గొంతు విప్పిన గువ్వ – 4

6
3

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

నాన్న

[dropcap]ని[/dropcap]జానికి ప్రతీ ఆడపిల్లకు తొలి నాయకుడు తండ్రే…

మొదటి క్రష్ కూడా నాన్నే.

పసితనంలో భరోసాతో కూడిన ఊరటనిచ్చే నాన్న వెచ్చటి కౌగిలి తోటే ఆడపిల్లకు వ్యతిరేక లింగాకర్షణలోని ప్రేమ మాధుర్యపు రుచి తెలిసేది. ప్రతీ ఆడపిల్లా అదే అపురూపమైన ప్రేమ భావనను తన పురుషునిలోనూ కోరుకుంటుంది.

ఏ మగాడు, ఏ స్నేహితుడు, ఏ బాయ్ ఫ్రెండ్, ఏ ప్రియుడు, ఏ భర్త తన తండ్రికి ప్రతిరూపమై ఆ ప్రేమ భావనను పునః ఉద్దేపింప చేస్తాడో అతనికి ఆమె జీవితాంతం దాసోహమైపోతుంది. ఇంక ఆ ప్రేమ మొలక ఒక నమ్మకంతో ఎంతటి పెనుతుఫాను తాకిడినైనా తట్టుకుని బలంగా పాతుకు పోయి ఇంతింతై వటుడిoతై తీరున చిగురించి శాఖోపశాఖలుగా విస్తరించి పుష్పించి ఫలించి ఆమె జన్మ ధన్యమౌతుంది.

అయితే పసి ప్రాయంలోనే తండ్రి ప్రేమకు దూరమైన నాలాంటి వాళ్ళ మానసిక స్థితే చర్చనీయాంశం. అమ్మ ప్రేమ ఎంత ముమ్మరంగా వున్నా నాన్న ప్రేమ శూన్యమైన ఆడపిల్లలకు కలిగే అభద్రతా భావన నుండి ఉద్భవించే మానసిక అస్థిమత్వం చిత్త చాపల్యానికి దారి తీస్తుంది. ఏ ఒక్క పురుషుని స్పర్శ తగిలినా మనసులో అలజడి, తనువులో తెలియని భీతి, కలకలం. నాన్న ఆత్మీయ స్పర్శ వలననే ఆడపిల్లకు స్పర్షల్లో తేడాలు అర్థమయ్యేది. నాన్న స్పర్శ పరిచయమే లేని వారికి అంతా గందరగోళమే.

నా పదో క్లాసు అవగానే మేము మరో కొత్త బస్తీలోకి ఇల్లు మారాము. కాలేజీతో పాటు టైపు ఇన్‌స్టిట్యూట్ లోనూ చేరాను. కాలేజీ తొమ్మిదికి మొదలు. పుస్తకంలో పాఠాల్లాగే టైపింగు కూడా ఉదయం వేళలో నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తుందని ఒక పిచ్చి ఆపోహ వుండేది నాకు. ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు టైపింగు క్లాసులో చేరాను మొదట్లో. అయితే ఆ సమయం నా కాలేజీ వేళకి ఇబ్బంది కలిగించటంతో నేను ఉదయం ఆరింటికి మార్చుకున్నాను. ‘కళ్ళు’ పుణ్యమాని ఐదేళ్ళుగా ఐదింటికే లేవటం అలవాటయింది. అదే అలవాటుగా ఐదుకే లేచి తయారయి ఆరుకల్లా ఇన్‌స్టిట్యూట్‌లో వుండేదాన్ని.

నా దురదృష్టం ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ వేళప్పుడు నేను ఒక్కర్తినే విద్యార్థిని. ఇన్‌స్టిట్యూట్ మాష్టారుకి యాభైకి అటు ఇటుగా వుంటాయేమో. నాదేమో పదహారేళ్ళ పరువం. పైగా ఉదయాన్నే స్నానం చేసేసి మరీ కడిగిన ముత్యంలా మెరిసి పోతుండేదానిని. పాపం నన్ను చూస్తే మాష్టారికి అతి కఠోరమైన గుణశీల పరీక్షలా వుండేది. నిభాయించుకోలేక ఏ బటను పైన ఏ వేలు పెట్టి నొక్కాలో చూపించే నెపంతో నా మీదుగా వంగి నా చేతులు తన చేతుల్లోకి తీసుకుని నా వేళ్ళు పట్టుకుని మిషను పైన ఆడిoచేవాడు. అది నాకు తొలి పురుష స్పర్ష. అందువలననేనేమో పుస్తకాల్లో చదివినట్టు తేళ్ళు జర్రులు పాకినట్టు కాకుండా ఏదో ఉద్వేగంగా అనిపించేది. నా మెడ మీద అతని బరువైన ఉచ్ఛ్వాసనిశ్వాసలు నా ఒంట్లో తెలియని స్పందనలు కలిగించేవి. అతని చేతుల్లో నలిగే నా వేళ్ళు, మెడ పైన అతని వేడి ఊపిరి నాలో అంతవరకూ అనుభవం లేని గందరగోళం సృష్టిoచేవి.

