జీవన రమణీయం-125

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

ప్రముఖ నటి గీతాంజలి గారితో

[dropcap]సె[/dropcap]న్సార్ బోర్డ్‌లో తరచూ కలిసి, చనువుగా మాట్లాడుకునే సెన్సార్ బోర్డ్ కోమెంబర్స్… ఆచార్య శరత్‌జ్యోత్స్నారాణీ, మన అచ్చమైన తెలుగు నటీ, ఇటీవలే దివంగతురాలైన అద్భుత కమేడియన్ పాత్రలేసిన గీతాంజలి గారూ, ఎప్పుడూ, “ఇంటికి రండి… రకరకాల వంటలు చేసి మిమ్మల్ని దెబ్బకి నాన్ వెజిటేరియన్‌గా మార్చేస్తాను” అనేవారు నన్ను. ఆవిడ ఇంటికి మహానటి సినిమాకి పని చేసేటప్పుడు డైరక్టర్ నాగాశ్విన్‌ని తీసుకుని వెళ్ళాను. ఎంతో బాగా మాట్లాడారు. చాలా ఎక్కువగా సెన్సార్‌లో కలిసి సినిమాలు చూసేవాళ్ళం. స్నేహశీలి. “మీరేం టిఫిన్ తెప్పించుకుంటున్నారూ? నేను అదే తింటా…” అనేవారు చిన్నపిల్లలాగా. మంగారెడ్డి అనే కాస్ట్యూమర్, అరుణ అనే లా కాలేజ్ ఓనర్, పద్మనాభరావు గారూ, గోపాల్ గారూ కాక, చాలామంది తరచుగా కలిసేవాళ్ళం కానీ నాకు పెద్ద స్నేహం కాలేదు! మా శైలేంద్ర మాత్రం నాకన్నా ఒక మెట్టు ఎక్కువ. ఆఫీసర్‌తో గొడవ పడి లాయర్ కాబట్టి కేస్ కూడా పెట్టిందని చెప్పింది. వై. సునీతా చౌదరి అనే జర్నలిస్ట్ నాకు ఫ్రెండ్. ఆ అమ్మాయి ఈ ఆఫీసర్‌తో పడక రిజైన్ చేసింది.  అసలు సిసలు మెంబర్ మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణ గారి భార్య పరుచూరి విజయలక్ష్మి గారు కూడా వుండేవారు. మా టెర్మ్ అయిపోయినా, అప్పుడప్పుడూ మెంబర్స్‌లో లైక్-మైండెడ్ వాళ్ళం, మా వనజ ఆధ్వర్యంలో లంచ్‌కో, సినిమాకో సరదాగా కలుస్తూ వుండేవాళ్ళం. ఆ కట్స్ పెట్టడం, కొన్ని భాషల సినిమాలకి ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుని, అతన్ని అడుగుతూ చూడడం, పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఫోన్స్ చెయ్యడం, కొన్నిసార్లు ప్రాధేయపడడం, అన్నీ చాలా సరదాగా ఉండేవి. కళ్యాణ్‌రామ్… అంటే నందమూరి హరికృష్ణ గారబ్బాయి, ఒక 3డి మూవీ తీసినప్పుడు, ఆ సెన్సార్ కట్స్‌కి అతను స్పందించిన తీరు కానీ, మా మెంబర్స్‌తో… నేనూ, శైలేంద్రా చేసాం ఆ మూవీ ప్రివ్యూ… మాతో మాట్లాడి మమ్మల్ని గౌరవించిన విధానం గాని నేను మరిచిపోలేను! “ఎంత మంచి సంస్కారం నేర్పారయ్యా మీ అమ్మగారు… ఆవిడకి మా నమస్కారం” అని చెప్పాను. అలాగే అమర్యాదగా మాట్లాడి గొడవ చేసిన వ్యక్తులనీ కూడా మర్చిపోలేను.

