సంభాషణం: శ్రీమతి అల్పన సిరి అంతరంగ ఆవిష్కరణ

0
3

[box type=’note’ fontsize=’16’] ఆల్ ఇండియా రేడియోలో ఓనమాలు దిద్ది పదమూడు సంవత్సరాలుగా న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా రాణిస్తున్న అల్పన సిరి గారితో సాధన గారు జరిపిన ముఖాముఖిని సంచిక పాఠకులకు అందిస్తున్నాము. [/box]

తల్లి తండ్రులు విద్యాభ్యాసం

అప్పటి నిజామాబాదు లోని కామారెడ్డి, ఇప్పుడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ నేను పుట్టి పెరిగిన ఊరు. నాన్న ఈశ్వర్ అమ్మ ఇంద్రా రాణి. ఇంటికి నేనే పెద్ద కూతుర్ని, తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు. ఎం.కామ్ చదువుకున్నాను.

రేడియో అనౌన్సర్‌గా

పీజీ చేయటానికి హైదరాబాద్ వచ్చినప్పుడు పాకెట్ మనీ కోసం చదువు డిస్టర్బ్ అవకుండా ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఆల్ ఇండియా రేడియోలో పార్ట్ టైం జాబ్ ఉందని తెలిసి అప్పటి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ చావలి దేవదాస్ గారిని కలిసాను. అనౌన్సర్‌గా చేయాలంటే తెలుగు బాగా రావాలన్నారు. అప్పటికి ఆడిషన్స్‌కి ఓ రెండు మూడు నెలల సమయం ఉంది. ఆయన చెప్పినట్టుగా ఆ సమయంలో తెలుగు బాగా నేర్చుకున్నాను. అనౌన్సర్‌గా సెలెక్ట్ అయ్యాను.

న్యూస్ ప్రెసెంటర్‌గా

రామ్ కోటి లోని ప్రగతి మహా విద్యాలయంలో ఎం కామ్ చదివేటప్పుడు పాకెట్ మనీ కోసం పార్ట్ టైం ఆల్ ఇండియా రేడియో యువవాణి లో అనౌన్సర్‌గా చేసేదాన్ని, అదే సమయంలో సి టీవీ లో యాంకర్ ఆడిషన్స్ జరుగుతుంటే అనుకోకుండా స్నేహితురాలికి తోడుగా వెళ్లి సరదాగా నేను కూడా సి టీవీలో యాంకర్‌గా ఆడిషన్స్ అటెండ్ అవ్వటం ఇంటర్వ్యూ, స్క్రీన్ టెస్ట్ క్లియర్ అయ్యి న్యూస్ రీడర్‌గా సెలెక్ట్ అయ్యాను.

పనిచేసిన ఛానల్స్

ఆల్ ఇండియా రేడియో, సి టీవీ, జెమినీ, వనిత, 6 టివి, ఎక్స్‌ప్రెస్, స్నేహ, దూరదర్శన్ మొదలగు అనేక ఛానల్స్ తో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా.

ప్రేమ పెళ్లి… కెరీర్ బ్రేక్

మాది ప్రేమ వివాహం. పెద్దవాళ్లు ఒప్పుకుని మా పెళ్లి చేసారు. మా వారు సుమన్ కుమార్ పెళ్లికి ముందే నా కెరీర్, నా ఇష్టాలు తెలుసు కాబట్టి నాకు వృత్తి పరంగా చాలా సహకరిస్తారు. బాబు పుట్టినప్పుడు సి సెక్షన్ అయి సంవత్సరంన్నర బ్రేక్ తీసుకున్నాను.

సెకండ్ ఇన్నింగ్స్

పెళ్లయి బాబు పుట్టాక సంవత్సరంన్నర బ్రేక్ వచ్చింది. తర్వాత జెమినీ, 6tv, వనితా, భక్తి టీవీ, దూరదర్శన్ లలో వరుస అవకాశాలు రావటం ఇదే ఫీల్డ్ లో కొనసాగడం జరిగింది. డిడి యాదగిరిలో న్యాయ సలహాలు, మెట్రో ప్లస్ తర్వాత ప్రస్తుతం రైతు నేస్తం కార్యక్రమాలకు పని చేస్తున్నాను. ఈ మద్యే వెబ్ సిరీస్ వర్కింగ్ విమెన్ వర్రీస్ చేస్తున్నాను. కేవలం న్యూస్ ప్రెసెంటర్ గానే కాకుండా యాంకర్‌గా చేస్తున్నాను.

పేరొచ్చిన ప్రోగ్రామ్స్

స్నేహ టీవీలో చేసిన శారీ ప్రోగ్రాంతో, 6tv లో బుక్క మహేష్ బాబు గారితో కలిసి చేసిన గురు ఆయుర్వేదంతో బాగా పేరొచ్చింది.

