ప్రసాదం

0
3

[dropcap]అ[/dropcap]దొక దేవాలయ సముదాయం. షిర్డీసాయి, దత్తాత్రేయులు, రాములవారు, లక్ష్శీ నరసింహస్వామి, కనకదుర్గమ్మ,  వెంకటేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వారు అక్కడ కొలువై యున్నారు. ఏడు గుళ్ళు, ఏడుగురు దేవుళ్ళు.

ప్రతి రోజు ఒక స్వామి వారికి ప్రత్యేకం కనుక, నిత్యం పూజలు, ప్రసాదాలు, భక్తుల దర్శనాలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి.

శర్మగారు ఉంటున్న అపార్టుమెంటుకి పది ఇళ్ళ అవతలే ఈ దేవాలయ సముదాయం వుంది కనుక, రోజూ గుళ్ళకి వెళ్ళి దేవుళ్ళ దర్శనానంతరం, ప్రసాదం తెస్తుంటారు.

ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, కట్టు పొంగళి, చక్కెర పొంగళి, శనగలు ఇలా రోజుకో రకం వుంటుంది. గుడి వారి ప్రసాదమే కాక, భక్తులు తెచ్చే ప్రసాదం కూడ ఆకు దొన్నెల్లో పంచుతారు.

అయితే శర్మ గారు ఎప్పుడు ప్రసాదం తీసుకున్నా, రెండు దిన్నెల్లో అడిగి తీసుకుంటుంటారు.

“అందరికీ పంచాలి కదా, రెండేసి తీసుకుంటే ఎలా?” అన్నా పట్టించుకోరు.

“ఆయనంతే. ప్రసాదం టిఫిన్లాగా తింటారు” అని కొందరు ఎగతాళి చేసినా, విననట్లు నటిస్తారు,

“పోన్లేండి, తీసుకోనివ్వండి. పెద్దాయన, పాపం ప్రసాదం కోసమే గుడికి వస్తాడనుకుంటా” అని వ్యంగ్యంగా మాట్లాడినా వినేసి ఊరుకుంటారు. రెండు దొన్నెల ప్రసాదం మాత్రం తీసుకువెళ్ళాల్సిందే.

అయితే ‘గుడికొచ్చేది ప్రసాదానికే’ అన్న మాట మాత్రం శర్మ గారి మనసును గాయపరిచింది. నొచ్చుకున్నా గమ్మునున్నారు.

ఇలా  చాలా కాలంగా శర్మ గారు నిత్యం గుడికి వస్తూపోతూనే వున్నారు. ఆయన్ని చూడగానే ప్రసాదం పంచేవాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే రెండు ప్రసాదాలు ఇచ్చేస్తున్నారు. కొందరు ఆయన్ని చూసి నవ్వుకుంటున్నారు.

ఆరోజు శర్మగారు గుడికి కొంచెం ఆలస్యంగా వెళ్ళారు. ప్రసాదం ఒక్క దొన్నే మిగిలింది.

గుడినుంచి తనున్న అపార్టుమెంటుకు వచ్చిన  శర్మ గారు వాచ్‌మన్‌ని పిల్చి “ఇదిగో నారాయణా,  ఈరోజు ఒకటే ప్రసాదం ఇచ్చారు. రెండోది దొరకలేదు. నువ్వు, నీ భార్య లక్ష్మి ఈరోజు సగం సగం తినండి.” అంటూ వాచ్‌మన్ చేతిలో ప్రసాదం పెట్టారు.

“రోజూ మాకు దేవుడి ప్రసాదం తెచ్చిస్తున్నారు. ఆ దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి” అన్న నారాయణ మాటల్ని పట్టించుకోకుండా లిఫ్టులో తన ఫ్లాటుకి వెళ్ళి పోయారు శర్మ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here