.. ఛీ.. అసహ్యం.. మున్సిపాలిటీ వాళ్ళు ఏమైపోయారు? రోడ్డు మధ్యలో ఓ మనిషి చచ్చిపడి ఉంటే పట్టించుకోకుండా పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదేమైనా అడవా? వూరేగా, వల్లకాడు కాదుగా? వల్లకాటిలోనైనా శవాన్ని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయరుగా. ఖననమో హననమో చేస్తారు కదా.
మరికొంత ముందుకు నడిచాను. నాలుగు నిర్జీవ శరీరాలు.. వాటికి సమీపంగా కింద పడి ఉన్న ద్విచక్రవాహనాలు.. రోడ్డు మధ్యలో నిలబడి ఉన్న కార్లు.. వాటిలో మృతదేహాలు.. చప్పున భయమేసింది. ఏలియన్స్ దాడి చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ఎప్పటినుంచో హెచ్చరికలు చేస్తోనే ఉంది. నేను లోయలో స్పృహ తప్పి పడి ఉన్నప్పుడు దాడి జరిగిందా? మనుషులందరూ భయపడినట్టు విషవాయువుల్ని వెదజల్లే ఆయుధాలు ప్రయోగించి జీవరాశినంతటినీ అంతం చేసేశారా? అందుకేనా చెట్ల మీద ఒక్క పక్షి కూడా కన్పించలేదు?
కాళ్ళకు అడ్డుపడున్న శవాల్ని దాటుకుంటూ ఇంటివైపుకు పరుగెత్తాను. తలుపు తెరిచే ఉంది. వంట గదిలో సుశీల శవం..
పిల్లల కోసం ఇల్లంతా వెదికాను. లేరు. అనుమానంతో స్కూల్ వైపు పరుగెత్తాను. ఏ గదిలో చూసినా పిల్లల శవాలే.. బల్లల మీద తలలు వాల్చి కొందరు.. కింద నేలమీదకు జారిపోయి కొందరు.. బ్లాక్ బోర్డ్ కింద పడిఉన్న మాస్టార్ల శరీరాలు.. వరుణ్, వినీలల శవాల దగ్గర కూచుని ఎంత సేపు ఏడ్చానో.. కన్నీళ్ళు ఇంకిపోయే వరకు.. కర్తవ్యం గుర్తొచ్చింది. స్కూల్ బైట నిలబెట్టి ఉన్న కార్లో డ్రైవర్ సీట్లో ఒరిగిపోయి ఉన్న విగత శరీరాన్ని కిందికి తోసేసి, నా ఇద్దరు పిల్లల శరీరాన్ని వెనక సీట్లో వేసుకుని ఇంటి వైపుకు వేగంగా పోనిచ్చాను. సుశీలతో పాటు నా పిల్లల్ని కూడా వూరికి దూరంగా ఉన్న పొలాల్లో గోతిని తవ్వి పూడ్చి పెట్టాను.
భార్యాపిల్లల్ని కోల్పోయిన దుఃఖం నుంచి బైట పడ్డాక పిచ్చిపట్టినట్టు వూరంతా తిరిగాను. మనుషుల్తో పాటు జంతుజాలమంతా చచ్చిపోయి వేర్వేరు దశల్లో కుళ్ళిపోయి కన్పించాయి. పక్క వూరు.. దాని తర్వాత వచ్చే వూరు… దాన్ని ఆనుకుని ఉన్న పట్టణం… ఎక్కడా ప్రాణాల్తో కదుల్తున్న మనిషెవరూ కన్పించలేదు. అట్నుంచి మరో పట్టణం… చీకటి పడబోతోంది. కార్లో పెట్రోల్ రిజర్వ్‌లో కొచ్చింది. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుని సమీపించాను. అక్కడ కొన్ని రోజులక్రితం చలాకీగా తిరుగుతూ పనిచేసిన సిబ్బంది శరీరా లు వేర్వేరుచోట్ల పడి ఉన్నాయి. నేనే ట్యాంక్ నిండా పెట్రోల్ నింపుకున్నాను. మళ్ళా ప్రయాణం.. బతికున్న మనుషుల్ని వెతుక్కుంటూ…
చీకటి పడింది. వీధి దీపాలు వెలగడం లేదు. ఎక్కడా కరెంటు లేదు. ఆకలిగా కూడా ఉంది. ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించాను. స్విచ్ వేస్తే లైట్లు వెలిగాయి. ఎలక్ట్రిసిటీ సిబ్బంది అంతా చనిపోయినా నిల్వ ఉన్న కరెంట్ వల్ల అవి వెలిగాయని అర్థమైంది. నాకవసరమైన ఆహారపదార్థాలు, వాటర్ బాటిళ్ళు తీసుకుని కారునిండా నింపుకున్నాను. రాత్రికి కార్లోనే పడుకుని ఉదయం మళ్ళా బయల్దేరాను. వెతుకులాట… మరో మనిషి కోసం.. నేను బతికున్నట్లే కొంతమందైనా బతికుంటారన్న ఆశ..
