అలనాటి అపురూపాలు-30

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తన కాలం కంటే చాలా ముందున్న నటి నాదిరా:

కొంతమంది నటీనటులు, కళాకారులు తమదైన అద్వితీయమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటారు. తమ సమకాలికుల కంటే మెరుగ్గా రాణిస్తూ, ఆ కాలంలో ఉండాల్సినవారు కాదు అని అనిపించుకుంటారు. అలాంటివారిలో అలనాటి నటి నాదిరా ఒకరు.

బాలీవుడ్ అందించిన అత్యంత చురుకైన, కొంటె అందగత్తెలలో ఒకరిగా ఫ్లోరెన్స్ ఎజేకియేల్ నాదిరా (5 డిసెంబరు 1932 – 9 ఫిబ్రవరి 2006) నిలుస్తారు. ‘ఆన్’లో హుందాతనంతో కూడిన చురుకుదనం, ‘శ్రీ420’లో సాహసోపేత, వలసించెడి ప్రదర్శన… ముఖ్యంగా ‘ముడ్ ముడ్ కే నా దేఖ్’ పాటలో ఆమె నటన… దేశమంతా ఆగి నాదిరా కేసి చూసేలా చేశాయి.

ఆమె బాగ్దాది యూదు కుటుంబంలో జన్మించారు. దర్శకుడు మెహబూబ్ ఖాన్ భార్య సర్దార్ అఖ్తర్ ‘ఆన్’ (1952) సినిమా ద్వారా నాదిరాను హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. రాజపుత్ర యువరాణిగా తన పాత్రకి న్యాయం చేసి, ప్రఖ్యాతి గాంచారు ఆమె. ఆ సమయంలో వారి కుటుంబం కష్టాల్లో ఉంది. తిండికి కూడా లేని పరిస్థితి. ఆమె తల్లి రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సరికి ఆమె ఉద్యోగం పోయింది. వారిది సాంప్రదాయబద్ధమైన కుటుంబం కావడంతో సినిమాలో నటిస్తానంటే ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ‘ఏ మంచి యూదు యువకుడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడు?’ అనేది క్లిష్టమైన ప్రశ్న!

‘ఆన్’ సినిమాకి నాదిరాకి నెలకి 1200 రూపాయలు ఇచ్చారు. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. షూటింగ్ జరగని కారణంగా, మొదటి మూడు నెలలు ఆమె డబ్బు తీసుకోలేదు. డబ్బు తీసుకోమని ఒత్తిడి చేసినప్పుడు, ఆమె తల్లి తమ కూతురు ఆ డబ్బుని దొంగిలించి తెచ్చిందేమోనని భయపడ్డారట. ఆ డబ్బుతో వారు ఫర్నిచర్, ఒక ఫ్రిజ్, వారానికి సరిపడే ఆహారం, బంగారు నగలు  కొన్నారట. అయినా ఇంకా చేతిలో డబ్బు మిగిలిందట. ఆమె తర్వాతి కాలంలో తాను సంపాదించిన ధనాన్ని వృథా చేయలేదు. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులపై ఖర్చు చేశారు. ఆమెకి తానో ‘స్టార్’ననే భావన ఉండేది కాదు, తాను సంపాదించే డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడమెలా అని మాత్రమే ఆలోచించేవారు. తొలి చిత్రం విషయంలో ఆమెకి లభించిన అద్భుతమైన అవకాశం… మెహబూబ్ ప్రొడక్షన్స్ వారి ద్వారా కథానాయికగా, మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో పరిచయం కావడం వంటి చక్కని అవకాశం అందరికీ దక్కేది కాదు. పైగా ఆ సినిమాలో హీరో దిలీప్ కుమార్, విలన్ ప్రేమనాథ్ కావడం మరో విశేషం. అయితే తమాషా సంగతి ఏంటంటే ‘స్టార్’ అనే పదానికి అర్థం ఆమెకి తెలియకపోవడం. ఆమె బృందగాన సభ్యులతో కలిసి కూర్చుని భోజనం చేయడం గమనించిన మెహబూబ్ ఖాన్ ఓ ‘స్టార్’లా ప్రవర్తించమని నాదిరాని తరచూ ఆటపట్టించేవారట. ఆ సినిమా నిర్మాణానికి 35 లక్షల రూపాయలు ఖర్చయ్యాయట. అప్పట్లో అది భారీ మొత్తం. చాలా ఖరీదైన చిత్రంగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో.  అంటే దానర్థం నటీనటులకు తక్కువ చెల్లించారని కాదు. ఆ రోజుల్లో స్టూడియోలు, ప్రొడక్షన్ హౌజ్‌లు ఉండేవి… అంటే నటీనటులని నెలవారీ జీతాలకి పని చేయించుకునేవారు. ఆ కాలంలో డబ్బుకెంతో విలువ ఉండేది. అయితే ఈ రోజుల్లో సగం డబ్బు బ్లాక్ మనీగా చెల్లిస్తున్నారు, కాబట్టి సరియైన రీతిలో మదుపు చేయలేరు. అందుకని దాచుకుంటారు. ఆ విధంగా రైడింగ్‌ల భయం తారలని వెంటాడుతుంది. ఆ రోజుల్లో మోతీలాల్, చంద్రమోహన్ వంటి స్టార్లకు తమ డబ్బుని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. రేసులు, జూదం, పార్టీలు అంటూ తమ ధనాన్ని వృథా చేసుకోలేదు వారు. తమ జీవితాలను ఆనందంగా గడిపారు వారు.