‘నిత్యానంద’ మీద తీసిన ‘సత్యానంద’ సినిమాని బ్యాన్ చేసినప్పుడు R.C. కొచ్చింది. R.C. అంటే రివైజ్ కమిటీ. ఆ ఛైర్మన్‌గా మా నిర్మాత శేఖర్‌బాబు గారుండేవారు. ఆ చిత్రం మేం ఆ నిత్యానంద బాబా భక్తులు కొంతమందొస్తే వాళ్ళతో కలిసి చూసాం. అతని శృంగార కాండనీ, మిగతా ఆశ్రమంలోని అక్రమాలనీ నిర్భీతిగా తీసారు దర్శకనిర్మాతలు. కానీ ఆ సినిమాలో తమ స్వామిని అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన నిత్యానంద బాబాని, చెడుగా చూపించారని, శోకాలు పెడ్తూ, చెంపలు వేసుకుంటూ, స్పృహ తప్పుతారేమో అన్నట్లుగా ప్రవర్తించారు ఆ భక్తులు! ఆ భక్తిలో సిన్సియారిటీ వున్నట్టే కనిపించింది నాకు! వాళ్ళు మనస్ఫూర్తిగా అతను శ్రీకృష్ణుడి అవతారం అని నమ్ముతున్నారు, కల్కి భగవాన్, సత్యసాయిబాబా భక్తులు లాగే సిన్సియర్‌గా! ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేనిది. ఢిల్లీ నుండి సెన్సార్ బోర్డ్ ఛైర్‌పర్సన్ లీలా శాంసన్, ప్రఖ్యాత నాట్యకళాకారిణి కూడా వచ్చారు. డైరక్టర్ చాలా అందంగా వున్నారు. ఆవిడ కూడా వచ్చారు. ఈ రీజనల్ ఆఫీసర్ మీద సెన్సార్‌లో పని చేసే ఆచారిగారు కూడా కంప్లైంట్స్ ఇవ్వడం వలన, సునీతా చౌదరీ కూడా ఇవ్వడం వలనా మీటింగ్ పెట్టి మమ్మల్నందరినీ పిలిచారు. ఆవిడ్ని బాగా విమర్శిస్తూ సభ్యులు మాట్లాడినా, పై వాళ్ళు అన్నీ విని, ‘ఏక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం’ అని వెళ్ళారు. కానీ ఏమీ ఏక్షన్ తీసుకోలేదు. ఆమె భర్త కూడా గవర్నమెంట్‌లో ఉన్నత పదవిలో వున్నాడు. కానీ సస్పెండ్ అయ్యారని వినికిడి! ‘దేనికైనా రెడీ’ సినిమా మోహన్ బాబు గారు తీసిన దాని మీద బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని, గొడవైనప్పుడు, మేం రెండో స్క్రీనింగ్ వేస్తున్నప్పుడు, నేనూ, శైలేంద్రా వున్నాం. మోహన్ బాబు గారొచ్చి, ఆఫీసర్‌ని కోపంగా “స్క్రీనింగ్ ఆపేయండి” అని పరుషంగా మాట్లాడారు, మేం కూడా లేచి వచ్చేసాం. మర్నాడు ఆవిడ, “నన్ను అలా వదిలేసి మీ ప్రాణాలు మీరు చూసుకుని వెళ్ళిపోతారా? నన్ను ఏమైనా చేసుంటేనో?” అని అరిచారు. “మీరేం తక్కువ కాదుగా, హేండిల్ చేసుకుంటారనుకున్నాం” అన్నాం మేం.

ఆ సెన్సార్ బోర్డ్ రెండేళ్ళూ ఎన్నెన్నో అనుభవాలు. తీపీ, చేదూ సమ్మేళనం! కానీ, సెంట్రల్ గవర్న్‌మెంట్ ఐడీ కార్డ్ ఎన్నో సార్లు కర్ఫ్యూలలో కూడా మా కారు వెళ్ళడానికి పనికొచ్చింది. భోజ్‌పురి సినిమాలు చూసీ చూసి అది నా మాతృభాష అయిపోయింది. ఒక ట్రాన్స్‌జెండర్స్ సినిమా చూసినప్పుడు మాత్రం వారం దాకా మనిషిని కాలేకపోయాను బాధతో. నేను నటించిన ‘వెల్‍కమ్ ఒబామా’, కథలు ఇచ్చిన ‘సరదాగా అమ్మాయితో’, ‘నేనేం చిన్నపిల్లనా?’ సెన్సార్‌లకి ముందే నన్ను వెయ్యొద్దని చెప్పేసాను. మనకి ఆ సినిమాతో ఏ మాత్రం సంబంధం వున్నా ఆ విషయం ముందే చెప్పేయాలి. చాలా బాధ్యత వుండేది. టీ.వీ. ఛానెల్ వాళ్ళూ, జర్నలిస్టులూ ఎప్పుడూ వివాదాల కోసం ఫోన్లు చేసేవారు.

