ఊరికిచ్చిన మాట

0
3

[dropcap]పై[/dropcap]పంచె పెట్టి దిమ్మ మీద వున్న దుమ్ము దులిపి కూర్చోబోతూ ఒకసారి తల పైకెత్తి చెట్టుమీదికి చూశాడు వెంకటసుబ్బయ్య పక్షులేమైనా ఉన్నాయా? అని.

“ఇప్పుడు పిట్టలన్నీ మేతకు బోయింటాయి. రెట్టలేమీ పడవు. రా! కూర్చో బావా. నీకూ ఓ చుట్టా, అగ్గిపెట్టే సిద్దంగా ఉంచాను” అంటూ అందించాడు భూషయ్య.

“50 ఏళ్ళ నాడు ఆడపడుచునిచ్చి పెళ్ళి చేసి బళ్ళతో సారె తోలావు. కావిళ్ళతో కట్నకానుకలు పంపావు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇంటల్లుడి మర్యాదలు జరుపుతూనే వున్నావని ఊరందరూ చెప్పుకుంటారు. మా మామ వద్దనకుండా చేయించుకుంటున్నాడు. ఏం మావా! నువ్వు నీ అల్లుళ్ళకు ఎప్పుడైనా ఇట్లా మర్యాదలు చేశావా?” అంటూ రాంబాబు హాస్యమాడాడు.

“మా మధ్య చుట్టరికం కంటే సావాసమే ఎక్కువరా. దానివల్లే ఈనాటివరకూ రోజూ ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటాం” అంటూ మీసాలు సవరించుకుంటూ “ఏరా రాంబాబూ! అరటితోట కాడికెల్లొత్తన్నావా? అరుట్లు ఎట్టా వున్నాయి?”

“ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి. కాని గెలల దిగుబడి వచ్చేనాటికి వాతావరణం అనుకూలించాలిగా. నోటి కాడకొచ్చిన ముద్ద గొంతు లోపలికి దిగేదాక గుండె పీకుద్దనుకో.”

“నిజమేరా రాంబాబూ! రైతుకెప్పుడూ దిగులు కూడే. ఒరే! ఇంకో సంగతి. మేమంతా ఏసిన కొబ్బరితోటలు ఇప్పుడు గిడసబారినాయి. గెలల దిగుబడీ, కాసిన కాయ సైజు, అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడా తోట కొట్టేసి కొత్త మొక్కలు ఎయ్యాల్సిందే” అన్నాడు వెంకట సుబ్బయ్య.

“అసలీ పాటికే అరటుల మధ్య పసుపు, కందా మొక్కల మధ్య మధ్య సాళ్ళల్లో కొబ్బరి మొక్కల్ని నాటాల్సింది. రెండు గజాలైనా మొక్క సాగేది” అన్నాడు భూషయ్య.

“ఇప్పుడు పెద్దరకాలు లాభం లేదు మావా. హైబ్రిడ్ రకాలు, అందునా పొట్టిరకాలు, బాగా దిగుబడి వచ్చేయి చూసి తెచ్చుకోవాలి. మొన్న మన రవీంద్ర మణిపాల్ నుండీ వచ్చాడు. అక్కడ వక్కమొక్కల పెంపకంతో పాటు, కొబ్బరి మొక్కల్ని ఎక్కువగానే పెంచుతున్నారంట. వాళ్ళంతా కేరళెల్లి పొట్టిరకాలే, చూసి తెచ్చుకుంటున్నారంట. ఆ రకాలు మన నేలలోనూ సూటవుతాయంట. కాపూ బాగానే కాస్తాయంటున్నాడు. నాగ్గూడా ప్రస్తుతం ఓ వంద మొక్కలు తెచ్చిపెట్టమని రవీంద్రనే అడుగుదామనుకుంటున్నాను”

“మంచి ఆలోచనే అబ్బాయి. మావాడికి కూడా ఒక మాట చెప్పు. ఇంకా మనవాళ్ళు ఎవరైనా కలిస్తే అందరికీ కలిపి తెప్పించొచ్చు. అందరికీ అవసరమేగా” అంటూండగానే వెంకట సుబ్బయ్య కొడుకు వీరయ్య మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తూ వెళ్తూ వీళ్ళని చూసి బండి ఆపుకుని తనూ వచ్చి దిమ్మమీద కూర్చున్నాడు.

