అఫ్ఘన్ స్త్రీల దీన గాథ – ఖలీద్ హొసైనీ రాసిన “A Thousand Splendid Suns”

2
3

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ఖ[/dropcap]లీద్ హొసైనీ నవలలు అఫ్ఘన్ ప్రజల జీవితాలకు ప్రతిబింబాలు. వారి రెండవ నవల “A THOUSAND SPLENDID SUNS” అఫ్ఘన్ స్త్రీల జీవితాల పై వచ్చిన గొప్ప రచన. వీరి నవలలలో కథతో పాటు పాఠకులకు ఆ దేశ రాజకీయ పరిస్థితి పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తారు రచయిత. 2007 లో రాసిన ఈ పుస్తకం ప్రపంచం మొత్తంలో చాలా ఎక్కువ మంది పాఠకులను సంపాదించగలిగింది. దానికి కథలోని విషాదం, నిజాయితీ కారణమయితే ఇంత విస్తృతంగా ఆ దేశ రాజకీయ సంక్షోభాన్ని రష్యా ఆక్రమణ నుండి తాలిబన్ల దాకా ఆ దేశంలో జరిగిన మారణహోమాన్ని రాసిన నవల మరోటి కనిపించకపోవడం కూడా మరో కారణం. ఎందరో గొప్ప కవులకు కళాకారులకు జన్మనిచ్చిన ఆ దేశం ప్రపంచంలోని గొప్ప బౌద్ధ స్తూపాలకు నెలవైన ఆ దేశంలో రగిలిన హింస, పారిన రక్తపుటేరులు గత యాభై సంవత్సరల కాలంలో ఆ దేశం అనుభవించిన బానిసత్వం, ఇవన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. పదిహేడవ శతాబ్దపు ఇరాన్ కవి “సాయెబ్ తబ్రీజీ” రాసిన కాబుల్ అనే కవితను జోస్ఫిన్ డేవిస్ ఆంగ్లంలోని అనువదించారు. అందులోని వాక్యాన్నే ఈ పుస్తక శీర్షికగా తీసుకున్నారు రచయిత. ఒకప్పటి కాబుల్ సౌందర్యం, ఆ నగర ఆకాశంలోని సూర్య చంద్రుల కాంతిని అనుభవించిన ఆ దేశ ప్రజలకు ఆ నగరంపై ఉన్న ప్రేమ, నమ్మకం వీటన్నిటి మధ్య ఆ నగరం భరించిన హింస ఇవి ఈ నవలలోని ముఖ్య అంశాలు, వీటి మధ్య మరియం, లైలాల కథ నడుస్తుంది.

నవలలోని ప్రధాన పాత్రలు మరియం లైలా. పితృస్వామ్య అఫ్గానిస్తాన్ లోని రాజకీయ సామాజిక సంక్షోభాల మధ్య నలిగిపోయిన వీరి జీవితాలు వారు భరించిన హింస ఈ నవల ఇతివృత్తాలు. పురుష ప్రాధాన్య సమాజంలో ఏ సంక్షోభం తలెత్తినా వాటి మధ్య నలిగిపోయేది ఎక్కువగా ప్రభావితం అయ్యేది స్త్రీలు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఇద్దరు స్త్రీల కథ ఇది.

