స్నిగ్ధమధుసూదనం-11

0
4

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 11వ భాగం. [/box]

[dropcap]ఆం[/dropcap]దోళనతో ముందుకు వచ్చి రుద్రనేత్రుడిని కాపాడేందుకు తనూ నీటిలో దూకబోయింది చంద్రహాసిని. ఆమె చర్యను గమనిస్తూ వారిస్తున్నట్టుగా సైగ చేశాడతను. అతని పరాక్రమం గురించి తెలిసినది కావడంతో నది ఒడ్డునే ఆగిపోయిందామె. చాలాసేపు నీటి ప్రవాహంతో పోరాడి చివరికెలాగో అదుపు తప్పిన తన అశ్వంతో పాటు తనూ క్షేమంగా ఒడ్డును చేరాడు.

రుద్రనేత్రుడు ఒడ్డుకి చేరుతూనే చంద్రహాసిని కళ్ళలోకి చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు కనపడినా, ఇది తన స్థిర నిర్ణయం అన్నట్టుగా ఉన్న ఆమె కళ్ళని చూస్తూ అబ్బురపడిపోయాడతను. యువరాణి ఇంత సాహసానికి ఒడిగట్టిందంటే ఏదో గట్టి కారణం తప్పకుండా ఉండి ఉంటుంది. కేవలం ఈ అడవి అందాలు చూడాలనే అల్పమైన కోరిక కాకపోవచ్చని అతనికి మొదటిసారిగా అనిపించింది.

ఏమైనా సరే, యువరాణి స్వయంగా చెప్పేవరకూ తను అడగరాదు. ఆమెని కాపాడటమే లక్ష్యంగా ఆమెకు రక్షణగా ఉండాల్సిందే.

అతని ముఖంలో కనపడుతున్న భావాల్ని చదివి ప్రసన్నంగా మారింది చంద్రహాసిని ముఖం. ఎక్కడినుంచో తన హృదయాన్ని మీటే చిరుగాలేదో సున్నితంగా తనని తాకిన అనుభూతి కలిగి అసంకల్పంగా తూర్పు వైపు తిరిగి నడక సాగించిందామె. ఆమె ఆశ్వం, రుద్రనేత్రుడూ, అతని వాహనం మౌనంగా ఆమెని అనుసరించారు.

***

“తేజా …”

అరిచినంత పని చేసింది భార్గవి.

“నువ్వేనా ఈ బొమ్మ వేసింది?”

ఆమె అంత ఉద్వేగంతో అడిగినా, తేజ ముఖంలో ఏ మాత్రం సంతోషం లేదు. ఏమీ చెప్పకుండానే ముఖం తిప్పుకున్నాడు.

“తేజా, నీకు తెలుస్తోందా? పెన్సిల్తో రేఖలు కూడా ఇన్నేళ్ళూ గియ్యలేకపోయిన నువ్వు పెయింటింగ్ చేసేదాకా వెళ్ళావ్ ఒక్కసారిగా” భార్గవి గొంతులో ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు.

సమాధానం రాకపోవడంతో తన చేతుల్లో ఉన్న కాన్వాస్ మంచంపైన పెట్టి తేజ వైపు తిరిగింది భార్గవి. అతని చూపులు నిర్లిప్తంగా కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయ్.

“తేజా …” భార్గవి అతని భుజాల్ని పట్టుకుని కుదుపుతూ విసుగ్గా పిలిచింది. ఆమె కళ్ళలోకి అభావంగా చూశాడు తేజ.

“నువ్వు పెయింటింగ్ వేశావ్…” తన ముఖంలోకి ఉద్వేగంగా చూస్తూ చెబుతున్న భార్గవి చేతుల్ని సున్నితంగా తన భుజాల మీంచి తప్పించాడతను.

“పెయింటింగా అది? దాన్నెవరైనా పెయింటింగ్ అంటారా?” తన కళ్ళలోకి చూస్తూ సూటిగా అడుగుతున్న తేజ ప్రశ్నకి తల విదిల్చి మళ్ళీ అతని వైపు చూసింది.

“చిన్నప్పటినుంచి లోపల పెయింటింగ్స్ వెయ్యాలన్న కోరిక నిన్ను దహించివేస్తున్నా, పెన్సిల్ చేత పట్టేసరికి చెయ్యి రాయిలా మారిపోతున్న నువ్వు ఇంత వెయ్యగలిగావంటే అది అద్భుతమే తేజా. ఈ పరిస్థితుల్లో నువ్వు వేసినదాన్ని పెయింటింగ్ అనే అంటారు. ఇది ఆరంభం మాత్రమే. ఇలాగే ఈ ప్రవాహాన్ని ఆపకు. సాధన చెయ్. రాత్రి పగలూ ఇదే పనిగా ఇదే లోకంగా… చాలా … చాలా తక్కువ కాలంలోనే నువ్వనుకున్నది నువ్వు సాధించగలవ్.”

అతని ముఖానికి దగ్గరగా వచ్చి అతని కళ్ళలోకి చూస్తూ నిజాయితీగా చెప్పింది.