1949లో ‘ఆన్’ చిత్రం మొదలైనప్పుడు నాదిరా జీతం నెలకి 1200 రూపాయలు. రెండవ ఏడాది నెలకి 2500 రూపాయలు, మూడో సంవత్సరం నెలకి 3000 రూపాయలు అందుకున్నారు. మొదటి సంవత్సరం మొదటి మూడు నెలలకి ఒకేసారి 3600 రూపాయలు అందుకున్నారు నాదిరా. అంత పెద్ద మొత్తంతో ఏం చేయాలో ఆమె కర్థం కాలేదు. అంత పెద్ద మొత్తంతో ఒంటరిగా ఇంటికి వెళ్ళలేక, తనని కారులో ఇంటివద్ద దించమని మెహబూబ్ గారిని అడిగారట. ఆమె తల్లి ఆ డబ్బుని చూడగానే దొంగతనం చేశావా అని అడిగారట! ఆమె వెంటనే వెళ్ళి ఇంటికి అవసరమైన ఫర్నిచర్, పన్నెండు బంగారు గాజులు కొన్నారట. అప్పట్నించి ప్రతీరాత్రి నిద్ర పోయే ముందు ఆమె ఆ పన్నెండు గాజులని తీసి లెక్కపెట్టి, ఒక చేతిరుమాలులో మూటగట్టి భద్రపరిచేవారు. ఉదయం నిద్రలేచాక మళ్ళీ లెక్కించేవారట.  చాలా కాలంగా సరిగా తినకపోవడంతో ఆరోజు చాలా ఆహార పదార్థాలు కొన్నారట. అవి కూడా పూర్తిగా తినలేక ఇరుగుపొరుగు వారికి పంచేసారు. కీర్తి ప్రతిష్ఠలు ఆమె ప్రపంచాన్ని ఒక్క రాత్రిలో మార్చేశాయి. నెలకి 664 రూపాయల అద్దెతో మరో పెద్దింట్లోకి మారారు. చివరిదాకా ఆమే ఆ ఇంటికి అద్దె చెల్లించారు. ఒకప్పుడు చిన్నగా, ఇరుకుగా తోచిన ఆ ఫ్లాట్, ఆమె చివరి దశలో పెద్దగా, ఖాళీగా కనబడేది. ఆమె కీర్తీ, విజయాలు సాధించినప్పుడు ఆమె చుట్టూ ప్రేమగా ఉండే బంధువులు ఉండేవారు. ఆమె తన స్టార్‌డమ్ కోల్పోగానే వారంతా అదృశ్యమయ్యారు. ఒక సమయంలో 14 మంది సభ్యులన్న కుటుంబంలో ఆమె మాత్రమే సంపాదించే సభ్యురాలుగా ఉండేవారు. ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులతో సహా, ఏదో ఒక రోగంతో చనిపోయినవారే. వారి కోసం చేయగలిగినంతా చేశారు నాదిరా. తన తల్లిందండ్రులను బాగా చూసుకున్నారు, తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన కూతురని అనిపించుకున్నారు.

