[box type=’note’ fontsize=’16’] “హిమాలయ ప్రాంతాలలో విచక్షణారహితంగా సాగిన అడవుల నరికివేత వరద ప్రమాదాన్ని మరింత పెంచింది” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]
[dropcap]మ[/dropcap]న దేశపు భూభాగంలో రమారమి 4 కోట్ల హెక్టార్లు వరద ముప్పు పరిధిలో వుంది. భారతదేశపు ప్రకృతి విపత్తులలో సగానికి పైగా వరదలదే. కొంచెం అటూ ఇటుగా ప్రతి ఏడాది వలెనే ఈ సంవత్సరమూ అస్సాం వరదల భీభత్సంలో కొట్టుకుపోతోంది. బ్రహ్మపుత్రతో సహా అనేక నదులు ప్రమాదసూచికలను మించి పోటేత్తుతున్నాయి. 80 మంది ప్రాణాలు కోల్పోయారు.
‘కజిరంగా’ జాతీయపార్కు 95% మునిగిపోయింది. అనేక మూగజీవాలు అసువులు బాసాయి. 2½ లక్షల హెక్టార్ల పంట ధ్వంసమయింది. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల అనంతరం వ్యాపించే అంటురోగాలు, ఆహార కొరత, వైద్య ఆరోగ్య సమస్యలు వంటి నష్టాలన్నీ ఉండనే ఉన్నాయి.
వానలు విపరీతంగా కురుస్తున్నప్పుడు గంగ, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదుల నీరు వచ్చి చేరే చోట నదులలో నీరు పొంగి వరదలు ముంచెత్తడం ఋతుపవనాల సమయంలో సర్వత్రా సాధారణమైపోయింది. హిమాలయ ప్రాంతాలలో విచక్షణారహితంగా సాగిన అడవుల నరికివేత వరద ప్రమాదాన్ని మరింత పెంచింది. మనిషి స్వార్థం, తెలివి ప్రకృతి విపత్తుల వరకు వచ్చేసరికి ఎందుకూ కొరగానివిగా మిగిలిపోతున్నాయి.
అంగుళాలను, గజాలను కొల్చుకుని నాదంటే నాదని కొట్టుకుంటూ అంతకుమించిన ఎన్నోరెట్ల ప్రయోజనాలను విస్మరిస్తున్నాం. సముద్రతలంపైనా హద్దులే! జలాలు పంపకాలే! ఈ పంపకాలు, నా, నీ భేదాలు మనిషికేగాని తనకు లేవని ప్రకృతి ఎప్పటికప్పుడు ఋజువు చేస్తూనే వుంది.
గత అర్ధ శతాబ్దిలో వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టం లక్షకు పైమాటే కాగా ఆస్తినష్టం మూడున్నర లక్షల కొట్ల రూపాయలకు పైమాటే. గతశతాబ్ది 90ల ద్వితీయార్థంలో వచ్చిన వరదలలోనూ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కజిరంగా నేషనల్ పార్కు 18 అడుగుల నీటిలో మునిగిపోయింది. పార్కులో నుండి ప్రవహించే ‘డిఫ్లూ’ నది గట్లు తెగడంతో కృత్రిమంగా ఏర్పాటుచేసిన కొండలు, గుట్టలు వంటివి కూడా వరదనీటికి గురయ్యాయి. నీళ్ళలో మునిగి చనిపోయినవి చనిపోగా మిగిలిన జంతువులు పార్కుకు సమాంతరంగా ఉన్న జాతీయ రహదారి నెం. 37 వైపు ప్రాణభీతితో పరుగులు తీశాయి. కజిరంగా పార్కు విస్తీర్ణం 430 కిలోమీటర్లు. ఆ పార్కులోని జంతువులు ఇంచుమించుగా అన్నీ పారిపోగా కొద్దోగొప్పోగా మిగిలిన రైనోలవంటివి ఆకలితో అలమటించాయి. అవి కూడా జనావాసాల్లోకి వచ్చేసి పశువుల పాకల్లోనూ, మరికొన్ని చోట్లా తలదాచుకున్నాయి. ఖడ్గమృగాలైతే 25 దాకా నీటిలో మునిగిపోయి మరణించి ఉంటాయని, 50కి పైగా చెల్లాచెదురైపోయి ఉంటాయని అప్పట్లో అంచనా వేయడం జరిగింది. 1988 వరదలలోనూ ఖడ్గమృగాలు నూటికి పైగా కొట్టుకుపోయాయి. ఇదంతా వన్యప్రాణులను పోగొట్టుకోవడమే. లేళ్లు, దుప్పిలు వంటి చిన్నప్రాణుల సంగతి చెప్పనే అక్కర్లేదని అవి వందల సంఖ్యలో ఉంటాయి.
ఇటువంటి విపత్తుల సమయంలో జనజీవితం స్తంభించిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం మామూలే. ప్రజల వద్ద కొనుక్కోవడానికి డబ్బూ ఉండదు.
C.W.C (కేంద్ర జల సంఘం) అంచనాల ప్రకారం నదులలో ఏటా మొత్తం ప్రవాహంలో 80% ఋతుపవనాల కాలంలోనే చేరుతూ ఉంటుంది. అదే వరదలకు కారణం అవుతుంది. వివిధ నదులకు గట్టు – 1600కి.మి నిర్మించడానికి మనకి 50 సంవత్సరాలు పట్టింది. గంగ, బ్రహ్మపుత్ర వరద నియంత్రణ బోర్డుల పనితీరు (అనేకానేక కారణాలుగా) అంతంత మాత్రమే. గంగ – ఉపనదులకు సంబంధించిన స్వల్ప, దీర్ఘకాలిక చర్యలతో కూడిన సమగ్ర ప్రణాలికలూ కాయితాల మీదే ఉండిపోయాయి.
మనదేశంలో అన్ని నదులలోనూ కలిపి 16450 కోట్ల క్యూబిక్ మీటర్ల జలరాశులు ఉన్నాయని అంచనా. కాగా అందులో 10% మించి వినియోగించుకోలేకపోతున్నాం. ఉత్తరప్రదేశ్ ప్రధాన నదులన్నిటికీ జన్మస్థానం అయినా అక్కడ తాగునీరు సైతం కరువే. చాలానదులకు జన్మస్థానం హిమాలయాలే. ఆ కారణంగా భారతదేశం నేపాల్‍తో కలిసి చర్యలు చేపట్టి సమర్థవంతంగా నీటిని వినియోగించుకోవడానికి గల అవకాశాలను పరిశీలించాలన్న ప్రతిపాదనా ఉంది. ఉమ్మడి చర్యలతో వరదలను కొంతవరకు అరికట్టగల అవకాశం ఉంది. రాష్ట్రాలకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది.
అయితే వివిధ దేశాలలో, రాష్ట్రాలలో స్వప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాల పట్ల ఇసుమంతైనా ధ్యాసలేని రాజకీయాలో చక్రం తిప్పుతున్న పరిస్థితులలో దేశాల నడుమ రాష్ట్రాల నడుమ సహకారంతో ప్రజల ప్రయోజనాలు నెరవేరగలవని ఆశించడం అత్యాశే అవుతుంది.