నా నవ్వు నాకు కావాలి

0
4

[box type=’note’ fontsize=’16’] ఒక్కసారి ఎదుటివారికి ప్రేమను పంచి వాళ్ళ ప్రేమను పొందితే వచ్చే ఆ అనుభూతే వేరని చెప్పే నాటికని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. [/box]

పాత్రలు:

సాహిత్య : 25 సంవత్సరాలు

సమన్విత : 25 సంవత్సరాలు

రజని : 25 సంవత్సరాలు

ప్రీతి : 10 సంవత్సరాలు (రజని కూతురు)

సిద్ధార్థ : 30 సంవత్సరాలు (రజని భర్త)

ఇందుమతి : 45 సంవత్సరాలు (సమన్విత తల్లి)

స్వర్ణలత : 48 సంవత్సరాలు (సాహిత్య తల్లి)

***

బిజీ రోడ్డు. హారన్ మోతలు, బస్సులు, కార్లు, ఆటోలు తిరుగుతున్న శబ్దాలు.

సమన్విత : సాహిత్యా! ఇప్పుడు వెళ్ళిందే – మనల్ని దాటుకుని ఆ అమ్మాయి రజని కదూ!

సాహిత్య : అవును. అందులో సందేహం ఏముందే సమన్వితా! అలా అడిగావేం?

సమన్విత : కనిపిస్తే చాలు కదలకుండా అరగంట పట్టుకునేది కదా! మనం విడిపించుకోడానికి దారులు వెతుక్కునేవాళ్ళం.

సాహిత్య : (నవ్వుతూ) అదా! అప్పుడు తనకు నా అవసరం ఉంది.

సమన్విత : అదేమిటే అలా మాట్లాడుతున్నావ్? అవసరముంటే అలా మాట్లాడతారా? లేకపోతే ఇలా తెలియనట్లు వెళ్ళిపోతారా?

సాహిత్య : ఫారిన్‍లో చదువు ధ్యాసలో పడిపోయి కొత్తగా ఊడిపడ్డ ఇది నీకు వింతగానే అనిపించవచ్చు. ఇక్కడ ఇది మామూలైపోయింది.

సమన్విత : జనాలు ఇంతలా మారిపోయారా?

సాహిత్య : అందరు కాదులే. ఇంకా రవ్వంతమంది మిగిలి ఉన్నారు. అందుకే ఈ భూమ్మీద మనలాంటి వాళ్ళం మనగలుగుతున్నాం.

సమన్విత : ఏమోనే! ఇంకా ఈ విషయాన్ని నేను అరాయించుకోలేక పోతున్నాను.

సాహిత్య : నువ్వేమిటి? నేనైతే తెల్లబోయాను. తెలిసిన వాళ్ళను చూస్తే పువ్వులా పెదాలు సహజంగా విచ్చుకుంటాయిగా!

సమన్విత : అంతేగా!

సాహిత్య : ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురయ్యాక వాళ్ళు నవ్వాకే నవ్వటం అలవాటు చేసుకున్నాను.

సమన్విత : అది కష్టం కదా! (మధ్యమధ్యలో హారన్లు వినిపించాలి)

సాహిత్య : మామూలు కష్టమా! మొగ్గ విరబూస్తుంటే వద్దు వద్దు అని చెట్టుకు చెప్పినట్లే అనిపిస్తుంది.

సమన్విత : ఆలోచించి నవ్వే నవ్వు నవ్వు కాదు గదా!

సాహిత్య : మరి అదే కదా నా బాధ. నిజం చెప్పాలంటే నా నవ్వును నేను మరచిపోయాను.

సమన్విత : బాబోయ్! ఆ మాట మాత్రం అనకే.

సాహిత్య : అనద్దంటే ఎలా? పోయినదాన్ని అక్కడే వెతుక్కోమంటారుగా! నేనూ అదే పనిలో ఉన్నాను.

సమన్విత : ప్చ్…

సాహిత్య : (దిగాలుగా) మనూ! నా నవ్వు నాకు మళ్ళీ తిరిగి వస్తుందంటావా?

సమన్విత : అలా మాట్లాడకే, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తప్పక మార్పు వస్తుంది. ఇలాంటివాళ్ళ గురించి ఆలోచించటం మానెయ్.