చిత్రసీమకి ఎంతో ఘనంగా పరిచయమైనప్పటికీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోడం ఆమెకి సులువు కాలేదు. బదులుగా వ్యాంప్ పాత్రలు పోషించవలసి వచ్చింది. కాస్తంత మార్పుగా ఉంటుందని ‘శ్రీ420’లో వ్యాంప్ పాత్ర ఒప్పుకుంటే, అది ఆమె పతనానికి నాంది పలికింది. తన వైవిధ్యాన్ని చాటడానికి ఆ పాత్రని ఓ సవాలుగా తీసుకున్నప్పటికీ, అది ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. ఆ సినిమా తర్వాత ఏడాదిన్నర పాటు ఆమెకి సరైన అవకాశాలు దొరకలేదు, అందరూ ఆమెని అదే నల్ల డ్రెస్ వేసుకుని అదే రీతిలో సిగరెట్ పట్టుకోమనే పాత్రలనే ఇచ్చారు. బహుశా ఆమెకి మార్గదర్శనం చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండేదేమో… కానీ ఆమె సెక్రటరీలని గాని లేదా ఆర్టిస్ట్-మేనేజర్‌లని గాని విశ్వసించలేదు. వారంతా తుదకు నిర్మాతలుగా మారతారని, ఎందుకంటే వాళ్ళు బ్లాక్‌మెయిలర్లు అవుతారని భావించారు. ఎందుకంటే ఏ తార దగ్గర ఎంత నల్ల డబ్బు ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు తారల ఇంట్లో యథేచ్ఛగా తిరుగుతారని, బెడ్ రూమ్‌లోకి కూడా వచ్చేస్తారని, తమకి ఏకాంతం ఉండదని భావించారు. ఒక చురుకైన, తెలివైన సెక్రటరీ లేకపోవడం వల్ల తానెంతో ఆదాయం కోల్పోయినట్లు ఆమెకి తెలిసినా, ఆమె ఎన్నడూ పట్టించుకోలేదు. హీరోయిన్ అయినా కాకపోయినా, ఆమె కీర్తి ప్రతిష్ఠలని ఎవరూ లాక్కుపోలేరు. సినీ చరిత్రలో అత్యద్భుతమైన నటీమణులలో ఒకరిగా నాదిరా మిగిలిపోతారు. తన కాలం కంటే ముందున్న మహిళ నాదిరా. 1950, 1960లలో చాలామంది హీరోయిన్‌లు పతివ్రత పాత్రలు వేస్తుంటే – ఈ బ్రహ్మాండమైన నటి విలన్ పాత్రలు పోషించడానికి ఎంతో ధైర్యం కనబరిచారు. పూజా భట్ నటించిన ‘తమన్నా’, ఐశ్వర్యా రాయ్ నటించిన ‘జోష్’, ఇంకా మిలింద్ సోమన్‌తో కలిసి నటించిన టెలివిజన్ సీరియల్ ‘మార్గరిట్టా’ వంటివి ఆమె సౌందర్యాన్నీ, నటనా పటిమను చాటుతాయి. ఆమె ఎక్కువగా నెగటివ్ పాత్రలు పోషించారు. ఆమెకి ఎన్నో ట్రోఫీలు లభించాయి, వాటన్నింటిని ఆమె అటకపైన దాచారు, ఎందుకంటే ఆమె లివింగ్ రూమ్ అంతా పుస్తకాలతో నిండి ఉండేది. ఆమెకో అద్భుతమైన గ్రంథాలయం ఉండేది. అదే అసలైన సంపద అని ఆమె భావించారు. తన వృద్ధాప్యంలో, తన పుస్తకాలు చూసి తనని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారేమో అని హాస్యమాడేవారామె. దుఃఖ సమయంలో స్నేహం ఓదార్పు నిస్తుంది. అదే ప్రస్తుత తరంలోని స్టార్‌లకు లేనిది. కానీ ఆ రోజుల్లో ఈ పరిస్థితి విభిన్నమైనది. పాత తరం నటీనటులంతా ఒక కుటుంబంలా ఉండేవారు, ఏడాదికి కొన్నే సినిమాలు నిర్మించేవారు. అయితే సినీరంగం నుంచి నాదిరాకి ఎక్కువ స్నేహితులు లేరు, నటి షమ్మి తప్ప. వారి షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, ఇద్దరూ రోజు కొన్ని నిమిషాలకైనా కలుసుకునేవారు. అయితే ఇతర రంగాల నుంచి నాదిరాకి ఎందరో స్నేహితులున్నారు… వారిలో పెద్ద ఆఫీసర్లు, బ్యూరోక్రాట్లు ఉన్నారు. ఆమెని ఓ నటిగా చూసేవారు కాదు, అలాగే వారి హోదాల వల్ల నాదిరా కూడా ప్రభావితమవలేదు. దాదాపుగా వారంతా చనిపోయారు, ఆమెని ఒంటరి చేశారు.

