[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
రాజంపేటలో ప్రధాని:
1977లో ఎన్నికల ప్రచారానికి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కడప జిల్లాలోని రాజంపేటకు వచ్చారు. అక్కడ కాంగ్రెసు అభర్థిగా పి. పార్థసారథి 1967, 1971లో గెలుపొందారు. 1970-71 మధ్య పార్లమెంటరీ వ్యవహారాల ఉప మంత్రిగా, కొత్త రఘురామయ్య క్యాబినెట్ మంత్రిగా ఇందిర కొలువులో ఉన్నారు. 1977లో పార్థసారథి మూడో దఫా రాజంపేట నుంచి నిలుచున్నారు. ఇందిరాగాంధీ ప్రచార సభకు వచ్చారు. ప్రధాని కాబట్టి ఆకాశవాణి కడప కేంద్రం పక్షాన రికార్డింగుకు నేను పరివారంతో వెళ్ళాను. సభ కాగానే ప్రసంగం కాపీ ఒకటి ఇందిరాగాంధీ ప్రెస్ సెక్రటరీ శారదా ప్రసాద్ కివ్వాలి. కానీ, ఆ రక్షణ కవచంలో దూరడం కష్టం – ముందుగా శారదా ప్రసాద్ నా దగ్గరకు వచ్చినప్పుడు టేప్ ముట్టినట్టు రసీదుపై ఆయన సంతకం తీసుకొన్నాను. చివరలో ఆయనే హడావిడిగా మా వద్దకు వచ్చి టేప్ తీసుకెళ్ళారు.
మా అమ్మాయి పెళ్ళి పనులకు అంతరాయం కలిగించిన రాజీవ్ గాంధీ:
1987లో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 22న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ప్రకాశం 116వ జయంతి సభ జరిపాం. ఆ సభలో ప్రధాని రాజీవ్ గాంధీ ముఖ్య అతిథి. సంస్థ పక్షాన రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సందేశాన్ని నేను సభలో చదివాను. ప్రకాశం విగ్రహం ఢిల్లీలో నెలకొల్పే అంశాన్ని రాజీవ్ గాంధీ హర్షామోదాలతో అంగీకరించారు. 88లో రెడ్ ఫోర్ట్ మీద నుంచి రాజీవ్ గాంధీ ప్రసంగం వీక్షించాము. 1991 మే 24న అనంతపురంలో మా అమ్మాయి శైలజ వివాహం నిశ్చయించాము. మే 21న రాజీవ్ గాంధీ ఎన్నికల సభలో శ్రీ పెరంబుదూరులో హత్య కావించబడ్డారు. దేశమంతా గందరగోళ పరిస్థితి. అనంతపురంలో 22 నుంచి కర్ఫ్యూ. మేముంటున్న ఆఫీసు క్వార్టర్స్ విశాల ప్రాంగణంలో పెద్ద పందిరి వేయించాము. ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. లోగడ ఆ అంశం నేను ప్రస్తావించాను. శుభప్రదంగా పెళ్ళి జరిగింది.
ప్రమాణ స్వీకారానికి గంట ఆలస్యంగా వెళ్ళిన ప్రధాని:
అది 1989 డిసెంబరు 2. సెలవు దినం. నేను ఢిల్లీలో పని చేస్తున్నాను. ఎన్నికలు పూర్తి అయి కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం రోజు. జాతీయ ఫ్రంట్ అధ్యక్షులు ఎన్.టి.రామారావు ఢిల్లీ ఏ.పి. భవన్‌లో చర్చలు జరుపుతున్నారు. ఆయన ఉపప్రధాని అవుతారని ప్రచారం జరిగింది. ఏ.పి. భవన్‌కు ఫర్లాంగు దూరంలో అశోకా రోడ్డు బంగళాలో విశ్వనాథ ప్రతాప్ సింగ్ వున్నారు.
ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‍కి వి.పి.సింగ్ బయలుదేరాలి. వివిధ పార్టీల నాయకులు వి.పి.సింగ్ తోనూ, రామారావుతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. తమాషాగా నేను సింగ్ ప్రాంగణంలో మిత్రులతో కలిసి గుమికూడాను. పక్క గదిలో పి. ఉపేంద్ర చర్చిస్తున్నారు. ప్రమాణ స్వీకారం కొద్దిగా వాయిదా వేయించారు రాష్ట్రపతి వెంకట్రామన్. ఉపప్రధాని విషయంలో గడ్డు సమస్య ఏర్పడింది. దేవీలాల్ ఉపప్రధానిగా, ఉపేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా నిర్ణయించారు. రామారావు ఆ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. వి.పి.సింగ్ బయటకు వచ్చారు. ఊరేగింపుగా ఒకమైలు దూరం నడిచి వెళ్ళి కారు ఎక్కారు. నాటకీయ పరిణామ మది.
