ట్విన్ సిటీస్ సింగర్స్-14: ఈ సంగీత సాగరం లో అన్ని భాషలూ రంగుల అలలే..’ – శ్రీమతి చంపక

0
3

[box type=’note’ fontsize=’16’] ‘ట్విన్ సిటీస్ సింగర్స్’ శీర్షికన – “సంగీతమే ఒక మహా సముద్రం. ఒకో అలది ఒకో అందం. కొన్ని ఉరకలెత్తెస్తే మరి కొన్ని మెత్తగా మనసుని స్పృశించి పోతుంటాయి” అంటున్న శ్రీమతి చంపక గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

***

శ్రీమతి చంపక ‘ఎంత సింపుల్‌గా కనిపిస్తారో, అంత ఘనంగా పాడతారు’ అని ప్రేక్షకుల మెప్పుని, ప్రశంసలను సొంతం చేసుకున్న గాయని – శ్రీమతి చంపక! ఇటు దక్షిణాది భాషలతో బాటు, అటు హిందీ, మరాఠీ భాషల్లో కూడా పాటలు పాడగల బహు భాషా ప్రజ్ఞాని! పలు సంగీత సాంస్కృతిక సంస్థలు నిర్వహించే అనేక విభావరీలలో, పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో పాల్గొని, ప్రశంసా పత్రాలతో బాటు ఎన్నో సన్మానాలు, సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం స్మూల్ సోషల్ మీడియాలో తన గానాన్ని అందిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందారు. పాపులర్ సింగర్ అయ్యారు.

సంగీతం అంటే ఎంత ఆరాధ్యమో, చదువన్నా అంతే ఇష్టం. అంతే మోహం. ‘నేనొక జ్ఞాన పిపాసిని..’ అంటూ నవ్వేస్తున్న ఈ గాయనితో ‘సంచిక’ కోసం చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ చదవండి..

***

♣ చంపక! చెప్పండి. మీ గాత్రాన్ని ఇంత అందంగా ఎలా మెరుగు పరచుకున్నారు చెప్పండి?

* (సంతోషం గా నవ్వేస్తూ) ఈ ప్రతిభ అంతా నా సొంతం కాదు. ఎందరో సంగీత విదుషీమణులు, ప్రతిభా మూర్తులని అనుసరిస్తూ నేర్చుకున్నాను అంతే! సాగరం వంటింది సంగీతం. నేను సంపూర్ణమైన బిందువుని కూడా కాదేమో! పాడుతున్నది సినిమా పాటే అయినా అందులోంచి నేర్చుకోవాల్సింది చాలా పరిజ్ఞానమే వుంటుంది. ఒకో సారి ఒక లైన్ పట్టుకోడానికి ఒక రోజంతా కృషీ, సాధన చేయాల్సి వుంటుంది.

ఉదాహరణకి..’సరిగమలు గలగలలే’ తీసుకోండి..కేవలం పల్లవి వరకు ఒక వారం పాటు అయినా సాధన అవసరం. వినడానికి ఎంతో సింపుల్‌గా సాధారణంగా వినిపించే పాటల్లో సైతం, అందులో సంగీత మర్మం ఎంతో దాగుంటుంది. అవన్నీ గమనిస్తుంటాను. కేవలం ఈ గమనికే నా పాటలో మెరుపులా మెరుస్తుందేమో తెలీదు. (నవ్వులు)

♣ మీరెప్పట్నించి పాడుతున్నారు?

* నా పదవ ఏట నించి పాడుతున్నాను.

♣ పదిమందిలో పాడిన మొట్ట మొదటి పాట గుర్తుందా మీకు?

* ఆ. గుర్తుంది. మరచిపోలేని జ్ఞాపకం అది నాకు. మా పక్కింటి వాళ్ళు సంక్రాంతి బొమ్మల కొలువు పెట్టేవారు. ఎంతో అందంగా, తీర్చిదిద్దిన ఆ ముంగిలి ఎంతో కళ కళ లాడుతూ వుండేది. వాళ్ళు నన్ను పిలిచి మరీ పాటలు పాడించుకునేవారు. అక్కడికి వెళ్లి పురందరదాసు కృతులు పాడేదాన్ని. అప్పటికి నా గొంతు అంతగా పరిపక్వం కాలేదు. తాళ జ్ఞానం కూడా అంత పరిపూర్ణంగా పొందని తొలి దశ! అయినా, బాగా పాడానని మెచ్చుకునేవారు.