సాహిత్య : అదెలా సాధ్యం? వాళ్ళను మార్చే ప్రయత్నం మనమే చెయ్యాలిగా!

సమన్విత : అవునవును. మన బస్టాప్ వచ్చేసిందే! అదుగో మనం ఎక్కాల్సిన బస్సు కూడా వచ్చేస్తోంది.

సాహిత్య : ఒకటో నెంబర్ బస్సును బాగానే గుర్తుపెట్టుకున్నావే! పద పద! ఆలస్యమైతే మళ్ళీ ఓ గంట ఎదురుచూడాలి.

సమన్విత : హమ్మయ్య! ఎలాగైతేనేం ఎక్కేశాం.

సాహిత్య : ఇలా రా మనూ! ఇక్కడ సీటుంది.

సమన్విత : అలాగే!

(ఇంతలో హాహాకారాలు)

(అరుపులు, మంటలు! మంటలు! అని)

సాహిత్య : మైగాడ్! మన బస్సును ఎవరో పెట్రోల్ పోసి అంటించేశారు

సమన్విత : ఉన్నట్లుండి ఇదేమిటి?

సాహిత్య : ఇక్కడ మామూలే! ఏ ఇద్దరు గొడవపడ్డా అమాయకంగా బలి అయిపోయేది ప్రజలూ! ఈ బస్సులే!

సమన్విత : ఇదెక్కడి అన్యాయమే!

సాహిత్య : ముందు మనం బయటపడే మార్గం చూడు. ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇలా అటూ ఇటూ పరుగెట్టడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు.

సమన్విత : చుట్టూ మంటలు క్రమ్ముకున్నాయ్! ఎలా బయటపడటం?

(మధ్యలో అందరి అరుపులు, కేకలు వినిపించాలి)

సాహిత్య : ఏదో మార్గం దొరక్కపోదు. ఎవరి దగ్గరైనా నీళ్ళున్నాయా?

ప్రీతి : ఆంటీ! నా వాటర్ బాటిల్‍లో ఉన్నాయి తీసుకోండి.

సాహిత్య : డ్రైవరు సీటు దగ్గర మంటలు తక్కువ ఉన్నాయి. అక్కడ ఆర్పుదాం. ఒక్కరు క్రిందకు దూకితే అందరూ వరుసగా బయటపడదాం.

సమన్విత : ఓకే నీ ఐడియా బాగుంది.

(నీళ్ళు చల్లిన శబ్దం, దూకిన శబ్దం వినపడాలి)

సాహిత్య : ఆఁ! ఆఁ! జాగ్రత్తగా దిగండి.

సమన్విత : జాగ్రత్త! జాగ్రత్త!

సాహిత్య : హమ్మయ్య! అందరం బయటపడ్డాం.

ప్రీతి : థ్యాంక్స్ ఆంటీ!

సాహిత్య, సమన్విత : పర్లేదురా ప్రీతీ! ఆపదలో ఒకరికి ఒకరం సహాయం చేసుకోకపోతే ఎలా?

ప్రీతి : వస్తాను ఆంటీ!

సాహిత్య : జాగ్రత్తగా వెళ్ళు నాన్నా!

***

రజని : (ఏడుస్తూ) ప్రీతీ… మన ప్రీతీ…

సిద్ధార్థ : అరె! ఏడిస్తే నాకేం అర్థమవుతుంది? విషయం చెప్పు రజనీ?

రజని : మన ప్రీతి స్కూలుకు రోజూ ఎక్కే బస్సును ఎవరో తగులబెట్టేశారండీ!

సిద్ధార్థ : ఆఁ!….

రజని : అవునండీ! టీ.వి.లో అదుగో స్క్రోలింగ్‍లో వస్తోంది చూడండి.

సిద్ధార్థ : సరే! నువ్వు కంగారుపడకు. నేను వెళ్ళి చూసొస్తాను.

రజని : నేనిక్కడ ఉండలేనండీ. నేను కూడా మీతో వస్తాను.

సిద్ధార్థ : సరే! బయలుదేరు. నువ్వు స్కూటరు దగ్గరుండు, నేను ఇంటికి తాళం వేసి వస్తాను.

రజని : అలాగే.

(తాళం వేస్తున్న శబ్దం, స్కూటర్ స్టార్ట్ చేసి వెళుతున్న శబ్దం)

ప్రీతి : (వెనుకనుంచీ) అమ్మా!…. అమ్మా!….

