[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 12” వ్యాసంలో కటారుపల్లి లోని ‘వేమన సమాధి’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
వేమన సమాధి
[dropcap]వి[/dropcap]శ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో రాసిన వేమన పద్యాలు తెలియని తెలుగువారుండరు కదా. ఆయన పద్యాలు చదువుకోని తెలుగు విద్యార్థి ఉండరు. అప్పట్లో చదువురాని వారు కూడా అలవోకగా ఆయన పద్యాలు పాడేవారు. ఎన్నో జీవనసత్యాలను అతి తేలిక పద్యాలుగా మనకందించిన ప్రజా కవి వేమన. వందల ఏళ్ల నాడే అన్ని మతాల డాంబికాచారాలనూ, మూఢనమ్మకాలనూ కడిగి పారేసిన ప్రజల కవి. ఆయన వ్యవహారాన్ని బట్టి, ఆయన పద్యాలను బట్టి ఆయనని యోగి వేమన అనేవారు.
ఈయన పద్యాలు విని ప్రభావితుడైన సి.పి. బ్రౌన్ అనే ఆంగ్ల సాహిత్యవేత్త ఈయన సాహిత్యం మీద పరిశోధన చేశారు, ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. ఈయన జన్మించినది, మరణించినది ఈ సంవత్సరాలో అని ఎవరూ చెప్పలేకపోయారు. 15, 16, 17 శతాబ్దాలవాడని రకరకాల అభిప్రాయాలు వున్నాయి.
అలాంటి యోగి తమ ఊరిలోనే మరణించాడని విశ్వసిస్తూ, గుడి కట్టి ఆరాధిస్తున్న ఊరి గురించి తెలుసుకుందాం.
ఆ మహా యోగి సమాధి అనంతపురం జిల్లాలో కదిరికి సమీపంలో కటారుపల్లిలో వున్నది. ఆయన పుట్టింది కడప జిల్లాలోనైనా మరణించింది మాత్రం ఇక్కడేననే నమ్మకం కటారుపల్లి వాసులకి. ఈయనకి మరణించినప్పుడే సమాధి నిర్మించారుట. అది పూరి గుడిసె మాదిరి వుండేది. క్రీ.శ. 1933లో దానిమీద చిన్న మందిరం, తర్వాత క్రీ.శ. 2005లో చుట్టూ బిల్డింగ్ కట్టి గోడలమీద 150 పైన వేమన పద్యాలు చెక్కించారు. ఇందులో చాలామందికి తెలియని పద్యాలు కూడా కొన్ని వున్నాయి. సమాధి దగ్గర పూజారిగా వున్నవారు వేమన వంశంవారిలో ఏడవ తరం వారుట. పేరు శ్రీ నాగిరెడ్డి. వారి సంబంధీకులు నాలుగు కుటుంబాలు వున్నాయిట అక్కడ.
వేమన ఈ వూరిలో జీవసమాధి పొందటం ఇక్కడి వారు గౌరవంగా భావిస్తుంటారు. అందుకే కటారుపల్లిలో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒక్కరికైనా వేమన పేరుపెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటారు.
కదిరికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం నల్లచెరువులో కూడా వేమనకు ఒక ఆలయం ఉంది. కటారుపల్లిలో సజీవ సమాధి అయిన తరువాత లేచి ఆయన ఇక్కడికి వెళ్లినట్లు నమ్మకం. అందుకే అక్కడ గుడి కట్టినట్టు చెబుతారు. బెంగుళూరుకు చెందిన నారాయణ రెడ్డి వేమన తత్వం, వేమన భావాలు ప్రజలకు దగ్గర చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరులో, అలాగే కటారుపల్లి గ్రామంలో కూడా ‘యోగివేమన ఆశ్రమం‘ నిర్మించారు. దీనికి ‘విశ్వవేమన కొండ’ అని నామకరణం చేశారు. వేమన జీవిత చరిత్ర పుస్తకాలు, పద్యాల సీడీలను ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు.
ఈ ఆలయానికి నిత్యం అనంతపురం కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆదివారం, మంగళవారం వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఉత్సవాలు
మార్చి 29, 30, 31 తారీకులలో వేమన జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వాటికి లక్షమంది దాకా వస్తారు.
సమీప పర్యాటక ప్రాంతాలు
వేమన గుడికి సమీపంలో వున్న తిమ్మమ్మ మర్రి మాను గిన్నిస్ బుక్‌లో ఎక్కిన ప్రకృతి ఇచ్చిన వరం.. పెద్ద మర్రి వృక్షం. ఈ మానుని చూడటానికి సందర్శకులు వస్తుంటారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహుని, ఖాద్రి కొండను దర్శించుకొనటానికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఆ ఊరిపై దృష్టి సారించింది.
కదిరినుంచి తిమ్మమ్మ మర్రిమాను, వేమన సమాధి, ఖాద్రి కొండ ఈ మూడు ప్రదేశాలను 3 గంటలలో చూసి రావచ్చు. మేము ఆటోలో వెళ్ళి వచ్చాము. ఆటోకి రూ. 450 తీసుకున్నారు.
మార్గం
అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కటారుపల్లి గ్రామం ఉంది. కదిరి నుంచి ఉదయం, సాయంత్రం సరాసరి బస్ సౌకర్యం ఉంది. అలా కాకుండా కడప జిల్లా రాయచోటి వైపు వెళ్ళే బస్సులలో కటారుపల్లి క్రాస్ వద్ద దిగి నడిచి కూడా వెళ్ళవచ్చు. కదిరి నుంచి బోలెడన్ని ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.