పాత కాలం వారిలో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి ఓ ధోరణి ఉండేది – అదే మద్యానికి బానిస అవటం. అయితే నాదిరా దాన్ని ఎన్నడూ ఒక దురలవాటుగా మార్చుకోలేదు. ఏ రోజు పని పూర్తయ్యాకా ఆ రోజు కాస్త విశ్రాంతికి కొద్దిగా తాగేవారు తప్ప, మర్నాడు హ్యాంగోవర్‌తో లేచేవారు కాదు.

నాదిరా తన తోటి నటీనటులతో కూడా కలిసి తాగేవారు కాదు, ఒక్కసారి రాజ్‌ కపూర్‌తో కలిసి తాగాల్సి వచ్చింది. ఆ రోజు నర్గిస్ కూడా ఉన్నారు. కొద్దిగా మద్యం సేవించాక రాజ్‍ కపూర్ తనని అవమానించడంతో, ఇక ఆయనతో ఎన్నడూ కలిసి తాగలేదు నాదిరా.

ఆమె తోడు కోసం వివాహం చేసుకున్నా, తన భర్తని ప్రేమించలేకపోయారు. రెండు పెళ్ళిళ్ళు అయినా, రెండూ విఫలమయ్యాయి. ప్రేమించడానికి తగిన వ్యక్తి ఆమెకి లభించలేదు. తనకి సరైన వ్యక్తి లభించినట్లయితే, ఓ మంచి భార్య, మంచి తల్లి అయి ఉండేదానినని ఆమె అనుకునేవారు. వైవాహిక జీవితం గడుపుతూ, నటన కొనసాగించడం సరి కాదని ఆమె భావించారు. జీవితం చివరిలో ఆమెను ఒంటరితనం వెంటాడింది. నిద్రలేమితో బాధపడేవారు. మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో, ఆమె ఎక్కువగా సంగీతం వినేవారు, అల్లికలతోనూ, పుస్తకాలు చదవడంతోనూ కాలక్షేపం చేసేవారు. ‘ఆనందం’ కోసం అన్వేషణలో ఆమె ఎన్నో తప్పులు చేశారు. ఎందరో ఆమెను మోసం చేసి, గాయపరిచారు. కానీ ఆమె ఎన్నడూ దిగులు చెందలేదు. “ప్రేమ కోసం నా హృదయంలో ఇంకా స్థానం ఉంది. వాచ్‌మన్ నుంచి, లిఫ్ట్ బోయ్ వరకూ, ఈ బిల్డింగ్‌లోని అత్యంత పెద్ద వయస్కుడి వరకు నేను అందరికీ అమ్మనే! వాళ్ళంతా నా పిల్లలే” అనేవారు. వృద్ధాప్యంలో ఆమె ప్రతీరోజు ఉదయపు నడకకి మహాలక్ష్మి రేస్ కోర్స్‌కి వెళ్ళేవారు. ఆమె ఇంటి వద్ద అతిథులను కలవడం మానేసారు, ఎందుకంటే వచ్చినవాళ్ళు తిని తాగి తెల్లవారు జామున వెళ్ళేవారట. అందుకని ఆమె పుస్తకాలను ఆశ్రయించారు. ఆధ్యాత్మిక, తాత్వికమైన రచనలు చదివేవారు. అవి ఆమెకి శాంతి కలిగించేవి. ఆమె భగవద్గీత కూడా చదివేవారు.