రజని : ఏమండీ! మన ప్రీతి గొంతులా ఉంది. కాస్త ఆగండి!

(బండి ఆపిన శబ్దం)

ప్రీతి : (పరుగెత్తుతూ) అమ్మా!…. అమ్మా!…

రజని : ప్రీతీ! నా తల్లీ! నువ్వు వచ్చేశావా? నీకేం కాలేదుగా!

ప్రీతి : ఏం కాలేదమ్మా!

సిద్ధార్థ : ఏం జరిగిందిరా ప్రీతీ!

ప్రీతి : డాడీ! సాహిత్య ఆంటీ లేకపోతే నేనసలు మీకు కనిపించేదాన్నే కాదు. ఆమే నన్ను కాపాడింది. నన్నే కాదు, బస్సులో అందర్నీ కూడా!

సిద్ధార్థ : అవునా! తప్పకుండా ఆంటీకి థాంక్స్ చెప్పాలి. ఏమంటావ్ రజనీ?

రజని : చెబుదాం.

(మనసులో) ప్రొద్దున్నేగా కనిపిస్తే చూడనట్లు వచ్చేసింది. అది మనసులో పెట్టుకుని తన పాపను కాపాడకపోతే ఏమయ్యేది?

సిద్ధార్థ : ఏమిటోయ్ ఆలోచనలు? ఎవరి కొంప కూల్చాలని?

రజని : అలాంటివాటికి స్వస్తి పలికేశా!

సిద్ధార్థ : అదెప్పటినుంచీ?

రజని : అదే మన పాప అంత ఆపదనుంచి బయటపడ్డప్పటి నుంచీ.

సిద్ధార్థ : నిజమే! అవసరం లేకపోతే నవ్వునూ, ఆలోచననూ కూడా కంట్రోల్ చేసుకొనే నువ్వు మారావంటే నేను నమ్మలేకపోతున్నాను.

రజని : లేదండీ! ఇన్నాళ్ళూ మీరెంత చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. కడుపుకోతకు దూరం చేసిన సంఘటన జరిగాక కూడా నే మారకపోతే ఎలా?

సిద్ధార్థ : ఇక పైన ఆవిడ అవసరం మనకు రాదేమో!

రజని : సిద్ధూ! చచ్చిన పామును ఇంకా చంపకు. మనిషికి ఏ నిమిషాన ఎవరి సహాయం అవసరమౌతుందో ఎవరూ చెప్పలేరు.

సిద్ధార్థ : సహాయం కోసం తప్ప ప్రేమ ఉండకూడదంటావ్?

రజని : ప్రేమ లేనిదే సహాయం చెయ్యాలనే ఆలోచన రాదండీ.

సిద్ధార్థ : ప్రీతీ! అమ్మ ప్రేమ గురించి చెబుతోంది వినరా!

రజని : నిజమే బంధం, అనుబంధం, అనురాగం, ఆప్యాయత మన కుటుంబానికే పరిమితం అనుకునేదాన్ని. అది విసృతమైనదని అర్థమైంది.

సిద్ధార్థ : బుద్ధుని పేరు పెట్టుకున్నందుకైనా నిన్ను మార్చగలనని శతవిధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.

రజని : పోదురూ! మీరు మరీనూ!

సిద్ధార్థ : ఆ ఛాన్స్ సాహిత్య కొట్టేసింది.

ప్రీతి : డాడీ! సాయంత్రం మనం సాహిత్య ఆంటీ ఇంటికి వెళదాం.

సిద్ధార్థ : తప్పకుండా వెళదాం.

రజని : అవును. ఆంటీకి పూతరేకులంటే ఇష్టం. అది కూడా చేసి పట్టుకెళదాం.

ప్రీతి : అయితే అది తయారుచేయడంలో నీకు సహాయం చేస్తాను.

రజని : అలాగే పండూ!

సిద్ధార్థ : మన జీవితాలకు కష్టం బదులు తీపిని రుచి చూపించిన సాహిత్యకు తీపి కానుకగా పూతరేకులు – శభాష్! రజనీ!

రజని : మీ పొగడ్తలు ఆపి మమ్మల్ని వెనక్కి తీసుకువెళ్తే పని ప్రారంభిస్తాం.