”ఇయ్యేడు నీ పసుపుతోట బాగా ఏపుగా వుంది వీరయ్య బావా. దుంప ఊట బాగా రావచ్చు” అన్నాడు రాంబాబు.

”రాంబాబు ఏదో కేరళ కొబ్బరిమొక్కలు తెప్పించి నాటతానంటున్నాడు. నువ్వూ తెప్పించి అరటి, పసుపూ సాళ్ళ మధ్య నాటించు. కొబ్బరిమొక్కలు పెరిగేదాకా ఇవీ సాగవుతా వుంటాయి”

’ఏంటి రాంబాబూ! ఏ రకం తెప్పిస్తున్నావు? ఎవరు తెస్తారు?”

“హైబ్రిడ్ రకమే. మూడున్నర ఏళ్ళలో కాపుకొచ్చే రకాలు, పైగా దిగుబడి బాగా వచ్చేరకాలు చాలా వున్నాయంట. అవే తెప్పిద్దామనుకుంటున్నాను.”

“ఆటికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలేమో!”

“ఏ రకానికైనా పెట్టుబడి పెట్టక తప్పదు. తక్కువ ఎత్తులోనే ఉండి ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు నయం కదా. రవీంద్ర చెప్పిన దాన్ని బట్టి ‘కల్ప శంకర్’, ‘చంద్ర శంకర్’ అనే రకాలు మన నేలకు సూటవ్వుతయ్యేమోననుకుంటున్నాను. తనే కేరళలోని ‘కాసరగోడ్’ ప్రాంతానికి వెళ్ళి కొబ్బరిమొక్కల విభాగంలో కొనుక్కొస్తానంటున్నాడు. అక్కడినుంచి విజయవాడ కొచ్చే లారీయో, ట్రెయినో పట్టుకుని మొక్కలు చేర్చుకోవచ్చు. నీకు ఇబ్బంది కూడా ఏం వుండదన్నాడు.”

“ఆలోచన బాగానే ఉన్నది. నేనూ ఈ మధ్య ‘అన్నదాత’ పుస్తకంలో చదివాను. అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు చెప్పిన విషయాలు బాగున్నాయి. ఈ కేరళలోని ‘కాసరగోడ్’ లో ఐసిఎఆర్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‍లో మన తెలుగాయనే వుండి ఈ కొబ్బరి రకాల్ని బాగా డెవలప్ చేశాడంట.”

“అవును బావా. రవీంద్ర ఇయ్యన్నీ చెప్పాడు. తనూ అక్కడికెళ్ళాడంట. తనకు తోటలు కౌలుకిచ్చిన ఆసామి వెంట వెళ్ళి చూశాడంట. అబ్బో ఆ సెంటర్ దేశంలోనే గొప్పది. ఎన్ని రకాల కొబ్బరిమొక్కలో. దాదాపు 25 రకాలు నాకు తెలిశాయి. కీరశంకర, కల్పసమృద్ది, కల్పహరిత అంటూ చాలా వున్నాయి. ప్రతి రకానికీ ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. మొక్క ఒక్కటికొచ్చేసరికి 250 రూపాయలు చార్జీలు అదనం అన్నాడు. మాకు ఇంకా మొక్కలు కావాలి. నువ్వునా దగ్గరకు రా. ఇద్దరం కలిసి వెళ్దాం” అంటాడు.

“నువ్వూ, రవీంద్ర కలిసి వెళ్ళండి. అతనిక్కావలసినవి ఇచ్చేసి నీకూ, నాకూ మామయ్య వాళ్ళకు నువ్వు ఇక్కడికి తీసుకురా. మొక్కల ఖరీదుతో పాటు ఇంకో డెభ్భై ఎనభై రూపాయలు ఛార్జీల నిమిత్తం తీసుకెళ్ళు. నువ్వైతే రవీంద్రను తోడు తీసుకుని వెళ్ళగలవు. ఇక్కడ్నుంచి మణిపాల్ ట్రెయిన్‍లో వెళ్ళు. ఆ తర్వాత మీ వీలును బట్టి నిర్ణయించుకోండి.”

“మీకూ కావాలంటున్నావుగా. అలాగే వెళ్తానులే.”

