ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఈ వ్యాసంలో సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]హిం[/dropcap]దూ మతము ప్రపంచములోని అతి పురాతనమైన మతాల్లో ఒకటి. ఈ మతము అతి పెద్ద మతాల్లో మూడవది. హిందూ మతము మీద నమ్మకము ఉన్న ప్రజలు ఒక్క భారత దేశములోనే కాదు ప్రపంచవ్యాప్తముగా ఉన్నారు. ప్రస్తుతము విదేశాలలో కూడా హిందూ ధర్మాన్ని అభిమానించేవారు, అనుసరించేవారు పెరుగుతున్నారు. హిందువుల పండుగలు అయినా దసరా దీపావళి వినాయక చవితి వంటి పండుగలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఏ మతానికైనా నమ్మకానికి ఆరాధించటానికి దేవాలయాలు చాలా ప్రధానమైనవి. ఈ దేవాలయాలు హిందువులకు, హిందూ ధర్మాన్ని ఆచరించేవారికి ప్రధానమైనవి. వీటి నిర్మాణములో పాటించే శిల్పకళ, విగ్రహాల ప్రతిష్ఠ చాలా ప్రత్యేకముగా భక్తులను ఆకట్టుకొనేటట్లు ఉంటుంది. ఈ దేవాలయాలలో ప్రవేశించినవారు ఈ వాతావరణముతో సంతుష్టులై వారిలో భక్తి భావముతో ఒక రకమైన మానసిక ప్రశాంతతను పొందుతారు. పూజల అనంతరము దేవుని తీర్థ ప్రసాదాలు తీసుకొని తృప్తిగా ఇంటికి వెళతారు.

భారతదేశములోనే కాకుండా థాయిలాండ్, బాలి వంటి ఆసియా దేశాలలో కూడా అతి సుందరమైన దేవాలయాలు, అతి పురాతనమైనవి ఉన్నాయి. అవి వారి నాగరికతలో భాగముగా ఉన్నాయి. భారతీయులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో స్థిరపడినవారు అక్కడ కొన్ని హిందూ దేవాలయాలు భారీగా నిర్మించారు. వీటికి విదేశీయులు కూడా వచ్చి భగవంతుడిని ఆరాధిస్తున్నారు. కొన్నిభారతీయ సంస్థలు ఇస్కాన్ వంటి అంతార్జాతీయ సంస్థలు కూడా ఈ దేవాలయాలను విదేశాలలో నిర్మించాయి. ఆ విధముగా హిందూమతం ఎక్కువగా వ్యాప్తి చెందిన మతము అవటం వలన భారతదేశములోనే కాకుండా ఆసియా దేశాలలో కెనడా, యూకె, యుఎస్ఏ వంటి దేశాలలో ఉన్న హిందూ దేవాలయాలను గురించి ముందు తెలుసుకుందాము. ఆ తరువాత భారతదేశములోని ప్రముఖ హిందూ దేవాలయాలను గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.

1. కోనేశ్వరం దేవాలయము, ట్రింకోనమలై, శ్రీలంక:

ఈ దేవాలయాన్నీ వెయ్యి స్తంభాల గుడిగా కూడా వ్యవహరిస్తారు. ఈ గుడికి అసలైన దేవాలయము క్రీ.పూ.205లో కట్టబడింది అని చరిత్ర చెపుతుంది. కాలక్రమేణా ఈ దేవాలయము శిథిలం అవటం వల్ల 12వ శతాబ్దములో ఒకసారి, 20వ శతాబ్దములో మరోసారి బంగారు రేకుల గోపురాలతో పునర్నిర్మించారు. ఈ దేవాలయమును నల్ల గ్రానైట్ రాయితో నిర్మించారు. సాంప్రదాయబద్దమైన హిందూ దేవాలయాలకు ఈ దేవాలయము నిదర్శనము.