♣ కృతులు అన్నారు, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా?

*అవునండి. మా నాన్నగారు కర్నాటక సంగీత గాయకులు. మేము ‘కన్నడ మధ్వాస్’. కనుక, నాన్నగారు ఎక్కువగా పురందర దాస కృతులు పాడేవారు. ఎంతో హృద్యంగా, ఆర్ద్రత నిండిన కంఠ స్వరంతో కళ్ళు మూసుకుని, కృతి సాహిత్యంలో లీనమై పాడుతుండేవారు. నాకు తెలీకుండానే నేను నాన్నగారి గాత్రంలో లీనమైపోయేదాన్ని. కీర్తనలను ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా ఆలకిస్తుండేదాన్ని. అలా కృతుల మీద అపరిమితమైన ఆరాధనా భావం పెరిగింది.

♣ మీరు తెలుగు వారనుకున్నాను..మీ మాటల్లో ఎక్కడా యాస లేదు ఎంతో స్పష్టంగా వుంది ఆంధ్రా తెలుగులా.. (నవ్వులు)

* నా మాతృ భాష కన్నడ..అయినా, నాలుగు భాషల్లో మాట్లాడగలను.

♣ కన్నడ సినిమా పాటలు కూడా పాడేవారా?

* అహా! బ్రహ్మాండంగా. మాతృ భాష అదే కాబట్టి కన్నడ సినిమా పాటలు అన్నీ రేడియోలో విని నేర్చుకున్నవే. అందుకే కన్నడ ఉచ్చారణ సుస్పష్టంగా వుంటుంది.

♣ మరి తెలుగెలా నేర్చుకున్నారు?

* నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. పైగా నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కావడంతో తెలుగు సినిమా పాటలు రేడియోలో వింటుండేదాన్ని. ‘ చిత్రసీమ..’ అనే ప్రోగ్రాం టీవీలో వచ్చేది అప్పట్లో! అలా టీవి కార్యక్రమాలలో చూసీ, నేర్చుకున్నాను.

♣ విద్యార్థిగా వున్నప్పుడు స్కూల్‌లో పాడేవారా?

* నేను పదవ తరగతిలో వున్నప్పుడు జాతీయ గీతంలో ప్రధాన గాయనిగా బృందంతో కలిసి పాడించేవారు. స్కూల్ పాటల పోటీలన్నిటిలోనూ చురుకుగా పాల్గొనే దాన్ని. సో, తెలుగులో పాడటం అలా అలవాటైపోయింది.

♣ పోటీలలో పాల్గొన్న అనుభవాలు ఎలా వుండేవి?

* పాటల పోటీలలో పాల్గొనడం అదొక ఉత్సాహ ఉద్వేగ సన్నివేశాలని చెప్పాలి. (నవ్వులు) నిజానికి అదొక సంచలనాల కాలం. ఆ పరంపర నా డిగ్రీ వరకు కొనసాగిందని గర్వంగా చెప్పుకుంటాను.

♣ ఆనాటి అనుభవాలను ‘సంచిక’తో పంచుకుంటారా?

* తప్పకుండా, ఆనందంగా పంచుకుంటాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం ఎంత విశాలమైనదో అందరకీ తెలుసు కదా! అక్కడ పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారు. వారి ముందు పాడి, జడ్జెస్ మెప్పు పొందాను. ఇలా చాలా పెద్ద పెద్ద కళాశాలలో పాడి బహుమతులు గెలుచుకునేదాన్ని. లా కాలేజీలో, చైతన్య భారతి టెక్నాలజీ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా.. అనేకానేక పెద్ద కళాశాలలో, పెద్ద పెద్ద ఆడిటొరియాలలో పాటల పోటీలలో పాల్గొని బహుమతులు పొందాను.

♣ మీరు ఆర్ట్స్ స్టూడెంట్ కదా, ఈ కాలేజీలలో ఎలా ప్రవేశం దొరికేది? మీరు అక్కడ విద్యార్ధిగా వున్నారా?

* నేను చదివింది సికిందరాబాద్‌లో ‘దీవాన్ బహదూర్ కాలేజీ’లో. కాలేజి తరఫున నన్ను ఇతర కాలేజి పోటీలకు పంపించేవారు. పెద్ద పెద్ద వేదికల మీద పాడడం అలా మొదలైంది.