“ఆనక డబ్బులు పంపుతాంలేరా అబ్బాయ్. పొద్దెక్కింది. ఇంటికి పోదాం రండి” అంటూ వెంకట సుబ్బయ్య లేచాడు. అతనితోపాటు భూషయ్య లేచాడు. ఇద్దరూ పైపంచలు దులిపి భుజాన వేసుకున్నారు. వెలిగే చుట్టల్ని దిమ్మకేసి రుద్ది ఆర్పి వాటిని మర్రిచెట్టు మొదట్లో పెట్టారు. ఆ మర్రిచెట్టు చుట్టూ కట్టుకున్న సిమెంటుదిమ్మ ఊళ్ళో వాళ్ళు కూర్చొని మంచీ, చెడూ మాట్లాడుకోవటానికీ, మర్రిచెట్టు అటు పక్షులకు గూడూ, ఇటు మనుషులకు చల్లదనాన్ని ఇస్తున్నది. ఊరిలోని పెద్దవాళ్ళకు ఆ చెట్టూ, దిమ్మా అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు చెట్టు చుట్టు చేరి, ఆడుకుంటూ ఉంటారు.

***

కొబ్బరిమొక్కల కొనుగోలుకు రెండులక్షలపైగా తీసుకెళ్ళాల్సి వచ్చింది. డబ్బంతా వెంట తీసుకువెళ్ళటం ఇబ్బంది అని రవీంద్ర మణిపాల్ ఎకౌంట్‍లోకి వేశారు. రాంబాబు ముందుగా మణిపాల్ వెళ్ళి రవీంద్రవాళ్ళు నాటిన కొబ్బరిమొక్కల్ని చూశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేరళలోని ‘కాసరగోడ్’ వెళ్ళారు. రవీంద్ర కౌలుకు చేసే పొలం ఆసామి లారీ వేసుకెళ్ళారు. ఆ లారీలోనే మొక్కలన్నిటిని మణిపాల్ చేర్చారు. వాళ్ళ పొలంలో నాటుకునే మొక్కల్ని వాళ్ళు తీసుకున్నారు. రాంబాబు తీసుకెళ్ళవలసిన వాటికోసం గోనెసంచుల్ని కొన్నారు. ఒక్కో గోనెసంచులో ఇరవై, ఇరవై మొక్కల చొప్పున పేర్చారు. అడుగు కొబ్బరిబొండాలతో సహా, దాన్నుంచి వచ్చిన మొక్క చెదరకుండా జాగ్రత్తగా, అక్కడి మనుషులు గోతాంలో చుట్టి, కట్టిపెట్టారు. మణిపాల్ వచ్చి తిరిగి వెళ్ళే విజయవాడ లారీని మాట్లాడుకుని మొక్కలన్నీ ఎక్కించారు. మొక్కల కొనుగోలు, పాకింగ్ పనుల వలన రాంబాబుకు బాగా అలసటగా అనిపించింది. లారీడ్రైవరు, క్లీనరూ తెలుగువాళ్ళు కాబట్టి వాళ్ళతో కొద్దిసేపు కబుర్లు చెప్పి త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు. లారీ ఎక్కేముందే పాంటు విప్పి లుంగీ కట్టుకున్నాడు. బీడీ తాగాలని లారీ క్లీనర్ కాబిన్‍లోనుంచి లారీపైకి మొక్కల మధ్యకొచ్చి బీడీ అంటించాడు.

