ఆత్మహత్యను అర్థం చేసుకునే ప్రయత్నం – ది సూసైడ్ ఇండెక్స్

0
3

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]అ[/dropcap]రవై ఒక్క సంవత్సరాల ఒక వ్యక్తి ఒక రోజు ప్రొద్దున్నే నిద్రలేచి, గడ్డం గీసుకుని, ఆప్టర్ షేవ్ లోషన్ పట్టించి, ఉద్యోగానికి వెళ్ళడానికి అనువైన ఇస్తీ బట్టలు వేసుకుని, ఆ రోజు పేపర్ తీసుకొచ్చి మడిచి డైనింగ్ టేబుల్ పై పెట్టి, భార్య కోసం కాఫీ కాచి అది తీసుకుని వెళ్ళి నిద్రపోతున్న భార్య పక్కన పెట్టి ఆమెను ఓ రెండు నిముషాలు పాటు చూసి ఆ గదిలోనే అలమారలో తాను దాచుకున్న చిన్న రివాల్వర్ తీసుకుని తరువాత పక్కన ఉన్న తన స్టడీ రూమ్ లోని వెళ్ళి కుర్చీలో కూర్చును కాల్చుకుని చనిపోతాడు. ఈ ప్రపంచంలో చాలా ఆత్మహత్యలు ఇలాగే జరుగుతున్నాయి. తరువాత మనం మనల్నీ ఎన్నో రకాలుగా ప్రశ్నించుకుంటాం. ఏం జరిగి ఉండవచ్చు? ఆ వ్యక్తి చనిపోయే ముందు ఏం ఆలోచించుకుని ఉండవచ్చు అని. జోయాన్ వికర్షామ్ ఆత్మహత్య చేసుకున్న తన తండ్రి గురించి ఈ పుస్తకంలో రాస్తూ ఆ రోజు ఏం జరిగిందో చెప్తూ రాసిన వివరం అది. తన తండ్రి మరణానికి కారణాలు వెతుక్కుంటూ ఆమె రాసిన పుస్తకం ఇది. తన తండ్రి గురించి తనకు అన్నీ తెలుసు అనుకుంటున్న జోయాన్ తండ్రి మరణం తరువాత అసలు తనకు నిజంగా తన తండ్రి గురించి ఎంత తెలుసో అర్థం చేసుకోవడానికి రాసిన జ్ఞాపిక ఈ పుస్తకం. 2008లో రాసిన ఈ ఆత్మకథ ఆత్మహత్యలను అర్థం చేసుకోవడానికి కుటుంబంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతనితో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ సంఘటన ఎలా ప్రభావితం చేస్తుందో వారి జీవితాలు ఎలా ఆ దుఖంతో, అపరాధబావంతో కృశించిపోతాయో చెప్పే గొప్ప పుస్తకం ఇది. ఆత్మహత్యలను అన్నీ కోణాలనుంచి అధ్యయనం చేయడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప పుస్తకం “The Suicide Index”.

ఆత్మహత్య చాలా మంది అనుకున్నట్లుగా అందరూ ఆవేశంగా తీసుకునే నిర్ణయం కాదు. వారి చివరి క్షణాలు మాత్రమే వారిని ఆ చర్యకు పురిగొల్పవు. కొన్ని సంవత్సరాలుగా పేరుకున్న వారి జీవితానుభవాలు, వారి దుఃఖం, వారి అభద్రతాభావం, వారి ఆత్మన్యూనతా భావం, ఇలాంటివెన్నో కలిసి ఒక మనిషిని చివరకు ఆ చర్యకు పురిగొల్పుతాయి. అయితే వారు తమ మనసులోని ఈ దుఃఖాన్ని ఇతరులముందు ఎదో ఒక కోణంలో ప్రదర్శిస్తారు. కాని చుట్టూ ఉన్న వారు వారి ఈ చిహ్నాలను గుర్తుపట్టరు. ఒక విధంగా ఒక వ్యక్తిలో అప్పుడొకటి అప్పుడొకటిగా ఎగిసిపడే నిరాశావాద ఆలోచనలను గ్రహించి వారితో చర్చించాలని మనం అస్సలు అనుకోం. చాలా సార్లు చూసి చూడనట్టు వాటిని వదిలేస్తాం. వారి జీవితాలలో ఈ అసహజ మరణానికి పునాది ఎప్పుడో పడిపోతుంది. అది కొద్ది కొద్దిగా పెద్దదయి వారి జీవితంలో పరిస్థితులలో పెద్దగా మార్పు రానప్పుడు ఒక్కసారిగా బద్దలవుతుంది. అప్పుడు అశ్చర్యంగా “అరే అలా ఎందుకు చెసారు” అని ప్రశ్నించుకుంటాం.