“ఏమో భార్గవీ. నిరాశగా మాట్లాడుతున్నా అనుకోకు. నా గురించి నీకు బాగా తెలుసు. ఈ విషయంలో మాత్రం నేను చెప్పేది నిజం. ఆ క్షణంలో నేను నేనుగా లేను. ఏదో మాయ కమ్మినట్టుగా ఈ పెయింటింగ్ మొదలుపెట్టాను కానీ, ఇప్పుడున్న నీ ఎదురుగా ఉన్న ఈ తేజ పరిస్థితి… నేను అంతర్నేత్రంలో దర్శించిన ఆ దృశ్యాన్ని చింత్రించకుండా ఆపిందనిపిస్తోంది. ఏదో శక్తి… ఏదో మాయ.. అసలు నేను నేనుగా ఉన్నానా ఆ చిత్రాన్ని గీసేటప్పుడు అని అనుమానం” అయోమయంగా చూస్తూ అంటున్న తేజ వంక సౌమ్యంగా చూసిందామె.

“హ్మ్మ్. మొదటి సారిగా నువ్వు బొమ్మ గియ్యగలిగావు కాబట్టి అది నువ్వే నమ్మలేకపోతున్నావ్. అందుకే ఇలా అనిపిస్తోంది. ఇది మామూలేలే. కమాన్. నాకు తెలుసు. నువ్వు సాధించగలవని. ఆ సమయంలో నువ్వెలా ఉన్నావో గుర్తుతెచ్చుకో. అచ్చం అలాంటి భావనలోకే వెళ్ళు. మైమరచిపో. మళ్ళీ గియ్యి. ఈ సారి మరింత బాగా వేస్తావు. అనుమానమే లేదు. నువ్వు చెయ్యగలవు…” తేజని హిప్నటైజ్ చేస్తున్నట్టుగా అతని కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా చెబుతూ అంది భార్గవి.

చనువుగా అతని గదిలో ఉన్న బీరువా తెరిచి ఒక కొత్త కాన్వాసు తీసి ఆ గదిలో ఓ మూలగా ఉన్న స్టాండ్‌కి తనే బిగించి కావాల్సిన అన్ని వస్తువులూ అతనికి అందుబాటులో తెచ్చి పెట్టి తేజ భుజం పట్టుకుని లేపింది.

తేజ అయోమయంగా భార్గవిని చూస్తూ లేచి నిలబడ్డాడు. అతని భృకుటి ఇంకా ముడుచుకునే ఉండటం చూసి

“నేను ఇక్కడ ఉండబోవటం లేదు. కిందకి వెళ్ళిపోతున్నాను. ఈ గదిలో నువ్వొక్కడివే ఉన్నావ్. నీ అంతర్నేత్రంలో కనిపించే దృశ్యం ఎదుట నువ్వు మాత్రమే ఉన్నావ్. అర్థమయిందా. మళ్ళీ నువ్వు అప్పుడున్న మూడ్ లోకి వెళ్ళు. బొమ్మ వెయ్యి. నీ ప్రపంచంలోకి నువ్వు అడుగుపెట్టు. ఆల్ ది బెస్ట్” అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ చెప్పి, అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా కిందకి వెళ్ళిపోయింది భార్గవి.

ఆ రోజు శనివారం. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో క్లినిక్ నుంచి ఇంటికి వచ్చాడు రఘురాం. అతను బాత్రూంలోకి వెళ్ళి శుభ్రపడి వచ్చేలోపులో భోజనాల బల్ల మీద రెండు కంచాల్లో అన్నం వడ్డించింది సుమిత్ర.

రఘురాం వచ్చి తన కంచం ముందు కూర్చుని ఆకలిగా తినడం మొదలుపెట్టడం చూసి నవ్వుకుంటూ తనూ అన్నం కలుపుకుంది.

సరిగ్గా అప్పుడే మేడ మీదనుంచి దిగింది భార్గవి. “హాయ్ అంకుల్.”

అన్నం తింటూనే భార్గవికి సమాధానంగా చెయ్యి ఎత్తాడు రఘురాం. వచ్చి టేబుల్ దగ్గరే కూర్చోమన్నట్టు సైగ చేశాడు. భార్గవి చనువుగా వాళ్ళకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

“అన్నం తిన్నావా భార్గవీ.”

“ఇవాళ ఇక్కడే మీ ఇంట్లోనే ఆంటీ చేతి అమృతం తిన్నానంకుల్.”

భార్గవి మాటకి చిరునవ్వుతో తన వంక చూసిన భర్తను చూస్తూ “భార్గవీ, తేజా ఇందాకే తిన్నారు” అంది సుమిత్ర.

“ఏం చేస్తున్నాడు హీరో?”

“పెయింటింగ్ వేస్తున్నాడంకుల్.”

రఘురాం భార్గవి వంక కనుబొమ్మలు పైకెత్తి చూశాడు. “మళ్ళీ ప్రయత్నమా.”

“అంకుల్.. మీకు తెలీదా? క్రిందటి ఆదివారం తేజ మొదటిసారిగా పెయింటింగ్ వెయ్యగలిగాడు. ఇన్నేళ్ళలో ఏ రోజూ, పెయింటింగ్ వెయ్యడమంటే కదలని తన చేయి ఎంత బాగా బొమ్మ వెయ్యగలిగిందో తెలుసా?”