సంగీతం టేపులు కావాలని కోరిన ప్రధాని:
పి.వి. నరసింహారావు సాహిత్యం పైనే గాక, సంగీతం పైన మక్కువ చూపేవారు. ఆయన వద్ద 20 ఏళ్ళు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన షిండేకర్, నేను ఢిల్లీ స్టేషన్‌లో ఉండగా ఒక రోజు ఫోన్ చేశారు. “పి.వి.గారు మాట్లాడతార”ని ఫోన్ కలిపారు. ఆకాశవాణిలో కొత్తగా రిలీజయిన కర్నాటక సంగీతం ఆడియో టేపులు కావాలని సూచన చేశారు.
ఆకాశవాణి ఆర్కైవ్స్‌లో పని చేస్తున్న గోపాలకృష్ణ, నేను పది ఆడియో సిడిలు తీసుకుని పి.వి.గారిని మోతీలాల్ నెహ్రూ మార్గంలోని వారి బంగాళాలో కలిసి అందించాము.
1984 ఎన్నికల ప్రసంగాలలో భాగంగా కాంగ్రెస్ పక్షాన పి.వి.గారి ప్రసంగాన్ని (అప్పుడాయన కేంద్ర మంత్రి) హైదరాబాదు కేంద్రంలో రికార్డు చేశాం. మరునాడు రాత్రికి ఢిల్లీ నుండి ప్రసారం కావాలి. రెండు కాపీలు తయారు చేసి రాజ్‌భవన్‌లో బస చేస్తున్న పి.వి. చేతికి నేనే స్వయంగా ఇచ్చి వచ్చాను. ఆ విషయం గుర్తు చేస్తే తలాడించారు.
విశ్రాంత జీవనం గడుపుతున్న సమయంలో 1998-2000 మధ్య రెండు, మూడు పర్యాయాలు వారి ఆహ్వానం మేరకు వారి బంగళాలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ లోని పలువురు సాహితీవేత్తల గూర్చి ప్రస్తావించేవారు. ఢిల్లీ సిరిఫోర్డ్ ఆడిటోరియంలో పండిట్ జస్‌రాజ్ హిందూస్థానీ సంగీత సభకు వారిని ఆహ్వానించాను. ఆయన ఎంగేజ్‌మెంట్‌లో వ్రాయించారు. చివరి నిముషంలో సెక్యూరిటీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు.
పి.వి. నంద్యాలకు ప్రధానిగా పలుమార్లు విచ్చేశారు. కడప కేంద్ర డైరక్టరుగా (1993-95) అన్ని సభలకు నేను హాజరయ్యాను. ఆ నియోజక వర్గాభివృద్ధి కోసం ఆయన ఎన్నో పథకాలు అమలుచేశారు.
ప్రధాని ‘టైర్’ పంక్చర్:
ప్రధానిగా నంద్యాల పర్యటనకు వచ్చారు పి.వి. అప్పుడు రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్‌గా ఆర్. ప్రభాకర రావు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ రోజు నంద్యాలలో బహిరంగ సభ కాగానే రోడ్డు మార్గంలో బనగాని పల్లె బయలుదేరారు. దారిలో చేడేశ్వరీ దేవి ఆలయం ఉంది. “ఆమె మీ కులదేవత. రెండు నిముషాలు ఆగి దర్శనం చేసుకొంటారా? సార్!” అని ప్రభాకరరావు సూచించారు. సెక్యూరిటీ వారు కుదరదన్నారు.
ప్రధాని కాన్వాయ్ వేగంగా వెళుతోంది బనగానిపల్లె వైపు. హఠాత్తుగా కారు డ్రైవర్ స్లో చేసి – “టైరు పంక్చర్ అయింది సార్! తమరు వెనుక కార్లో…” అన్నాడు భయం భయంగా.
వంద గజాల దూరంలో చౌడేశ్వరీ మాత గుడి. పూర్ణకుంభ స్వాగతం ఇచ్చారు అర్చకులు హడావిడిగా ఎదురేగి. ‘ఈ విషయం అనూహ్య సంఘటన’ అన్నారు ప్రభాకరరావు ఒక రోజు నాతో రవీంద్రభారతిలో.
ముందే యింటికెళ్ళిన ప్రధాని ఫోటోగ్రాఫర్:
అది 1992 నవంబరు 8వ తేదీ.
ఢిల్లీ అశోకారోడ్డులో ఏ.పి.భవన్ ముంగిట ప్రకాశం గారి కాంస్య విగ్రహాన్ని ప్రధాని పి.వి. ఉదయం ఆవిష్కరించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ సభ్యుడిగా నేను అనంతపురం నుండి వెళ్ళాను. పి.వి. గారు సభలో ప్రకాశం ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పి.వి.తో కలసి పని చేసిన మండలి వెంకట కృష్ణారవు, లుకలాపు లక్ష్మణదాసులు వచ్చారు.