ప్రీతి : రైట్! రైట్!

సిద్ధార్థ : ఇద్దరూ ఆర్డర్ వేశాక ఈ డ్రైవర్ అనుసరించక తప్పదుగా!

(స్కూటర్ వెళుతున్న శబ్దం)

***

ఇందుమతి : (కోపంగా) ఆ సాహిత్యతోనేనా తిరిగివస్తున్నావ్?

సమన్విత : ఆఁ! తనతోనే తిరుగుతున్నా! ఎందుకే తనంటే నీకంత కోపం?

ఇందుమతి : ఎందుకంటే అందరికీ నీతులు చెబుతుంది కనక!

సమన్విత : అమ్మా! అందులో తప్పేం ఉందే! మంచి చెప్పటం కూడా నేరమేనా?

ఇందుమతి : తనకు మాలిన ధర్మం ఎందుకని?

సమన్విత : అదే! తనకూ మనకూ ఉన్న తేడా! మనమంతా ఒకటి అని తను అనుకుంటుంది.

ఇందుమతి : మనం అనుకుంటే సరిపోతుందా? అందరూ అనుకోవద్దూ!

సమన్విత : అదే! ఎందుకు అనుకోరు అనేదే శోధిస్తుంది. చివరకు సాధిస్తుంది కూడా!

ఇందుమతి : ఎదురుచూస్తూ కూర్చో!

సమన్విత : ఆ నమ్మకం నాకుందమ్మా!

ఇందుమతి : నాకు లేదు. ఈ కాలం మనుషుల మనస్తత్వాలే వేరు.

సమన్విత : అలా అని ఊరుకుని తన పాటికి తను వెళ్ళిపోతే బస్సులో ఉన్న వాళ్ళంతా ఈ రోజు మాడి మసి అయ్యేవారు. అందులో నీ కూతురు కూడా ఉంది.

ఇందుమతి : ఏమిటే నువ్వు చెప్పేది?

సమన్విత : అవునమ్మా! ప్రాణాలకు తెగించి అందరూ బయటపడేదాకా ప్రమాదమని తెలిసినా కదలలేదు.

ఇందుమతి : నిజమా?

సమన్విత : అవునమ్మా! అదేం అడుగుతోంది? మనం సంపాదించుకున్న డబ్బును పంచిపెట్టమనటం లేదు. ఆప్యాయతతో కూడిన చిన్న పలకరింపు కోరుతోంది.

ఇందుమతి : అవుననుకో.

సమన్విత : సమాజంలో అంతా కలిసి ఉంటున్నాం. ఎవరికెవరు అన్నట్లు ఎడమొఖం పెడమొఖంగా ఉంటే జీవితం ఎడారిలా ఉండదూ!

ఇందుమతి : ఏమో! ఎప్పుడూ అలా ఆలోచించలేదు.

సమన్విత : ఒక్కసారి ఎదుటివారికి ప్రేమను పంచి వాళ్ళ ప్రేమను పొందితే వచ్చే ఆ అనుభూతే వేరు. అదే సాహిత్య నుంచీ నేను పొందుతున్నాను.

ఇందుమతి : నిజమేనే! ఇలా అందరూ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?

సమన్విత : ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. రేపు ఇంకొకరు తెలుసుకుంటారు. అలా అందరు మారాలనేదే దాని తాపత్రయం.

ఇందుమతి : చాలామందికి తెలియదని కాదు. సంపాదన ధ్యాసలో పడి ఇలాంటి వాటికి దూరమైపోతున్నారంతే!

సమన్విత : ‘నా’ అనే స్వార్థాన్ని వదిలేస్తే చాలు.

ఇందుమతి : నాకేం పనిలేదని దెప్పుతుంటావ్‌గా. ఇకనుంచీ ఈ విషయాన్ని నలుగురికీ తెలియజేయడమే పనిగా పెట్టుకుంటాను.

సమన్విత : (ఆనందంగా) నిజంగానా అమ్మా!

ఇందుమతి : నిజమేరా కన్నా!

సమన్విత : నువ్వొక్కదానివి మారితే వందమంది మారినట్లే! ఈ సంతోషాన్ని ఇప్పుడే నేను సాహిత్యతో పంచుకోవాలి.

ఇందుమతి : ఎందుకాలస్యం! వెళ్ళు మరి!

