[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హెడీ లామార్: మదర్ ఆఫ్ వై-ఫై:
సినీరంగంలో గొప్ప అందగత్తెగా, బాగా నటిస్తారనే పేరు తెచ్చుకోవడం నటీమణులకు సాధారణమే. పరిశోధనారంగంలో కొత్త ఆవిష్కరణలను కనిపెట్టి పేరు తెచ్చుకోవడం మహిళా శాస్త్రవేత్తలకూ పరిపాటే! అయితే నటీ, ఆవిష్కర్తా ఒకరే కావడం అరుదు. తన కాలంలో అందం, మేధల అపురూపమైన కలబోత హెడీ లామార్. నేటి బ్లూటూత్ సాంకేతికతకి ఆద్యురాలు ఈ నటి.
1900 నాటి తొలి రోజుల్లో ఆడవాళ్ళు – ఇంటి పనులకి, వంటకి, పిల్లలు, కుటుంబం సంరక్షణకి తప్ప మరెందుకు పనికిరారని భావించేవారు. అయితే తాను ఎంచుకున్న రంగంలో రాణించడానికి గాని, తను కనిపెట్టాలనుకున్న ఉపకరణాలను ఆవిష్కరించడంలో గాని సమాజంలోని కట్టుబాట్లు లామార్‌ని నిలువరించలేకపోయాయి.
ఈనాడు మనం అనుభవిస్తున్న ఎన్నో సౌలభ్యాల వెనుక విషాదకోణం ఉంది. వీటిలో చాలా పరికరాలు – ప్రమాదాల అంచున, యుద్ధాల కాలంలో ఆవిష్కరించబడ్డాయి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం – పాశ్చాత్య దేశాలని సాంకేతిక సృజనాత్మకత వైపు పరుగులుడేలా పడేలా చేసింది. ఆనాటి ఆవిష్కరణలలో వెండి తెర వేలుపు హెడీ లామార్ కనిపెట్టిన సాంకేతికతది ఓ వింత గాథ. ‘ప్రపంచంలోకెల్లా అందగత్తె’ అయిన ఈ మహిళ ఆధునిక వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిద్ధాంతంలో కీలకమైన ఆవిష్కరణని వెలుగులోకి తెచ్చారు. 1914లో వియాన్నాలో ‘హెడ్‌విగ్ కీస్లర్’ అనే పేరుతో జన్మించిన ఈవిడ తొలి రోజుల్లోనే నటన పట్ల ఆకర్షితురాలయ్యింది. పైగా వియాన్నా నగరం కూడా కళలకు ప్రసిద్ధి! ఆమె తొలి విజయాలు (వివాదాస్పదంగా నగ్నంగా నటించిన 1933 నాటి ‘ఎక్‌స్టసీ’ సినిమా) వియాన్నాలో కెల్లా సంపన్నుడూ, యుద్ధంలో రెండు వైరి పక్షాలకు ఆయుధాలు అమ్మే వ్యాపారి అయిన ఫ్రిట్జ్ మండల్ దృష్టిలో పడ్డాయి. 1933లో హెడీ, మండల్ వివాహం చేసుకున్నారు. అప్పడామె వయసు 19 ఏళ్ళే. పెళ్ళయిన వెంటనే నటన మానేసి, ఇంటికే పరిమితం కావాలని భర్త ఆదేశించారు. ఆ బంధం దారుణమైనదే అయినా, కొన్ని మంచి పనులకూ దోహదపడింది. ఈ వివాహం కారణంగా లామార్‌కు గొప్ప గొప్ప సాంకేతిక ఆవిష్కర్తల పరిచయం లభించి, వారి ఆలోచనలను పంచుకోగలిగారు. ‘గైడెడ్ వెపన్రీ’ సృష్టించబడడానికి మూలాలను అన్వేషించారు. పరిస్థితులకు తొలవొగ్గి భర్త ఆజ్జని పాటించినా, 1938లో ఇక తప్పదన్నట్టు – తన విజ్ఞానాన్ని తీసుకుని నాజీయిజం నుండి, భర్త నుండి దూరంగా వెళ్ళిపోయారు.