ఏలియన్స్ విషవాయువుల్ని ప్రయోగించిన సమయంలో, భూమి పొరల్ని చీల్చుకుని గనుల్లో పని చేసేవాళ్ళు బతికుండే అవకాశం ఉంది కదా అనిపించింది. మరుక్షణం ఆ ఆలోచన తప్పనిపించింది. వాళ్ళయినా తమ షిఫ్ట్ అయిపోగానే బైటికొచ్చి ఉంటారుగా, విషతుల్యమైన గాలిని పీల్చుకుని ఉంటారుగా. ఆ విషవాయువుల ప్రభావం కొన్ని రోజుల వరకు గాల్లో మిళితమై ఉండి ఉంటుంది. కలుగుల్లో దాక్కున్న మను షులు కూడా బైటికి రాగానే ఆ గాలిని పీల్చి చచ్చిపోయి ఉంటారు. నేను లోయలోంచి బైటికొచ్చే సమయానికి వాటి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. అందువల్లనే నేనింకా శ్వాసిస్తో ఉన్నాను.
నేను బతికున్నందుకు అదృష్టవంతుణ్ణి అనుకోవాలో నేను తప్ప ఇంకెవ్వరూ బతికిలేనందుకు దురదృష్టవంతుణ్ణి అనుకోవాలో అర్థం కావటం లేదు. లోయలోంచి బతికి బైటపడ్డ క్షణం ప్రాణభయం అన్నిటికన్నా భయంకరమైంది అనుకున్నా కదూ. ఒంటరితనం ఇంకా భయంకరమైందని అర్థమౌతోంది. నాకు మరో అనుమానం కూడా వచ్చింది. అందరూ చచ్చిపోయి నేను బతికున్నానా లేక నేను చచ్చిపోయి శవాల దిబ్బలాంటి ఈ నరకాన్ని చేరుకున్నానా అని.
రోజుల తరబడి తిరుగుతూనే ఉన్నాను. పెట్రోల్‌కి కొరతలేదు. సూపర్ మార్కెట్లన్నీ బార్లా తెరిచి ఉన్నాయి కాబట్టి తిండికీ ఇబ్బంది లేదు.
పిచ్చిగా వెతుకులాట.. మరో మనిషి జాడ కోసం.. కనీసం మరో ప్రాణి జాడ కోసం..
