వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-33

0
4

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. కళ

“మమ్మీ, గత మూడేళ్ళ కాలంగా నీ పేరుతో వివిధ పత్రికల్లో అచ్చు అవుతున్న కవితలు, కథలు, బాలగేయాలు, సమీక్షలు అన్నీ నిజంగా నువ్వు రాస్తున్నవేనా?” తల్లి రంజితను అడిగాడు తమ జిల్లా కేంద్రం అనంతనగరంలో వున్న ఓ కార్పొరేట్ స్కూల్ బ్రాంచ్‌లో పదో తరగతి చదివే పదిహేనేళ్ళ ప్రణయ్ శెలవుల్లో ఓసారి ఇంటికి రాగానే.

“నీకెందుకొచ్చిందా అనుమానం?”అడిగింది రంజిత.

“మా స్కూల్లోనే చదివే కొంతమంది పిల్లల తండ్రులు కూడా కవితలు రాస్తారు కదా, వాళ్ళంతా అనేక అనేక వాట్సాప్, ఫేస్‌బుక్ సాహిత్య గ్రూపుల్లో చదివి తమ పిల్లలకి చెప్పారట, నీ పేరుతో ఇంతకాలం అచ్చయిన రచనలన్నీ నీ స్వంతం కాదని, ఎవరో సీనియర్ సాహితీవేత్త రచనల్ని నువ్వు కాపీ చేసావని, సాక్ష్యాత్తు ఆ రచయితే కొన్ని ఆధారాలతో సహా బయటపెట్టాడట కదా, నిజమేనా, నా సాక్షిగా నిజం చెప్పు మమ్మీ?” అడిగాడు ప్రణయ్ తల్లిని.

“సాహిత్యరంగంలో ఇలాంటివెన్నో జరుగుతుంటాయ్, వాటిని నువ్వేం పట్టించుకోకు” కొడుకును హెచ్చరిస్తున్నట్లు అంది రంజిత.

“ఈ విషయంలో నామీద ఒట్టు పెట్టుకోవడం లేదంటే అవన్నీ నిజాలే అని నమ్మాల్సివస్తోంది మమ్మీ, పైగా క్రితం ఏడాది నీ పేరుతో నువ్వు అచ్చు వేయించుకున్న కవితల సంపుటి ‘ఒక స్వప్నం రెండు నేత్రాలు’ కూడా శేషమరాజు అనే అదృశ్య రచయిత చేత రాయించుకుని అతడికి కూడా డబ్బు ఇవ్వకుండా మోసం చేశావట” అ(క)డిగేశాడు ప్రణయ్ రంజితను.

“నోర్మూసుకో, ఇక చాలు” కొడుకును కసురుకుంది రంజిత.

“నువ్వు నీ కవితల సంపుటి ‘ఒక స్వప్నం..’ మీద సమీక్షలు చేయించుకునేందుకు ఎందరినో కాళ్ళావేళ్ళా పడిన సంగతి తనకు బాగా తెలుసని క్రితం సారి మన ఇంటికి వచ్చిన గోరువంట్ల రెడ్డిరాజా మామయ్య నిన్ను నిలదీసి అడగడం, ఆ రోజు నుండీ నువ్వు అతడితో మాట్లాడకపోవడం గురించి కూడా నాకు తెలుసు మమ్మీ” అన్నాడు ప్రణయ్.

“ఎక్కువగా వాగకు” మరోసారి కొడుకుపై విసుక్కుంది రంజిత.

“ఏది ఏమైనా నీకు సాహిత్యంలో పెద్దగా ఓనమాలు రాకున్నా పేరు కోసం అడ్డదారులు తొక్కి అందరూ ఎగతాళిగా నవ్వుకుంటుంటే నువ్వు మాత్రం ‘షేం’ ఫీల్ కాకున్నా కాపీ రచయిత్రి కొడుకుగా నాకు మాత్రం అవమానంగా వుంది మమ్మీ, నీ దొంగ సాహిత్యాన్ని సపోర్ట్ చేసే వాడెవడో ముంగిలి వెధవ ఆరు ముఖాల నిప్పుకొండ గాడిని, ఇంకా కొందరు బేవార్స్ గాళ్ళని తన్నాలి ముందుగా” ప్రణయ్ మాటల్లో కోపం ద్వనించింది.