ఎం.జి.ఎం. స్టూడియోస్‌కి చెందిన లూయిస్ మేయర్ ఆమె పేరుని ‘హెడీ లామార్’గా మార్చి హాలీవుడ్‌లో అవకాశాలిప్పించారు. అయితే సినిమాకి సినిమాకి మధ్య చేసేందుకు ఏ పని ఉండేది కాదు లామార్‌కి. హాలీవుడ్ ఆమెకి బోర్ కొట్టేసింది. తనకి వచ్చే ప్రతీ పాత్రనీ ఒప్పేసుకోవలసిన క్షీణ ఆర్థిక పరిస్థితిలో లేరామె. రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు సుసంపన్నులు, తోటి వారి సంక్షేమం కన్నా తమ బాగోగుల గురించే అధికంగా ఆలోచించారు. ఈ విధంగా ఓ అమెరికన్ కంపోజర్ జార్జి ఆంథీల్‌తో లామార్ మాట్లాడుతున్నప్పుడల్లా వారి సంభాషణంతా యుద్ధంపైనే జరిగేదట! “ఆమే, ఆంథీల్ ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా – వారి మాటలు తిరిగి తిరిగి – భీతి గొలిపే యుద్ధం మీదకే చేరేవి. ‘తనకి సౌకర్యంగా లేదనీ, పరిస్థితులు అంత దారుణంగా ఉంటే తాను హాలీవుడ్‌లో కూర్చుని డబ్బు పోగు చేసుకోవడం తనకి ఇష్టం లేదని హెడీ చెప్పింద’ని ఆంథీల్ గుర్తు చేసుకున్నారు” (చెస్లాక్ కొల్లీన్). ఈ ఉల్లేఖనంలో చెప్పినదాని ప్రకారం యుద్ధంలో జయించడానికి జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే – తాను డబ్బు కోసం పని చేయడం లామార్‌కి ఇష్టం లేదని అర్థమవుతుంది. యుద్ధ పరిస్థితి రోజు రోజుకీ భీతావహం అవుతుంటే – ప్రజల దృష్టి మళ్ళీంచే సినిమాలు చేస్తూండడం కన్నా తాను చేయాల్సింది ఇంకెంతో ఉందని లామార్ భావించారు. ఏదో ఒక మార్గంలో సాయం చేయాలనుకున్నారు – అది ‘వార్ బాండ్స్’ అమ్మడం కావచ్చు లేదా తన జన్మదేశం కాకపోయినా – ఆ దేశానికి ఉపయోగపడేలా ఏదైనా కనిపెట్టాలనుకున్నారు. యుద్ధం ముగిసి, ప్రజల ప్రాణాలు నిలవాలనుకున్నారు. అందుకని సరళమైన పరికరాలను ముందుగా కనుక్కుందామనుకున్నారు… ఉదాహరణకి అసలైన, తాజా ఆహారాన్ని దాచి ఉంచేందుకు తక్కువ స్థలమైనా సరిపోయే ఉపకరణాలని ఆవిష్కరించాలని అనుకున్నారు. కాని యూరప్‍లో జరుగుతున్న యుద్ధం తన పంజా విసిరి, అమెరికాని సైతంలో రంగంలోకి లాగుతుండడంతో, లామార్ తన దృష్టిని ఆయుధాల రూపకల్పనపైకి, ముఖ్యంగా టార్పెడో గైడెన్స్ సిస్టమ్స్ పైకి మళ్ళించారు.
సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, ఈ అంశం మండల్ డిన్నర్ పార్టీలలో ప్రధాన సంభాషణ అయింది. యూరప్‌కి చెందిన ఎందరో గొప్ప గొప్ప ఇంజనీర్లు సందేహించినా, లామార్ ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అసలు సమస్య ఏంటంటే – సాంప్రదాయకంగా, ఒక టార్పెడోని పేల్చినప్పుడు – శత్రువుపై దాడి చేసేందుకు అది తన నిర్ధారిత – సరళరేఖా మార్గంలో పయనిస్తుందని ఆశిస్తాము. అది పక్కకు మళ్ళినా, లేదా కెరటాల కారణంగా దారి మళ్ళినా అదృష్టం తారుమారు అవుతుంది. ఇప్పుడు కావల్సింది – ఆ టార్పెడో తన గమ్యం వైపు పయనిస్తున్నప్పుడు – ‘కొద్దిగా ఎడమకు, ఇప్పుడు ముందుకు…’ అంటూ మార్గదర్శనం చేసే ఒక వ్యవస్థ!