♣ మీరు హిందీ పాటలు కూడా అద్భుతంగా పాడతారు.. హిందీలో కూడా మీకు ప్రవేశం వుండివుండాలి కదూ?

* అవును వుంది. నా చదువులో హిందీ కూడా ఒక లాంగ్వేజ్‌గా తీసుకోవడంతో ఈ భాషలో కూడా నాకు మంచి ప్రవేశం, నాలెడ్జ్ వున్న మాట వాస్తవం. పైగా రేడియోలో వివిధ భారతి ఎప్పుడూ చెవి కింద హిందీ పాటల్ని పాడుతూనే ఉండేది..(నవ్వులు) అలా.. పాటలన్నీ ఈజీగా వచ్చేవి. ఈజీగా పాడేదాన్ని. ఫ్రెండ్స్‌తో సినిమాలకు వెళ్ళేదాన్ని. అందుకని లేటెస్ట్ పాటలు నాలిక మీదే ఆడేవి. నిత్యం హమ్మింగ్‌గా పాడుకోవడంతో నాకు తెలీకుండానే పాటకి సాధన చేకూరేది. ఇలా – నాకు ఏ భాషలో కూడా భాషా పరంగా గానీ, డిక్షన్‌తో కానీ ఇబ్బంది పడలేదు.

♣ పాటలు అందరూ వింటారు. కానీ నేర్చుకోవడంలో కూడా కొన్ని టెక్నిక్స్ వుంటాయేమో కదూ?

* అవునండి. మంచి ప్రశ్నే వేశారు. శ్రోతగా కాకుండా ఈ పాట పాడాలనుకునే సింగర్‌గా – వినేటప్పుడు ఓ ప్రత్యేక శ్రధ్ధ పెట్టి వినాలి. సినీ గాయకులు ఎలా పాడుతున్నారు?ఎక్కడ గమకాన్ని చేర్చారు, ఎక్కడ ఏ స్థాయిలో మెరుపుల్ని కురిపించారు, ఏ పదాల మలుపుల్న హస్కీ వాయిస్ ఇచ్చారు, ఆ డైనమిక్స్ అన్నీ పసిగట్టేదాన్ని. కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ వినేదాన్ని. ఇప్పటికీ, ఏ కొత్త పాటే అయినా, అదే పద్ధతిలో విని నేర్చుకుంటా.

♣ సినిమా పాట నేర్చుకోడానికి సంగీతం తోడ్పడుతుందా?

* తప్పని సరిగా ఎంతో దోహదపడుతుంది. అందులో సందేహమే లేదు. అందుకే నాకు శాస్త్రీయ సంగీతం మీద తెగని మక్కువ. ఆ మాధుర్యమే మాధుర్యం.

♣ సంగీత కచేరీలు కూడా ఇస్తుంటారా?

* ఆ ఆశయంతోనే వుండేదాన్నీ..కానీ.. అశోక్‌తో నా వివాహం జరగడం, సంసారంలో బిజీ అయిపోవడంతో సంగీతానికి నాకు మధ్య గాప్ వచ్చింది.

♣ మీ వారు అశోక్ కూడా పాడతారా?

* ఆ. అద్భుతంగా పాడతారు. ఆయన హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. మా మెట్టినిల్లు ఒక సంగీత నిలయం. మా అత్తగారు అప్పట్లోనే అంటే అరవై యేళ్ళకు పూర్వమే సంగీతంలో డిప్లొమా చేసారు. మంచి గాయని. కొన్నాళ్ళు స్కూల్‌లో సంగీతం టీచర్‌గా కూడా పనిచేశారు. పెళ్ళయ్యాక మానేసానని చెబుతుండేవారు. ఆమె త్యాగరాజ కీర్తనలు ఎంత శ్రావ్యంగా, హాయిగా పాడతారో! ఇక మా మామగారు సంగీత ప్రియులు. శాస్త్రీయ సంగీతం తెలియదు కానీ గాత్రం మాధుర్యాలను ఇట్టే పట్టేస్తారు. శృతి లయలు రాగ తాళ భావాల ఆస్వాదనలో ఆయనకు ఆయనే సాటి. మా పాటల్లో ఏ అతి సూక్ష్మ లోపాలనూ ఇట్టే చెప్పేసే వారు. అంత నిష్ణాతులు. వారికి సంగీతం బాగా తెలుసు. మంచి గాత్రం కూడా వుంది. ఆ తర్వాత చెప్పాలంటే – మా బావగారు, మరిది, ఆడపడుచు, ఆమె పిల్లలు ఇలా చెప్పుకుంటూ పొతే మా కుటుంబంలో అందరూ గాయనీ గాయకులే.. మాది ఓ సంగీత కుటుంబం.. కాదు కాదు సంగీత వంశం.

