[dropcap]క[/dropcap]వి, రచయిత అయిన డా॥ ప్యారక కృష్ణమాచారి రచించిన ఈ ‘జీవనయానం’లో అనేక విషయాలపై రచయితగా తన అనుభవాలను రంగరించి చూపే ప్రయత్నం చేసారు.
నిజ ‘జీవనయానం’లో ఎదురయ్యే సహధర్మనారిణి, అమ్మ, వసంతం, మావత్వం, జీవన సంధ్య/జీవన యానం, జీవితం – సార్థకం, అనుభూతి… వంటి అనేక విషయాలపై అతి తేలికైన, అందరికీ అర్థమయ్యే వచనంలో ఈ సంపుటి ప్రథమ పాదంలో కవిత్వంగా చూపించారు. నిజానికి ఇందులో కవిత్వం పాలు తక్కువైనా… నినాదాలు, ప్రాసలతో కూడిన వచనంలో ఆలోచింప విషయాలు అనేకం ఉన్నాయి. అలాగే కవిత కింద వున్న ఖాళీలలో ‘చిటుకులు’ పేరుతో రాసిన చిన్న కవితలు చురుక్కమనిపించేలా వ్యంగ్యరీతిలో సాగగా, రెండవ పాదం (భాగం)లో ఉగాది కవితలతో విడిగా అందించారు. ఈ ఉగాది కవితల వల్ల ఆయా సంవత్సరంలో జరిగిన పరిణామాలను కవితలుగా అల్లి, భవిష్యత్ తరాలకు రికార్డు పరిచి.. ఆనాటి సంఘటనలు చవి చూపించే ప్రయోజనం ఈ కవితల వల్ల కనిపిస్తుంది. మూడవ పాదం ‘గుండెపోటు’ పేరుతో మినీకవితలుగా అందించారు. ఈ కవిగారికి వచ్చిన గుండెపోటువల్ల తనని పరామర్శించానికొచ్చిన ఆత్మీయులతో తనకుగల అనుభవాలను కవిత్వంగా చూపే ప్రయత్నం చేసారు. ఇవన్నీ అంతగా పాఠకుడిని మెపింపచలేక పోవచ్చు గాని ఈ మూడు పాదాల తర్వాత నాలుగో పాదంగా రచించి అందించిన 5 కథలు మాత్రం మెచ్చదగ్గవిగా, అన్ని రసాలనూ రాసి మెప్పించేవాడే నిజమైన రచయిత అనే మాటకు కృష్ణమాచారి సరిపోతాడని నిరూపితమైనదిగా అనిపిస్తుంది. ఈ ఐదు కథలూ యదార్థం, కామెడీ, శృంగారం, దేశభక్తి, కాల్పనిక సాహిత్యం అనే వాటిని చాలా చక్కగా వీటిలో చవి చూపించారు. నిజం చెప్పాలంటే ఈ కవి, కవిగా కంటే రచయితగా చాలా పరిణతి సాధించాడనిపిస్తుంది ఈ సంపుటి మొత్తం చదివినాక. కవిత్వం కంటే అంత మంచి శైలిలో రాసారు ఈ కథలను కృష్ణమాచారి.
‘ఇల్లాలే’ అనే కథలో క్షణికావేశం వల్ల భార్యభర్తల మధ్య వచ్చిన స్పర్థ వల్ల వచ్చే నష్టం ఏపాటిదో తెలిపి, దానిని ఏవిధంగా అర్థం చేసుకొని మార్చుకుంటే ఫలితం ఎంత మంచిగా ఉంటుందో తెలిపిన కథ ప్రతి భార్యాభర్తలూ చదవదగ్గ కథగా నిలుస్తుంది. కాని కథకు పేరు ‘క్షణికావేశం’ అని పెడితే బాగుండననిపిస్తుంది చదివిన పాఠకుడికి. ఇక చివరగా రాసిన కథ- కథ అనేకంటే ఓ చిన్న నవలిక అని అనవచ్చు. ఇది చదవడం మొదలుపెట్టిన పాఠకుడిని ఉత్కంఠంతో ఏకబిగిన మొత్తం అక్షరాల వెంట పరుగులు పెట్టించి.. ఈ కథలో రచయిత పేర్కొన్న ఆ వంటకం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రం తొందర పెట్టి తీరుతుంది. కేవలం ఒక వంటకం కోసం దేవలోకంలో రంభ భువికి దిగి వచ్చేంతగా పనిమనిషిగా నటించేంతగా, దేవలోకం మొత్తం ఆ వంటకం కోసం పడిచచ్చి ఆ వంటకం తినేందుకు ఊవిళ్ళూరేంతగా… మలిచిన ఈ కథ అత్యద్భుతంగా మలిచారు రచయిత. దేవలోకంలోని అమృతాన్ని మించిన రుచి, ఈ భూమిపై ఒక వంటకం తన ప్రత్యేకతను కలిగుందని, ప్రతి ఇంటా, ప్రతి పెళ్ళిళ్ళూ ప్రత్యేక పండుగ దినాలలో తినే ఆ వంటకం యొక్క గొప్పదనాన్ని, దానిపై మరింత అభిమానాన్ని పెంచేరీతిలో మలిచిన ఈ కథ చదివిన వారు ఈ రచయితను తప్పక అభినందించి తీరవల్సిందే. ఇంతకీ ఈ వంటకం పేరేమిటి అని ప్రతి పాఠకుడూ అడగవచ్చు.. ఎదురుచూడవచ్చు..! ఈ కథకు పెట్టిన పేరే ఆ వంటకం. ఆ పేరు నేను చెప్పలేను… ఎందుకంటే ఈ పుస్తకం తెప్పించి చూస్తేనే ఆ వంటకం పేరు తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్!. కవిగా కంటే రచయితగా మంచి శైలిని, వస్తువు స్వీకరణను అందిపుచ్చుకున్న కృష్ణామాచారి ప్రతిభకు ప్రత్యేక అభినందన.
***
‘జీవనయానం’ (కవితా/కథా సమాహారం)
రచన: డా॥ ప్యారక కృష్ణమాచారి,
పుటలు: 184, వెల: రూ.100/-;
ప్రతులకు:
డా॥ ప్యారక కృష్ణమాచార్య,
10-185, గాయత్రి హోమ్స్,
గాయత్రి నగర్, కర్మన్‌ఘాట్,
హైదరాబాద్-500079,
సెల్: 7675042763