[dropcap]సం[/dropcap]తోషమెందుకు
నవ్వుల్లో ఆవిరౌతుంది
దుఃఖమే ఎందుకు
గుండెలో గూడుకడుతుంది
దుఃఖం నవ్వు కన్న బరువైనదనా
గాలిలో తేలిపోలేనిదనా
ఆనందమంత క్షణికం కాలేనిదనా?
కుమ్మరించి ఖాళీ చేసిన ప్రతిసారీ
ఎవరో నింపుకొస్తున్నట్లెందుకు
పొర్లుకొస్తుంది
అనాది ముసురై
మనసులనే ఎందుకెంచుకుంటుంది?
బయట చెట్టుమీద బుల్బుల్ పిట్టొకటి
అదేపనిగా ఎందుకు కూస్తోంది
ఎవరు వింటున్నారని
దాని భాష ఎవరికర్ధమౌతుందని?
అయినా ఇక్కడ దానిలా
ఎవరంత సంతోషంగా వుండగలరని?