సభానంతరం పి.వి.కి వీడ్కోలు చెబుతూ, మండలి కృష్ణారావు – “సాయంకాలం మీతో మేమందరం మీ బంగళాలో కలుస్తాం, అనుమతిస్తే” అన్నారు.
“సాయంత్రం 5 గంటలకు అందరూ రండి!” అన్నారు పి.వి.
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అధ్యక్షులు యం. రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి టంగుటూరి సూర్యనారాయణలతో సహా ఇరవై మందిమి 7, రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధాని నివాసం చేరుకొన్నాం. పి.వి. దాదాపు గంటకు పైగా పాత ముచ్చట్లు చర్చించారు తన పాత మంత్రివర్గ సహచరులతో.
“శ్రీశైలం రండి!” అన్నారొకరు.
“పని ఒత్తిడులున్నాయి. నాకూ రావాలనే వుంది” అన్నారు పి.వి.
చివరలో “ఒక ఫోటో తీసుకొందాం” అన్నారు లక్ష్మణదాసు.
ఫోటోగ్రాఫర్ కోసం కబురు పంపారు.
ఆఫీసు టైం పూర్తి అయిందని కాబోలు, ‘మీటింగ్ ఫోటోలు’ తీసేసి, ఫోటోగ్రాఫరు వెళ్ళిపోయాడు.
ఎన్నికల ప్రసంగాలకు వచ్చిన మాజీ ప్రధానులు:
నేను ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‌గా 1997-2000 మధ్య మూడేళ్ళు పని చేశాను. అనుకోకుండా రెండు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దూరదర్శన్, ఆకాశవాణిలలో జాతీయ స్థాయిలో అన్ని జాతీయ పార్టీలకి ప్రసంగాలు రెండు సార్లు చేసే అవకాశం ఇచ్చారు. నెల రోజుల పాటు ఆ ప్రసంగాల రికార్డింగుల బ్రహ్మోత్సవాలు నిర్వహించాము.
ఆయా జాతీయ పార్టీల పక్షాన పలువురు ప్రముఖులు వచ్చారు. నేను ఢిల్లీ చేరేనాటికి ఐ.కె. గుజ్రాల్ ప్రధాని (1997 ఏప్రిల్ నుండి 1998 మార్చి వరకు). ఎన్నికల ప్రసంగానికి గుజ్రాల్, మరో ప్రధాని దేవేగౌడలు మా స్టూడియోకి వచ్చారు.
భాజపా పక్షాన యల్.కె. అద్వానీ, కాంగ్రెస్ పక్షాన జయరాం రమేష్ సమన్వయ పరిచిన ప్రముఖులు. కమ్యూనిస్టు పార్టీల పక్షాన సీతారాం ఏచూరి, డి. రాజాలు కోలాహలంగా వచ్చారు. వారినందరినీ ఆహ్వానించి, సాదరంగా పలకరించడం నా డ్యూటీ. 1999 సెప్టెంబరు 5 నుండి అక్టోబరు 3 వరకు ఎన్నికలు జరిగాయి.
అంతకుముందు 1998 ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సాధారణ ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికల ప్రసంగాలు ఏ పార్టీవారు నొచ్చుకోకుండా పూర్తి చేశాను.
సాహితీవేత్త ప్రధాని ఆవిష్కరించిన గ్రంథం:
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్రాసిన గ్రంథాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సి. నారాయణరెడ్డి, జయప్రదలు పార్లమెంటు సభ్యులుగా సభలో పాల్గొన్నారు. ఆహ్వానం అందుకొన్న నేను సభకు హాజరయ్యాను. సభానంతరం తేనేటి విందులో ప్రధాని అందరినీ కలిశారు.
మూడేళ్ళ ఢిల్లీ డైరక్టరు పాలనలో ప్రధానిగా వాజ్‌పేయి బంగళాలో పలు సందర్భాలలో సందేశాలు రికార్డు చేశాము.
ప్రధానికి సమాచార సలహాదారుగా సుధీంద్ర కులకర్ణి వుండేవారు. ఆయన సమన్వయంతో రికార్డింగులు సవ్యంగా జరిగాయి. కృష్ణాపత్రిక ఉత్సవాలలో పిరాట్ల వెంకటేశ్వర్లుతో కలిసి వాజ్‌పేయి పాల్గొన్న సభలో పాల్గొన్నాను. రేస్ కోర్స్ రోడ్డు రక్షణ వలయాన్ని దాటుకుని వెళ్ళడానికి అధికారికంగా అరగంట పట్టేది. ఆ విధంగా పలు సందర్భాలలో ఆ బంగళా ప్రాంగణంలో ప్రవేశించే అవకాశాలు లభించాయి. యం.ఆర్.రెడ్డి అనే ఐపిఎస్ అధికారి ప్రధాని రక్షణ విభాగాధికారిగా వుండేవారు. ఆకాశవాణి ఉద్యోగం వల్ల ఈ అవకాశాలు లభించాయి తప్ప నా ఘనత కాదు సుమా!