ఆర్క్ లైట్లు ఒకే తీవ్రతతో నిరంతరం వెలగలేవు. ప్రతీ ఒక్కరు ఏదో ఒకరోజున రంగాన్ని వీడవలసిందే. ఆమె సంపూర్ణ జీవితం గడిపారు. ప్రయాణలు చేశారు, ప్రపంచంలోని ఉత్తమ/చెత్త వ్యక్తులను కలుసుకున్నారు. సుదీర్ఘమైన వ్యాధి కారణంగా 73 ఏళ్ళ వయసులో 9 ఫిబ్రవరి 2006 నాడు ముంబైలోని తారాదేవ్‌లోని భాటియా ఆసుపత్రిలో మరణించారు. కాలేయం సరిగా పని చేయకపోవడం, పక్షవాతం ఇంకా ట్యుబర్‍క్యులర్ మెనింజైటిస్‌తో బాధపడ్డారు. ట్యుబర్‍క్యులర్ మెనింజైటిస్‌ కాంప్లికేషన్లు కూడా ఆమెని బాధించాయి.

సినీ పరిశ్రమలో దాదాపుగా అందరు హీరోలతో నటించే అవకాశం నాదిరాకు లభించింది. 1962లో ఓసారి సరదాగా, అప్పటి సుప్రసిద్ధ నటులపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆమె మాటల్లోనే : “ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఇవి నావి. ఈ చిన్న జీవితంలో నాకు తెల్సిన అద్భుతమైన వ్యక్తుల గురించి ఇవి నా భావాలు, నా అభిప్రాయాలు.

విలువైనది అనుకున్న ప్రతీదాన్ని నేను చూశాను, తెలుసుకున్నాను, ఆస్వాదించాను. వీళ్ళ గురించి చెప్పడానికి నేడు నా వయస్సు, వివేకం చాలు”.

***

దిలీప్ కుమార్:

‘హ్యాండ్‍సమ్’ – నేను ఆయన్ని ఎప్పుడూ అలానే పిలిచాను. జటిలమైన, సున్నితమైన పర్‌ఫెక్షనిస్ట్. ఎప్పుడూ సంతోషం లేకుండా, వ్యాకులంగా ఉండే అంతర్ముఖుడు. తన సాంప్రదాయబద్ధమైన ఆలోచనలకీ, ప్రపంచంలో తాను పొందిన ఈ స్థాయి సామర్థ్యానికీ  మధ్య ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. చీకటి రాత్రులను సైతం వెలిగించగలిగే నవ్వుతో ఆయన ప్రపంచాన్ని చూస్తారు… కానీ ఆ చీకటి రాత్రులు ఆయనవి కావు!

