ఇట్లు కరోనా-1

1
3

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

A Letter to Mankind

[dropcap]మ[/dropcap]నిషీ!

ఈ ప్రపంచం ఎంత అందమైనది… పచ్చని వనాలు… ఎగిసి దూకే జలపాతాలు… పక్షుల కువకువలు… ఆశల హరివిల్లులు… విశాల ఆకాశం… ఊరించే ఆహారాలు… విభిన్న ఆహార్యాలు… అబ్బో ఎంత బావుందో… అరే… ఏమిటిలా స్క్రోల్ చేస్తూ పేజీలు పైకీ కిందికీ తిప్పేస్తున్నావ్… ఎవరు రాశారీ ఈ-మెయిల్ అనుకుంటున్నావా… ఇంకెవరు… కలలో కూడా నిన్ను కలవరపెట్టే కరోనాని! భయపడకుండా చదువుతావు కదా!

నిశితంగా నువ్వు గమనించలేదు కానీ వేకువ కిరణాల కొసల మీద మృత్యు స్పర్శని తీసుకొని 2020 తలపై కిరీటంగా నిలబడి నేనొచ్చాను. కొత్త సంవత్సరంలో సరికొత్త సంక్షోభానికి తెర తీసాను. అడుగు పెట్టీ పెట్టకుండానే కనిపించని నాలాంటి చొరబాటుదారుడితో ఊహించని పోరాటం చేయడమే మీ యుగధర్మంగా మార్చేశాను. రాజసౌధాలు సైతం క్వారంటైన్‌లై లైఫ్-లైన్ కొసల్లో వేలాడేలా చేశాను. మనిషి మరో మనిషిని కరోనా కళ్ళతో అనుమానంగా, అభద్ర భావంతో చూసేంతగా మీ మనోస్థైర్యాన్ని దిగజార్చాను. అయినా హస్తాంజలి-పరిశుభ్రత-స్వీయ రక్షణ-గృహస్థితి-దూరంతనాల్ని జీవితాల్ని పొడిగించుకునే సూత్రాలుగా మీరు సిద్ధాంతీకరించుకున్నారు. జాతీయ పతాకాల్ని, జాగ్రఫీ మ్యాప్ లని మార్చకుండానే ఒక్కో ఊరిని ఒక్కో రాజ్యంగా సరిహద్దులు మీ చేతనే గీయించేసాను. సెన్సెక్స్ రిజిస్టర్లలోని ప్రపంచముఖాలన్నీ మాస్కీకరించబడి, హాస్పిటల్స్ అన్నీ హాట్ స్పాట్‌లుగా రూపాంతరం చెందించేసాను.

ఇన్ని నెలలు గడిచాక ఎన్నో లక్షల మరణాలని చూసాక విజయగర్వంతో స్పందించాల్సిన మనసెందుకో అసంతృప్తితో, అపరాధ భావనతో నిండిపోయింది. “గతమెప్పుడూ విజయాల్నే గుర్తు చేస్తుంది. వర్తమానమెప్పుడూ సవాళ్ళనే చూపిస్తుంది. భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది. క్రుంగుబాటు తాత్కాలికమే. యుద్ధభూమిలోకి దిగాక రణమో, మరణమో తేల్చుకోవల్సిందే” అంటూ మీరు స్పందించిన విధానం చూసాక వెనక్కి తిరిగి నా ప్రస్థానాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటున్నాను.

నిజమే మిత్రమా! నేనొక మృత జీవిని. రూపం ఎట్లాగూ లేదు. అతి స్వల్ప పరిమాణం నాది. నా ఒళ్ళంతా అసుర విషమే… నాకు ఆకలెక్కువ.. అదే మీరు కుంభకర్ణుడు, బకాసురుడు అంటారుగా అలా. ఊళ్ళకు ఊళ్లే… దేశాలకు దేశాలు ఆక్రమించటమే నా పని. అఫ్కోర్స్, మా వైరస్ అక్కలు, మా బాక్టీరియా అన్నలు కూడా అదే పని చేశారనుకోండీ… వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సాధించలేనిది నేను చేసి చూపిద్దామనుకున్నాను. అదృశ్య విస్ఫోటనంతో మిమ్మల్ని ఆక్రమించాలని… ప్రపంచాన్ని సర్వనాశనం చేసి మాదే పైచేయని నిరూపించాలని నాకు దిశా నిర్దేశం చేయబడింది.

నిజానికి ఆదిమ కాలం నుండీ మాయా యుద్ధాల్ని ఎదుర్కోడంలో మీరు పోరుబాటనే పట్టారు. ఒక మారీచుడు, ఇంకో శూర్పణఖ, మరో కుంభకర్ణుడు, ఇంకో ఇంద్రజిత్… ఎంతో మంది ఎన్ని రూపాలెత్తి మాయా యుద్ధం చేసినా మీరు నియంత్రణతో, మీ సహజమైన ఓరిమితో మమ్మల్ని ఓడిస్తూనే వున్నారు.