జోయాన్ తండ్రి పిస్టల్‌తో పేల్చుకున్నాక మొదట అతని భార్య అతన్ని చూస్తుంది. అతని ఇద్దరు కూతుర్లకు ఈ కబురు తెలిసి వారు వచ్చేసరికి పోలీసులు శవాన్ని పరీక్షకు తీసుకువెళతారు. అతని అల్లుడు అంటే జోయాన్ భర్త ఆ గది శుభ్రం చేస్తాడు. అయితే అతని గుండె పై రక్తం చూసి అతను గుండెపై కాల్చుకుని ఉంటాడు అని అతని భార్య అనుకుంటుంది. గుండె పై గాయం చేసుకుంటే రక్తం తక్కువగా వస్తుంది కాబట్టి జోయాన్ తండ్రి భార్యను భయపెట్టడం ఇష్టంలేక అలా చనిపోయి వుంటాడు అని భావిస్తారు. కాని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో అతను నోటీలో కాల్చుకున్నాడని. అలా అతని మెదడు చిద్రం చేసుకోదలచాడని కాని పిస్టల్‌లో ఏదో సాంకేతిక లోపం కారణంగా అది సరిగ్గా పేలనందువలన బులెట్ అతని తలలో ఉండిపోయిందని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యులను భయపెట్టకూడదనే ఆలోచన అతనిలో ఏం లేదని అతి భయానకమైన మరణాన్ని అతను కోరుకున్నాడని తెలిసి చీమకు కూడా అపకారం చేయలేని సున్నిత మనస్కుడైన తన తండ్రి ఇంత కర్కశంగా ఎలా చనిపోవాలనుకున్నాడని జోయాన్ ఆలోచిస్తుంది. ఈ సంగతి విని అతని భార్య మాత్రం ఈ పని కూడా సరిగ్గా చేయలేకపోయిన తన భర్తపై జాలిపడుతుంది. ఈ వార్త తెలిసిన తరువాత జోయాన్ దాన్ని మామూలుగా స్వీకరిస్తుంది. గొప్ప బాధ దుఃఖం ఆమెలో కలగవు. మనసంతా మొద్దుబారిపోతుంది. కాని అన్నీ కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఐదు నెలలు దాటాక తనకు సైక్రియాటిస్ట్‌ని కలవవలసిన అవసరం పడుతుంది. అప్పుడు అర్థం అవుతుంది ఈ సంఘటన తనను ఎంతగా కుదిపివేసిందో. దుఃఖానికి అతీతమైన స్థితి ఎంత భయంకరమో. తండ్రి చనిపోయిన తొమ్మిది సంవత్సరాల తరువాత కూడా సైక్రియాటిస్ట్ వద్దకు వెల్తూ అతనితో మాట్లాడుతూ ఈ సంఘటన తన జీవితాన్ని మార్చి వేసిన విధానం గురించి ఆలోచిస్తుంది. తండ్రి మరణాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఆమెకు తండ్రి గురించి పెద్దగా తెలియని విషయాలంటూ ఏమీ లేవు. కాని వాటి ద్వారా తండ్రి మరణాన్నిఅర్థం చేసుకునే క్రమంలో ఈ ఆత్మహత్య వెనుక కేవలం ఒక కారణం అంటూ లేదని తండ్రీ సంపూర్ణ జీవితం ఈ చర్యకు ప్రేరేపించిందని, తన జీవితంలోని అపశ్రుతులతో తండ్రి సతమతమవుతున్నప్పుడు మౌనంగా ఉన్న అందరూ ఈ చర్యకు కారణం అవుతారని అర్థం చేసుకుని భయంకరమైన అపరాధ భావంతో ముడుచుకుపోతుంది.