“నాది దొంగ సాహిత్యమని, నేను కాపీ కవయిత్రినని అంటున్నావే, అది నిజమో కాదో ఒప్పుకోనుగానీ, ప్రణయ్, ఒక్క మాట మాత్రం నిజం మనకున్న అరభై నాలుగు కళల్లో ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘చోర కళ’ను నేను గౌరవిస్తుంటే అందరూ ఇలా గగ్గోలు పెడుతున్నారేంటి?” ఈసారి చాలా కూల్‌గా జవాబిచ్చింది తనను తాను ‘చెయ్యి తిరిగిన’ సాహితీవేత్తగా సొంత బాకా వూదుకునే రంజిత.

2. తొందరపాటు

“నమస్తే సార్, ఎమ్మార్వో ఆఫీసులో పనిచేసే రాఘవరావు గారు ఇల్లు ఎక్కడో కాస్తంత చెప్పగలరా?” అడిగాడో యాభైఏళ్ళ పెద్దాయన వీధి మొదట్లో తన ఇంటి ముందు నిల్చునివున్న శేషును.

“కాస్తంత ముందుకు వెళ్ళి కుడివైపు తిరగండి, మీరు ఆయన బంధువులా?” అడిగాడు శేషు పెద్దాయనను.

“కాదు సార్, నేను రాఘవరావు గారు పనిచేసే అఫీసులో అటెండర్‌ని, ఆయనగారు వేరే ప్రాంతం నుండీ ఈ వారం రోజుల క్రితమే బదిలీపై ఇక్కడికి వచ్చి చేరారు, ఓసారి ఇంటి వద్దకు వచ్చి కలవమని చెప్పారు, అందుకని వచ్చా” చెప్పాడు గురునాధం.

“నాకు తెలిసినంతవరకు చాలా ఆఫీసుల్లో మామూలు పనిదినాల్లోనే ఆఫీసర్లు అటెండర్ల చేత క్షణం తీరిక ఇవ్వకుండా నానా చాకిరీ చేయించుకుంటారు, ఇవాళ ఆదివారం కదా, హాయిగా ఇంటివద్ద పెళ్ళాం పిల్లలతో గడపక ఇప్పుడు కూడా అయ్యగారి దర్శనం చేసుకోవాల్సిందేనా?, ఏవైనా స్వంత పనులు చెబుతారు కాబోలు” ఈసడింపు ధ్వనించింది శేషు మాటల్లో.

“చిన్న ఉద్యోగులం కదా సార్, మాకు ఇవన్నీమామూలే, మేమూ మనుషులమే అయినా అడ్డ గాడిదల్లా అస్తమానం చాకిరీ తప్పదు, ఈ కొత్త ఆఫీసర్ ఏమేం పనులు చెప్పి నా ఊపిరి తీసేస్తాడో” కొంచెం యాస్ట పడుతూ ముందుకు కదిలాడు పెద్దాయన.

సరిగ్గా ఓ పది నిముషాల తర్వాత…

“నమస్తే సార్, ఇవాళ ఇంటి వద్దకు వచ్చి కలవమని చెప్పారు, ఏవైనా పనులు వుంటే చెప్పండి” అడిగాడు గురునాధం రాఘవరావును.