మరియం తండ్రి ఆమె తల్లిని వివాహం చేసుకోడు. అతనికి అంతకు ముండే ముగ్గురు భార్యలు. నానాతో అతనికి ఏర్పడ్డ సంబంధం కారణంగా మరియం పుడుతుంది. కాని ఆమెకు అతను భార్య స్థానం ఇవ్వలేడు. ఊరి బయట ఒక చిన్న ఇల్లు కట్టించి అక్కడ వారిద్దరిని ఉంచుతాడు. వారంలో ఒక్క రోజు అతను వచ్చి మరియంతో సమయం గడుపుతాడు. తండ్రి అంటే మరియంకు చాలా ఇష్టం. నానా మరియంకు వాస్తవాన్ని బోధించాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కాని ఎప్పుడూ విషాదానికి మారు పేరులా ఉంటూ తన ప్రతి ఆనందానికి అడ్డు వచ్చే నానాను మరియం అర్థం చేసుకోదు. ఆమెకు తల్లి అర్థం అయ్యే సరికి ఆమె మరొకరి భార్యగా హింస అనుభవిస్తూ ఉంటుంది. ప్రతి వారం అతిథిలా వచ్చే ఆ తండ్రి విదిల్చే బహుమతులతో సంతోషపడిపోయే మరియం ఒక రోజు ఊరిలోకి వెళ్ళి, తండ్రి ఇంటికి వెళ్ళి అతన్ని అతని కుటుంబాన్ని కలవాలని అనుకుంటుంది. తల్లి వారించినా వినకుండా ఒంటరిగా తండి ఇంటికి వెళుతుంది. తలుపు కొట్టిన మరియంను చూసి దాక్కున్న ఆ తండ్రి ఆ ఇంట్లోని మిగతా వారు ఆమెను ఇంటిలోకి రానివ్వరు. అనాథలా ఆ ఇంటి ముందు వీధిలో పడుకుంటుంది మరియం. అప్పుడు ఆమెకు తల్లి చెప్పిన మాటలు అర్థం అవుతాయి. మరుసటి రోజు బలవంతంగా ఆ ఇంటి డ్రైవర్ ఆమెను ఆమె ఇంటి వద్ద దిగబెడతాడు. కాని అక్కడ ఇంటి బైట తల్లి శవం చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. ఏ కూతురు కోసమైతే జీవచ్ఛవంలా బ్రతుకుతుందో ఆ కూతురే తనను కాదని ఆ తండ్రి పక్షాన చేరడం భరించలేని నానా ఆత్మహత్య చేసుకుంటుంది. తల్లి మరణం తరువాత దుఖంతో తండ్రి ఇంట చేరిన మరియం బాధ్యత తీసుకోవడానికి నిరాకరించిన అతని కుటుంబం నెల తిరక్కుండానే కాబుల్‌లో ఉండే రషీద్ అనే వ్యక్తికి ఇచ్చి ఆమె పెళ్ళి జరిపిస్తారు. రషీద్ వయసులో చాలా పెద్దవాడు. మరియం వయసు పదమూడేళ్ళు. అతనికి అప్పటికే భార్య ఒక కొడుకు చనిపోయు ఉంటారు. ఎంత బ్రతిమాలినా తండ్రి ఆమె పెళ్ళి ఆపడు. హైరత్ అనే చిన్న ఊరులో పెరిగిన మరియం తన భాష మాట్లాడని మరో ప్రాంతానికి పెళ్ళి పేరుతో వెళ్ళిపోతుంది. ఆమెకు ఎన్నో గర్భస్రావాలు అయి పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత ఆ భర్త కర్కశత్వాన్ని భరిస్తూ అసహాయంగా జీవిస్తూ ఉండిపోతుంది.