జోయాన్ తండ్రి జర్మనీలో ఇద్దరు నటులకు పుట్టిన పెద్ద కుమారుడు. తల్లి తండ్రి ఇద్దరి మధ్య సయోధ్య ఉండని కారణంగా తండ్రి తన కోపాన్ని జోయాన్ తండ్రిపై చూపిస్తూ ఉంటాడు. తల్లికి కూడా తన పెద్ద కొడుకు కంటే చిన్నవాడిపైనే ఎక్కువ ప్రేమ. ఇది ఆమె దాచాలనికూడా ప్రయత్నించదు. జోయాన్ తండ్రి అసలు పేరు బోరిస్. కాని తల్లితో అమెరికా వచ్చేసాక కొత్త జీవితం వెతుక్కుంటూ అతను తన పేరుని పాల్‌గా మార్చుకుంటాడు. కాని అతని జీవితంలో అప్పుడు కూడా ఓటములే ఎక్కువ. పెళ్ళి చేసుకున్నాక అతని భార్యతో కొన్నాళ్ళు సుఖంగా గడిచిందనుకున్నాడొ లేదు ఆర్థికపరమైన కష్టాలు కమ్ముకుంటాయి. ప్రతిసారి కొత్త బిజినెస్ పెట్టడం అది మూసివేయడం. ఇదే పద్దతి అతని చివరి వరకు జరుగుతూ వచ్చింది. భార్యకు తనకు కావల్సిన ఆడంబర జీవితం ఇవ్వలేని భర్త పట్ల కొంత నిరసన భావం ఉంటుంది. ఆమె భర్త మిత్రుడు అయిన టేడ్‌తో సమయం గడపడానికి ఇష్టపడుతుంది. ఆమెకు టేడ్‌తో శారీరిక సంబంధం ఉండదు. కాని ప్రతి వ్యాపారంలో గెలుపు సాధిస్తూ డబ్బు సంపాదించే టేడ్ అంటే ఆమెకు ఇష్టం. ఈ ఇష్టం చూసి ఆమె భర్త లోలోపల ఆత్మన్యూనతా భావంతో కొట్టూకుపోతూ ఉంటాడు. అతనిమనసులో బాధ, ఒంటరితనం తెలిసినా టేడ్, పాల్ భార్య తమ స్నేహాన్ని మానుకోవాలనుకోరు.

ఇక పాల్ చుట్టూ ఉన్న మిత్రులు తమ ఆడంబరాలతో, మాటలతో ప్రతి నిముషం అతని ఓటములను గుర్తుకు తీసుకువస్తూ ఉంటారు. మనుష్యుల మధ్య గడపడానికి అతను ఇష్టపడక ఆత్మన్యూనతా భావంతో రగిలిపోతూ ఉంటాడు. పిల్లలకు, భార్యకు తన ఆర్థికపరమైన కష్టాలు తెలీయకుండా నటించడం అతని జీవితంలో మరో ప్రత్యామ్నాయం అవుతుంది. దీని కారణంగా కూడా విపరీతమైన ఒత్తిడికి గురిఅవుతూ ఉంటాడు. మనసు విప్పి చెప్పుకునే స్నేహితులు లేరు. అంతే కాకుండా అతని శారీరిక నిర్మాణం కూడా అతి మామూలుగా ఉంటుంది. బలహీనుడు కూడా అందువల్ల తరుచుగా అన్ని రకాల జబ్బులతో బాధపడుతూ ఉంటాడు. ఇవి ప్రాణాంతకమైన జబ్బులు కావు కాని అతన్ని క్రమంగా శక్తిహీనుడిగా చేస్తాయి. వీటన్నిటి మధ్య అతను అలసిపోయి తన జీవితాన్ని ముగించుకుంటాడు. అతని జీవితంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూట్టూ ఉన్న వ్యక్తుల స్పందన అంత ఆశాజనకంగా ఉండదు. అతనికి ప్రేమను నమ్మకాన్ని అందించాలని ఎవ్వరికీ అనిపించదు. అది అవసరం అని కూడా కుటుంబ సభ్యులు కాని స్నేహితులు కాని అనుకోరు. అతని జీవితం ఇలాగే ముగుస్తుందని వారికి తెలిసినా పట్టించుకోవలసిన అవసరం వారికి కలిగి ఉండలేదా అన్నది అతని మరణం తరువాత ప్రతి ఒక్కరు వేసుకుంటున్న ప్రశ్న.