“మా స్వంత పనులు నువ్వేం చేయాల్సిన అవసరం లేదులేవయ్యా, మేము చేసుకోగలం గానీ, నిన్న నువ్వు మీ పిల్లాడికి షూస్ కొనేందుకు డబ్బు లేదని, ఓ వెయ్యి రూపాయలు అప్పుగా సర్దమని జూనియర్ అసిస్టెంట్‌ను అడిగావట, తక్కువ జీతంతో నువ్వు పడే ఇబ్బందులు, ఇంటి సమస్యలు, లంచం ముట్టని నీ నిజాయితీ గురించి అన్నీ తెలుసుకున్నాగానీ, మా వాడూ నీ కొడుకు వయస్సు వాడే, ఆన్‌లైన్‌లో షూస్ తెప్పించుకుంటే అవి సైజు చాలడం లేదట, మళ్ళీ వాపసు ఇవ్వడం ఎందుకు, నువ్వేమీ అనుకోనంటే మీ అబ్బాయికి సరిపోతాయేమో చూడు, ఇంత చిన్న దానికోసం మళ్ళీ అప్పు చేయడం ఎందుకూ?” అని తన చేతుల్లో షూస్ ప్యాక్ పెడుతూ అంటున్న రాఘవరావు మాటలకు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి అటెండర్ గురునాధానికి, తాను మరీ తొందరపడి ఇతగాడు కూడా అందరిలాంటివాడే అని అనుకున్నందుకు.

3. కారణం

“అమ్మా, ఎలా వున్నావు?” కాలేజీకి పండుగ శెలవులు ఇవ్వడంతో సిటీ నుండీ స్వంత వూరికి వచ్చిన ఇంటర్మీడియెట్ సెకండియర్ చదివే ప్రసాద్ అడిగాడు వరండాలోనే ఎదురుపడ్డ తన తల్లిని.

“నేను బాగానే వున్నానుగానీ, నువ్వేంట్రా మరీ అలా చిక్కిపోయావ్, అసలు కడుపుకు తింటున్నావా లేదా?” అడిగింది సుందరమ్మ కొడుకును.

“నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నువ్వు అడిగే మాట అదే కదూ, నేను మరీ ఏం చిక్కిపోలేదులే” తల్లికి బదులిచ్చాడు ప్రసాద్ .

“ఒరే వెధవా, నీ కోసం హాస్టల్ ఫీజు పేరిట నానా ఇబ్బందులు పడి వేలకు వేలు కడుతున్నా నువ్వు మాత్రం తిండి తిననివాడికిమల్లే నీరసంగా మొహం వ్రేల్లాడేసుకున్నావెందుకు” అడిగింది సుందరమ్మ.

“చదువుకోవడానికి రాత్రుళ్ళు కాస్తంత ఎక్కువసేపు మేలుకోవడం వల్ల ఈ నీరసం మామూలే, ఇక ఆ సంగతి వదిలెయ్” అన్నాడు ప్రసాద్.

“త్వరగా మొహం కడుక్కుని రా, భోంచేసి టౌనుకు వెళ్ళి క్రొత్త బట్టలు తెచ్చుకుందువు” చెప్పింది సునందమ్మ.

“సరేమ్మా, అలాగేగానీ, నా ఫ్రెండ్ రాజా వుంటే టౌనుకు తోడు తీసుకుని వెళతా”చెప్పాడు ప్రసాద్.

సరిగ్గా ఓ గంట తర్వాత…..

“ఔరా ప్రసాద్, బట్టల సెలక్షన్ కోసమని నన్ను పల్లె నుండీ అదేపనిగా వెంటబెట్టుకుని వచ్చావ్, నేను చెప్పినట్లుగా రెడీమేడ్ బట్టలు కాకుండా మళ్ళీ టైలర్ దగ్గర కుట్టించేలా క్లాత్ పీస్ కొనాలంటున్నావే?, పండుగ ఎల్లుండే కదా, ఆలోగా టైలర్ కుట్టివ్వగలడా?” అడిగాడు రాజా స్నేహితుడిని.

“కాస్తంత ఆలశ్యమైనా ఫర్వాలేదురా, రెడీమేడ్ బట్టలంటే నాకు ఏమాత్రం ఇష్టంలేదు” చెప్పాడు ప్రసాద్.

“ఇదివరకే చాలాసార్లు అడిగినా నువ్వు చెప్ప్పలేదు, సిటిలో చదువుతున్నవాడివి, అసలెందుకు ప్రసాద్ నీకు మాలాగా రెడీమేడ్ డ్రెస్ నచ్చదు?” ప్రశ్నించాడు రాజా జవాబు చెప్పకతప్పదన్నట్లుగా.