ఏవో అరుపులు వినబడేటప్పటికి రాంబాబుకు కొద్దిగా మెలకువ వచ్చింది. “నీళ్ళు…. నీళ్ళు గురూ, కాలవ, పెద్ద కాలవ, లారీ ఒరుగుతుంది” అంటూ క్లీనర్ అరుస్తున్నాడు. అతని మాటలు సరిగ్గా అర్థం కాలేదు. రాంబాబుకు పూర్తిగా మెలకువ వచ్చింది. పక్కకు చూస్తే డ్రైవర్ కూడా కంగారుగా ఉన్నాడు. అతని చేతిలో స్టీరింగ్ నిలబడటం లేదు. లారీ అంతా ఊగిపోతున్నట్టుగా ఉంది. క్లీనరు పైనుంచి ఏదో అరుస్తున్నాడు. “లారీ బ్రేకులు పనిచెయ్యడం లేదు” అన్నాడు డ్రైవరు. రాత్రిపూట కావటం వలన చీకటిగా వున్నది. లారీ లైట్ల వెలుతురులో ఎదురుగా పెద్దకాలువ కనపడుతున్నది. డ్రైవర్ మాట సాంతం పూర్తికాకుండానే లారీ జర్రున ముందుకు ఒరిగి కాలువలో జారిపోయింది. రాంబాబు తెప్పరిల్లేలోగానే కాబినంతా నీళ్ళొచ్చేశాయి. కాబిన్ డోర్ డ్రైవర్ తెరిచాడో, అదే తెరుచుకుందో తెలియదు. రాంబాబు మాత్రం కాలవలో పడ్డాడు. నీళ్ళు…. చుట్టూ నీళ్ళు… ఊపిరాడనట్లుగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఒక్కసారి తల విదిల్చాడు. బోర్లా పడుకుని కాళ్ళను తన్నిపెట్టాడు. నోట్లోకి, ముక్కులోకి నీళ్ళు పోనివ్వకూడదు. తనిప్పుడు చాలా దైర్యంగా ఉండాలి. సాహసంగా ఈదుకెళ్ళాలి. ఈ నీళ్ళలోనుంచి బయటపడాలి. కాళ్ళకు అడ్డం పడుతున్న లుంగీని ఎడంచేత్తో పైకి లాక్కున్నాడు. లుంగీ కొస ఒకదానిని తన ఒంటినున్న డ్రాయరు లోపల నడుం దగ్గర దోపాడు. మరో కొసను నడుం మీదనుండి తలమీదకు తెచ్చి ఎడంచేత్తోనే ఎత్తిపట్టుకున్నాడు. కుడిచేత్తో నీళ్ళను తోసుకుంటూ, ఎడంచేత్తో తన లుంగీ కొసను చిన్న తెరచాపలాగా వుంచాలని ఊపిరి బిగపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దారీ, తెన్నూ తెలియటం లేదు. అలాగే ఒంటిచేత్తో ఈదుతూ, కాళ్ళలోకి సత్తువ అంతా తెచ్చుకుని ముందుకుపోతున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు కాలువల్లో వేసిన ఈత. దాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఈదుతున్నాడు. అది నేత్రావతి నదీపాయో, మరేదైనా కాలువో అతనికేం తెలియదు. కాళ్ళు పట్టేశాయి. బండబారాయి. పాదాలు తిమ్మిరెక్కాయి. కంటిరెప్పలు బరువెక్కాయి. వాటితోపాటు వంటినున్న షర్టూ, బనియన్ బరువుగా అయ్యాయి. డ్రాయర్‍కున్న ఎలాస్టిక్ ఒరుసుకుని నడుం దగ్గర మంటపుడుతున్నది. మొలతాడు నాని, బిగిసిపోయి ఒరుసుకుపోతున్నది. ఆ ఒరిపిడికి మాటిమాటికి మూత్రం పడుతున్నది. ఏదో మొండి దైర్యంతో తేలిపోయే కాళ్ళతో ఈదుతున్నాడు. చేతిలోని లుంగీకొస ఎప్పుడో జారిపోయింది. కాళ్ళూ, చేతులూ సహకరించటం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు.

***

“వీరయ్యా రాత్రి పదింటికి భోజనం చేసి రాంబాబు మొక్కలతో లారీ ఎక్కాడు. రేపు రాత్రికి చేరుకుంటాడు. కేరళలో వున్న టి&డి హైబ్రిడ్ పాతికరకాలు తీసుకున్నాం. ప్రతిరకానికి 60, 70 మొక్కలుండేటట్లు చూశాం. అన్ని కూటులకి “టాగ్”లు కట్టించాను. మనవాళ్ళందరినీ సరిపోతాయి” అని రవీంద్ర ఫోన్ చేశాడు.

