[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
బాల కార్ణవ మధ్యేతు ద్వీపః షడ్యోజనాయతః।
తత్రసన్తి పిశాచా యే దైత్య పక్షాః సుదారుణాః ॥
[dropcap]నీ[/dropcap]లమత పురాణంలో ‘పిశాచా’లు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? వారు కశ్మీరులో ఉండేందుకు నియమ నిబంధనలేమిటి వంటివి స్పష్టంగా ఉన్నాయి. పిశాచాలు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న అర్థం రాదు. ఇప్పుడు పిశాచం అంటే సినిమాల్లో చూపినట్టు ఊహిస్తాం. నిజానికి సినిమాల్లో రాక్షసుడికి, పిశాచానికీ పెద్ద తేడా లేదు. సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం తీసుకుంటే ‘పీక్కు తినేది పిశాచం’. అది మాంసాన్ని పీక్కు తినేది కావచ్చు, శవాన్ని పీక్కు తినేది కావచ్చు. మనిషిని పీక్కు తినేది కావచ్చు. లేక, కూరగాయలనయినా పీక్కు తినేది కావచ్చు. అంటే అనాగరికంగా అనాగరికంగా ప్రవర్తించేవారు, నాగరికం కానిది అన్నమాట. భయం కలిగించి, అసహ్యం కలిగించేలా, మామూలు నాగరికుల కన్నా భిన్నం అయి, అసహ్యంగా, దుష్టంగా ప్రవర్తించే వారిని ‘పిశాచం’ అన్న పదంతో సంబోధించి ఉంటారు. మన పురాణాలలో, జానపద గాథలలో, భూత ప్రేతాలతో కలిపేసి అర్థం చేసుకుంటున్నాం. కానీ నీలమత పురాణం, వేదాలతో సహా పురాణాలలో పిశాచ సంబంధిత అంశాలను పరిశీలిస్తే, ‘పిశాచం’ అంటే అదేదో మరణించి కూడా మరణించని దుష్టమైనది కాదు, ప్రాచీన కాలంలో ఉన్న అనేక జాతులలో ఒక జాతి అని స్పష్టమవుతుంది. అంతేకానీ, అసాధారణ పరిస్థితులలో మరణించినవారు, కోరికలు తీరక మరణించినవారు భూతాలు, దయ్యాలు, పిశాచాలు అవుతారన్న ఆలోచన ఏ మాత్రం సమంజసం కాదు. బహుశా ప్రాచీనులు ఒక ప్రాంతానికి చెందినవారి అలవాట్లు అనాగరికంగా ఉండడంతో, వారి ప్రవర్తన దౌష్ట్యంగా ఉండడంతో, వారు ప్రత్యేకంగా గుర్తించే లక్షణాలు కలిగి ఉండడంతో వారిని ‘పిశాచాలు’ అని ఉంటారు. అయితే, మన పురాణాలలో ‘పిశాచా’ల గురించి మూడు గాథలున్నాయి.
మహాభారతం శాంతి పర్వంలో ఒక యక్షుడి పేరు ‘పిశాచ’. ఆది పర్వంలో పిశాచాల ప్రస్తావన వస్తుంది. బ్రహ్మ పద్ధెనిమిది మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షుడు, యక్షులు, గంధర్వులు, పిశాచాలు ఉన్నాయి. సభా పర్వంలో పిశాచాలు కుబేరుడి ఆస్థానంలో ఉంటాయని ఉంది. పిశాచాలు కుబేరుడిని అర్చిస్తాయి. అదే సభా పర్వంలో పిశాచాలు బ్రహ్మ దగ్గర ఉంటాయనీ, బ్రహ్మను పూజిస్తాయనీ ఉంది. మరో పర్వంలో పిశాచాలు గోకర్ణంలో ఉంటాయి, శివుడిని పూజిస్తాయి అని ఉంది. ద్రోణ పర్వంలో పిశాచాలు రక్తం తాగుతాయి, మాంసం తింటాయి అని ఉంది. ఘటోత్కచుడికి మద్దతుగా పిశాచాలు కర్ణుడితో పోరాడాయి. ఖాండవ దహనం సమయంలో అర్జునుడు పిశాచాలను ఓడించాడు. ‘మూన్జవాన్’ పర్వతంపై పిశాచాలు పార్వతీ, పరమేశ్వరుల గురించి తపస్సు చేశాయని అశ్వమేధ పర్వంలో ఉంది. ఆశ్రమ వాసిక పర్వంలో పిశాచాలు రాజులయ్యాయని ఉంది. ఎక్కడా కూడా పిశాచాలు మానవులు కారన్న భావన లేదు. ద్రోణ పర్వంలో పిశాచాలను శ్రీకృష్ణుడు శపించిన ప్రస్తావన ఉంది.
