[dropcap]క[/dropcap]రోనా కాలం, ఇది నిజంగా కష్ట కాలమే. కానీ ఎండ వస్తే గొడుగు పట్టుకుంటాం. వానొస్తే రెయిన్ కోట్ వేసుకుంటాం. అలాగే ఇప్పుడు కరోనా వచ్చింది. మాస్క్ పెట్టుకుంటున్నాం. అంతే తేడా.
నిజానికి కరోనా ఇప్పట్లో వెళ్లదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ కరోనాని మనమే మనుషుల మనస్సుల్లోంచి వెళ్లగొట్టాలి. అందుకే కరోనా కనక మనిషికి ఉత్తరం రాస్తే ఏమటుందో ఊహిస్తూ అయినంపూడి శ్రీలక్ష్మి గారు సంచికలో ఓ ధారావాహిక రాస్తున్నారు.
మాస్క్ కాదు వట్టి వస్త్రమే కరోనా పట్ల అస్త్రమే, వైరస్‌ను పారద్రోలే శస్త్రమే, ఈ కాలపు ఆరోగ్య శాస్త్రమే – అన్నట్టు ఈ కష్ట కాలంలో అందరికీ కరోనా పట్ల అవగాహన కలిగిస్తూ కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ మీకందిస్తున్నాం ఈ ధారావాహికగా ఈ సుహృల్లేఖని.
ఆలోచనల్ని రేకెత్తిస్తూ, అవగాహనని పెంపొందిస్తూ, మానవతను ప్రేరేపిస్తూ, కన్నీరు పెట్టిస్తూ, చరిత్రను చుట్టేస్తూ, ప్రపంచ స్థితిగతుల్ని కరోనా కాలంలో కళ్ళకు కట్టినట్టుగా అక్షరబద్ధం చేస్తూ ధారావాహికగా మీ ముందుకు రాబోతోంది ‘ఇట్లు కరోనా’. ఇది మీకు కరోనా రాస్తున్న ఉత్తరమే. సిద్ధపదండి మీరిక. వచ్చేవారం నుంచి ధారావాహికగా మిమ్మల్ని పలకరిస్తూ తన మనసు మాటను వినిపించబోతోంది కరోనా.