లైలా తల్లి తండ్రులు చదువుకున్నవారు. ఆమె బాల్యం చాలా ప్రేమతో గడుస్తుంది. అప్పుడు అఫ్గాన్‌పై సోవియట్ల అధికారం నడుస్తూ ఉంది. తమ దేశ స్వాతంత్ర్యం కోసం ముజాహిద్దీన్ పోరాడుతుంది. వారితో చేరి లైలా అన్నలు సైన్యంలో యుద్ధానికి వెళతారు. యుద్ధంలో వారి మరణం లైలా తల్లిని కలచివేస్తుంది. ఆమె మంచానికే పరిమితమై పోతుంది. లైలా తండ్రి బాగా చదువుకున్నవాడు. రష్యన్ల పరిపాలనలో ఆడపిల్లలపై చదువుకు నిషేధాలు లేని కారణంగా లైలా స్కూలుకి వెళుతుంటుంది. తారిక్ అనే అబ్బాయితో ఆమెకు మంచి స్నేహం. తారిక్‌కి ఒక కాలు ఉండదు. కర్రకాలుతో ఆనందంగా ఉంటాడు. ముజాహిద్దీన్ గెలుస్తుంది. అఫ్గాన్‌లో ప్రశాంతత మాత్రం కొరవడుతుంది. స్త్రీల పై నిషేధాలు మొదలవుతాయి. స్కూల్లు మూసేస్తారు. ముజాహిద్దీన్ల అంతర్గత కలహాల కారణంగా వారిలో వారికి జరిగే యుద్ధాలతో కాబుల్ బాంబుల వర్షానికి బలి అవుతుంది. ఎందరో నగరం వదిలేసి వెళ్ళిపోతారు. తారిక్ కుటుంబం కూడా నగరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ముజాహిద్దీన్ల పాలనలో, ఆ నిరంతర బాంబు దాడుల మధ్య ఉండలేక లైలా తండ్రులు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని బైలుదేరుతున్న రోజునే వారి ఇంటిపై బాంబు పడి లైలా తల్లి తండ్రులు మరణిస్తారు. లైలాకు చాలా గాయాలవుతాయి. ఆమెను పొరుగింటి రషీద్ రక్షిస్తాడు. తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమెకు మరియం సేవలు చేస్తుంది. లైలా బ్రతుకుతుంది కాని ఒక చెవుకు వినికిడి పోతుంది. అప్పటికి ఆమె పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి. ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు రషీద్. మరియం ఇష్టపడకపోయినా లైలా అందాన్ని సొంతం చేసుకోవాలన్న కోర్కెతో రషీద్ వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకుంటాడు. అప్పటికే తాను గర్భవతి అని తెలుసుకున్న లైలా, తారిక్ మరణించాడని ఒక వ్యక్తి చెప్పగా అసహాయ స్థితిలో రషీద్‌ను వివాహం చేసుకుంటుంది. తన మొదటి బిడ్డ రషీద్ సంతానంగా బ్రతుకుతుందని లేదంటే ఆ బిడ్డను చంపుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని లైలా రషీద్‌కు లొంగిపోతుంది.

నవల ఇక్కడితో అయిపోదు. ఆ ఇద్దరి స్త్రీలు ఒకరికొకరు తోడుగా ఆ విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కున్నారన్నది ఆ తరువాతి కథ. ఒక పక్క భర్త రాక్షసత్వం, అప్పుడే అధికారం లోకి వచ్చిన తాలిబన్ల పరిపాలనలో స్త్రీల పై విధించిన నియమాలు, వీటి మధ్య వారి జీవితాలు చీకటి మయం అయిపోతాయి. బైటికి వెళ్ళాలంటే మగ వ్యక్తి తోడు ఉండాలి, బురఖాలు తప్పకుండా ధరించాలి. స్త్రీలకు చదువుపై, కళలపై ఎటువంటి హక్కులేదు. వారి ఆరోగ్య విషయాలు పట్టించుకునే వారే ఉండరు. వారికి అన్ని హాస్పటల్లలోకి ప్రవేశం లేదు. స్త్రీలకు నగరం చివరన ఒకే ఒక హాస్పిటల్. అందులో మందులు అందుబాటులో ఉండవు. లైలాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుడుతుంది. మరోసారి అబ్బాయి. రెండో ప్రసవంలో సిజేరియన్ చేయవలసి వచ్చినప్పుడు మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకోవల్సిన ఘోరమైన పరిస్థితులు. తాలిబన్ల సమయంలో అగ్ని ప్రమాదంలో దుకాణం కాలిపోయి రషీద్ సంపాదన తగ్గిపోయినప్పుడు కూతురును అనాథ శరణాలయంలో చేర్పిస్తారు. తరువాత మిగతా కథంతా ఆ ఇద్దరి స్త్రీల దీన గాథ, వారు భరించిన దుర్భర దారిద్ర్యం, హింస. వీటి నుండి వారి జీవితాలకు మార్గం మరియం త్యాగంతో దొరుకుతుంది. మరియం భర్తను పొరపాటున చంపినా దానిలో లైలాని బ్రతికించాలనే తపన ఉంది. చివరకు తాను ఆ శిక్ష తనపై వేసుకుని మరణశిక్షను స్వీకరించి లైలాకు ఆ జీవితం నుండి పారిపోవడానికి తారిక్ రూపంలో వచ్చిన అవకాశం వినియోగించుకోవడానికి మరియం, తనను తాను త్యాగం చేసుకుంటుంది. చివరకు అనుకోకుండా మరియం తండ్రి ద్వారా వచ్చిన ఆస్తి కారంగా లైలా కుటుంబం కాబుల్‌లో మళ్ళీ బ్రతకగలుగుతుంది.

