గొంతు విప్పిన గువ్వ – 6

22
3

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

తెల్లబోయిన మనసు

[dropcap]అ[/dropcap]ది పాతికేళ్ళ వయసు. అప్పుడప్పుడే ఒక కర్షకునిలా సాహిత్య సేద్యం మొదలెట్టిన రోజులు. సాహిత్యంలో మునిగి తేలుతూ, ఆ పాత్రల్లో లీనమైపోతూ, వాటితో మమేకమై పోతూ, ఆ పాత్రల సృష్టికర్తల ఔన్నత్యానికి మురిసిపోతూ ఆ కథల్లో నాయకానాయికల పాత్రల్లో ఆ కథా రచయితలనే ఊహించుకుంటూ ఒక ఊహాలోకాన్ని సృష్టించుకుని మైమరిచిపోతూన్న మూమెంటది.

సాహిత్యంలో చెప్పేదీ, చేసేదీ ఒకటే అయి వుంటుందని నిజాయితీగా నమ్మిన అమాయకత్వo నాది.

అద్భుతంగా కథలల్లుతూ ఒక ట్రెండ్ సెట్టర్ అయిన ఒక గొప్ప నవలా రచయిత పారవశ్యంలో ఓలలాడుతున్న తరుణమది. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, మొత్తం ఆంధ్రకే మకుటాయమానమైన ఒక రచయితను దేవునిలా ఆరాధ్య భావంతో కొలుస్తున్న కాలమది. వివిధ విషయాల పైన అనర్గళంగా కథలల్లగలిగిన ఆ రచయిత IQకి తబ్బిబ్బయి మనో శిఖరాగ్రాన అతనిని ప్రతిష్ఠించుకున్న అపురూప వేళ అది.

సైన్స్, ఫిక్షన్, వ్యక్తిత్వ వికాసం, మనో వైజ్ఞానికం, రసభరిత ప్రేమ కావ్యం… ఒకటేమిటి అతని ప్రతీ నవలలో హీరోలో అతను కనబరిచిన గుణాలన్నీ, అత్యున్నత భావాలన్నింటినీ మొత్తంగా అతనికి ఆపాదించుకుని నా అభిమానం ఇంతింతై వటుడిoతైగా ఉధృతమై నన్ను గగన విహారం చేయిస్తున్న సమయం. ఒక నవల చదివి ఆ వెన్నెల మంచులో సాంతం తడిసి ముద్దయి, ఆ తీవ్ర భావ సాంద్రతను తాళలేక, ఇక నా అభిమానాన్ని అదుపు చేసుకోలేక, అతనిని అభినందించాలన్న నా మనసుని నియంత్రించ లేక   అతనికి కాల్ చేసి పలకరించాను.

సముద్రమంతటి విజ్ఞానం ఈ నీటి బొట్టుకిచ్చిన విలువకు ఆనందాతిశయంతో కళ్ళు వరదలై ఉప్పొంగాయి. తరుచూ పరస్పరం మాట్లాడుకోవటం మొదలయ్యింది. అతనితో మాట్లాడిన రోజున నేలపై పాదం ఆగేది కాదు. అన్ని అద్భుత నవలలు రాసిన మహా మేధావి, ఎన్నో సినిమాల కథకుడు, ఎన్నో అవార్డుల గ్రహీత అయిన అతను అతి మామూలు ఆడదాన్నయిన నాతో అలా గంటలు గంటలు ఫోనులో సాహిత్య చర్చలు….. నాకు నేనే గొప్పగా అనిపించేదానిని. గర్వంగా ఫీలయ్యేదానిని.

వన్ ఫైన్ డే, ఇలా ఫోనులో మాటాడుతూ ఎంత కాలం వెళ్ళ తీస్తారు, ఒక సారి వచ్చి కలిస్తే బాగా కనెక్ట్ అవుతామన్నాడు.

నిజానికి కనెక్ట్ అవ్వటమంటే అర్థం తెలియదు కాని నాకూ అతనిని చూడాలని మహా ఉబలాటంగా వుండేది. కాకపోతే ధైర్యం చాల లేదు.

మొత్తానికి ధైర్యం కూడతీసుకుని ఓ సాయంత్రం సాహసించాను. బంజారాహిల్స్‌లో చెప్పిన చిరునామా వెతుక్కుంటూ బితుకు బితుకుమంటూ చేరుకున్నాను.

ఆహ్వాన సూచకంగా చేయి ముందుకు సాచాడు. మునివేళ్ళతో అతని చేతిని స్పృశించి లోపలికి అడుగు పెట్టాను. చక్కటి లౌంజ్, రెండు మూడు కంప్యూటర్లు, మగ ఆడ నగ్నంగా పెనవేసుకొన్న ఆధునికంగా కనిపిస్తున్న శిల్పాలు, గోడ పైన మోడరన్ పెయింటింగ్స్, రసమయంగా సాగుతున్న మంద్రస్థాయి ఇంగ్లీషు మ్యూజిక్. ఏమిటో తెలియని ఇబ్బందిగా కదిలాను.

‘ఫీల్ ఫ్రీ అండ్ గెట్ రిలాక్స్డ్’ అంటూ అతను నా ఎదురు సోఫాలో కూర్చొన్నాడు.

‘ఏమయినా సెక్స్ పుస్తకాలు చదివారా’ అతని ప్రశ్నకి దిమ్మెర పోయాను. అతని మొట్టమొదటి సంభాషణ అలా ఊహించలేదు నేను.