♣ చిన్న సంగీత కుటుంబం నించి ఓ పెద్ద సంగీత కుటుంబంలోకి ప్రవేశించారన్నమాట? (నవ్వులు)

* నిజమండీ! సరిగ్గా అదే జరిగింది. అలా సంగీతంతో ఎప్పుడు కనెక్టె అయి వున్నా. మా పుట్టింట్లో కూడా – మా అమ్మా, నాన్న పెద్దక్క, తమ్ముడు అందరూ మంచి గాయకులే. సో సంగీతం నా జీన్స్‌లో వుందని చెప్పాలి. మెట్టింట్లో కూడా సంగీతాభిరుచి గల వారే దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తుంటాను. మా వారు దగ్గరుండి నన్ను ప్రోగ్రామ్స్‌కి పంపిస్తారు. పాడమని ఎంతగానో ప్రోత్సహిస్తారు.

* కొన్ని పాటలు పాడుతున్నప్పుడు ఆలపిస్తుంటే అనిపిస్తుంది..ఈమె సినిమా సింగరా అని..ఎప్పుడైనా ప్రయత్నించారా సినిమాలకి?

* అప్పట్లో సినీ రంగం మీద పెద్దవాళ్ళకు ఆసక్తి వుండేది కాదు. దృష్టి అటు వైపు వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు ప్రయత్నించాలి అని వున్నా, పెద్దల మాటే మాకు శిరోధార్యం. బహుశా అందుకే నేనెప్పుడూ ప్రయత్నించలేదేమో అని అనుకుంటుంటాను. ఇప్పుడా అవకాశం అరుదు కదా!

♣ చదువు పై కూడా మీకమితమైన మక్కువ అని విన్నాను.

* అవునండి. చదువు, సంగీతం రెండూ రెండు కళ్ళు నాకు.

డిగ్రీ అయ్యాక పెళ్ళయింది. ఒక బాబు పుట్టాడు. పేరు ప్రకాష్. బిటెక్ చేసాడు. ప్రస్తుతం ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. బాబు పుట్టాక నా ఇంట్రెస్ట్ పై చదువుల పైన కలిగింది. పెళ్ళి తరువాత ఎం.ఏ., బి.ఎడ్. చేసాను. కొన్నాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్‌లో సోషల్ స్టడీస్ డిపార్ట్మెంట్‌కి హెచ్.ఓ.డి.గా పని చేసాను. ఆరోగ్యం సహకరించక పోవడంతో కొన్నాళ్ళే పని చెయ్య గలిగాను.

ఆ తరవాత సైకాలజీ సబ్జెక్ట్ గెస్ట్ లెక్చరర్‌గా కాలేజిలో పార్ట్ టైమ్ జాబ్ చేసాను. బిఎడ్ వాళ్లకు మాక్ ప్లాన్స్ ప్రిపేర్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా సైకాలజీ సబ్జెక్ట గెస్ట్ లెక్చరర్‌గా కనెక్టెడ్ గానే వున్నాను.

ఎంకాం కూడా చేసాను. ఈ నాలెడ్జ్‌తో షేర్ మార్కేట్ లో కొంత ఆసక్తి రగిలింది. (నవ్వులు) ఇప్పుడు ట్రేడింగ్‌లో బిజీగా వుంటున్నాను. ఇల్లే ఆఫీస్. ఉదయం నించి సాయంత్రం వరకు ఉద్వేగ క్షణాలే (నవ్వులు) – వివాహానంతరం నా విద్యాభివృద్ధిలో నన్ను ప్రోత్సహించడంలో మా శ్రీవారు అశోక్ పూర్తి సహకారం వుంది.

♣ మీరు స్మూల్‌లో చాలా పాపులర్ సింగర్ అయిపోయారు.. స్మూల్ లోకి ఎలా ప్రవేశించారు?