ప్రేమ్‌నాథ్:

ఈయన అమాయకులు. దైవమంటే భయం. ఎంతో వినయంగా ఉంటారు, కష్టపడతారు. ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగినప్పుడు నేను మొదటిసారిగా కలిసాను. ఇప్పటికీ అలానే ఉన్నారు. రాజకీయాలంటే ఆయనకి ఆసక్తి లేదు. అటువంటి వాటికి నప్పని ఋజుమార్గం ఆయనది.

బాల్‌రాజ్ సహానీ:

ఈయన చర్మంలోని ఒక్కో కణం నుంచి సంస్కృతి, సంస్కారం, విద్య వెలువడతాయి. ఆయన ముఖంపై కనబడే ప్రతీ గీతా – ఆయన జీవితంలో ఎదుర్కున్న క్రూరమైన గాయాలకు గుర్తుగా శాశ్వతమైన మచ్చలుగా మిగిలాయి. వాటిలో ఏ ఒక్క దాన్నీ ఆయన మరిచిపోలేదు.

అశోక్ కుమార్:

అసలు ఆయనకి వయసెలా అయిపోయింది? ఎంతో మంది నటీమణులకి ప్రియుడి నటించిన తర్వాత చివరగా ఆయన జీవితాన్ని ప్రేమించసాగారు. తన ఉనికి లోని ప్రతి క్షణం – జీవితాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకుగాను స్పందన కలిగించే అనుభవం పొందేందుకే ప్రయత్నిస్తారు. అవ్యక్తమైనదాని గురించి మరిచిపోతారాయన – అయితే ఆయన చివరి రోజుల్లో సాధువుగా మారినా నేను ఆశ్చర్యపోను. అప్పుడు కూడా ఆయనకిచ్చే వేషాల కన్నా చిన్నవాడిలానే కనిపిస్తారు!

రాజ్ కపూర్:

అత్యంత ప్రేమాస్పదుడూ, అద్భుతమైన సినిమా ఆరాధకుడైన ఈ వ్యక్తి పేరు ‘మోషన్ పిక్చర్ (మేకింగ్)’  అని ఉంటే సరిపోయేది. ఆయనకి తిండీ, నిద్రా, ఆలోచన, శ్వాస – అన్నీ సినిమాలే, నటించడమే కాదు నిర్మిస్తారు కూడా. ఎన్నటికీ పూర్తిగా తృప్తి చెందని ఈయన తొలి, మలి ప్రేమ సినిమానే. ఆయన ఏం చేసినా, చూసినా ఆన్నీ ఈ మాధ్యమం ద్వారానే. నాకు తెలిసిన అందరిలో ఆయన అత్యంత దృఢచిత్తముగల, ఏకాగ్రదృష్టిగల వ్యక్తి. ‘నక్షత్రాల అవతల కూడా ఖాళీ ఉంది’ అన్నది లక్ష్యం గురించి ఆయన అభిప్రాయం.

దేవ్ ఆనంద్:

తన ముఖంపై చిరపరిచితమైన, ఉల్లాసపూర్వకమైన ఆ చిరునవ్వుని ఎలా ఉంచుకుంటారని ఆయనని ఎప్పుడూ అడుగుతుంటాను. ఓ నిర్లిప్తుడు నవ్వే నవ్వుని ముఖంపై చూపే వ్యక్తిలా, ప్రజల మూఢత్వాలకు, ప్రపంచం వెల్లడి చేచే ప్రహసనాలకు నవ్వుకునే వ్యక్తిలా ఉంటారు.

రాజేంద్ర కుమార్:

స్టార్‍డమ్ కోసం నిజంగా సవాలు చేసిన వ్యక్తి. సేదదీదే కళని అలవర్చుకుంటే; తనదైన సొంత అసలైన వ్యక్తిత్వం అలవర్చుకుంటే – అతను విజయం సాధిస్తారు, విలువైనవన్నీ పొందగలరు.