“విజయవాడ లారీ మన ఊరుదాకా వస్తుందిగా”

“ఆ….ఆ….. రాంబాబు అట్లాగే మాట్లాడుకున్నాడు. అందుకే రేపు రాత్రికల్లా వస్తాడన్నాను” అన్నాడు. ఆ మర్నాడు రాత్రికి లారీ వస్తదని వీరయ్య వాళ్ళు దిమ్మ దగ్గరే చెట్టుకింద కూర్చున్నారు. మొక్కలు దింపటానికి ఇద్దరు పాలేళ్ళు సిద్దంగా ఉన్నారు. అర్ధరాత్రి దాకా చూసి వీరయ్య వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే చెట్టు దగ్గరకొచ్చాడు. ఉదయం తొమ్మిదయ్యేసరికి రాంబాబు రాని సంగతి అందరికీ తెలిసింది. “ఇందులో మోసం ఏమీ లేదుకదా?” అని కూడా కొందరాలోచించారు. వీరయ్య రవీంద్రకు ఫోన్ చేశాడు.

“రాంబాబు రాలేదు. ఫోన్ నెంబరూ కలవటం లేదు రవీంద్రా”

“నేనూ ప్రయత్నం చేస్తున్నా. డ్రైవర్ నెంబరూ, రాంబాబు నెంబరూ రెండూ కలవటం లేదు. రాంబాబు ఇంట్లో వాళ్ళకు ఆదుర్దాపడవద్దని చెప్పు. ఒకపూట ఆలస్యమయినా రాంబాబూ, మొక్కలూ చేరతాయి. నేను ఇంకేమైనా ప్రయత్నం చేస్తావుంటా”

తన పొలం ఆసామికి తెలుగు బాగా వచ్చు. విషయం చెప్పి సలహా అడిగాడు. ఆయన తెలిసిన పోలీసు ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ‘మణిపాల్ టు విజయవాడ’ రూట్‍లో లారీ ఏక్సిడెంట్ ఏమైనా జరిగిందేమోనన్న కోణంలో కనుక్కుని చెప్తానన్నాడు. పదిరోజులుగా కురిసిన వర్షాలకు నేత్రావతి, దాని పాయలూ, చిన్న, పెద్దకాలువలూ, అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. నేలంతా నాని మెత్తగా వున్నది. లారీ ఎక్కడన్నా దిగపడిపోయిందేమో కనుక్కుందామనీ చెప్పాడు.

***

ఆ రోజు రాత్రి రాంబాబు ఎక్కిన లారీ మణిపాల్ నుండి బయలుదేరింది. మంగుళూరు దాకా వచ్చింది. అప్పటిదాకా రాంబాబు కబుర్లు చెప్పి నిద్రపోయాడు. మరోగంట గడిచించి. పెద్దకాలువ అంచునే లారీ పోతున్నది. క్లీనర్ టైం చూసుకున్నాడు.

“రోడ్డు బాగా వున్నది గురూ. రాత్రిపూట కావటంతో పెద్దగా ట్రాఫిక్కులేదు. నువ్వు ఇంకొంచెం స్పీడ్ పోవచ్చు. అలాపోతే తెల్లరేపాటికి చానాదూరం పోవచ్చు. మన ప్రయాణం అంతా కలిపి పన్నెండొందల కిలోమీటర్లు వుంటుందేమో. రేపు మాపటేలకే మనం మొక్కల్ని దించేసి ఎనక్కు పోవచ్చు. సరేలే, నేను పైకి పోయి బీడీ కాల్చుకుంటా” అంటూ వెళ్ళాడు.

లారీ కాల్వలోకి జారటంతోనే డోర్‍లో నుంచి డ్రైవర్ కాల్వలోకి పడ్డాడు. మొన్నటి వర్షాలకు పెద్ద చెట్టొకటి కూలి కొమ్మలూ, వేళ్ళతోసహా ఎక్కడినుంచో అదే సమయానికి కొట్టుకుని వస్తున్నది. డ్రైవర్ సరిగ్గా ఆ చెట్టుకొమ్మల మీదనే పడ్డాడు. అలా కొమ్మల్లో ఇరుక్కునే కొట్టుకుపోసాగాడు. ఉరవడిగా పోతూనే మధ్యమధ్యలో హెల్ప్… హెల్ప్ అని అరుస్తూనే వున్నాడు. నడిజాముదాకా అలా కొట్టుకుపోతూనే ఉన్నాడు.