తమ తప్పిదాలను గుర్తించిన తరువాత మామూలుగా జీవించడం జోయాన్‌కు కష్టమవుతుంది. ఎవరు బాధ్యులో ఎంతవరకో అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటూంది. తన కొడుకుని తన తండ్రి మరణాన్ని గురించి ఎలా చెప్పాలి, ఒక ఆత్మహత్య తమ కుటుంబంలో జరిగిందని ఎలా అంగీకరించి తరువాతి తరానికి ఈ విషయం వివరించాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. జోయాన్ తల్లి, భర్త మరణం తరువాత మరో పదిహేనేళ్ళు జీవించే ఉంటుంది. భర్త ఉన్న ఇల్లు అమ్మాలంటే ఆ ఇంట్ళో ఆత్మహత్య జరిగిందని తెలిసి ఎవరూ కొనడానికి ముందుకు రారు. భర్త మీద ప్రేమ కన్నా ఆ తరువాత తమ జీవితంలో రేగిన అలజడి కారణంగా అతను నన్ను ఇలా శిక్షించాడు అంటూ తన తప్పిదాలను భర్త విధించిన జీవితఖైదు తన జీవితం అంటూ బాధపడుతూ ఉంటుంది. తమ గురించి తెలిసిన వారందరికీ దూరం జరుగుతుంది ఆ కుటుంబం. అలా ఎందరో బాల్య స్నేహితులు దూరం అవుతారు. పాల్ మొదటి నుండి ఆత్మహత్య అతి హేయమైన మరణంగా పిల్లలకు చెప్పేవాడు. అసలు అది మంచి పని కాదని దాన్నిఖండించేవాడు. అతని మాటలు నమ్మిన అతని పిల్లలు తమ తండ్రి ఆ మార్గాన్ని అనుసరిస్తాడని ఎప్పుడు అనుకోలేదు. అది జరిగాక తండ్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలీయక జీవితాంతం వ్యథను అనుభవిస్తారు.

తండ్రి మరణం తరువాత ఆత్మహత్య గురించి సైంటిఫిక్‌ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది జోయాన్. తమ కుటుంబాలలో ఆత్మహత్యలు జరిగిన ఎందరినో కలుసుకుటుంది. తామందరి జీవితాలలో వచ్చిన ఒక నిశ్శబ్దత, నిర్వేదం ఒక్కటే అని అర్థం చేసుకుంటుంది. ఆత్మహత్యను సహజ మరణమని భ్రమించజేయాలని సంవత్సరాలుగా ప్రయత్నించే కుటుంబాలను చూస్తుంది. తమ కుటుంబంలోని ఆత్మహత్య పట్ల తమ బాధ్యత గురించి ఆలోచించే బాధ నుండి తప్పించుకోవడానికి అసహజంగా సంవత్సరాల కొలది జీవిస్తున్న వ్యక్తులను చూస్తుంది. మాట్లాడుతుంది. తమ కుటుంబంలోని ఈ మరణాలు వారిని ఎలా బ్రతికి ఉన్న శవాలుగా మార్చాయో చూసి వణికిపోతుంది.

