[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఈ[/dropcap] లాక్‌డౌన్ పుణ్యమాని అడుగు బైటకి పెట్టలేకపోతున్నాం. ఇదివరకైతే ఎంచక్క ఎప్పుడేది కావాలంటే అప్పుడు మాకు రెండు వీధులవతలున్న మైన్ రోడ్ మీద కెళ్ళి అక్కడున్న షాపుల్లో కావల్సినవి కొనేసుకునేవాళ్లం. మిక్సీ బుష్ పోయినా, కుక్కర్ గాస్కెట్ అయినా ఇట్టే వెళ్ళి అట్టె తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడవన్నీఆన్‌లైన్‌లో కొనాల్సొస్తోంది..
అదేవిటో సరిగ్గా ఈ టైమ్ లోనే కుకర్ గాస్కెట్ పాతదయి ప్రెషర్ అంతా బైటకి పోవడం మొదలెట్టింది. ఒకరోజు అన్నం ఉడకదు, ఇంకో రోజు పప్పు ఉడకదు. కొత్త గాస్కెట్ పెడితే కాని ఇంక దానిని వాడుకుందుకు లేదు. ఈ కుక్కర్లకీ, మిక్సీలకీ ఎంతగా అలవాటు పడిపోయేనంటే ఇదివరకులా అత్తెసరు పెట్టడవే మర్చిపోయేను. అందుకే గాస్కెట్ కొనడానికి ఆన్‌లైన్‌లో సెర్చ్ మొదలుపెట్టేను.
కుక్కర్ గాస్కెట్ కోసం సెర్చ్‌లో కొడితే వేల ఖరీదులు చేసే అన్నిసైజుల కుక్కర్లూ స్క్రీన్ మీదకి వచ్చేసేయి. వేలుందని గారెలొండుకున్నట్టు గాస్కెట్ కోసం ఇప్పుడు మళ్ళీ కొత్త కుక్కర్ కొనాలా అనుకుంటూ నా సెర్చ్‌ని మరింత పెంచి షాపుల వైపెళ్ళేను.
హమ్మయ్య.. ఒకచోట గాస్కెట్లు అమ్మకానికి కనపడ్డాయి. సైజులన్నీ డయామీటర్లంటూ ఉన్నాయి. నేనసలే లెక్కల్లో వీకు. ఈ డయామీటర్లేవిటిరా దేవుడా అనుకుంటూ పాత గేస్కెట్ డయామీటర్ ఎంతుందో కొలవడానికి టేపు ఇంట్లో ఎక్కడ పెట్టేనా అని వెతకడం మొదలెట్టేను. టేపు కోసం వెతుకుతుంటే తవ్వకాల్లో అప్పుడెప్పుడో కనపడకుండా పోయిన చిన్న కత్తెర ఒకటి దొరికింది. మహా ఆనందపడిపోతూ ఇంక టేపు కోసం వెతకడం మానేసి దారాలకోసం వెతకడం మొదలెట్టేను.. అప్పుడయితే ఖచ్చితంగా టేపు దొరుకుతుందని నా నమ్మకం. అబ్బే.. నా అంచనా తప్పయింది.. అల్లప్పుడెప్పుడో కనిపించకుండా పోయిన జంధ్యాలూ, అల్లికసూదులూ దొరికేయి తప్పా ఎక్కడా టేపు పత్తాయే లేదు.
ఇంకిది పనికాదనుకుని ఒక్కసారి మా నాన్నమ్మని తల్చుకున్నాను. నేనెప్పుడూ అంతే. నాకేదైనా డౌటొస్తే మా నాన్నమ్మని తల్చుకుని, ఆవిడ మాటలు గుర్తు చేసుకుంటాను. ఒకసారి నేనూ, నాన్నమ్మ కలిసి ఒక స్టీలు గిన్నె కొందామని బజారెళ్ళేం. అక్కడ అన్నిసైజుల గిన్నెలూ ఉన్నాయి. ఏ సైజు తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాన్నమ్మ అద్భుతమైన సలహా ఇచ్చింది. “పెద్ద గిన్నే తీసుకోవే అమ్మడూ, పెద్దదైతే అందులో తక్కువైనా వండుకోవచ్చు. అదే చిన్నదైతే ఎక్కువ కావాలంటే వండుకోలేం” అంది. అదుగో.. ఆ మాట గుర్తొచ్చింది. అందుకే అన్నింటికన్న పెద్ద డయామీటరున్న గాస్కెట్ ఆర్డరిచ్చి, పేమెంట్ చెద్దామని వెడితే అక్కడ
“గాస్కెట్ ఖరీదు – 200 రూపాయిలు డెలివరీ చార్జెస్ – 600 రూపాయిలు..టోటల్ – 800 రూపాయిలు” – అని వుంది.
నా గుండె ఢామ్మంది. ఇంత దారుణమేవిటా.. అని వివరాల్లోకి వెళ్ళి చూస్తే ఆ గాస్కెటు బెంగలూరు నుండి వస్తుందిట. దాని ప్రయాణం ఖర్చులు నేనే పెట్టుకోవాలిగా మరీ.. అందుకని దాని ఖరీదు తడిసి మోపెడయిందన్నమాట.