అతని చేతులు విసిరికొట్టి క్లాసు వదిలేసి లేచిపోవాలని ఒక వైపు, నా శరీరంలో పురుష లింగాకర్షణ వలన కలిగే భయాందోళనల ఉత్సుకత మరో వైపు…

బహూశా తండ్రి ఆలింగన స్పర్శ తెలిసి వుంటే, అన్న వాత్సల్యానుభవం వుండి వుంటే, తాతయ్యల ప్రేమానురాగాల రుచి చూసి వుంటే, మేనమామల మమకారం విలువ తెలిస్తే నాలో ఇన్ని ప్రకంపనలు వుండక పోనేమో. అప్పటివరకూ నేను ఏ బాంధవ్య రూపంలోనూ పురుష ప్రపంచం చూడక పోవటమే నా ఈ మనసులో అలజడికి కారణమనుకుంటా.

రాను రాను టైపు క్లాసంటే నాలో ఒకలాంటి భయం పెరిగిoది. అమ్మకు చెబుదామంటే నోరు పెగలదు. అయినా కూతురికి కష్టం కలగకుండా కాలేజీకి దగ్గరగా ఇల్లు తీసుకుని జాగ్రత్త పడే అమ్మకు ఇటువంటి విషయం చెప్పి బాధ పెట్టటం భావ్యం కాదు. నా క్లాసు టైమింగ్స్ మార్చుకుందామనుకున్నాను.

నిజానికి మాష్టారికి నా చేతివేళ్ళు పట్టుకునే అవసరం లేని, అవకాశం ఇవ్వని స్థాయికి నేను టైపింగులో గబగబా ఎదిగి పోయాను. చకచకా టైపు చేస్తున్నా నా వీపు వెనుక టక టక బూట్ల చప్పుడు వినిపిస్తే బిగుసుకు పోయేదానిని. వెనుక నుండి మాష్టారు ఎక్కడ చెయ్యి వేస్తాడోనని గుండె దడదడలాడుతుండేది. బితుకు బితుకుమంటూ అతి కష్టం మీద ఒక నెల రోజులు లాగించాను.

నా పిరికితనంతో మరింత తెగించిన మాష్టారు ఒక రోజున నా పక్క టైపు మెషీను ఎదురుగా వున్న స్టూలు మీద కూర్చుని ‘అలా ఓ పక్కగా కూర్చోకూడదు సరిగ్గా టైపు రైటరుకి ఎదురుగా వుండాలం’టూ నా స్టూలుని ఒక చేత్తో తనకు దగ్గరగా లాగుతూ రెండో చేత్తో నా నడుం పట్టుకున్నాడు. అంతవరకూ భరించలేని నిర్లిప్తత, ఎదిరించలేని అశక్తతల నడుమ సందిగ్ధంలో ఊగిసలాడుతున్న నాకు అమాంతం ఎక్కడ లేని పిచ్చి ధైర్యం వచ్చేసింది. అమాంతం స్టూల్ మీద నుండి లేచి నిలబడి పక్కనే కూర్చుని వున్న మాష్టారిని చాచి లెంపకాయ కొట్టాను. ఒంటరిగా నాలుగు గోడల మధ్య భయంభయంగా పెరిగిన నా సాహసానికి నేనే విస్తుపోయాను. నా ప్రతిఘటనను ఊహించని మాష్టారు స్థాణువై పోయాడు.

అంతవరకూ అమాయకంగా టైమింగ్స్ మార్చుకుందామనుకున్న నాకు చిత్రంగా అప్పుడు ఇన్స్టిట్యూటే మార్చుకోవాలన్న జ్ఞానోదయం కలిగింది. అమ్మతో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో టైపింగ్ సరిగ్గా నేర్పటం లేదని పైగా షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆ ఇన్‌స్టిట్యూట్‌కి జనగణమణ పాడేసాను.

మాష్టారితో నా ఈ అనుభవం జీవిత పుస్తకంలో అతి ముఖ్యమైన పేజీ. చెడు వలననే మంచి విలువ తెలిసినట్టు ఈ జీవిత పుస్తకపు తొలి పుటల్లో సిరా అసంబద్దంగా లీకై భయంకరమైన చేదు అనుభవాలు మిగల్చటం వలననే వేరు కొన్ని అనుభూతుల నుండి అద్భుతమైన అవ్యక్త మాధుర్యాన్ని ఆస్వాదించగలిగాను. ఆ మాష్టారి అనుభవమే లేకపోతే నాలో ఆ ప్రాయంలో పిరికితనపు ముసుగులో నిద్రాణంగా వున్న ధైర్యం, తెగువ వెలుగు చూసేవి కావు.

ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పటమే కాదు కఠోరమైన కటిక చేదు అనుభవాలు భవితను మార్చేసే విలువైన పాఠాలు నేర్పుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here