2. ఇండోనేషియా దేశము యోగ్యకర్త లోని ప్రంబానన్ దేవాలయాల సముదాయము:

ఈ దేవాలయాల సముదాయము 9వ శతాబ్దములో మధ్య జావా, యోగ్యకర్తల మధ్య నిర్మించబడింది. ఈ ప్రాంతము యూనెస్కో వారిచే వరల్డ్ హెరిటేజి స్థలముగా గుర్తించబడింది. ఆగ్నేయ ఆసియాలోని రెండవ పెద్దదైన, మరియు ఇండోనేషియాలో పెద్దదైన హిందూ దేవాలయము. ప్రాచీన హిందూ దేవాలయాల పద్దతిలో ఈ దేవాలయ నిర్మాణము ఉంటుంది. ఈ దేవాలయ మధ్య భాగము 154 అడుగుల ఎత్తులో ఉంటుంది.

3. అజర్ బైజాన్ ప్రాంతములోని బకులో గల బకు అటెశ్గః దేవాలయము:

ఈ దేవాలయములో లభ్యమైన ప్రాచీన పర్షియన్ వ్రాత ప్రతుల వలన ఈ గుడికి ఫెయిర్ టెంపుల్ ఆఫ్ బకు (బకు అనే అగ్ని దేవత) అనే పేరు కూడా ఉంది అని తెలుస్తుంది. ఇది 17వ, 18వ శతాబ్దాల కాలంనాటి హిందూ, సిక్కు, జోరాస్ట్రియన్ల పూజా స్థలము. 2007లో ఆ దేశ అధ్యక్షుడు ఈ దేవాలయాన్ని చారిత్రాత్మక మరియి ఆర్కిటెక్చరల్ నిధిగా ప్రకటించాడు. దీనికి పూర్వమే అంటే పదేళ్ళ క్రితము ఈ దేవాలయాన్ని కూడా యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు.

4. అంటారియో (కెనడా)లో బొచాసన్వసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) వారి నిర్వహణలోని శ్రీ స్వామి నారాయణ మందిర్:

అంటారియోలో హిందూ ధర్మాన్ని ఆచరించే వారికి అందమైన పూజాస్థలము ఉంది. ఈ నిర్మాణము చాలా జాగ్రత్తగా శ్రద్ధగా 24,000 వేరు వేరు భారదేశపు పింక్ మార్బుల్ మరియు టర్కిష్ సున్నపురాళ్ల  ముక్కలను చేర్చి కట్టినది. వీటితో పాటు ఇటాలియన్ కార్రర్ మార్బుల్ రాళ్ళ చేతి చెక్కడాలను కూడా ఉపయోగించారు. ఈ నిర్మాణము పూర్తి అవటానికి 18 నెలలు పట్టింది. ఈ దేవాలయ నిర్మాణము పూర్తిగా పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారము జరిగింది. ఈ దేవాలయంను 18 ఎకరాల విస్తీర్ణములో ఉంది. ఈ దేవాలయము కెనడాలో ఉన్న అతి పెద్ద దేవాలయము.

5. ఆమెరికా కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామి నారాయణ్ మందిర్:

BAPS వారి నిర్వహణలో ఈ మందిరము హిందూమతం లోని స్వామినారాయణ్ శాఖకు చెందినది. ఇంతకూ మునుపు చెప్పుకున్న కెనడాలోని మందిరము కూడా వీరి శాఖకు చెందినదే. అన్ని శాఖల హిందువుల నమ్మకాలకు ప్రతీకగా ఈ మందిరాలు ఉంటాయి. లాస్ ఏంజెల్స్ లోని ఈ మందిరము ప్రత్యేకత ఏమిటి అంటే ఇది భూకంపాలను తట్టుకొనే విధముగా కట్టిన ప్రపంచములోనే మొదటి దేవాలయము. అలాగే మరో ప్రత్యేకత ఈ దేవాలయము పూర్తిగా సోలార్ విద్యుత్ సిస్టంతో ఉంటుంది.

