[dropcap]తె[/dropcap]లంగాణ విముక్తి చరితము
చీకటధ్యాయముగ మిగిలె.
బెండ్లు మునిగెను, గుండ్లు తేలెను
అసలు వీరుల దలచరైరి.
ప్రజల కోసం ప్రాణమిచ్చిన
వీర ఆర్య సమాజులేరి?
వామపక్షము నాదరించిన
వారికే నీరాజనాలు.
మిగితా త్యాగధనుల ఉనికే
మాయమాయెను ఎందుకంటి.
ప్రజల ధన, మాన, ప్రాణాలను
హరించిన యా నిజాం దొరను,
రజాకార్లను రాక్షసాధముల
గుట్టు రట్టు చేయరెందుకు?
దుష్ట నైజాం కారు పైనే
బాంబు విసిరెను వీరుడొకడు,
నారాయణరావు పవారును
నరహంతకులు చంపినారు.
త్యాగరాజుగ మిగిలిపోయిన
విగ్రహామ్మెట బెట్టినారు?
గూఢచారిగ వ్యవహరించి
పణముగ ప్రాణాలు బెట్టె.
నిజాం ఆయుధ రహస్యాలను,
పథకముల కూపీలు లాగి,
కేంద్ర ప్రభుతకు చెరవేసియు,
సైనిక చర్య స్వాగతించెను.
వందేమాతర రామచంద్రు
దలచ రెందుకు తెలియదాయె.
స్వామీ రామతీర్థ త్యాగము
మాయమాయెను మహిమ ఏమి?