చేపల్ని కొనుగోలు చేసి చిల్లర మార్కట్లో అమ్ముకునేవాళ్ళు నడిజామునే లేచి  చేపల మావుల దగ్గరకు పోతారు. అలా ఇద్దరు మనుష్యులు సైకిళ్ళేసుకుని పోతున్నారు. లీలగా అరుపులు వినిపించి పరికించి చూశారు. ఏదో అనుమానం వచ్చి కాల్వలోకి దూకారు. చెట్టుకొమ్మల్ని పట్టుకుని లాగారు. డ్రైవర్ స్పృహలోనే వున్నాడు. వాళ్ళ సాయంతో ఒడ్డుకు వచ్చాడు. కాస్త తెప్పరిల్లాడు. గలిబిలిగా విషయం చెప్పాడు.

“నన్ను తొందరగా సైకిల్ మీద కూర్చోపెట్టుకుని పోలీసుస్టేషనుకు తీసుకుపోండి” అని అడిగాడు.

“పోలీస్ స్టేషనుకా?” అనివాళ్ళు సందేహించారు.

“కాదు. అవసరం” అంటూ చేతులెత్తి మరీ మరీ దణ్ణం పెట్టాడు.

వాళ్ళు చివరకు తీసుకెళ్ళారు. డ్యూటీలో వున్న పోలీసుకు విషయం అర్థమయ్యేటట్లు చెప్పాడు. లారీ ఏక్సిడెంట్, ఇద్దరు మనుష్యులున్నారని వివరించాడు. ఆ పోలీసు వెంటనే డిపార్ట్‌మెంట్‍వాళ్ళకు ఫోన్‍చేసి చర్య తీసుకోవటం మొదలుపెట్టాడు.

***

లారీ మీదున్న క్లీనర్ లారీ కాలువలోకి జారటం గమనించి ముందుగా డ్రైవర్ని కేకలు పెట్టాడు. లాభం లేదనుకుని ఒక్క ఉదుటున అక్కడనుండి కిందకు దూకాడు. అది కాలవో, కాలవగట్టో, రోడ్డో ఏమీ చూసుకోలేదు. లారీ దారిన లారీ కాలువలోకి జారిపోయింది. క్లీనర్ రోడ్డు అంచునే పడ్డాడు. కాని అక్కడో పెద్దరాయి పాతి ఉన్నది. రాయి చుట్టూ పిచ్చిమొక్కలూ, తుప్పలూ పెరిగివున్నాయి. అయినా వాటి మధ్యనున్న రాయి పదునుగా వున్నది. ఆ రాతి మీదే క్లీనర్ పడ్డాడు. నుదుటికి బాగా గాయమయ్యి రక్తం బొటా బొటా కారిసాగింది. వంటిమీద చొక్కా కూడా రక్తంతో తడవసాగింది. సగం గాయం బాధతోనూ, సగం భయంతోనూ క్లీనర్ స్పృహతప్పి శవంలాగా అక్కడే పడిపోయాడు.

తెల్లవారే ముందు ఎవరో స్థానికులు చూసి మొహంమీద నీళ్ళు చల్లారు. లేపి కూర్చోబెట్టారు. పిచ్చిచూపులు చూశాడు కాని ఏం మాట్లాడలేకపొయ్యాడు. నుదుటికి తగిలిన గాయం మీద పడి తల వెంట్రుకలు కూడా తడిసి ఆరిపోయి ఉన్నాయి. చొక్కా ముందు భాగమంతా రక్తపు మరకలు. అతనికి కాసేపు కలో, నిజమో అర్థం కాలేదు. అసలదే ప్రాంతమో కూడా తెలియలేదు. వాళ్ళవంక చూస్తూ “ఆంధ్రా లారీ ఏక్సిడెంట్” అన్నాడు.

యాక్సిడెంట్ అనగానే లేవదీసిన వాళ్ళు అతని జేబులో రెండువందల డబ్బులు పెట్టి గబ గబా అక్కడినుండి వెళ్ళిపోయారు. క్లీనర్ కుంటుకుంటూ లేచి రోడ్డుమీదకొచ్చాడు.