నేను లోయలో పడి ఉండబట్టే కదా బతికి బైటపడ్డాను. నాలానే మరెవరికైనా జరిగి ఉండే అవకాశం ఉంది కదా అనే ఆశ నన్నింకా ముందుకు నడిపిస్తోంది. నాక్కావల్సింది ఎవరైనా బతికున్న మనుషులు.. వాళ్ళు ఏ వయసు వాళ్ళయినా పర్లేదు. పసిపిల్లలైనా ముసలివాళ్ళయినా సరే. కన్పిస్తే చాలు.. నా ఒంటరితనాన్ని వాళ్ళ సామీప్యంలో ఖననం చేయాలన్న కోరిక…
మూడు నెలల పైనే వెతుకులాట.. అవిశ్రాంత ప్రయాణం.. మనిషి జాడ కన్పించలేదు. నన్ను అల్లుకుంటూ నిరాశ..నా బతుక్కి అర్థమేమిటి? ఎవరి కోసం బతకాలి? తినడం, పడుకోవడం, తిరగడమేనా జీవితం? నాకూ చచ్చిపోవాలనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక బలంగా నన్ను తన పరిష్వంగంలోకి లాక్కుంటోంది. నిస్సారమైన నిరర్థకమైన బతుకు బతికేకన్నా చావే నయం కదూ. ఇప్పుడు నేను బతికే బతుకుని బతుకంటారా? ఇదీ ఓ రకమైన చావే.. కేవలం శ్వాసిస్తున్నాను.. అంతే తేడా..
ఏదో వూరు.. స్మశాన నిశ్శబ్దాన్ని నింపుకుని.. తన ఒంటరితనంలోకి అధాటుగా వచ్చిన ఆగంతకుడి వైపు ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తున్నట్టు.. వూరు. పెద్ద పట్టణంలా ఉంది. ఎటు చూసినా ఎత్తయిన కొండలు.. వాటినానుకుని లోతైన లోయలు.. దట్టంగా పెరిగిన చెట్ల సమూహాలు.. ఆకలేస్తోంది. కార్లో నింపుకున్న తిండి సామాగ్రి నిండుకుంది. సూపర్ మార్కెట్ కన్పిస్తే లోపలికి ప్రవేశించాను. మసక చీకటిగా ఉంది. లైట్లు వేశాను. వెలగలేదు. కరెంటు నిల్వలు ఖాళీ అయి ఉంటాయి. నాక్కావల్సిన ఆహారపదార్థాల కోసం వెతుక్కుంటూ మలుపు తిరిగినప్పుడు చాటున ఎవరో నక్కి ఉన్నట్లు సన్నటి అలికిడి.. నిజమేనా.. భ్రమ పడ్తున్నానా.. ఓ వేళ జంతువేమో.. ఎలాంటి జంతువో.. ప్రమాదకరమైనదైతేనో.. ఎందుకైనా మంచిదని స్వరం హెచ్చించి “ఎవరక్కడ? బైటికి రండి” అని అరిచాను. నిశ్శబ్దం… మరికొంత సేపు వేచి చూసి, అలికిడి వచ్చిన వైపు మెల్లగా అడుగులేశాను. భయపడూనే అక్కడికి చేరుకున్నాను. ఎవరూ లేరక్కడ.
మనిషి కోసం వెతికి వెతికి మతి చలించినట్టుంది. ఆహారపదార్థాలతో బాటు మంచినీళ్ళ బాటిళ్ళు తీసుకుని బైటికొచ్చాను. కారు వెనక సీట్లో వాటిని ఉంచి కారులోకి ఎక్కబోతున్నప్పుడు దూరంగా పరుగెత్తి పోతున్న మనిషి కన్పించింది. మనిషేనా.. మనిషే.. ఆడమనిషి.. నిజమేనా… లేక నా చిత్త చాంచల్యమా.. కారుని వేగంగా ఆమె వెనక పోనిచ్చాను. కారు సమీపించే కొద్దీ ఆమె మరింత వేగంగా పరుగెత్తసాగింది.
ఆమెకు అడ్డంగా కారు ఆపి దిగాను. నా వైపు భీత హరిణేక్షలా చూస్తూ ఆమె.. వయసు పాతిక్కి దగ్గరగా ఉండొచ్చు. సన్నగా రివటలా ఉంది. మొహం నిండా దైన్యం.. బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. నేనేదో అనే లోపల ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి పరుగెత్తసాగింది, నేనామెను వెంబడిస్తూ “భయపడి పారిపోతావెందుకు? నేనూ నీలాంటి మనిషినే.. దెయ్యాన్ని కాదు” అన్నాను. ఆమె ఆగిపోయింది. నా వైపు తిరిగి నా మొహంలోకి అనుమానంగా చూసింది.