“ప్రతి ఒక్కరూ రెడీమేడ్ బట్టల వైపే మొగ్గుజూపితే మనలాంటి పల్లెల్లో బట్టలు కుట్టే వృత్తి మీదనే ఆధారపడి పెళ్ళాం పిల్లల్ని పోషించుకునే చిన్నా చితకా టైలర్ల గతి ఏం కావాలి రాజా?” ఎదురు ప్రశ్నించాడు ప్రసాద్ తన బాల్యంలో అందరూ రెడీమేడ్ బట్టలపై మోజు చూపిన కారణంగా గిరాకీలు లేక, చేయడానికి మరే పనీ చేతగాక మానసికంగా దిగులుపడి అనారోగ్యంతో మంచం పట్టిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.

4. అలవాటు

“అమ్మా, శాదదమ్మ గారు మీరే కదమ్మా?” ప్రక్కింటావిడతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న శారదను అడిగింది ఓ యాభై ఏళ్ళ వయస్సున్న పెద్దావిడ.

“అవును,ఇంతకూ నువ్వెవరు?” అడిగింది శారద.

“నన్ను రాజేశ్వరమ్మ గారు పంపించారమ్మా, మీకు పనిమనిషి కావాలన్నారట కదా?” అంది పెద్దావిడ.

“ఓహో నువ్వేనా, నీ పేరేంటి?”అడిగింది శారద.

“మంగమ్మ, వారం క్రితం వరకు కాలేజీ ప్రిన్సిపాల్ గారింట్లో చేసేదాన్నమ్మా, వాళ్ళకు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోయారు” చెప్పింది పెద్దావిడ.

“అది సరే, నువ్వు ఎన్ని గంటలకు రావాల్సింది, ఏమేం పనులు చేయాల్సింది, మేము ఎంత జీతం ఇచ్చేది రాజేశ్వరి నీతో చెప్పిందా?”అడిగింది శారద.

“ఉదయం ఎనిమిదికి రావాలని, అంట్లు కడిగి, చెత్తలు చిమ్మి, టిఫిన్ తయారు చేసి, బట్టలు ఉతికి వెళ్ళాలని చెప్పిందమ్మా, జీతం పదిహేను వందలు ఇస్తామన్నారట, ఇంకో మూడు వందలు పెంచి ఇవ్వండమ్మా” అడిగింది మంగమ్మ.

“ఓ మూడు నెలలు చెయ్, తర్వాత చూద్దాం, ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరు వుంటారు?” ప్రశ్నించింది శారద.

“నేను, ఎనిమిదేళ్ళ నా మనవడు వుంటామమ్మా, బస్సు యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాయనా చచ్చిపోతే వాడిని నేనే సాక్కుంటున్నా” చెప్పింది మంగమ్మ.

మంగమ్మ శారద ఇంట్లో పనికి కుదిరిన పది రోజుల తర్వాత…

“ఏంటి మంగమ్మా, చేతిలో ఆ స్టీల్ బాక్స్ ఏంటి?, ఏదో ఇంటికి తీసుకుపోతున్నట్లున్నావే?” ఓ రోజు అడిగింది శారద మంగమ్మను.

“నా మనవడికి నిన్నటి నుండీ జ్వరంగా వుందమ్మా, అన్నం సయించడం లేదట, మిగిలిపోయివుంటే రెండు ఇడ్లీలు తీసుకెళుతున్నా” చెప్పింది మంగమ్మ.

“వాటిని అక్కడే పెట్టివెళ్ళు, మీ అయ్యగారు ఇవాళ ఉదయమే కుక్క పిల్లను తీసుకొచ్చారు, దానికి పెట్టాలి, అంతగా నీ మనవడికి కావాలనుకుంటే హోటల్ నుండీ తీసుకెళ్లు, ఇవాళ ఒక్కరోజు తీసుకెళ్లినట్లు కాదు, అడగకుండా వూరకనే వుంటే రోజూ అలవాటవుతుంది” కోపంగా చెప్పింది శారద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here