ఈ నవలలోని ప్రధాన అంశాలు అఫ్గాన్‌లోని రాజకీయ సంక్షోభం, పితృస్వామ్య మతాహంకార సమాజంలో జీవిస్తున్న అఫ్ఘన్ స్త్రీలు వారి జీవితాలు. అటువంటి గడ్డు పరిస్థితులలో కూడా వారు చూపే ఓపిక, పరిస్థితులను భరించే వారి ఓర్పు. మరియం తల్లి నానా ద్వారా నవల మొదటి పేజీలలోనే రచయిత అక్కడి స్త్రీల జీవితాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక సందర్భంలో నానా మరియంతో అంటుంది. “ఇప్పుడే అర్థం చేసుకో మరియం. దిక్చూచిలో సూది ప్రతి సారి ఉత్తర దిక్కుని చూపిస్తున్నట్లు ప్రతి సారి మగవాని చేయి ఆడదాన్నే ప్రతి తప్పుకు కారణంగా చూపుతుంది. ఇది అర్థం చేసుకో, కలల ప్రపంచంలోనించి వాస్తవంలోకి రా” అంటుంది కాని తల్లి ఘోష చిన్న మరియంకు అర్థం కాదు. తన కారణంగా జీవితంపై ఆశ చచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి అమెకు నిత్యం గుర్తుకువస్తూ ఉంటుంది. మరో చోట తండ్రిపై విపరీతమైన నమ్మకం పెట్టుకున్న మరియంను చూసి నానా అంటుంది. “మగవాడి గుండె స్వార్ధంతో నిండి ఉంటుంది. అది గర్భసంచి కాదు బిడ్డల కోసం రక్తం కార్చడానికి, బిడ్డకు స్థానం ఇవ్వడానికి తనను తాను సాగదీసుకోవడానికి” అప్ఘాన్‌లో మతం చాటున్ స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలు, అక్కడి బహుభార్యత్వం, కుటుంబ హింస, ఇవన్నీ ఈ నవలలో రచయిత చాలా విపులంగా చర్చిస్తారు. అతి విషాదంగా సాగే ఈ నవల ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. చాలా మందికి తెలీని ఒక హింసాత్మక ప్రపంచాన్నీ, కేవలం ఆ దేశంలోని స్త్రీలుగా పుట్టినందుకు అంతటి క్రూరత్వాన్ని భరిస్తున్న అఫ్ఘన్ స్త్రీల దుస్థితినీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

ఖలీద్ హుసైనీ శైలి చాలా బావుంటుంది. వీరి నవలలన్నిట్లో కూడా కనీసం ఒక మూడు తరాల కథ నడుస్తుంది. మానవ సంబంధాలపై వీరి నమ్మకం కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు వారి తల్లితండ్రుల నుండి పుచ్చుకునే వారసత్వ సాంప్రదాయ ఆలోచనలను వీరి కథకు చాలా చక్కగా వాడుకుంటారు. తరాల మధ్య నిలిచి ఉండిపోయే మానసిక అనుబంధం, మానవ జాతి ఒక తరం నుండి మరో తరానికి అందించే ఆలోచనలు సాంప్రదాయాలను కోరుకున్నా వదిలిపెట్టలేకపోవడం వీరి అన్ని నవలలో ఒక కామన్ పాయింట్‌లా కనిపిస్తుంది. ఈ నవలలో అది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. మర్చిపోలేని నవల ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here