కుటుంబం వృత్తి మధ్య సమన్వయము

ఒక రోజు తెల్లవారు జామున, మరో రోజు మధ్యాహ్నం ఇలా రోజూ ఒక్కో షిఫ్ట్‌లో పనిచేస్తాను. పిల్లల చిన్నప్పుడు కొంచం ఇబ్బంది అనిపించేది, కానీ నా భర్త, అత్త మామల సహకారం చాలా ఉంది. పిల్లల చిన్నప్పుడు వాళ్లు చూసుకునేవారు. ఇప్పుడు పిల్లలు కొంచం పెద్దయినా నన్ను ఇబ్బంది పెట్టకుండా మారం చేయకుండా నాకు చక్కగా సహకరిస్తారు. కుటుంబ సహకారం వల్లే నేనీ రోజు ఈ స్థానం లో ఉన్నాను.

పని గంటలు

ప్రస్తుతం కోవిడ్ వల్ల తగ్గింది కానీ సాధారణంగా పన్నెండు నుండి పద్నాలుగు గంటల వరకు పని చేస్తూ ఉంటాను. ప్రతీ ప్రోగ్రామ్‌లో ముఖం ఫ్రెష్‌గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. నేను అలసి పోయాను అనే భావన మనస్సులో కలగనీయను, ఇంకా చేయాలి అని అనుకుంటూ ఉంటాను.

చాలెంజెస్

కెరీర్ ఆరంభంలో ఒక ఛానల్‌లో నాలో లోపం ఉందన్నారు, ప్రశ్నలడగటం రాదు ఈమెనెలా తీసుకున్నారు అన్నారట. అన్ని ప్రోగ్రామ్స్ వేరే యాంకర్స్‌కే ఇచ్చేవారు. దాంతో నేనక్కడ మానేసాను. నాలో మైనస్‌లు సరిదిద్దుకున్నాను. కూర్చునే విధానం, ప్రశ్నలు అడిగే విధానం ఇలా అన్ని బాగా ప్రాక్టీస్ చేసి 6 టీవీ లో జాయిన్ అయ్యాను. అంతకు ముందు ఏ ఏ ప్రోగ్రామ్స్‌కు నన్ను రిజెక్ట్ చేసారో అవే ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేసాను. చాలా కమర్షియల్ ప్రోగ్రామ్స్ చేసాను. నాకు రాదు కదా అని వదిలిపెట్టలేదు, నేర్చుకొని మరీ చేసాను.

అందానికి ఆరోగ్యానికి

ఇంటి పని వంట పని అంతా నేనే చేసుకుంటాను, పని మనుషులతో చేయించుకోను. అదే నా చిట్కా.

యాంకర్ కాకపోయి ఉంటే

ప్రభుత్వ ఉద్యోగి ని అయి ఉండేదాన్ని

అవార్డులు

జి వి ఆర్ ఆరాధన వారు బెస్ట్ యాంకర్ అవార్డు ఇచ్చారు. మరో ఛానల్ లో ఇంటి ఆడపడుచుకు పెట్టినట్టుగా చీర, శాలువాలతో సత్కరించారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.

కరోనా జాగ్రత్తలు

ఎవరూ భయాందోళనలు చెందొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేనైతే ఇంటి నుంచి బయల్దేరే ముందు ముఖం అంతా కవర్ అయ్యే విధంగా స్కాఫ్ కట్టుకుంటాను. చేతులు శానిటైజ్ చేసుకుంటాను. శానిటైజ్ చేసుకున్నాక చేతులకు గ్లౌజ్ వేసుకుంటాను. నా సొంత వాహనం లోనే స్టూడియో కి వెళ్తాను. వెళ్లిన తర్వాత కూడా చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం చేస్తాను. మేకప్‌మెన్, హెయిర్ డ్రెస్సర్ లేకుండా నేనే సొంతంగా మేకప్, హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. సాంఘిక దూరం పాటిస్తూ, ఎవ్వర్నీ టచ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను.

ఇంట్లో ఉన్నప్పుడు ఎలా గడుపుతారు

ఇంట్లో ఉన్నప్పుడు శ్రీవారికి, పిల్లలకు ఇష్టమైన వంటలు చేస్తాను. నేను ఇంట్లో ఉన్న రోజు పండగలా ఉంటుంది. ఎక్కువగా నిద్ర పోతుంటాను. పిల్లలతో గడుపుతాను. వాళ్ల అల్లరి ఎంజాయ్ చేస్తాను.

కుటుంబం

జీవిత భాగస్వామి సుమన్ కుమార్, బాబు సాత్విక్ పాప సాన్వి.

మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ గురించే కాకుండా కోవిడ్ జాగ్రత్తలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలండి.

మీ

సాధన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here