ఎన్నిసార్లు మా లోకంలో ఈ విషయం మీద చర్చలు జరిగాయో తెల్సా… అందరూ తేల్చి చెప్పింది ఒక్కటే, మీలో మీకు ఎన్ని విభేదాలున్నా మాలాంటి వారు యుద్ధం ప్రకటిస్తే అందరూ కల్సి ఐక్యంగా మమ్మల్ని తరిమికొడ్తారు… ఆనాడు గంధర్వులు యుద్ధానికొస్తే కౌరవపాండవులు కలిసి యుద్ధం ప్రకటించినట్లుగా బయటి శత్రువు మీద సమైక్యంగా యుద్ధం చేయడమే మీ మానవుల గొప్పతనం. ఎంతగా మిమ్మల్ని క్రుంగదీసినా-దివాళా తీయించినా-ప్రాణహాని కల్గించినా వెంటనే మళ్ళీ కోలుకొని తోటివారికి చేయందించి నిలబడతారు. గొడ్డలికి పిడిగా మారి తనను తాను నరుక్కునే చెట్టులా ఎదిగేదీ మీరే – మీ వేళ్ల చుట్టూ వున్న మట్టితో రూపొందించిన కుండనిండా నీళ్ళతో హరితావరణాన్ని కాపాడుకునేదీ మీరే. ఇన్నాళ్లూ మీతో సహజీవనం చేస్తూ చూస్తున్నాగా నిజంగా మీ జనజాగృతి ఎంత గొప్పదో నాకు అర్థం అవుతుంది. మీ మనోధైర్యం, సహానుభూతి, కరుణతత్వం, పోరాటపటిమ ఓ వైపు, బద్ధకం, నిర్లక్ష్యం, స్వార్థం, అహంకారం మరోవైపుగా మార్చేయబడుతున్న మీ మానవ నైజాన్ని చూసాక మాత్రం ఒకింత అసలు ఏమిటీ మనిషి ప్రవృత్తి అని అశ్చర్యపడని క్షణం లేదు.

అయినా మిత్రమా, నాకో సందేహం… రామాయణం మీ ఆది కావ్యం అంటారు కదా, ఎలా బతకాలో చెప్పే మార్గదర్శిగా మీరంతా భావిస్తారు కదా. ఎంతటి కష్టాలు పడినా సత్యాన్ని విడవకూడదని, ప్రతి జీవిని తమతో సమానంగా చూడాలని చెప్పే ఆ పవిత్ర గ్రంథం నుండి మీరు ఏం గ్రహించినట్టు? మహాభారతం పంచమ వేదమని, భారతంలో లేనిది ఎక్కడా ఉండబోదని చెప్పుకునే మీరు అందులోని నీతి కథల్లోని ధర్మాల్ని ఎక్కడ తలకెక్కించుకున్నట్లు? భగవద్గీత జీవిత పరమార్థాన్ని బోధిస్తూ ఆటుపోట్లకు క్రుంగిపోని వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిస్తుందంటారు. బుద్భుదప్రాయమైన జీవితం శాశ్వతం అనుకునే కాదా మీరు సకల జీవరాసుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. మీరు చేస్తున్న అభివృద్ధి అనేది జీవజాలాన్ని అంధకారంలోకి నెడుతూ అంతిమ దశకు చేరువ చేస్తుండటం విషాదకరం కాదంటారా?

అన్నట్టూ.. మీరెప్పుడూ విజన్ 2020 అంటూ దిశానిర్దేశం చేసుకుంటూ వుంటారట కదా – దేనినైనా గత పదేళ్లుగా ఈ వత్సరంతోనే ముడిపెట్టుకొని అభివృద్ధి ప్రపంచం అంటూ గోల్స్ ఏర్పాటు చేసుకున్నారట కదా… అందుకే నేను ఈ కొత్త సంవత్సర వేడుకల్లోనే మీ భూమి మీద కాలుమోపాను. మీరంతా వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ మీ ఊహల్లో కూడా ఊహించలేని విధంగా వూహాన్‌లో అడుగు పెట్టాను. కాస్త స్థిరత్వం సాధించానో లేదో ఎక్కడో భారతదేశం అనే పేరు వినపడింది. నేనెప్పటి నుండో మీ దేశం గురించి కథలు కథలుగా విన్నాను. ధర్మ భూమి, కర్మ భూమి, యోగా భూమి, తపో భూమి – అంటూ. అందుకే ఎగిరి గంతేస్తూ జనవరి 30న మీరంతా దేవభూమిగా పిలుచుకొనే కేరళలో అడుగుపెట్టాను, ఉషా అయ్యర్‌ని వాహికగా చేసుకొని. నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత అంటూ మీ జ్ఞానపీఠ కవి డా. సి. నారాయణరెడ్డి గారు చెప్పుకున్నట్టు గానే హిమశిఖరాల్లో పల్లవించిన కలకూజితాల్ని, దేవళాల్లో కువకువలాడిన ధర్మ పథాన్నీ నేను చూసాను.

ఎంత బావుందో భారతావని నేనొచ్చేంత వరకూ. నేనొచ్చాక మొత్తం అంతా తలకిందులైందంటున్నారు. నిజంగా ఇది సత్యమేనా?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here