సమన్విత : నా సెల్ ఎక్కడుందే? కనిపించదే?

ఇందుమతి : ఆనందంతో నీ కళ్ళెదురుగా ఉన్నా కనిపించటం లేదు. ఇదుగో! మాట్లాడుకో!

సమన్విత : థాంక్స్ అమ్మా!

***

స్వర్ణలత : ఏమిటే సాహిత్యా! నీ ముఖం అంత వెలిగిపోతుంది.

సాహిత్య : సంతోషమా అది చిన్నమాటలా అనిపిస్తోంది అమ్మా! ఇంకా పెద్దమాట ఏదైనా ఉంటే బాగుండేది.

స్వర్ణలత : ఎందుకే అంత ఆనందం?

సాహిత్య : మార్పు తొందరగా రాదు… కానీ ప్రారంభమైతే తొందరగా ప్రాకిపోతుంది. అదీ సంగతి.

స్వర్ణలత : ఏదీ సరిగా చెప్పవుకదా!

సాహిత్య : సమన్విత వాళ్ళ అమ్మ ఎంత మొండిదో నీకు తెలుసుగా! ఈరోజు ఆమె నా భావాలను అర్థం చేసుకుందట.

స్వర్ణలత : నీకెలా తెలిసింది?

సాహిత్య : ఇప్పుడే అది ఫోన్ చేసి చెప్పింది. నాకైతే గాలిలో తేలినట్లుంది.

స్వర్ణలత : పడిపోతావే! జాగర్త! నేను పట్టుకోలేను కూడా!

సాహిత్య : పోమ్మా! నువ్వు మరీ జోకులేస్తావ్!

స్వర్ణలత : ఇది జోక్ కాదు నిజం.

సాహిత్య : అనుభవంతోనే పాఠాలు అందరూ నేర్చుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. ఎదుటివారి అనుభవాలను కూడా పాఠాలుగా నేర్చుకోగలిగితే అదీ అసలైన నిజం అని నేనంటాను.

స్వర్ణలత : నీ కోరిక త్వరలోనే తీరుతుందిలే.

సాహిత్య : ఆ రోజు కోసమే కదమ్మా నేనిన్నాళ్ళూ ఎదురుచూస్తున్నది.

స్వర్ణలత : ఈ శుభ సందర్భంలో నీకు సేమ్యా పాయసం చేసి పెట్టనా?

సాహిత్య :  దానికన్నా మమకారం, మధురిమ చూపే ఓ ముద్దు ఇస్తే ఈ సమయంలో నేను ఇష్టపడతాను.

స్వర్ణలత : (ముద్దు ఇస్తూ) నీవన్నీ వింత కోరికలే!

(కాలింగ్‍బెల్ శబ్దం)

సాహిత్య : వస్తున్నా!

(తలుపు తెరిచిన సవ్వడి)

ప్రీతి : ఆంటీ

సాహిత్య : హాయ్!

రజని : నన్ను క్షమించానంటే నేను లోపలికి వస్తాను.

సాహిత్య : భలేదానివే రజనీ! నువ్వంత పెద్ద తప్పు ఏం చేశావని? రండి సిద్ధార్థ గారు.

సిద్ధార్థ : తనతోపాటు నన్నూ బయటే నిలబెట్టేస్తారేమోననుకున్నా (కాస్త ఆగి) ఆశ్చర్యంతో!

సాహిత్య : (నవ్వేస్తూ) అదా ఈ మధ్య ఒకరింటికి ఒకరు రావటం తగ్గిపోయింది.

సిద్దార్థ : అవి పోగొట్టడానికి మేమే ప్రారంభోత్సవం చెయ్యాలి.

సాహిత్య : మంచిపని చేశారు. ఇంటర్‍నెట్‍, కంప్యూటర్‍లలో కాలక్షేపం చేసేవారికి ఇందులో మజా ఏం తెలుస్తుంది?

ప్రీతి : నేనొప్పుకుంటా ఆంటీ! మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

సాహిత్య : ‘థాంక్యూ. నా చిట్టీ తల్లీ’ అంటూ, “కూర్చోండి! ఒక్క నిమిషం.. మీ అందరికీ మంచినీళ్ళు తీసుకొస్తాను”.

స్వర్ణలత : సాహిత్యా! అందరికీ ఈ జ్యూస్ ఇవ్వమ్మా.