‘లేదు’ తడబడుతూ బదులిచ్చాను.

‘అందులో అంత కంగారు పడాల్సిందేముంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్.. పోనీ మామూలు నవలల్లో సెక్స్ సీన్స్ చదివారా’

తల అడ్డంగా వూపాను.

‘అదేమిటి, కథలో ఆ సీన్స్ స్కిప్ చేస్తారా’ ప్రశ్నలో ఏదో కవ్వింత.

‘మధ్యలో స్కిప్ అంటూ ఎమీ చేయను. అలాంటి సెక్స్ సీన్స్ చదివిన జ్ఞాపకం లేదు’

‘రచయితలకు, కవులకు స్పందన పాళ్ళు ఎక్కువ. రసజ్ఞులైన పాఠకులూ ఏమీ తక్కువ కాదు. మీరు త్వరగా స్పందిస్తారని నాకనిపిస్తోంది. అలాంటివి చదివినప్పుడు మీ స్పందన ఎలా వుంటుందో తెలుసుకుందామని’

ఇతను నన్ను కావాలనే పరీక్షిస్తున్నాడా అని అనుమానం కలిగింది నాకు.

‘పెద్దలకు మాత్రమే’ లాంటి ఒక కామక్రీడల పుస్తకం నా చేతికిచ్చి చదవమన్నాడు.

ఇంతలో పక్క గదిలో నుండి లంగా ఓణీలో ఒక పద్దెనిమిది, ఇరవై ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయి అతని కోసం బయిటికొచ్చింది. ఆ అమ్మాయి నిద్రలో లేచి వచ్చినట్లనిపించింది.

‘ఇప్పుడే వస్తాను చదువుతూండండి’ అతను ఆ అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. పుస్తకంలో వాక్యాలు చదువుతుంటే తేళ్ళు జెర్రులు ప్రాకినట్లుంది. అసహ్యమనిపించింది. అతను మళ్ళీ బయటికి వచ్చాడు. ఆ అమ్మాయి తన వీరాభిమాని అని, అతనిపై పిచ్చితో ఏలూరు నుండి ఇల్లు వదిలి వచ్చేసిందని చెప్పాడు.

ఆ హాలులోకి ద్వారం వున్న మరో మూడు గదులు చూపించి ‘ఇవన్నీ నా అభిమానుల ఆశ్రయం కోసం. చిన్న వయసులో భావోద్రేకానికి లోనై ఇలా పారిపోయి వచ్చేవారికి కొద్ది రోజులు ఆశ్రయం ఇచ్చి, సముదాయించి, కౌన్సిలింగ్ చేసి నచ్చచెప్పి తిరిగి పంపిస్తూంటాను’ అన్నాడు.

నాకంతా అయోమయంగా అనిపించింది.

‘చదివారా, సెక్స్ కావాలని అనిపించట్లేదా’ అతనడిగాడు.

‘లేదు, జుగుప్సాకరంగా వుంది’

‘సరే, సినిమాల్లో సెక్స్ సీన్స్ చూసినప్పుడు కూడా ఒంట్లో చలనం కలగదా’

నేను మౌనంగా వుండిపోయాను.

నన్ను లేచి కంప్యూటర్ ముందు కూర్చోమన్నాడు.

నాకు దగ్గరగా వచ్చి నా తల చుట్టూ హెడ్ ఫోన్స్ బిగించాడు. ఏదో సౌండ్స్ సెట్ చేసాడు.

‘సౌండ్ ఓకే నా, ఇది విన్నాక కూడా మీలో చలనం కలగలేదంటే అప్పుడు ఇక నేను ప్రాక్టికల్‌గా ప్రయత్నించాల్సిందే’ కన్ను గీటుతూ నా బుగ్గన చిటికె వేసాడు.

ఇంతలో మరో రూమ్ నుండి అలికిడి అయ్యింది. అతను ఆ గదిలోకి వెళ్ళాడు.

నా చెవికున్న హెడ్ ఫోన్స్‌లో కేళీ వినోదంలో భావ ప్రాప్తి పరాకాష్ఠకు సంకేతంగా సన్నటి మూలుగులు, చుంబనాది శబ్దాలు, తీవ్ర భావ ప్రాప్తిలో అసంకల్పిత పంటి, గోటి గాయాల గావు కేకలు, అదుపు తప్పిన ఉచ్చ్వాసనిశ్వాసల ఆరోహణ అవరోహణల వికృత శబ్దాలు.

నాకు ముచ్చెమటలు పోసాయి. వెన్నులోనుండి వణుకు పుట్టింది. భయ కంపితురాలినయ్యాను.

ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా నా చెవికున్న హెడ్ ఫోన్స్ తీసి విసిరి పారేసి ఒక్క ఉదుటున వీధిలోకి ఉరికాను.

రైటర్ల రాతలను బట్టి వాళ్ళను అంచనా వేసి వెర్రిగా ఆరాధించటం ఎంత ప్రమాదమో, ఎందరు అమ్మాయిలు పిచ్చి ఆరాధనలో పడి పతనమై పోతున్నారో తలుచుకుoటే ఎప్పుడూ బాధే…

కొసమెరుపు ఏమిటంటే అంతా వివరంగా చెప్పాక కూడా నా స్నేహితురాలు వెళ్ళి కలవాలనుకోవటం.. అతని పైన పాఠకుల క్రేజ్ అలాంటిది మరి…

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here