నేను ఆయాసపడూ “దెయ్యాలు కార్లు నడపవు” అన్నాను. ఆమె మొహంలో సన్నటి చిర్నవ్వు మెరిసింది.
“నేను తప్ప ఈ భూమ్మీద ఎవ్వరూ బతికిలేరనే ఇప్పటివరకూ అనుకున్నాను. హమ్మయ్య. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది” అంది.
“నీకంటే అమితంగా సంతోషపడ్తుంది నేను. ఎందుకంటే మూడు నెల్లకు పైగా మరో మనిషి జాడ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను కాబట్టి” అన్నాను.
“ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో నాకర్థమైంది.. మీరు కన్పించకపోయి ఉంటే తప్ప కుండా నాకు పిచ్చిపట్టి ఉండేది లేదా ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని”
“నాదీ అదే పరిస్థితి.. ఇప్పుడు మనకా భయం లేదు. నీకు నేను నాకు నువ్వు తోడున్నాం”
ఆమె దిగులుకు ప్రతిరూపంలా మారిపోయింది. కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్ళు కారసాగాయి. “నాకు పెళ్ళి నిశ్చయమైంది. ఆ రోజు నా పెళ్ళి రోజు. అందరూ చాలా ఉత్సాహంగా పెళ్ళి వేడుకలో పాల్గొ న్నారు. పెళ్ళి తర్వాత కార్లో నేనూ నా భర్త, అత్తామామలు వాళ్ళ యింటికి బయల్దేరాం. సన్నటి ఘాట్ రోడ్డు.. పక్కనే లోతైన లోయ.. ఒక్కసారిగా కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. నాకు స్పృహ తప్పింది. మెలకువ వచ్చి చూసేసరికి నా భర్తా అత్తామామలు చచ్చిపోయి కన్పించారు. ఆ లోయలోంచి ఎలా బై టపడాలో తెలీలేదు. వొంటినిండా గాయాలు.. కొన్నిసార్లు నడవలేక దోగాడుతూ ముందుకు కదిలాను. పైకి రావడానికి వారం రోజుల పైనే పట్టింది. పట్టణంలో ఎటు చూసినా శవాల గుట్టలు… మా యింట్లో అందరూ చచ్చిపోయారు.. భరించలేనంత దుర్గంధం. భయంతో పారిపోయాను. మీరు కన్పించేవరకు పారిపోతూనే ఉన్నాను”
“నాకు భార్యా ఇద్దరు పిల్లలు.. అందరోపాటు వాళ్ళూ చచ్చిపోయారు. నేనూ లోయలో జారిపడి స్పృహ తప్పడం వల్ల బతికిపోయాను.”
“మనం బతికుండటం వల్ల ఏమిటీ ప్రయోజనం? మనవాళ్ళంటూ ఎవ్వరూ లేకుండా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు” ఏదో ఆలోచిస్తూ అందామె.
“ఇప్పుడీ భూమ్మీద మిగిలున్న మనుషులం మనిద్దరమే. మనతో మానవజాతి అంతరించిపోకూడదు. అదృష్టం ఏమిటంటే మనం వయసులో ఉన్న స్త్రీపురుషులం. దేవుడు మనల్ని చంపకుండా వదిలేసింది ఇందుకేనేమో. ఇది మనకు పునర్జన్మ… మనం మళ్ళా మానవ సంతతిని వృద్ధి చేద్దాం. మనకిప్పుడు దేనికీ లోటు లేదు. ఈ భూమ్మీద ఉన్న సంపదంతా మనదే. పని చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. తినడానికి కావల్సినంత ఆహారపదార్థాలున్నాయి. మనం చేయాల్సిన పని ఒక్కటే. పిల్లల్ని కనడం” అన్నాను.
ఆమె కొన్ని క్షణాల విరామం తర్వాత “ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. మొదట ఇక్కణ్ణుంచి దూరంగా ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్లాం. ఇక్కడ ఇన్ని శవాల మధ్య, దుర్గంధాల మధ్య నేను బతకలేను” అంది.
