భక్తి పర్యటన అనంతపురం జిల్లా -16

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 16” వ్యాసంలో పెద్ద ముష్టూరు లోని ‘శ్రీ సిద్ధేశ్వర ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

పెద్ద ముష్టూరు

[dropcap]పె[/dropcap]న్న అహోబిలం నుంచి బళ్ళారి బస్ ఎక్కి ఉరవకొండలో దిగాము. అక్కడనుండే పెద్ద ముష్టూరు వెళ్ళాలి. బస్ దిగిన చోటే ఒక ఆటో అతన్ని అడిగాము. పెద్ద ముష్టూరు, పంపనూరు గురించి, ఇంకా ఏమన్నా చుట్టు పక్కల పురాతన ఆలయాలు వున్నాయా అని. మధ్యాహ్నం 1 గం. దాటింది. అతను ఇంకా రెండు మూడు వున్నాయని, అన్నీ చూపిస్తానని 400 రూ. ఇమ్మన్నాడు. ఏమీ తగ్గలేదు. ఆ ఆలయం ఈ ఆలయం అంటూ కబుర్లు చెప్పాడు. సరే అన్నీ తెలిసినవాడిలా వున్నాడు, ఇలాంటప్పుడు పదికీ ఇరవైకీ బేరమాడటంకన్నా అన్నీ తెలిసినవాళ్ళయితే త్వరగా వెళ్ళచ్చనీ, ఇంకేదైనా దోవలో కనిపించినా, గుర్తొచ్చినా చూపించాలని చెప్పి ఎక్కాము. ముందు భోజనం అన్నాము.

ఉరవకొండలోనే ఒక పెద్ద తాటాకుల షెడ్ లాగా వుంది. హోటల్ పేరు స్రవంతి. మనిషికి 40 రూ. ఆ ఊళ్ళో అదే పెద్ద హోటల్ అని చెప్పాడు. మా చుట్టుపక్కల ఇంకేమీ కనబడలేదు కనుక నమ్మాము. భోజనం వేడిగా బాగానే వుంది. పరిసరాలు కూడా శుభ్ర్రంగా వున్నాయి.

భోజనం అయ్యాక అక్కడికి 8 కి.మీ. ల దూరంలో వున్న పెద్ద ముష్టూరు చేరేసరికి మధ్యాహ్నం 1-30. ఆ సమయంలో గుడి తెరిచి వుండదు కదా అంటే ఆటో డ్రైవర్ అంతకు ముందే తిరణాల జరిగిందనీ, అందుకని తెరిచి వుండచ్చేమో చూద్దామన్నాడు. కొన్నిటికి ఛాన్సులు తీసుకోవాలి తప్పదు మరి.

ఆలయంలో దేవుడు సిద్ధేశ్వరుడు. చిన్న ఆలయం. మూసి వుంది.. బహుశా తిరణాల బాగా జరిగి వుంటుంది. అక్కడవాళ్ళకి అది బాగా మహిమగల ఆలయం కావచ్చు. చుట్టుపక్కల మనుష్య సంచారం లేదు. ఆక్కడ కొంచెం నిరాశ చెందగా ఆటో డ్రైవర్ ఉండబండలో వీరభద్ర స్వామి ఆలయం చాలా మహిమ కలది. పెద్దది కూడా. అక్కడికి తీసుకెళ్తానన్నాడు. ఈ పేరు అంతకు ముందు ఎవరూ చెప్పలేదు. పోనీలే ఇంకో బోనస్ దొరికిందని అదీ ఇలాగే వుంటుందా అని ముందే అడిగాము. లేదు పెద్ద గుడి అన్నాడు. మళ్ళీ ఉరవకొండ మీదనుంచే వెళ్ళాలి.

 

 

ఉరవకొండ అనగానే ఆ ఊరు చీరెలకి ప్రసిధ్ధి అక్కడ పట్టు చీరెలు కూడా నేస్తారు అని ఎక్కడో చదివినది గుర్తు వచ్చింది. ఆటో డ్రైవర్‌ని అడిగితే చూస్తారా. కొంచెంసేపు ఇవి చూసుకు వెళ్తే గుడి కూడా తీస్తారు అన్నాడు. సరేనన్నాము. ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఊళ్లో వాళ్ళే పెద్ద వ్యాపారస్తులట. ఇంటి ముందు బోర్డు వున్నట్టుందిగానీ, షాపు పేరు ఇప్పుడు గుర్తులేదు. వాళ్ళకి స్వంత మగ్గాలు వున్నాయిట. నేయించి షాప్స్‌కి వేస్తారు. హైదరాబాద్‌లో చందన, బొమ్మనలకి ఇక్కడనుంచే వెళ్తాయి అన్నారు. ఆడవాళ్ళంకదా, చీరెలు నచ్చుతే వదిలి పెడతామా. నేను రూ.1100 పెట్టి ఒక రా సిల్క్ చీరె (ఉతికినా బాగుంది), 2000 పెట్టి ఒక పట్టు చీరె తీసుకున్నా. పట్టు చీరె ఒక పెళ్ళి కూతురుకి పెట్టాను. అందుకని ఎలా వుందో నాకు తెలియదు. మా ఉమ 2400 పెట్టి ఒకటి తీసుకుంది.

ఇంక అక్కడనుంచి బయల్దేరి విడపనకల్లు మండలం లోని పాల్తూరు గ్రామంలోని ఉండబండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకున్నాము. మా డ్రైవర్ దానిని బండగూడెం అన్నాడు. ఉరవకొండ దగ్గరనుంచి 12 కి.మీ. ల దూరం. ఆ ఆలయం గురించి వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here