భార్గవి చెప్పే మాటలకి తినడం ఆపి మొహమొహాలు చూసుకున్నారు రఘురాం, సుమిత్రలిద్దరూ.

“మనకి చెప్పనే లేదు చూడండీ” అంటున్న సుమిత్రను చూస్తూ “తేజ పెయింటింగ్ వెయ్యగలిగాడంటే అది వార్తే” అన్నాడు రఘురాం.

అతను వెటకారంగా అనకపోయినా, ఎందుకో బాధ కలిగింది భార్గవికి. తేజ విషయంలో ఏదో తేడా ఉంది. ఎక్కడా ఎవరికీ జరగని వింతలా అనిపిస్తుంది తనకి. బొమ్మలు వెయ్యడంలో ఆసక్తి లేకపోతే ఫరవాలేదు. కానీ, పెయింటింగ్స్ అంటే ప్రాణం పెట్టే తేజ, అదే తన జీవితాశయం అన్నట్టు ఉండే తేజ, ఎక్కడ ఏ పెయింటింగ్ చూసినా అందులో ఉన్న లోపాలని క్షణాల్లో కనిపెట్టి ఏం చేస్తే ఆ లోపాన్ని పూడ్చుకోవచ్చో అవలీలగా చెప్పగల తేజ కాన్వాస్ ముందుకి వచ్చేసరికి పెన్సిల్ పట్టుకుని ఒక్క గీత అయినా గీయలేకపోవడం చాలా చిత్రంగా ఉంటుంది. అతని లోపల ఏదో జరుగుతోంది. అదేమిటో కనిపెట్టి అతనికి సహాయపడాలని ప్రయత్నిస్తోంది తను. దీనివల్ల తేజ ఎంతగా తల్లడిల్లిపోతున్నాడో తను గమనిస్తోంది. అదేమీ పైకి కనపడనివ్వట్లేదు కానీ, అతను లోలోపల దహించుకుపోతున్నాడని తనకి తెలుస్తోంది. తేజ తనకు ఊహ తెలిసినప్పటినుంచీ తెలిసిన వ్యక్తే కాదు. తను అమితంగా ఇష్టపడే స్నేహితుడు కూడా. తేజ మాట తీరు, వ్యక్తిత్వం, ఎవరు ఎక్కడ ఆపదలో ఉన్నా వీరుడిలా వాళ్ళని కాపాడి సహాయపడే నేర్పు, ఇవన్నీ చూశాక తేజకి దూరంగా ఉండలేకపోయింది తను చిన్నప్పటి నుంచీ. తేజ కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ఎక్కువ స్నేహితులు లేరు. ఎప్పుడూ చిత్రకళకి సంబంధించిన ఆలోచనల్లోనే అతనుండటం వల్ల పెద్దగా స్నేహాలు చెయ్యలేదు ఎవరితోనూ. అందువల్ల తను చిన్నప్పటినుంచీ తేజ అంటే ఉన్న ఇష్టం వల్ల అతను చుట్టూ తిరగడంతో తేజ కూడా మంచి స్నేహితుడిగా తనకి దగ్గరయ్యాడు. ఇద్దరూ ఒకే ఇంటి మనుషుల్లా అన్ని విషయాల గురించీ చర్చించుకుంటారు. తేజ పెద్దగా తన సంగతులు పట్టించుకోడు. అది అతని స్వభావం. తన చిత్రలేఖన సమస్యలు, తన లోకంలో తను ఉంటాడు. తనే అతని ప్రతి విషయాన్నీ శ్రధ్ధగా చూసుకుంటుంది.

తనే ప్రతిసారీ గొడవ చేసి మరీ, తేజ చదివే కాలేజీలోనే తను చేరింది. తమ చదువులయ్యేసరికి ఇద్దరి ఇళ్ళలో పెద్దవారూ పెళ్ళి మాట తీసుకొచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు భార్గవికి వాళ్ళంతా తాము ప్రేమికులమనుకుంటున్నారని. ఆమెకి కూడా ఎప్పుడూ తేజ మీద ఆ అభిప్రాయం కలగలేదు. ఒకే ఇంట్లో పెరిగే మనిషి మీద ఉండే ఇష్టమే కానీ, తనకి తేజని పెళ్ళి చేసుకోవాలి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదని దయచేసి ఇలాంటి విషయం మరోసారి ఎత్తి తమ మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టద్దని పెద్దవాళ్ళకి చెప్పేసింది.

ఈ విషయం తెలిసి తేజ తేలిగ్గా నవ్వేశాడు. అతని హృదయంలో ప్రస్తుతం ప్రేమకి చోటు లేదు. ఎక్కడో ఏదో బాధ్యతని సగంలో వదిలేసిన వాడిలా తల్లడిల్లిపోతున్నాడు. ఏదో తెలుసుకోవాలనుకుంటాడు. దేన్నో చేరుకోవాలనుకుంటాడు. అదేమిటో అతనికే సరిగ్గా తెలీదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here