“నాకూ అలానే అన్పిస్తోంది. మొదట మనకవసరమైన సరుకుల్ని కార్లో నింపుకుని, మనం ఉండటానికి అనువైన ప్రదేశం కోసం వెదుకుదాం పద” అన్నాను.
కారు డిక్కీలో బియ్యం, కందిపప్పుతో బాటు అవసరమైన సరుకులన్నీ నింపుకుని ఉత్తర దిశగా ప్రయాణమైనాం. యాభై కిలోమీటర్లు ప్రయాణించాక స్వచ్ఛమైన నీళ్ళతో గలగలా పారుతున్న సెలయేరు కన్పించింది. చుట్టూతా రకరకాల పండ్ల చెట్లు.. విరబూసిన అందమైన పూలతో అలరారుతున్న మొక్కలు. పక్షుల కిలకిలారావాలు..
“ఈ యేటి ఒడ్డున యిల్లు కట్టుకుందాం. పొందిగ్గా ఓ పర్ణశాల లాంటి యిల్లు చాలు” అందామె.
ఆమెతో పాటు సరుకుల్ని దింపేసి, మళ్ళా వూళ్ళోకెళ్ళాను. మూడో మనిషంటూ లేడు కాబట్టి ఆమె భద్రతకు సంబంధించి ఏ రకమైన భయమూ లేకుండా యిల్లు కట్టుకోడానికి అవసరమైన సామగ్రినంతా నింపుకుని తిరిగొచ్చాను. వెదురుబద్దల్ని చుట్టూతా గోడల్లా పాతి, పైకప్పు మీద రెల్లు గడ్డిని దట్టంగా పరచి, పర్ణశాలలాంటి యింటిని నిర్మించాను.
దోమల భయం లేదు. విష కీటకాల భయం లేదు. క్రూరమృగాల భయం లేదు. దుర్మార్గపు మనుషుల భయమూ లేదు. స్వేచ్ఛ.. నిర్భయత్వం.. సమృద్ది.. ఇంతకన్నా మనిషి కోరుకునేదేముంటుంది?
ఆమె పేరు శివానీ.. ఉదయం లేచి ఇద్దరం సెలయేటిలో స్నానం చేస్తాం. ఆమె కట్టెల పొయ్యిమీద వంట చేస్తుంది. భోంచేశాక మట్టికుండలోంచి ముంచుకుని నీళ్ళు తాగుతూ ‘అమృతం తాగుతున్నట్టే ఉందండీ’ అంటుందామె. నేను అంగీకార సూచకంగా తల వూపుతాను. సాయంత్రం యేటి గట్టెమ్మటే కబుర్లు చెప్పుకుంటూ నడక.. రాత్రి కిరోసిన్ దీపం వెల్తురులో కొద్దిసేపు ఏదో పుస్తకాన్ని తిరగేయడం.. తర్వాత నిద్ర.. నాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలు రాసాగాయి. నా చిన్నప్పుడు పల్లెటూరిలో రోజులు ఇలానే గడిచేవి. ప్రకృతికి దగ్గరగా సహజీవనం..
యింటి చుట్టూతా కూరగాయ మొక్కలు నాటాం. అందులో పండిన కూరగాయల్లో రోజుకో రకం కూర చేస్తుంది తను. వెన్నెల రాత్రుళ్ళు ఆరుబయట పడుకుని నక్షతాల్ని చూస్తూ ఎన్ని కబుర్లో..
“మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా?” అందో రోజు రాత్రి.
నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “ఎవరైనా నాకు సంతోషమే. ఈ భూమ్మీద నేనే చివరి మానవుణేమో అనుకుని ఎంత దిగులు పడ్డానో… మానవజాతి నాతోనే అంతరించిపోతుందని ఎంత వ్యథ చెందానో.. నువ్వు కన్పించావు. నాలో ఆశలు రేకెత్తించావు. నేను చివరి మానవుణ్ణి కాదన్న భరోసా ఏర్పడింది. ఇప్పుడు నువ్వు మరో ప్రాణికి జన్మ నివ్వబోతున్నావు. తొందర్లో మనం ముగ్గురమౌతాం. మనం ఇక్కడితో ఆగకూడదు. మనలో శక్తి ఉన్నంతవరకు పిల్లల్ని కందాం. కనీసం డజను మంది పిల్లలు..”