ఇందుకు సులువైన మార్గం రేడియో తరంగాలే. కానీ మార్గదర్శక వ్యవస్థను తెరిచి ఉంచడం వల్ల శత్రువులు దానికి పలు రకాల శబ్దాలతో అడ్డంకులు కల్పించే అవకాశాలు ఎక్కువ, దాని వల్ల ఎంత అధునాతనమైన రేడియో వ్యవస్థ ఉన్నప్పటికీ టార్పెడోకి మార్గదర్శనం లభించదు.
ఇందుకు లామార్ ప్రతిపాదించిన పరిష్కారం సరళమైనది, గొప్పది. తాను వాడిన పదాలను మరిచిపోకుండా చెప్పుకుందాం – ‘యాన్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ డెత్’. ఆమె దానిని ‘ఫ్రీక్వెన్సీ హాపింగ్’ అని పిలిచారు. ఓడకి, టార్పెడోకి మధ్య కేవలం ఒకే ఒక ఫ్రీక్వెన్సీ కాకుండా ‘మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ’ ఉంటే తప్పేంటని ఆమె అన్నారు. బహుళ పౌనఃపున్యాలు ఉంటే – ఓడ, టార్పెడో వాటిని పరస్పరం మారుస్తూ సమన్వయం చేసుకుంటాయని అన్నారు. అప్పుడు శత్రువు ఒక ఫ్రీక్వెన్సీని జామ్ చేసినా, అది ఓడ యొక్క మార్గదర్శక వ్యవస్థలో ఏ ఒక్క భాగానికో ఆటంకం కలిగించి, మిగతా ఫ్రీక్వెన్సీలు ఉపయోగపడతాయని అన్నారు. ఆటంకాలను తొలగించి, కనెక్టివిటీని పెంచేందుకు ఆమె ప్రతిపాదించిన ఈ ఆలోచన – ఆరు దశాబ్దాల తర్వాత బ్లూటూత్ సాంకేతికతకి మౌలికాంశంగా మారింది.
ఇక్కడ ఓడనీ, టార్పెడోని ఏకకాలంలో సమన్వయం చేయడం కీలకం. అప్పుడే అవి రెండూ కొత్త ఫ్రీక్వెన్సీని ఉపయోగించగలుగుతాయి. ఈ విషయంలో లామార్ అప్పటి నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ జార్జి ఆంథీల్ సాయం అర్థించారు. 1926 నాటికే ఆయన అత్యంత ఆధునికుడిగా ముద్రపడిన వ్యక్తి. వాస్తవానికి ఓ ప్రయోగాత్మక డాడావాదపు చిత్రానికి అనుబంధంగా వాయించేలా ‘Ballet Mecanique’ పేరుతో తన తొలి కచేరీతో సంగీత ప్రపంచంలోకి దూసుకువచ్చారాయన. అది ఆ కచేరీలో సంచలనం సృష్టించింది. ఇందులో రాగాన్ని రిథమిక్‌గా పలికించడం కోసం ఒక విమానం ప్రొపెల్లర్, దానితో ఏకకాలంలో సమన్వయం చేయబడిన 16 పియానోలని ఉపయోగించారు. ఆ కచేరీని ఇప్పుడు వింటే – దానిలో ప్రోకోఫీవ్ యొక్క సంగీతమంత మృదువుగా ఉంచేందుకు ప్రయత్నించారని అర్థమవుతుంది.
అయితే ఈ పరికరం అమెరికాలో దారుణంగా విఫలమయింది. తర్వాతి రెండు దశాబ్దాలు ఆంథీల్ దొరికిన పని చేశారు – సినిమాలకు సంగీతం అందించడం, ఓ స్త్రీ ఓ పురుషుడిని ఇష్టపడుతోందని తెలిపే నాడీ వ్యవస్థ గురించి రచనలు చేయడం, ‘SeeNote’ అనే పేరుతో పియానో నేర్పించే రోబోని సృష్టించడం వంటివి చేశారు.
1940లో చేసేందుకు ఏమీ లేక, తన ‘Ballet Mecanique’ పరికరాలతో కుస్తీ పడుతూండగా, యంత్రాలను సింక్రొనైజ్ చేయడం కొద్దిగా తెలిసింది. లామార్ ఆయనని కలిసి, ఉమ్మడి ఆవిష్కరణలకు సన్నద్ధమయినప్పుడు ఆయన ఈ విజ్ఞానాన్ని ఆమెతో పంచుకున్నారు.