రజని : ఆంటీ బాగున్నారా?

స్వర్ణలత : బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు?

రజని : మీ అమ్మాయి దయవల్ల ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం.

స్వర్ణలత : ఎంతమాట?

రజని : అవునాంటీ! నాకులాగే సంకుచితంగా మీ అమ్మాయి ఆలోచిస్తే ఈరోజు నా కూతురు నాకు దక్కేది కాదు.

సాహిత్య : ఆపదలో ఉన్నప్పుడు నువ్వు కూడా అలా ఆలోచించవు రజనీ.

రజని : నామీద నాకా నమ్మకం లేదు ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఉందని ఖచ్చితంగా చెప్పగలను.

సాహిత్య : అబ్బో! ఈరోజు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతున్నాయ్.

సిద్ధార్థ : ఏమిటండీ అవి? మేము వినవచ్చా?

సాహిత్య : నా స్నేహితురాలు ‘సమన్విత’ ఫోన్ చేసి వాళ్ళ అమ్మ గురించి అచ్చు రజని మాట్లాడుతున్నట్లే మాట్లాడుతోందని చెప్పింది.

సిద్ధార్థ : ఓ!

ప్రీతి : ఆంటీ! పూతరేకులు మీకు ఇష్టమని అమ్మ చేసి తెచ్చింది. నేనూ సాయం చేశాను.

సాహిత్య : ప్రీతి మంచి అమ్మాయి.

రజని : ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇకనుంచీ నువ్వు చేసే మంచిపనుల్లో నాకూ భాగస్వామ్యం ఇవ్వు.

సాహిత్య : భలేదానివే రజనీ! అది నువ్వు అడగాలా? ఇలాంటివాటికి అడగకుండా కూడా వచ్చేయచ్చు.

సిద్ధార్థ : అది నాలాంటి వాళ్ళు చేసే పని.

స్వర్ణలత : ఇక ఈ రోజు మా అమ్మాయి భోం చేయదు. మీ మాటలతోనే దాని కడుపు నిండిపోయి ఉంటుంది, కదు సాహిత్యా!

సాహిత్య : నిజమేనమ్మా! వీళ్ళ పలకరింపుతోనే ఆ పని జరిగిపోయింది.

రజని : ఇకనుంచి తరచుగా కలుసుకుందాం!

సాహిత్య : తప్పకుండా రజనీ!

రజని : మరి ఇక మేము వెళ్ళిరామా!

సాహిత్య : వెళ్ళిరావాలి. ఎదురుచుస్తూ ఉంటాను.

***

సమన్విత : సాహిత్యా! ఏమిటే నీ ముఖం వెలిగిపోతుంది?

సాహిత్య : ‘మార్పు రావాలి’ అని రేడియోకి నాటిక పంపాను. అది సెలెక్ట్ అయి బ్రాడ్‌కాస్ట్ అవుతోంది ఈ రోజే!

సమన్విత : ఇంతకీ నాటికలో ఏం రాసావేమిటి?

సాహిత్య : అనురాగం, ఆప్యాయత, పలకరింపు, చిరుజల్లు లాంటివి. వాటిలో తడిస్తేనే ఆనందమని.

సమన్విత : ఓవ్! ఇద్దరం కలిసే విందాం!

***

సాహిత్య : సమన్వితా!… సమన్వితా!

సమన్విత : ఓ! రా! రా! ఏమిటీ సడన్ సర్‍ప్రైజ్?

సాహిత్య : రేడియోలో వచ్చిన నా ‘నాటిక’ కు ఉత్తరాలు ఈ రోజే వచ్చాయి.

సమన్విత : ఏమని రాశారేం?

సాహిత్య : మేం కోల్పోయిందేమిటో తెలియజేశారు, చాలా థాంక్స్. మేం మారామంటే మీరు నమ్మాలి అని.

సమన్విత : ఇప్పుడేమంటావ్?

సాహిత్య : (హాయిగా నవ్వుతూ) నా నవ్వు నాకు దొరికిందోచ్!

సమన్విత : ఎక్కడో?

సాహిత్య : నా పెదాలమీదే! సహజంగానే సుమా!

సమన్విత, సాహిత్య : హఁ! హఁ! హఁ! (నవ్వుతారు సంతోషంగా)

– సమాప్తం-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here