శివాని ఉదాసీనంగా మారిపోయింది. “మానవజాతి మనతో అంతమైపోకూడదనుకుని కదా ఇద్దరం ఒక్కటైనాం. మనకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక ఎవర్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారండీ? అందరూ అన్నా చెల్లెళ్ళే అవుతారుగా. పెళ్ళిళ్ళు లేకుండా పిల్లలెలా పుడ్తారు?” అని అడిగింది.
నాలోనూ ఈ ప్రశ్న ఎప్పటినుంచో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆదిమ మానవుడి కాలంలో వావి వరసలు లేని విచ్చలవిడితనం ఉండి ఉండాలి. మనుష్యజాతికి సభ్యతా సంస్కారాలు అలవడ్డాక కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమనిబంధనల మధ్య బతకడం అలవాటు చేసుకున్నారు. అది తరతరాలుగా రక్తంలో ఇంకిపోయి, వారసత్వంగా పిల్లలకు అందుతూనే ఉంది. మేమిద్దరం నాగరికతకు దూరంగా ప్రకృతికి దగ్గరగా బతుకుతున్న మాట నిజమే. అలాగని పిల్లలు ఆదిమ మానవుల్లా వావి వరసలు మరచి ప్రవర్తిస్తే చూస్తూ వూర్కోగలమా?
పిల్లల మనసుల్లో వాళ్ళు ఒకరికొకరు అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ అవుతారన్న భావన ఏర్పడ్డాక లక్షణ రేఖ దాటడం సాధ్యమా? ఏమో…
ఒకవేళ మా పిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోతే వాళ్ళల్లో చివరగా చనిపోయే వ్యక్తే ఈ భూమ్మీద తిరిగిన చివరి మానవుడవుతాడు. నాకు మరో ఆలోచన కూడా వచ్చింది. ఇక్కడ ఈ భూభాగంలో మేమిద్దరం బతికి ఉన్నట్టే ఎక్కడో వేరేభూభాగంలో ఇంకెవరైనా బతికి ఉండొచ్చు. వాళ్ళూ పిల్లల్ని కనొచ్చు. ఏదో రోజు ఆ పిల్లలూ మా పిల్లలూ కల్సుకోవచ్చు. వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు జరగొచ్చు. అలా మానవజాతి వృద్ధి చెందవచ్చు. ఎంత అందమైన వూహ…
ఆరుబయట ఆకాశాన్ని చూస్తూ పడుకుని ఉన్న సమయంలో ఈ ఆలోచనని తనతో పంచుకోగానే శివాని ఎంత సంబరపడిపోయిందో. “నిజంగా అలా జరిగితే ఎంత బావుంటుందో కదా. మనం ఒక పని చేద్దాం. పిల్లల్ని కనడం పూర్తయ్యాక, పెద్ద పిల్లల సంరక్షణలో మిగతా పిల్లల్ని వదిలేసి, మనలాంటి కుటుంబాలు ఈ భూమండలం మీద ఎక్కడున్నాయో వెదుక్కుంటూ వెళామండి” అంది.
నేను తన చేతిలో చేయివేసి “అలాగే వెదుకుదాం. వాళ్ళ పిల్లల్లో మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దాం. నువ్వా విషయంలో దిగులుపడకు” అన్నాను. ఆ చీకట్లో శివాని కళ్ళల్లో నక్షత్రాలు మెరవడం గమనించాను.
శివానీకి తొమ్మిదో నెల.. ఐనా తనలో చురుకుతనమేమీ తగ్గలేదు. సెలయేట్లో స్నానాలూ, యేటి ఒడ్డున షికార్లు ఏవీ మానలేదు. “శ్రమెందుకు పడ్డావు? కదలకుండా కూచోవచ్చుగా. మిగతా పనులన్నీ నేను చేసుకుంటాను” అన్నాను.
“పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలన్నా సుఖ ప్రసవం జరగాలన్నా ఓపికున్నంత కాలం పని చేస్తూ ఉండాలని మా అమ్మమ్మ మా అమ్మతో చెప్తూ ఉండేదండి” అంటూ నవ్వింది.
వర్షాకాలం మొదలయింది. యింటి చుట్టూతా వేసిన కూరగాయ మొక్కలు పచ్చగా కళకళలాడూ కన్పిస్తున్నాయి. ఏరు నిండు చూలాలిలా ఒడ్డుని ఒరుసుకుని ప్రవహిస్తోంది.
రెండ్రోజుల క్రితం పడిన వర్షమే. బాగా తెరిపిచ్చింది. వాతావరణమంతా పొడిగా మారింది. ఉదయం లేచి యేటి ఒడ్డుకి స్నానానికి వెళ్తుంటే, వద్దంటున్నా వినకుండా శివానీ కూడా వెంట వచ్చింది.
గట్టున కూచుని నాలుగు చెంబులు వొంటిమీద పోసుకోమని చెప్పాను. “స్నానం చేసి రెండ్రోజులయింది. యేటి ఒరవడి కూడా ఎక్కువగా లేదు. నీళ్ళలోకి దిగి స్నానం చేయడం వల్ల ప్రమాదమేమీ లేదు” అంటూ లోపలికి దిగింది.
తను చెప్పినట్టే యేరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. కొద్ది సేపు స్నానం చేశాక “ఇంక చాలు. వెళ్లాం పద” అన్నాను.
“అప్పుడేనా.. మరి కొద్దిసేపు.. చల్లటి నీళ్ళు వొంటిని తాకుతుంటే ఎంత బావుందో” అంది తను.
అదే క్షణంలో అంతెత్తున పొంగుతూ, ఉధృతంగా ప్రవహిస్తూ వస్తోన్న నీటి పడగ కన్పించింది. ఎగువన మైదానాల్లో ఎక్కడో కుంభవృష్టి కురిసి ఉంటుంది. ఆ నీళ్ళన్నీ జల ప్రళయంలా మారి మా మీదికి దూసుకొస్తున్నాయి.
“వరద నీరు.. ప్రమాదం ముంచుకొస్తోంది… తొందరగా పద” అరుస్తూ శివానీ చేయి పట్టుకుని గట్టు వైపుకి కదిలాను. మరో నాలుగుడుగుల్లో గట్టుని చేరుకుంటామనగా నీరు ఉప్పెనలా మమ్మల్మి ముంచెత్తి ప్రవాహంతో పాటు లాక్కెళ్ళసాగింది.
నేను శక్తి కొద్దీ ఈతకొట్టడానికి ప్రయత్నిస్తూనే శివానీ చేతిని వదలకుండా పట్టుకున్నాను. కొంత దూరం కొట్టుకెళ్ళాక మధ్యలో పెద్ద రాయి కన్పించింది. అది నీటిమట్టం కన్నా ఎత్తులో ఉంది. దాన్ని ఒడుపుగా పట్టుకుని దాని పైకి ఎక్కి శివానీని కూడా దాని పైకి లాగాను.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక “చచ్చిపోతాననుకున్నానండి. అమ్మో ఎంత భయపడ్డానో. వీడికి ఆయుషుంది” అని నీర్సంగా తన పొట్టని ప్రేమగా నిమురుకుంది.
గట్టుకీ మాకూ పదడుగుల దూరం ఉంది. నీటి ఉధృతి తగ్గితే గానీ ఈదుకుంటూ అటువైపుకి వెళ్ళ లేము. మరికొంత సమయం వేచి చూస్తే ప్రవాహపు ఉధృతి తగ్గుతుందనుకున్నా.
కానీ అనూహ్యంగా మరింత వేగంతో నీటి ప్రవాహం మమ్మల్ని నీళ్ళలోకి విసిరేసింది. శివానీ చేయి నా చేతిలోంచి జారిపోయింది. “శివానీ” అని పెద్దగా అరుస్తూ, బలంగా కాళ్ళూ చేతులూ ఆడిస్తూ, చాలా దూరం ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి ఒడ్డుకి చేరుకున్నాను.