నాకు నీరసమొచ్చేసింది. నాలుగడుగులు వేస్తే వచ్చే మైన్ రోడ్ మీద రెండు వందలకి దొరికే కుక్కర్ గాస్కెట్ ఆన్‌లైన్‌లో తెప్పించుకుందుకు ఎనిమిదివందలు కట్టాలా..హారి భగవంతుడా.. ఇంకా ఎన్నాళ్ళీ శిక్ష అనిపించింది.
ఇంకిది పని కాదనుకుని ఎలాగైనా రెండు వీధులవతల వున్న మైన్ రోడ్ మీదున్న షాప్‌కి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. కానీ బైట కెళ్ళాలంటే మాస్క్ తప్పనిసరి కదా. ఇప్పటిదాకా ఆ అవసరమే పడలేదు.
అందుకని ఆన్‌లైన్‌లో మాస్క్ కోసం చూడడం మొదలెట్టేను. అదేమిటో.. చీరల్లోకూడా అన్ని రంగులూ, డిజైన్లూ వుండవు. అన్ని రకాలు కనిపించేయక్కడ. రెండువందలనుండీ రెండువేలవరకూ వున్న వాటి ధరలు చూస్తే మతిపోయింది. అసలు నాకు కావల్సిందేమిటో మర్చిపోయి, ఆ మాస్కులు తయారుచేస్తున్నవారిలోని కళాప్రతిభను మెచ్చుకుంటూ, అలా ఒక్కొక్కటీ చూస్తూ వెళ్ళిపోయేను.
ముఖ్యంగా ఆడవారికి ఎన్ని రకాలో. మేచింగ్ మేచింగ్ అంటూ జరీ బోర్డరువీ, ఎంబ్రాయిడరీ చేసినవీ, పువ్వులూ, పళ్ళూ అప్లిక్ వర్క్ చేసినవీ, అద్దాలు కుట్టినవీ…ఇలా రకరకాలు.. ఆ మధ్య ఎవరో అంటూంటే విన్నాను… బంగారం, వెండితో కూడా మాస్కులు చేస్తున్నారని.. హూ.. ఇండియా ఎంత మెరిసిపోతోందీ అనుకుంటూ అసలు నేను దేనికి వెతుకుతున్నానా అని ఆలోచనలో పడిపోయేను..
హమ్మయ్య… గుర్తొచ్చింది. మైన్ రోడ్ మీదున్న షాపులకి వెళ్ళడానికి మాస్కులు ఆన్‌లైన్‌లో తెప్పించుకుందామని వెతుకులాట మొదలెట్టేనని. అంతలోనే నాలో ఉన్న అంతరాత్మ నన్ను ప్రశ్నించింది.. “నువ్వు ఈ మాస్కు తెప్పించుకుని, అది వేసుకుని షాప్‌కి బయల్దేరతావు సరే… అసలు ఆ షాపే తియ్యకపోతే ఏం చేస్తావూ!” అంటూ. నిజమే కదా! అంతరాత్మ అప్పుడప్పుడు నిజాలే చెపుతుంది. మరిప్పుడు గాస్కెట్ కొనడం అసంభవం అనిపించింది. కిం కర్తవ్యం అనుకుంటూ మళ్ళీ నా అంతరాత్మ ఏదైనా దారి చూపిస్తుందేమోనని దాని లోకి దూరిపోయేను..
హుర్రే.. చూపించింది..
ఈ పృథ్విలో కావల్సినవీ, అఖ్ఖర్లేనివీ, పనికొచ్చేవీ, పనికిరానివీ, పాతవీ, కొత్తవీ అన్నీ చూపించే ఒకే ఒక దర్పణం యూ ట్యూబ్. అందులోకి వెడితే బియ్యం ఏరడం దగ్గర్నుంచి, అన్నం ఎలా వండాలో వరకూ మొత్తం వీడియోలు వచ్చేస్తాయి. కానీ ఒకసారి అందులో అడుగు పెట్టామా.. అది పద్మవ్యూహమే..మరింక దానిలోంచి బైటికి రాలేం. ధైర్యం చేసి, నాకేం కావాలో బాగా మనసులో పెట్టుకుని అందులో ప్రవేశించేను.
పాత గాస్కెట్‌ని కొత్తగా మార్చడమెలా అని వెతుకులాట మొదలెట్టేను. నా అదృష్టం.. బ్రహ్మాండమైన ఉపాయం కనిపించింది. అదేదో సినిమాలో గడ్డం చక్రవర్తి ఒక విదేశీయుడికి పెరుగు ఎలా తోడు పెట్టాలో చెపుతూ, “స్లీప్ నైట్… మార్నింగ్ టైట్ అంటాడు”.. అలాగ పాత గాస్కెట్‌ని రాత్రి ఫ్రీజర్‌లో పెడితే, పొద్దున్నకల్లా అది గట్టిపడి, మళ్ళీ వాడుకుందుకు పనికొస్తుందని కనిపించింది. నాకెంత ఆనంద మనిపించిందో! ఇంత చిన్న విషయం ఇన్నాళ్ళు తెలీనందుకు విచారిస్తూ, వెంటనే పాత గాస్కెట్‌ని ఫ్రీజర్‌లో పెట్టేసేను.
చూడాలి.. రేపు అన్నం, పప్పూ ఉడుకుతాయో…లేదో!