భీష్మ పర్వంలో పిశాచ దేశంలో ఉండేవారిని పిశాచాలు అనడం కనిపిస్తుంది. వీరు పాండవుల తరఫున పోరాడారు. యుధిష్టరుడు పన్నిన క్రౌంచ వ్యూహంలో దక్షిణం వేపు ఉన్నారు వీరు. అయితే కొందరు పిశాచాలు భాగదత్తుడి సైన్యంలో దుర్యోధనుని పక్షాన పోరాడారు. ఇదంతా మహా భారతంలో పలు పర్వాలలో పిశాచాల గురించి ఉన్న ప్రస్తావన.
నీలమత పురాణంలో పిశాచాలు, ఇసుక సముద్రంలో, ఆరు యోజనాల పొడవున్న ఒయాసిస్సు దగ్గర ఉంటారని ఉంది. వీరు దుష్టులతో స్నేహం చేస్తారని, వారి ప్రవర్తన దౌష్ట్యంగా ఉంటుందని ఉంది. అయితే కుబేరుడు నికుంభుడిని మంచి పిశాచాలకు అధిపతిగా నియమించి కశ్మీరులో నివసించమన్నాడు. అంతేకాదు, ఇసుక సముద్రంలో మధ్యలోని ‘ఒయాసిస్’ ప్రాంతంలో నివసించే దుష్ట పిశాచాలతో ఆరు నెలలు పోరాడాలి. వారిని అదుపులో పెట్టాలి. మిగతా ఆరు నెలలు కశ్మీరులో నివసించాలి. వారితో కలిసి నివసించేందుకు ఇష్టపడని నాగులను కశ్యపుడు శపించాడు. నికుంభుడిని కూడా కశ్మీరులో ఉండే ప్రజలు పూజిస్తారు. ప్రజలను కష్టపెట్టే పిశాచాలను నికుంభుడు క్షమించడు. నాలుగు యుగాల వరకూ పిశాచాలు కశ్మీరంలో ఉండవచ్చు. నీలమత పురాణంలో నికుంభుడిని ఎప్పుడు, ఎలా పూజించాలి అన్నది కూడా స్పష్టంగానే ఉంది. ఎక్కడా పిశాచాలు మానవాతీతమని లేదు. పైగా కశ్మీరులో ఉన్న పిశాచాలు మంచివి. ఇవి దుష్ట పిశాచాలలో ఆరు నెలలు పోరాడి వారిని అదుపులో ఉంచుతాయి. కాబట్టి ‘పిశాచం’ అనగానే అదేదే వేరే జీవి అనుకునేందుకు వీలు లేదు. పిశాచం కూడా మనిషే.
నీలమత పురాణంలో పిశాచాల గురించి ఉన్నది, మహా భారతంలో ఉన్నదీ కలిపి చూస్తే పిశాచాలు కుబేరుడి మాట వింటాయనీ, పిశాచాలలో కూడా మంచివారు, చెడ్డవారు ఉన్నారని, మంచివారు మనుషులతో సహజీవనం చేస్తారు, దుష్టులు దూరంగా ఉంటారని స్పష్టమవుతోంది.