* భలే గుర్తు చేసారు. ఇప్పుడు ఇదే అసలు విషయంగా చెప్పుకోవాలి. (నవ్వులు) ఒక రోజు మా మరిది తన మాటల్లో స్మూల్ ఆప్ గురించి చెప్పారు. ప్లేబ్యాక్‌లా పాడుకోవచ్చు, ట్రై చేయండి అని. సరే అని స్మూల్‌లో జాయిన్ అయ్యాను 2018లో. అప్పటి నుండి పాడుతున్నాను. ఇందులో మంచి మంచి సింగర్స్‌తో పరిచయం అయ్యింది. దేశ విదేశాల గాయనీ గాయకులతో పరిచయమే కాకుండా నా కొలాబ్ నచ్చడం వల్ల అభిమానులుగా మారడం నాకెంతో ఆనందాన్ని కలగచేసిది.

♣ స్మూల్ లో మరపు రాని ఇన్సిడెంట్ ఎమైనా వుందా?

* చాలా ప్రశంసలు, మెచ్చుకోవడాలు, అభిమానాన్ని కురిపించడాలు ఒక అందమైన ఆత్మీయానుభూతిని కలిగించడం ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలే. కానీ మరపురాని జ్ఞాపకం ఒకటుంది. ఒక వీడియో రికార్డింగ్ చేయాలని రిక్వెస్ట్ పంపారు. నేనెక్కువగా వీడియోలు చేయను. అన్నీ ఆడియోస్ నా పాటలన్నీను.

ఆ వీడియో కాన్సెప్ట్ ఏమిటంటే ‘జన గణ మన.. జాతీయ గీతం’ పై సింగర్స్ పాడిన పాట. చాలా ఆసక్తిగా అనిపించింది. వారి కోరిక మీద పాడాను. చాలా వ్యూస్ వచ్చాయి. బాగా హిట్ కూడా అయ్యింది. స్మూల్ సోషల్ మీడియా వేదిక మీద నా పాటల సెలెక్షన్ నా అభిరుచి మేర మాత్రమే ఎంచుకుని పాడుతుంటాను.

♣ ఎన్ని భాషల్లో పాడుతుంటారు?

* నేను పాడగల ఐదు భాషల్లో ఎక్కువగా, తెలుగు, హిందీకే ప్రాధాన్యత ఇస్తాను. ఆ తర్వాత కన్నడ, అప్పుడప్పుడు తమిళం. స్మూల్ లో హింది, తెలుగు, కన్నడ,తమిళ్ మరియు మరాఠీలో కూడా పాడుతాను.

♣ స్టేజ్ షోస్ ఇస్తారు కదూ?

* అవును. అప్పుడప్పుడు స్టేజ్ షోస్ ఇస్తాను. ఇప్పుడు కరోనా కారణంగా తగ్గాయి ప్రోగ్రామ్స్.

♣ స్టేజ్ మీద ఏ పాటలెక్కువగా పాడుతుంటారు?

* తెలుగు, హిందీ భాషల్లో పాడుతాను. ఇతర భాషల్లో పాడమని కోరితే కూడా పాడతాను. నో ప్రాబ్లం.

♣ సింగర్‌కి భాషా పరమైన ఆంక్షలు వుంటాయంటారా?

* లేదండి. అసలు వుండకూడదని నా అభిప్రాయం. ఒక కళాకారుడికి ఒక భాష కంటే ఎక్కువ భాషలు తెలిసివుంటే ఇంకా మంచిదంటాను. ఆ భాషా సంకారాలు తెలిసి వుంటం వల్ల ఆ యా భాషలో పాట పాడేటప్పుడు పాటలో నేటివిటీ వుంటుంది. చదవడం రాయడం వచ్చి వుంటే ఇంకా మంచిది. సింగర్ కి ఇవి ప్లస్ పాయింట్స్ అవుతాయి.

 ♣ ఈ భాషా చిత్రాలలో సంగీతం బావుంటుందని కొందరి అభిప్రాయపడుతుంటారు. మీరేమంటారు?

* ఏ భాషలో అయినా సంగీతం సంగీతమే..ఆ మాధుర్యం ఎవరికైనా మధురం గానే వుంటుంది. అని నేను అనుకుంటాను.