శివానీ జాడ కన్పించలేదు. యేటి ఒడ్డునే తన కోసం వెతుక్కుంటూ చాలా దూరం నడిచాను. యేరు నదిలోకి కల్సిపోయేచోటు వరకు వెళ్ళి వెతికాను. శివానీ కన్పించలేదు. ఆ నది కొన్ని వందల మైళ్ళు ప్రయాణించి సముద్రంలో కలుస్తుందని తెలుసు. ఎక్కడని వెతకను? ఎంత దూరమని వెళ్ళను?
ఆకాశంతో పాటు నేనూ వర్షించసాగాను. ఎన్ని రోజులు.. ఎన్ని వారాలు.. ఎన్ని నెలలు.. వర్ష రుతువు మారిపోయినా నాలో మాత్రం వర్ష రుతువు చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఒంటరితనం.. శివానీ లేని దుఃఖం.. నన్ను లోపల్లోపలే తినేయసాగింది. శివానీ బతికుందా? బిడ్డకు జన్మనిచ్చిందా? అలా జరిగి ఉంటే నేను చివరి మానవుణ్ణి కాదు. నా అంశతో పుట్టిన కొడుకో కూతురో నా తర్వాత ఈ భూమ్మీద శ్వాసిస్తో ఉంటారు. ఒకవేళ శివానీ చనిపోయి ఉంటే నేనే చివరి మనిషవుతాను.
కొన్నేళ్ళు భారంగా గడిచాయి. ఆరోగ్యం పాడైంది. మృత్యువు సమీపిస్తోందని అర్థమవుతోంది. వెన్నెల రేయి.. యేటి ఒడ్డున ఆకాశంలోకి చూస్తూ చావు కోసం ఎదురుచూస్తూ పడుకున్నా. శివానీ నేనూ ఇలాంటి ఎన్ని రాత్రుళ్ళు ఆనందంగా గడిపామో.. శివానీ లేదిప్పుడు.. చనిపోయి ఉంటుంది. ఈ భూమ్మీద మనిషనేవాడు తీసుకునే చివరి శ్వాస నాదే అవుతుంది.
నేనూ శివానీ ఎన్ని కలలు కన్నామో.. మానవజాతి అంతరించిపోకుండా చాలామందిని కనీ పెంచి, ఈ భూమి మనుషుల్లో కళకళలాడేలా చేయాలని ఎన్ని కలలో.. చివరికి ఓడిపోయి మనషనేవాడే మిగలకుండా వెళ్ళిపోతున్నాను.
కళ్ళు మూతలు పడున్నాయి. దూరంగా ఎవరో అర్చుకుంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నారు. మనుషులేనా.. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను. ఏడేళ్ళ వయసులో నేనెలా ఉండేవాడినో అలా ఉన్నాడు… వాడి వెనక ఆమె.. శివానీ.. నిజమేనా.. కల గంటున్నానా.. భ్రమకు లోనవుతున్నానా.. నేనే ఈ భూమ్మీద తిరుగాడిన చివరి మనిషిని కానా.. కానేమో.. మనిషికీ భూమికి మధ్య చాలా బలమైన బంధమేదో ఉంది. భూమి లేకుండా మనిషి బతకలేడు. మనిషి లేకుండా భూమి ఉండలేదు. చివరి మనిషంటూ ఎవ్వరూ ఉండరు. రాతిని తొల్చుకుని పుట్టుకొచ్చే మొక్కలా మనుష్యజాతి చిగురిస్తూనే ఉంటుంది.
నన్నెవరో తన ఒడిలోకి తీసుకున్నారు. చిన్ని చేతుల్తో నా మొహాన్ని నిమురుతున్నారు. నేను తృప్తిగా కళ్ళు మూసుకుని మెల్లమెల్లగా శాశ్వత నిద్రలోకి జారిపోతూ…