[dropcap]ఆ[/dropcap]కుల పూవుల అక్షింతలు వేస్తూ
అల్లరి చేస్తున్న పచ్చపచ్చని నేస్తాలతో కూడి
నల్లగా మెరుస్తోన్న ఆ వలయరహదారి
ఎంత చల్లగా కరువుదీరా నవ్వేదో
అలసటనూ అసౌకర్యాన్ని దూరంచేసి
దూరాన్ని భారంగా కాకుండా హారంలామార్చి
కాలాన్ని కాస్తంత మిగిల్చి అందించిందని
ఆనోటా ఈనోటా వినబడే మెచ్చుకోళ్ళకు
ఎంతగానో మురిసిపోయేది
వింత వింత చూపులతో విస్తుపోయేది
వేగాన్ని వంటినిండా నింపుకొని
పకపకల కేరింతలతో, వినోదాల సరదాలతో
అవసరాల మనుషులతోనో
ఆందోళనల మనసులతోనో
జర్రుమంటూ కొన్ని
బుర్రుబుర్రుమంటూ మరికొన్ని
తనని తాకుతూనో, తాకీ తాకకుండానో
పరుగుతీస్తూ, గాలితో పందేలేస్తూ
కన్ను మూసితెరిచేలోగా కనుమరుగైపోతుంటే
కిలకిలా నవ్వేస్తూ సంబరపడిపోయేది
కనిపించని చేతులూపుతూ
వినిపించని వీడ్కోలులు చెబుతుండేది
అదుపుతప్పిన ఆ చక్రాలు
అదుపులోలేని ఆ చక్రాల చోదకులు
బతుకుపుస్తకంలోని
ఆఖరిపేజీని ఆత్రంగా చదివేస్తే, చదివించేస్తే
ఆ చివరన ఎర్ర’సిరా’తో
ఒంటిగానో … ఓ గుంపుగానో
గజిబిజి సంతకాన్ని గబగబా చేసేస్తే
రక్తదాహం తీర్చుకుంది
పచ్చనికుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది
అనే
రాతలు పత్రికల్లో కనబడుతోంటే
మాటలు ప్రసారమై వినబడుతూంటే
నేరం నాదికాదు… నాది కాదని
నాది కానే కాదని మూగగా రోదిస్తూఉంది
తాను వలయరహదారినే
కాని
విలయరహదారిని కాను.. కానే కాదంటూ
మూగగా రోదిస్తూనేఉంది