హిందీ పాటలోని మృదుత్వాన్ని ఆస్వాదిస్తాను, దక్షిణాది చిత్రాల టఫ్ కంపోజిషన్స్ సైతం విని ఎంజాయ్ చేస్తుంటాను. వెస్టర్న్ మ్యూజిక్ కూడా వింటుంటానండి. చాలా ఇష్టం. దేని బ్యూటీ దానిదే. సంగీతమే ఒక మహా సముద్రం. ఒకో అలది ఒకో అందం. కొన్ని ఉరకలెత్తెస్తే మరి కొన్ని మెత్తగా మనసుని స్పృశించి పోతుంటాయి. రంగురంగు పూల మాల వంటిది, విభిన్న భాష చిత్రాల సినిమా పాట నాకు.

♣ మీకు తెలుగు లో బాగా ఇష్టమైన పాట?

* ఊ…నాకు నచ్చిన పాట తెలుగులో అంటే – ‘ఏ శుభ సమయంలో’. హిందీ లో ‘రైనా బీత్ జాయే’. కన్నడలో ‘బానల్లు నీనే భువి యల్లు నినే’. తమిళ్‌లో ‘ఎంద సత్తం ఇంద నేరం ఉయిరే ఉయిర్’. ‘ఒరోరి పిల్లగాడు వగలమారి పిల్లగాడా’ అనే సూపర్ సాంగ్ నాకు ఆల్ టైం ఫేవరేట్.

♣ ఇష్టమైన సంగీత దర్శకులు?

 * శంకర్ జైకిషన్ అంటే చాలా అభిమానం. ఇళయరాజా, రాజన్ నాగేంద్ర (కన్నడ). అల్లు గారి వినోదం, రాజన్ నాగేంద్ర, ఇళయ రాజా, సత్యం. రెహ్మాన్, శంకర్ జై కిషన్, మదన్మోహన్ వంటి గొప్ప సంగీత దర్శకులు నేనెప్పటికీ మరచిపోలేని గొప్ప సంగీత దర్శకులు.

* సినీ సంగీత సాహిత్యంలో?

* సముద్రాల, కృష్ణ శాస్త్రి సాహిత్యం అంటే ఓ ప్రత్యేకమైన మక్కువ.

♣ మీ అభిమాన గాయనీ గాయకులు?

* లత, ఆశా, సుశీల, జిక్కి, ఘంటసాల, శ్రేయ ఇంకా బాగా పాడే ఏ కొత్త సింగర్ అయినా నాకు ఇష్టమే.

♣ సంగీతం అంటే మీ దృష్టిలో?

* నా సంగీతం నాతోనే పుట్టింది నాతోనే పోతుంది. అంటే నా చివరి శ్వాస వరకు సంగీతం నాతోనే వుంటుంది.

దుఃఖ సాగరం నుంచి మనల్ని బయట పడేసి శక్తి కేవలం సంగీతానికి మాత్రమే వుంది. వుంటుంది. ఇది నా అభిప్రాయం. ఎందరో మహానుభావులు కనుగొన్న సత్యం!

సర్వే జనా సుఖినోభవంతు!

♣ థాంక్సండి. మీరు మరెన్నో స్టేజ్ ప్రోగ్రాంస్ చేసి, మరిన్ని కీర్తి శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నాను. మా సంచిక తరఫున మీకు శుభాకాంక్షలు అందచేస్తున్నాను.

*థాంక్సండి. సంచిక సంపాదకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అందరకీ వందనములు.

***

సెల్ : 80740 47182

champakakkumar67@gmail.com.

***

Songs links

“Hume Aur Jeene Ki[Duet]-Agar Tum Na Hote 1983” on #Smule:

https://www.smule.com/p/396711640_3678223043

“Dil Ki Nazar Se” on #Smule: https://www.smule.com/p/1690815798_3682736292

“Kanchi re kanchi re” on #Smule: https://www.smule.com/p/396711640_3678236482

“ʜᴅ Loote Koi Man Ka Nagar” on #Smule: https://www.smule.com/p/1194769195_3673963872

“Kanasalu Neene Manasalu neene” on #Smule: https://www.smule.com/p/1361415988_3662252002

“TERE BINA ZINDAGI SE” on #Smule: https://www.smule.com/p/1421131509_3663755050

“Jeeva Veene Needu Midithada” on #Smule: https://www.smule.com/p/1304198985_3650242742

“Raag Kirwani based 10 Film Songs – @_s_a_b_u_” on #Smule: https://www.smule.com/p/396711640_3563147708

” Sirimalle puvva – 16 yella vayassu” on #Smule: https://www.smule.com/p/1421131509_3136269718

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here