ప్రపంచంలో ప్రతి ఆత్మహత్య వెనుక ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతికే ప్రయత్నం ఈ ఆత్మకథలో జరుగుతుంది. ఒక మనిషి పైకి ప్రదర్శించే ధైర్యం మాటున కొన్ని రహస్యాలుంటాయని వాటిని అర్థం చేసుకోవడం కష్టమని, ప్రతి ఆత్మహత్య కేవలం ఒక సంఘటనతో ముడిపడి ఉండదని, అతని జీవితంలో ఎక్కడో బాలెన్స్ తప్పి ఉంటాడని అది కనుక్కోలేక విషయాన్ని అక్కడితో వదిలేస్తే అది ఒక మానసిక రుగ్మతగానో ఆలోచన గానో ఆ మనిషి మనసుని మెదడుని ఆక్రమించుకుని చివరకు అతన్ని ఈ బలవంతపు మరణానికి ప్రేరేపిస్తుందని, ప్రతి ఆత్మహత్య ఆ వ్యక్తి తన చూట్టూ ఉన్న వారిని వేసే ప్రశ్న అని ప్రతి ఒక్కరికి దాని పట్ల బాధ్యత ఉంటుందనే నగ్న సత్యాలను చెప్పే ఆత్మకథ ఇది. దైర్యాన్ని ప్రదర్శించే వ్యక్తులు ఆత్మహత్య చేసుకోరని భ్రమించడం తప్పని కూడా అర్థం అవుతుంది ఈ పుస్తకం చదివితే.

అన్నిటికన్నా ఒక కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే ఆ కుటుంబ సభ్యుల జీవితాలు ఒక తెలీని దుఃఖంతో జీవితాంతం నలిగిపోతాయని అది ఆ కుటుంబం ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ అని జోయాన్ జీవితం చెబుతుంది. ఒక తరంలో ఆత్మహత్య జరిగితే అది మరో తరంలో మరోసారి జరిగే అవకాశాన్ని ఎందుకు పెంచుతుందో అర్థం అవుతుంది ఈ పుస్తకం పూర్తిగా చదివితే. ఆత్మహత్య కేవలం మరణం కాదు. ఒక వ్యక్తి భయంకర ఒంటరితనానికి నిదర్శనం. అది సమాజం పట్ల ఆ వ్యక్తి చేసే ఆరోపణ. తనను ఒంటరివాడిని చేసారని తనను వారి మధ్యలో ఉంచుకోలేకపోయారని వారిపై అతను వేసే అభియోగం. ఈ ఆత్మహత్య అనే నేరంలో దోషం మనందరిదా లేదా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి ఒక్కనిదా అన్నది ఎప్పటికీ తేలని ప్రశ్న.

ఒక్క అమెరికా దేశంలోనే ప్రతి సంవత్సరానికి సుమారు 30,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన దేశంలో ఈ సంఖ్య ఐదింతలు ఎక్కువ. అయితే సుమారు పది రెట్లు ఎక్కువ మంది ఆ ఆత్మహత్యల కారణంగా మానసికంగా దెబ్బతిని జీవిస్తున్నవారు. వీరి జీవితాలు మామూలుగా సాగవు. ఎప్పుడో అప్పుడు అవి పేలిపోయే డైనమెట్లే. అంటే ఆత్మహత్యలు సమాజ ఆరోగ్యంపై చూపే ప్రభావం తెలుసుకుంటే మనం ఎలాంటి జీవితాలు గడుపుతున్నామో అర్థం అవుతుంది. మనిషి పట్ల మనిషికి దూరం పెరుగుతూ, మానవ సంబంధాలన్నీ ఆర్థిక లేక అవసరాలతో ముడిపడి ఉన్న ఈ సొఫిస్టికేటెడ్ నాగరికత వెనుక మనిషి సంతోషంగా మాత్రం లేడు. ఉండడు. ఈ సంఖ్య వచ్చే దశాబ్దంలో మూడింతలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఎంతమంది మానసికంగా చచ్చి జీవచ్ఛవాలుగా జీవించవలసి వస్తుందో అర్థం చేసుకుంటే వీటిని వ్యక్తిగతమైన సమస్యలుగా కాక సామాజిక సమస్యగా పరిగణించవలసిన అవసరం కనిపిస్తుంది. ఆ ఆలోచన కలిగించే పుస్తకం ఇది. కొన్ని నిజాలు తట్టుకోవడం కష్టం, కాని కొన్ని మరణాలను ఆపడానికి, కొందరి జీవితాలను ప్రభావితం చేయడానికి ఇటువంటి సాహిత్యం అవసరం చాలా ఉంది. ఈ పుస్తకం మనుష్యుల జీవితాలను, మరణాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన బాధ్యతను స్పష్టపరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here