[box type=’note’ fontsize=’16’] ఇటీవల పరమపదించిన జర్నలిస్ట్, తెలుగు భాషా ఉద్యమకారుడు శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావుకి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు ఆనందరావు పట్నాయక్. [/box]
[dropcap]పె[/dropcap]దాల మీద చెదరని నవ్వు, తెల్లగా తళుక్కుమని మెరిసే పలువరుస, నుదుట ఎర్రని చాదుబొట్టు, సులోచనాల గుండా దూసుకువచ్చే ఎక్సురే కళ్లు. వెరశి పట్నాయకువి వెంటటేశ్వర్రావు అలియాస్ వీ.ఆర్. మీరు లేరు గాని మీ మాట ఉంది. యూట్యూబులో అది అందరినీ అలరిస్తోంది.
మిత్రుడు ఇందురమణ, విశాఖ సూచించడంతో పైద్రాబాదు వెళ్లిన నాకు వీ.ఆర్ నుండి ఫోను వచ్చింది. ఆయన నిర్వహించే వారంవారం తెలుగువారం అన్న ఆన్లైను ఇంటర్వ్యూకి హాజరయి ప్రవాసాంధ్రవాణిని విన్పించమని కోరారు. అదే మా పరిచయం. ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కూకట్‌పల్లి మెట్రోస్టేషనులో మమ్మల్ని రిసీవు చేసుకొని వారి ఫ్లాటుకి తీసుకువెళ్లారు వీ.ఆర్. ఇంట్లోనే స్టుడియో. ఒంటిగంట వరకు ముఖాముఖి కార్యక్రమం కొనసాగింది. వెళిపోతామన్న మమ్మల్ని లంచ్‌కి ఆహ్వానించారు. ఇష్టాగోష్ఠికి వచ్చిన అతిథుల్నిభోజనం వెట్టి పంపించడం ఆనవాయితీ అట. ఆయనకు తగ్గ ఇల్లాలు ఇందిర వదినమ్మ. ఒడిశా రాష్ట్రం నుండి వచ్చిన నాకు మంచి తెలుగు వంటకాలు తినే అదృష్టం కలిగింది. ఆయన రాసిన కవితల సంపుటాలు బహూకరించి వాటి మీద నా సమీక్ష రాయమని కోరారు వీ.ఆర్. భుక్తాయాసంతో చతికిలబడిన మాకు ఆయన కథ విన్పించారు.
ఆంథ్రప్రదేశ్‌లో వెనుకబడ్డ జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంలో కాపుగోదేటివలసలో పుట్టిన ఈ తెలుగుబిడ్డ ఎమ్.ఏ. బి.ఎల్. చదివారు. ఆయనకు పెంపుడుతండ్రి అయిన మేనమామ పోలీసు ఆఫీసరు. తమ డిపార్టుమెంటులో ఉద్యోగం వేయిస్తామన్నా ఖాకీవనం కాలదన్ని పత్రికారంగంలో అడుగువెట్టారు వీ.ఆర్. మూడున్నర దశాబ్దాలుగా వివిధ దినపత్రికల్లో విలేకరి నుండి డెప్యూటీ న్యూస్ ఎడిటరుగా ఎదిగిన యీ వెర్రినాయన ఏం బావుకున్నాడు. కవితలు రాయడం, సమీక్షలు చేయడం, పుస్తకపఠనంలో ఉన్న తృప్తి మరి దేంట్లో లేదంటాడాయన. మాతృమూర్తి, మాతృభాష అంటే ఎనలేని మమకారం. కనుమరుగవుతున్న తెలుగు భాష పునరుజ్జీవనం కోసం నడుము బిగించిన ఈ వీరుడు ఉద్యమం బాట పట్టాడు.
1999 సంవత్సరంలో మా రాష్ట్రంలో జరిగిన సూపరు సైక్లోను కవరేజీ కోసం మూలమూలలా పర్యటించి బాధితుల్ని పరామర్శించి అద్బుతమైన రిపోర్టు తయారుచేసారు. ఈనాడు ఎం.డి. శ్రీ కిరణ్ గారు ప్రత్యేకించి వీ.ఆర్‌ని ప్రశంసించి రివార్డు ఇవ్వడం తన జీవితంలో మరచిపోలేని మధురఘట్టం అని పాత స్మృతులు నెమరువేసుకొన్నారాయన.
కవితాసంకలనం గురించి అడిగితే దాత తమ అమ్మాయి ప్రత్యూష అని సగర్వంగా పలకడం నాకింకా గుర్తే. వీ.ఆర్.అల్పసంతోషి. ఎన్నో శ్రమదమాదులకు ఓర్చి, స్వంత పైకం ఖర్చు చేసి ప్రతీ వారం చేస్తున్న ప్రోగ్రాంకి లాభాపేక్ష ఎంతమాత్రం లేదు. నూరవ వార్షికోత్సవం అంగరంగ వైభోవంగా జరపడం మాకు తెలుసు. సాయం ఆయన ఇంటిపేరు. శిష్టికరణ సమాజానికి వీ.ఆర్. పెద్ద దిక్కు. మా కవి మిత్రుడి మాటల్లో…
“ఆయన సహృదయతకు మారుపేరు
సౌమ్యతకు మరో పేరు
కార్యదక్షతకు నిలువెత్తు నిదర్శనం
క్రమశిక్షణకు నిర్వచనం
మృదుభాషిత్వానికి పుట్టినిల్లు
సాధుస్వభావానికి సంతకం
అన్యాయం ఎదుర్కోవడంలో వజ్రాయుధం”.