భారతి గారితో నేను

‘వెల్‍కమ్ ఒబామా’ అనే సినిమాలో నేను నటించడం, నాకే ఆశ్చర్యంగా వుంటుంది! భారతి అనే ఆవిడ నాకు ఫోన్ చేసి, “సింగీతం గారో సినిమా తీస్తున్నారూ… మేం దానికి నిర్మాతలం. మా వారు భారతీకృష్ణ, నేను భారతీ… మిమ్మల్ని అడగమన్నారు” అంటే, “సింగీతం గారితో పనిచెయ్యాలా? డైలాగ్సా? స్క్రీన్ ప్లేనా? అది నా పూర్వజన్మ సుకృతం…” అని ఏదేదో మాట్లాడేస్తుంటే, “కాదండీ… మీరు నటించాలి… చాలా ముఖ్యమైన పాత్ర!” అంది. తర్వాత నా మరదలు మాణిక్యం అయింది లెండి. వాళ్ళాయన నాకు స్వంత తమ్ముడితో సమానంగా మారాడు. నేను వెంటనే “నేను నటించనండీ… మా పిల్లలు ఒప్పుకోరు” అన్నాను. మా పెద్దవాడు అమెరికాలో ఎం.ఎస్. చేస్తున్నాడూ, మా చిన్నవాడు ఇంజనీరింగ్ శ్రీనిధీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడూ అప్పుడు. “అలా కాదు… ఆయన ఒక ట్రాక్ కేవలం రచయితలతోనే అనుకుంటున్నారు… మాట్లాడండి” అని సింగీతం గారికి ఫోన్ ఇచ్చింది. ఆ మహానుభావుడి స్వరం వినే పులకించిపోయాను. ఎంతటి లెజెండ్ ఆయన? మాయాబజార్‌కి పని చేసిన ఆణిముత్యాలలో మిగిలి వున్న ఒక్కగానొక్క ముత్యం ఆయన. ఆయన పుష్పక్, ఆదిత్యా 369, అపూర్వ సహోదరులు, మయూరీ, అమెరికా అమ్మాయీ…, మైకేల్ మదన కామరాజూ, సొమ్మొకడిదీ సోకొకడిదీ… అబ్బబ్బా ఎన్నెన్ని అద్భుతాలు తీసారాయనా? ఇంకొకరు అటెంప్ట్ కూడా చెయ్యలేరు మళ్ళీ అలాంటి అద్భుతాలు. నా దృష్టిలో ఆయన ఇండియన్ స్పీల్‌బెర్గ్. స్పీల్‌బెర్గ్ కన్నా గొప్పవారు! “సో… ఏమ్మా మీ ఆయన ఒప్పుకోరా?” అన్నారు. “లేద్సార్. నేను ప్రయత్నిస్తాను… రేపు చెప్తాను” అన్నాను. పిల్లలిద్దరిలో పెద్దవాడు చాలా విముఖత చూపాడు “అది అలవాటైతే నువ్వు రెగ్యులర్ ఆర్టిస్ట్‌వి అయిపోతావేమో” అని. “లేదు… అనుభవం కోసం ఒకే ఒక్క సినిమా… అదీ మహానుభావుడు ఆయన అడిగారు” అన్నాను. మావారు ఒకే మాట అన్నారు “Do whatever you think reasonable. పిల్లలనీ, నన్నూ అడగాల్సిన అవసరం లేదు నువ్వు” అని.

నేను చాలా సందర్భాలలో చెప్పానుగా, అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. నా రీజనింగ్ మీద ఆయనకి అపరిమితమైన విశ్వాసం. నా ఏక్సెప్టన్సీ భారతికి చెప్పేసాను. డబ్బులు కూడా మాట్లాడేసుకున్నాం. మర్నాడు శ్రీనగర్ కాలనీలో సింగీతం శ్రీనివాసరావు గారు బస చేసిన హోటల్‌లో మీటింగ్.

డైరక్షన్ చేస్తూ సింగీతం గారు
రోహిణి గారితో నేను

నేను వెళ్ళేసరికి ఊర్మిళ అనే మరాఠీ అమ్మాయీ, అనంత శ్రీరామ్ వున్నారు. నేను ప్రొడ్యూసర్స్ భారతినీ, ఆమె భర్త భారతీకృష్ణనీ అతని తమ్ముడు కెమెరామెన్ సత్తిబాబునీ అప్పుడే చూడ్డం. బాలూ అనే ఇంకో తమ్ముడు మాత్రం ఈ.వి.వి. సత్యనారాయణ గారి దగ్గర అసోసియేట్‌గా పని చేసేవాడు, నాకు బాగా పరిచయం. వాళ్ళు ఎనమండుగురు అన్నదమ్ములు అనుకుంట. మా భారతి చాలా ఓర్మిమంతురాలూ, పనిమంతురాలూ. ‘అక్కా’ అంటూ నన్ను చూడగానే పిలిచాడు కృష్ణ. సుమలత గారొకసారి అన్నారు “కృష్ణ తెలివిగా అందరినీ ‘అక్కా’ అనేసి తను చిన్న వయసులోనే వుండిపోతున్నాదు” అని. శాండల్‌వుడ్ ప్రొడక్షన్ బ్యానర్‌ మీద తీస్తున్నారు ఆ సినిమా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here