***

ఆ రోజు రాత్రి డాక్టర్ ప్రభాకర్ తన భార్య, మామగారితో కలిసి కారులో ఆ రోడ్డుమీద వస్తున్నాడు. కారులో కూర్చున్న మామగారు తన కూతుర్ని కోప్పడుతున్నాడు. “అమ్మాయ్ సరళా! ఇంతాలస్యం చేశావు. నడిజామైంది. ముసలివాణ్ణి, హార్ట్ పేషంట్‍ను ఇప్పటిదాకా మేలుకుని వుండటం ఎంత కష్టమో తెలియదా?” అంటూ “అబ్బాయ్ డ్రైవర్! కాస్త కారాపు. కాలు ముడుచుకుని వస్తాను” అన్నాడు.

ఆ మాటలు విన్న ప్రభాకర్ నవ్వుకుంటూ మామగారి చేయి పట్టుకుని కారు దింపాడు. “డ్రైవర్! దగ్గరుండి వీరిని తీసుకురా. రోడ్డు పక్కనే కాలవుంది. జాగ్రత్త” అంటూ సెల్‍ఫోన్ లైట్ వేసి యథాలాపంగా కాలవవంక చూశాడు. ఎవరో మనిషి బోర్లాపడుకుని తలమాత్రం పైకెత్తి బలహీనంగా ఈదుతూ కనిపించాడు. “ఈదుతున్నాడా? శవమై తేలుతున్నాడా?” అన్న ఆలోచనతో పాటు అతనిలోని వైద్యుడు మేల్కొన్నాడు.

“డ్రైవర్ సరిగ్గా చూడు. కాల్వలో మనిషి కొట్టుకొని పోతున్నాడు” అని అనటం పూర్తికాకుండానే చురుగ్గా కదిలిన డ్రైవర్ చెప్పులు వదిలేసి ఒక్క ఉదుటున కాల్వలోకి దూకి ఆ మనిషి జుట్టు పట్టుకుని లాగి ఈడ్చుకుని కాల్వ అంచున పడుకోబెట్టాడు. డాక్టర్ ప్రభాకర్ ఆ మనిషి పొట్టనొక్కి చూశాడు. కనురెప్పలు విడదీసి చూశాడు. నాడి చూశాడు.

“డ్రైవర్! నీ సీట్లో టర్కీ టవల్ తీసి ఇతణ్ణి శుభ్రంగా తుడువు. తడిబట్టలు లాగేసి ఆ టవల్ చుట్టబెట్టు. నువ్వూ నీ తడిబట్టలు విప్పేసి కవర్లో నా నైట్ డ్రెస్ వుంది వేసుకో. అలాగే మామగారి కోసం ఫ్లాస్క్‌లో వుంచిన పాలను అతనికి తాగించు” అని చెప్పాడు.

“ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేవు. ఏ ఆత్మహత్యా ప్రయత్నమో అయివుంటుంది. లేనిపోయిన చిక్కులొస్తాయి” అని భార్యా, మామగారు ఎంత వారించినా వినకుండా అతడ్ని తన క్లినిక్‍కి తీసుకుని వెళ్ళాలని కారులో కూర్చోబెట్టించాడు. క్లినిక్‍కు వెళ్ళగానే సెలైన్ పెట్టించాడు. మర్నాడు మధ్యాహ్నానికి గాని అతనికి పూర్తి స్పృహ రాలేదు. స్పృహ రాగానే ఎదురుగా రవీంద్ర కనిపించాడు.

“చాలా ధైర్యంగా, ఇంకా చాలా సాహసంగా ఈదావు రాంబాబు. నా వల్లే ఇలా జరిగిందని నేను చాలా కుమిలిపోయాను. అదృష్టం బాగుండి ఈ డాక్టరుగారి చేతుల్లో పడ్డావు. డ్రైవర్ రిపోర్టుతో పోలీసులు, వారితోపాటు ఎస్‍టిఆర్‍ఎఫ్ వాళ్ళు రంగంలోకి దిగారు. లారీ ఆచూకీ దొరికింది. ఒరిగిపోయిన లారీలో మొక్కల గోతాలన్నీ చాలావరకు భద్రంగానే వున్నాయి. డాక్టర్ గారి రిపోర్టుతో నీ ఆచూకి నాకు తెలిసింది.”

“వీరయ్యకు ఫోన్ చేసి చెప్పు మొక్కల్ని తెస్తామని. మన మాట పోగూడదు కదా. ఈ డాక్టరుగారికి జీవితాంతం ఊడిగం చేసినా ఋణం తీరదు” అంటూ చేతులెత్తి మొక్కాడు రాంబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here