అక్కినేనితో అద్భుత స్నేహం

8
4

[box type=’note’ fontsize=’16’] ది 20 సెప్టెంబరు 2020 న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా, వారితో తమకున్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఏ. పద్మనాభం. [/box]

[dropcap]మా[/dropcap] వూరు కోనసీమలో అమలాపురం. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. తెగ సినిమాలు చూసేవాణ్ణి. అక్కినేని గారి అభిమానిని.

అప్పటి రోజుల్లో వేసవి సెలవలు 3 నెలలు ఉండేవి. ఆ సమయంలో కోనసీమలో ‘మూగమనసులు’ షూటింగుకి అందరూ కాలేజీలో నివాసం వుంటారు అని తెలిసి మా ఆనందానికి అంతులేదు. నటీనటులను చూడాలని కాపు కాసేవాళ్ళం. అందులో అక్కినేని అభిమానిని, గొప్పఅవకాశం వచ్చింది ఆయనను చూడాలి అంతే… అలా మొదటిసారి దూరంనించే చూసేను చాలాసార్లు. ఇక ఆయన నటించిన సినిమాలు రెండుసార్లు చూసేవాణ్ణి. తరువాత నేను కాలేజీ లెక్చరరుగా పనిచేస్తూన్నప్పుడు బంధువులింటో పెళ్ళికి వెళ్ళాను హైదరాబాదు. ఆ పెళ్ళికి అక్కినేని వచ్చారు. ఇంకేముంది మరో అద్భుతమైన అవకాశం. అప్పుడు దగ్గరగా చూడడటమే కాదు చేయి కలిపి మాటాడాను. ఫొటో తీసుకున్నాను. విజయవాడ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మళ్లీ మరో అవకాశం వచ్చింది. అది ఎలా అంటే మా కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని అక్కినేనిని చేత చేయించడానికి పిలిచారు. ఆయనకి విజయవాడ ఐలాపురం హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అసలు అయన ఎప్పుడు విజయవాడ వచ్చినా ఐలాపురంలోనే వుంటారు. ఆ హోటలు కూడా అక్కినేని ప్రారంభించారుట. అప్పటినుంచి అదే అలవాటు. కాలేజీలో అందరు లెక్చరర్లును పరిచయం చేసినపుడు నన్నుగుర్తుపట్టి ప్రత్యేకంగా పలకరించారు అక్కినేని. అయన జ్ఞాపకం అమోఘం. అంతే కాదు పధ్ధతి అంతకంటే గొప్పది. ఎప్పుడో ఏదో పెళ్లికి చూసిన వాడిని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. మరి నిజమైన అభిమానిగా గుర్తువుండిపోయానో ఏమో నాకు తెలియదు. నేను లెక్చరరునని కూడా వారికి ఇక్కడే తెలిసింది. నా అదృష్టం ఏమో… ఆయన ఆపేక్షకి ఎంతగానో కదిలిపోయాను.

అంతకంటే మరో అద్భుతం మరునాడు వీలుంటే హోటలకి రమ్మని ఫోను చేసారు. నాకు ఒక్కసారి మతిపోయింది… అయన దేశానికేకాదు విదేశాలలో కూడా వేలమందికి అభిమాన నటులు. కోట్లమంది అభిమానుల్లో ఒకణ్ణి నేను. అలాటిది నన్ను గుర్తు పెట్టుకోవడమేకాదు పిలిచి మాటాడటం నాకు మరువలేని అనుభవం. కొందరు పరిచయం అయినా అంతటితో సరి. నా విషయంలో అది కొనసాగడం విచిత్రమే!

నాలుగేళ్ళ తరువాత హైదరాబాదుకి మారేను. అక్కడే ఇరవై అయిదేళ్ళు స్థిరపడ్డాము. వారి పుట్టినరోజుకి గ్రీటింగ్ కార్డు పంపడం, వీలుంటే ఇండియాలో వున్నప్పుడు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం, వారికి ఇష్టమైన పాయసం చేసి ఇవ్వడం ఒక అలవాటుగా కొనసాగింది. వారిని కలిసినప్పుడు ఎన్నో కబుర్లు, వారి అనుభవాలు ఆలోచనలు పంచుకోవడం ఎన్నటికి మరచిపోలేము. మాకు తెలిసిన స్నేహితులు, వారి అభిమానులను తీసుకువస్తాము… రమ్మంటారా అని అడిగితే ఏనాడూ కాదనలేదు. వారి తోటలో కూరగాయలు ఇచ్చేవారు. కాఫీ స్వయంగా తెచ్చి ఇచ్చేవారు. ఒకసారి పకోడీలు తెచ్చి ఇచ్చారు కాఫీ తోబాటు. వారి కుటుంబమందరితో కూర్చుని మాటాడేవాళ్ళం. అన్నపూర్ణగారు, సుశీల, నాగార్జున అందరూ…. ఒకే కుటుంబముగా కలిసేవాళ్ళం. ఒకగంట మా కోసం కేటాయించేవారు. మేము సామాన్యులం. కేవలం అభిమానులం. అంతటి ప్రఖ్యాత నటులు మాపట్ల చూపిన స్నేహాన్ని కలకాలము గుండెనిండా పదిలంగా దాచుకున్నాము. వారి సినిమాలు చూస్తాము, పాటలు వింటూ పరవశించిపోతాము. ఆ సంస్కారం ఎవరిలోనూ చూడలేము. అలాటివారు నూటికో కోటికో ఒక్కరే వుంటారు.

వారి తొంభైవ పుట్టినరోజుకి కలిసినపుడు చాల నీరసంగా కనిపించారు. అంతవరకూ వారిని ఆ విధంగా చూడలేదు. వారు పంచలోహ నాణాన్ని చెరొకటి ఇచ్చారు. వారికి అమెరికాలో అభిమానులు 80వ పుట్టినరోజుకి ఇచ్చారట. ఆనాడు ముగ్గురం కలిసి తీసుకున్న ఫోటోని ప్రేముకట్టి మా ఇంటిలో పెట్టుకున్నాము. రోజూ వారిని చూస్తూనే ఉంటాము. ఎందరో మహానటులు కానీ ఒక్కరే ఆప్తులుగా మిగిలివుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here