[dropcap]వా[/dropcap]డెప్పుడూ బానిసే
బానిసగా పుట్టాడు/బానిసకి పుట్టాడు
బానిసగా పెరిగాడు/బానిసగానే చస్తాడు
వీడు పుట్టాకే/స్వతంత్రంవచ్చిందట
అయినా వీడు/బానిసే!
పరాయి భాషకి బానిస
పరాయి భావాలకి బానిస
పరాయి మతానికి బానిస
పరాయి సంస్కృతికి బానిస
తనదైన ఊహకూడా లేని
కట్టు బానిస!… వాడు
ఆలోచించడు.. నిన్ను
ఆలోచించనివ్వడు
నువ్వు ఆలోచిస్తే వాడికి భయం
నువ్వు.. నిలబడితే వాడికి
చెప్పలేనంత భయం.
వాడికి
దేన్నిచూసినా భయమే
దేవుడు అన్నా/దెయ్య౦ అన్నా
పదవులన్నా, పాలకులన్నా
రౌడీలన్నా, కేడీలన్నా
గూండాలన్నా, నాయకులన్నా
రోగాలన్నా, డాక్టర్లన్నా
న్యాయం అన్నా, లాయర్లన్నా
శాస్త్రాలన్నా, బాబాలన్నా
సమ్మెలు అన్నా, యుద్దాలన్నా
అడుక్కునే ముష్టోళ్ళు అన్నా
అంతేలేని భయం భయం
అర్థం లేనీ భయం భయం.
మళ్ళీ చెబుతున్నా… వాడు
దేవుడికీ/దెయ్యానికీ
పాపానికీ/పుణ్యానికీ
పూజలకీ/వ్రతాలకీ
నటులకీ/నాస్తికులకీ
కీచకులకీ/ప్రవచకులకీ
రాళ్ళకీ/రప్పలకీ
భార్యకీ/బిడ్డలకీ కూడా
నిఖార్సైన బానిస.నిష్కామ బానిస.
అటెళ్ళి ఎర్రజండా అంటాడు
ఇటొచ్చి పచ్చచొక్కా అంటాడు
రోజుకో రంగు మార్చి
సర్వులకీ సలాము చేస్తుంటాడు .
సాగిలపడుతూ ఉంటాడు
కుక్క గద్దె నెక్కినా/కిక్కురుమనకుండా
కాల్మొక్తా అంటాడు. కాకా పడుతూ ఉంటాడు.
గద్దలకీ పాములకీ ఎలుకలకీ ఏనుగులకీ
కోతులకీ కొండలకీ బల్లులకీ బండలకీ
కళ్ళు మూసుకుని మొక్కుతాడు
నిప్పుల్ని తొక్కుతాడు…వాడి
నరనరానా భయమే
నరనరానా వినయమే!
నువ్వు …ఎవరినైనా నమ్ము
వాడ్నిమాత్రం నమ్మకు. ఎందుకంటే
ఒక్కక్షణం నువ్వు ఏమారితే
నిన్నేకాదు నీ తరతరాల్నీ
బానిసలుగా మారుస్తాడు.
నిజం.. వాడి భగవంతుడు కూడా
బానిసలకే దర్శనమిస్తాడు
ఇంతకీ వాడెవడని కదూ
మధ్యతరగతి మనవాడు.