తుదకు వారు ప్రతిపాదించిన యంత్రాంగం అత్యంత సరళమైనది. ఇందులో ఓడ, టార్పెడో రెండూ – పియానోలను వాయించడానికి ఉపకరించే – పెర్‌ఫొరేట్ షీట్స్ వలె – చుట్టుఛుట్టుకున్న, గంట్లున్న రిబ్బన్‌ని ఉపయోగిస్తాయి. టార్పెడోని ప్రయోగించిన వెంటనే ఒక స్విచ్ ఆన్ అయి రెండు రోల్స్ ఒకేసారి ఆన్ అయ్యేలా చేస్తాయి. రిబ్బన్‌పై పెట్టిన గంట్లు ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పులను సూచిస్తాయి. బహుళ పౌనఃపున్యాల మధ్య మారడం వల్ల రేడియో ప్రసారంలో ఏర్పడే చిన్న ఆటంకాలను పరిమితం చేయవచ్చు, ఫలితంగా ఈ వ్యవస్థని నిరోధించడం అసాధ్యమవుతుంది.
ఇది అద్భుతమైన వ్యవస్థే అయినా, ఒక చిన్న సమస్య ఉంది. దీని తయారీ బాధ్యత అప్పటి నౌకాదళానికి అప్పగించారు. వారు రూపొందించే టార్పెడోలో ఎన్నో లోపాలు ఉండేవి. యుద్ధం మొదలైన కొన్ని నెలల పాటు వాళ్ళ టార్పెడోలు – వెళ్తే తమ లక్ష్యాల కింద నుండి దూసుకుపోయేవి లేదా నెమ్మదిగా నౌక స్థూలభాగాన్ని తాకి పేలకుండా ఉండిపోయేవి.
ఇది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేది. అందుకని లామార్, ఆంథీల్‌ల ఆవిష్కరణ ఎంత గొప్పదైనా, దాన్ని పరిశీలించి, ప్రయోగించే అవకాశాన్ని నౌకదళం స్వీకరించలేదు. దానితో పనిచేయడం కన్నా తమ టార్పెడోలని సరిగా పనిచేయించడం వాళ్ళకి ముఖ్యమైంది.
తమ ఆవిష్కరణకి లామార్, ఆంథీల్ పేటెంట్ పొందినప్పటికీ, దాని అభివృద్ధిని వారు చూడలేకపోయారు. ఆ డిజైన్‌ని తాళం వేసి భద్రపరిచారు, తిరిగి పలు దశాబ్దాల వరకు దాని తాళం తెరవనే లేదు.
కాలక్రమంలో, విమానాల సంఖ్య పెరిగింది. వాటి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతినకుండా ఉండాలంటే – పరికరాలు ఒకదానికి మరొకటి ఆటంకాలు కల్పించకుండా ఉండాలి. ఇందుకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు లామార్ విస్మృత పరికరం గురించి ఆలోచించారు, అది ఓ విప్లవాత్మక పరిమాణం కావచ్చని భావించారు. గ్రామీణ పాఠశాలలకు ‘ఫాదర్ ఆఫ్ వైర్‌లెస్ నెట్‌వర్క్ సిస్టమ్స్’గా పేరుపొందిన డేవ్ హ్యూజ్స్ – లామార్‌కి తన గొప్ప, మూలమైన పనికి గుర్తింపు లభించాలని కోరుకున్నారు. అందుకు తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా 1993లో ‘ది ఎలెక్ట్రానికి ఫ్రాంటియర్ ఫౌండేషన్’ వారి ‘ది పయోనీర్ అవార్డు’ లామర్‌కి లభించింది. ఈ కార్యక్రమంలో ఆమె కృషికి తగ్గ ప్రశంసలు అందాయి. నేడు లామార్, ఆంథీల్‌ల ఆవిష్కరణ వై-ఫై, జిపిఎస్, బ్లూటూత్ వంటి పరికరాల పనితీరులో ఉపయోగపడుతోంది. ఈ విధంగా లామార్‌కు ‘మదర్ ఆఫ్ ఆఫ్ వై-ఫై’ అనే మారుపేరు వచ్చింది.
లామార్ 2000వ సంవత్సరంలో మరణించారు. ప్రపంచంలోకెల్లా అందగత్తెలలో ఒకరై, వైర్‌లెస్ యుగానికి మాతగా పేరుగాంచారామె.