6. లండన్ లోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్:

లండన్ లోని ఈ దేవాలయాన్ని పూర్తిగా సాంప్రదాయబద్దముగా రాతితో కట్టారు. ఈ దేవాలయము యూరోప్ లోని మొదటి రాతి కట్టడమైన హిందూ దేవాలయము. కెనడా అమెరికాలలో దేవాలయాల మాదిరిగానే ఈ దేవాలయము కూడ హిందూ సంస్థ అయిన BAPS వారి నిర్వహణలో నడుస్తుంది.

7. అమెరికాలోని టెక్సాస్‍లో గల BAPS వారి శ్రీ స్వామినారాయణ్ మందిర్:

ఇది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రములో హూస్టన్ నగరములో 7 మిల్లియన్ డాలర్ల ఖర్చుతో BAPS సంస్థ నిర్మించిన మందిరము. ఈ మందిరాన్ని 11,500 అడుగుల విస్తీర్ణముతో అంతస్తులుగా 75 అడుగుల ఎత్తు ఉన్న గోపురాలతో నిర్మించారు. ఈ మందిరము నిర్మాణములో ఇటాలియన్ మార్బుల్స్, టర్కిష్ సున్నపు రాయిని వాడారు. ఈ మందిరము నిర్మాణాన్ని 2002లో ప్రారంభించి 28 నెలల కాలములో పూర్తిచేశారు. దీనికి కావలసిన 33,000 రాతి  పలకలను నౌకలలో ఫోర్ట్ బెండ్ కంట్రీకి పంపారు.

విదేశాలలో ఉన్న ఈ దేవాలయాలు కాకుండా హిందూ ధర్మానికి, హిందూ మతానికి పుట్టినిల్లు అయిన భారతదేశములో అంతర్జాతీయంగా హిందువులకు ఆరాధ్య దైవాలు కొలువై ఉన్న దేవాలయాలు అనేకము ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము. అవి:

గుజరాత్ లోని సోమనాధ్ దేవాలయము. ఈ దేవాలయము పై ఘజిని మహమ్మద్ అనేక సార్లు దోపిడీ చేసాడు. ఆ తరువాత ఈ దేవాలయాన్ని పునర్మించారు.

ఉత్తర భారతములోని బియాస్ ఒడ్డున గల హిమాచల్ ప్రదేశ్ లోని ఖాంగ్రా లోయలో గల 8వ శతాబ్దపు దేవాలయాల సముదాయము. ఈ దేవాలయము ఏకశిల నిర్మితము. ఈ సముదాయము పెద్దది అయినప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయింది. పైపెచ్చు చాలా భాగము కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతింది.

మరో దేవాలయము కర్ణాటకలోని శివాలయము. ఇది మలప్రభ నది ఒడ్డున ఉంది. ఈ దేవాలయము 5 నుండి 8 శతాబ్దాల కాలములో కట్టబడినదని చారిత్రాత్మాక ఆధారాలు ఉన్నాయి ఈ దేవాలయాల సముదాయములో హిందూ బౌద్ధ, జైన్ మందిరాలు కలిసి ఉన్నాయి.

మరో దేవాలయము మధ్యప్రదేశ్ లోని ఖండారియా మహాదేవ్ దేవాలయము. ఇది ఖజురహో గ్రామములోని చాలా అందమైన దేవాలయము. ఇక్కడి శిల్పకళా అమోఘము. అందుచేతనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలముగా గుర్తించింది.

మరో ప్రసిద్ధి చెందిన దేవాలయము దక్షిణాదిలోని మధుర మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుని దేవాలయము. ఈ దేవాలయము 12 వ శతాబ్దములో నిర్మించబడింది.

ఇవి కాకుండా తంజావూరు బృహదీశ్వర ఆలయము, రామేశ్వరము లోని శివాలయము, గురువాయూర్ లోని శ్రీకృష్ణుని మందిరము, తిరువనంతపురము లోని  పద్మనాభస్వామి దేవాలయము, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయము మొదలైనవి. భారతదేశములో ప్రముఖ దేవాలయాలు చాలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here