వేదంలో పలు సందర్భాలలో ఎర్ర ముఖం ఉండి, గొప్ప శబ్దం చేసే పిశాచాన్ని నాశనం చేయమని ఇంద్రుడిని ప్రార్థించటం కనిపిస్తుంది. ఇక్కడ కూడా పిశాచాలు ఏవో మానవాతీత శక్తులు అన్న భావన కలుగదు. దుష్టులు, శత్రువులు, చెడు చేసేవారితో పాటు పిశాచాల ప్రస్తావన వస్తుంది. అంటే, మనుషుల జాతులలో ఒక జాతిలానే ‘పిశాచి’ అన్న పదం వాడేరన్న మాట. దొంగలు, అనాగరికులు, పిశాచాలను ఒకే రకంగా ప్రస్తావించటం తైత్తరీయ సంహితలో కూడా కనిపిస్తుంది. దేవతలు, మనుషులు ఒక వైపు, అసురులు, రాక్షసులు, పిశాచాలు మరో వైపు ఉంటారు యుద్ధంలో. బృహద్దేవతలో ఒక ఇక్ష్వాకు రాజు భార్య పిశాచి. పురాణాలలో కూడా పలు సందర్భాలలో దారదులు, పౌండ్రకులు, తంగణాలు, శకులు, కాంభోజులు, యవనులతో పాటు పిశాచాలను కలిపి చెప్పటం కనిపిస్తుంది. మిగతావన్నీ మానవుల వివిధ జాతులు. కాబట్టి పిశాచాలు కూడా పలు రకాల మానవ జాతులలో ఒకటి తప్ప అదేదో దయ్యమో, భూతమో అని అనుకోకూడదు. పురాణాలలో పిశాచాలు హిమవంతం, ఉత్తర కురు ప్రాంతాలలో నివసిస్తాయని చెప్పటం కనిపిస్తుంది.
విష్ణు పురాణం, మత్స్య పురాణాలలో కశ్యప ప్రజాపతి, క్రోధల సంతానం పిశాచాలు. క్రోధ దక్షుడి కూతురు. బహుశా, అందుకేనేమో మంచి పిశాచాలను కశ్మీరులో నివసించేట్టు చేశాడు కశ్యపుడు. అందుకు అభ్యంతరం చెప్పిన నాగులను శపించాడు. వాయు పురాణంలో పదహారు పిశాచాల పేర్లు ఉన్నాయి. మేరు పర్వతానికి దక్షిణాన ‘పిశాచక’ అనే పర్వతం ఉందనీ, దానిపై కుబేరుడి భవంతి ఉందని ఉంది. ఈ పిశాచక పర్వతం హిమవంతం సమీపాన ఉంటుంది. నీలమత పురాణంలో కూడా హిమవంతం, కశ్మీరం ప్రాంతాలలో పిశాచాలు ఉన్నట్టు ఉంది. అయితే, నీలమత పురాణం కశ్మీరుకు ప్రత్యేక పురాణం కావటం, కశ్మీరులోని ప్రజలకు సంబంధించినది కావటంతో, పిశాచాల గురించి ఇతర పురాణాలలో ఉన్నట్టు, అమానవీయ శక్తులు అన్న భావన ఉండదు. కొన్ని పురాణాలలో పిశాచాల తల్లి ‘కపిశ’ అని ఉండడంతో, చరిత్రకారులు ఎక్కడ ‘కపిశ’ అన్న పేరు కనిపిస్తే ఆ ప్రాంతం పిశాచాల జన్మస్థలం అన్నట్టు తీర్మానించారు. ఒక కపిశ తెగ వారిలో ‘పశ్తాయ్ ‘ అన్న పేరు కనిపిస్తుంది. ఇది ‘పిశాచ’కు దగ్గరగా ఉంది కాబట్టి వీళ్ళే ‘పిశాచాలు’ అని, కఫీరిస్తాన్ వీరి జన్మస్థలం అని తీర్మానించారు కొందరు. మిళింద పన్హలో అలెగ్జాండ్రియా పేరు నికుంభ అన్న పేరు కలసిరావటంతో పిశాచాలు అలెగ్జాండ్రియా పరిసర ప్రాంతానికి చెందినవారని, ఆ ప్రాంతాన్ని నికుంభుడు ఆక్రమించాడని బల్ల గుద్ది చెప్తారు కొందరు.
(ముగింపు త్వరలో)