జైరాజ్:

‘మజిల్‌మాన్’ – కండల వీరుడు. తెరమీద ఆయన కండలు తప్ప మరేమీ ముఖ్యం కాదు. ముఖం మీద కాంతి ఎలా పడాలో ఆయన నుంచే తెలుసుకున్నాను. ఒకసారి నేను ఆయనకి (తెర మీద) నా పాతివ్రత్యం గురించి చెబుతున్నప్పుడు – నేపథ్యంలో మెలిపడుతున్న ఆయన కండలను చూసి పరధ్యానం కలిగింది. మంచి వ్యక్తి, సాదా సీదా మనిషి.

షమ్మీ కపూర్:

‘ఏదైనా చేస్తే, భారీగా చేయాలి’, దాని గురించి బాగా శబ్దం చేయాలి అనుకునే వ్యక్తి. అది ఆయన నినాదం. ఆయనని ఎవరూ మోసం చేయలేరు. తనని మోసం చేసే ప్రయత్నాలని ఆయన ఆస్వాదిస్తారు. గీతని పెళ్ళి చేసుకోబోయే ముందు – తనకి తాను మాత్రమే మిత్రుడయిన ఈ అందగాడు నాకు ఆత్మీయుడయ్యాడు. ఈయన గురించిన విషయాలు నాకు మాత్రమే పరిమితం చేసుకోవాలి, మిగతావాళ్ళకి అవి విడ్డూరంగా అనిపిస్తాయి.

రాజ్ కుమార్:

తన సొంత నమ్మకాల గురించి మనల్ని ఒప్పించడంతో ఎంతో ఆతురత కనబరుస్తారు. పైగా ఆయన ఉపయోగించే కఠినమైన పదజాలం మనకి కష్టంగా ఉంటుంది. ఆసక్తికరమైన వ్యక్తి, సున్నితమైన, మంచి మనిషి. కానీ గందరగోళంగా ఉంటారు. కంట్లో కన్నీరుతో ఈయన కంటే నన్ను కదిలించిన మగాళ్ళెవరూ లేరు.

భరత్ భూషణ్:

గొప్ప హుందాతనం, విజ్ఞానం కలబోసిన వ్యక్తి. జీవితంలోని భౌతిక వస్తువులకి ఏ మాత్రం విలువ ఇవ్వరు. నేను చూసిన భరత్ భూషణ్ – అప్పటికే ఋష్యత్వం పొందినవారు.

మోతీలాల్:

నికార్సైన వ్యక్తి. మొండివారు. కాంస్య భవనంలా గర్వించదగ్గవారు. ఎందరో విమర్శించినా, మన మోతీని మనం ప్రేమిస్తాం. తన ఆత్మగౌరవం కోసం ఆయన మృత్యుదేవత తోనే పోరాడారు. ఆయన అంగఛేదము చేసి ఏ భాగంలోంచి అయినా కొంత రక్తాన్ని తీస్తే మీ సిరంజిలో నీలి సిరాలా కనిపిస్తుంది.

సునీల్ దత్:

ఈయన గురించి నాకు అసలేం తెలీదు. చాలా తక్కువ తెలుసు. మేమిద్దరం ఒకరి దారుల్లో ఒకరు తారసపడలేదు.

***

“ఇలా విభిన్నమైన వ్యక్తులతో పని చేశాక, నేను ‘బాటా షూ’గా మారిపోయాను. దృఢత్వం, మన్నిక, నిత్యం అయిపోయాను – రూ 3.90 పైసల స్థిరమైన ధరతో. నాలుగు రూపాయలు అడిగితే, నేను నా నిర్మాతని శాశ్వతంగా కోల్పోతాను.”

***

1952 ‘ఆన్’ సినిమాలోని “మాన్ మేరా ఎహసాన్” పాట

1955 ‘శ్రీ 420’ సినిమాలోని ‘ముడ్ ముడ్ కే నా దేఖ్’ పాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here